Rayachoty Masjid

400 ఏండ్ల రాయచోటి పత్తర్‌ మసీదు

రాయచోటి నడిబొడ్డున ఠాణా సెంటర్‌లో ఉన్న అతి ప్రాచీనమైన మసీదు ‘షాహీ జామియా’ మసీదు (పత్తర్‌ మసీదు). దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ మసీదు స్థలాన్ని అప్పటి భూస్వామి ఇనాయత్‌ ఖాన్‌ దానం చేశారట. అప్పట్లో గ్రామ పెద్దల సహకారంతో ఆర్థిక వనరులు సమకూర్చకుని మసీదు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మసీదు నిర్మాణమంతా రాతితో జరిగింది. అందుకే దీనిని పత్తర్‌ మసీద్‌ అని పిలుస్తారు. మసీదు అంటే ప్రార్థనా మందిరం.

దీనికి మరొక పేరు కూడా ఉంది – జుమ్మా మసీదు అని. జుమ్మా అంటే శుక్రవారం. ప్రతి శుక్రవారం నమాజు చదవడానికి స్థానిక ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అందుకని ఆ పేరు వచ్చిందా? లేక మసీదును శుక్రవారంనాడు ప్రారంభించారా? అనేది తెలియదు. మసీదు నిర్మణం పూర్తి చేసిన ఇనాయత్‌ ఖాన్‌ కృషి, పట్టుదలలకు మారుపేరు. దైవభక్తి ఎక్కువగా గల వ్యక్తి. ఆ కాలంలో రాజులు,ర నవాబులు ఎక్కువగా ప్రజల సౌకర్యార్థం చెరువులు, కుంటలు, బావులు, దేవాలయాలు, మసీదులు, కోటలు నిర్మించేవారు. ఇవి చరిత్రకు ప్రతీకలు.

చదవండి :  రాయచోటి శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు?

మహమ్మదీయుల కాలంలో క్రీ.శ. 1646 ప్రాంతంలో సిద్దవటం పాలకులైన మట్లి రాజులను ఓడించి నల్లగొండ కుతుబ్‌షాహీలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు కుతుబ్‌షాహీలను ఓడించి నల్లగొండ రాజ్యం ఆక్రమించుకోవడంతో కడపజిల్లా ప్రాంతం వారి ఆధిపత్యంలోకి వచ్చంది. 1714నుంచి కడపను పాలించిన అబ్దుల్‌ నబీఖాన్‌ ప్రసిద్ధుడు. అంతకుముందే 1650లో ఇనాయత్‌ఖాన్‌ నిర్మించిన ఈ మసీదు పొడవు 150 అడుగులుండగా, వెడల్పు 100 అడుగులుంది.

మసీదులో (సఫ్‌) వరుసలో 50 మంది నిలిచి ‘అల్లాహ్‌ హు అక్బర్‌’ అని రకాత్‌ కట్టగలరు. ఈ మసీదులో దాదాపుగా 2000 మంది ఒకేసారి నమాజు చేసుకునే వీలున్నది. మట్లి వంశ రాజుల మూల పురుషుడు దేవ బోళమ రాజు కడపను పాలించాడు. 1627-1650 వరకు పాలించిన 32వ రాజు మట్లి చిన్నరాజు. ఇతని అన్న కుమారుడు కుమార రాజరాజు పాలనా సమయంలో షాహీ జామియా మసీదు నిర్మించడానికి కంకణం కట్టుకోవడం ఆషామాషీ పని ఏమీ కాదు.

చదవండి :  రాయచోటి వీరభద్రాలయం

చెరువులు, బావులు, మసీదులు, దేవాలయాలు నిర్మించాలంటే కేవలం ధనం ఉంటే సరిపోదు. ధైర్యం, పట్టుదల, కృషి ఉండాలి. దానికితోడు దైవబలం కావాలి. అన్నీ కలిసిరావడంతో ఆయన షాహీ జామియా మసీదు నిర్మించారు. ఈ మసీదు చరిత్రను జమాయత్‌ ఉలమా ఎ హింద్‌ ప్రధాన కార్యదర్శి అజ్మతుల్లా, స్థానిక ప్రముఖ చిత్రకారుడు జాఫర్‌లు వివరించారు.

ఈ మసీదుకు రెండు ముఖద్వారాలున్నాయి. ఉర్దూ, అరబ్బీ తెలియని, తెలుగు ముస్లింల కోసం దివ్యఖుర్‌ఆన్‌తోపాటు యాషిన్‌హార్ట్‌ (హృదయం), మహమ్మద్‌ ప్రవక్త జీవిత చరిత్రలు, రోజా ఫర్జ్‌), తరావీహ్‌, నమాజ్‌ కా తరిఖా దువాయే వంటి ఇస్లామిక్‌ పుస్తకాలు తెలుగులో ముద్రించబడి ఉన్నాయి.

చదవండి :  మొదటి దశలో 80.40 శాతం పోలింగ్

ముస్లింలకు సంబంధించిన దైవ సంబంధిత రహస్యాలు, విషయాలు తెలుసుకోదలచినవారు నమాజ్‌ అనంతరం విశ్రాంతి గదిలో కూర్చుని తెలుసకోవడానికి వీలుగా ఒక గది ఏర్పాటయింది.

– ఎస్‌. అభినయ్‌, రాయచోటి

ఇదీ చదవండి!

రాయలసీమ రైతన్నా

వాన జాడ లేదు – సేద్యానికి దిక్కు లేదు

18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: