బారులు తీరిన ఓటర్లు – భారీ పోలింగ్ నమోదు
స్వల్ప సంఘటనలు మినహా వైఎస్సార్ జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంల ఏర్పాటులో తలమునకలయ్యారు. ఉదయం 8 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 10 గంటల సమయం తర్వాత ఊపందుకుంది.
సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్ల ఉత్సాహం కొనసాగింది. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. 2009 అసెంబ్లీ ఎన్నికల కంటే అధిక సంఖ్యలో ఓటర్లు ఈసారి పోలింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం ఓటర్లలో 78 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 5,46,716 మంది ఓటర్లు ఉండగా, 4,27,514 మంది వారి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.
వీరిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాజంపేట పరిధిలో 1,86,756 మంది ఓటర్లకు గాను 1,47,537 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా.. వారిలో 72,396 మంది పురుషులు, 75,141 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రైల్వేకోడూరులో 1,59,815 మంది ఓటర్లకు గాను 1,19,861 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 59,553 మంది పురుషులు, 60,308 మంది మహిళలు ఉన్నారు.
రాయచోటిలో 2,00,145 మంది ఓటర్లుండగా, 1,60,116 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 78,729 మంది పురుషులు కాగా.. 81,387 మంది మహిళలు ఉన్నారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2,10,676 మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకోగా, 2,16,838 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
2009 అసెంబ్లీ ఎన్నికల పరిధిలో రాజంపేటలో 74.25 శాతం పోలింగ్ నమోదు కాగా, ప్రస్తుతం 79 శాతం పోలింగ్ నమోదైంది. రైల్వేకోడూరులో 74 శాతం గత ఎన్నికల్లో నమోదు కాగా, ఈ మారు 75 శాతం పోలింగ్ నమోదైంది. రాయచోటిలో గత ఎన్నికల్లో 76.76 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ మారు 80 శాతం చోటు చేసుకుంది.