గురువారం , 21 నవంబర్ 2024

కాంగ్రెస్‌ సమర్పించు.. హైప్‌ మీడియా డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌.. జైల్లో జగన్‌ -1

జగన్ ప్రత్యర్ధులు కంటున్న ఈ కల నిజమైతే పరమపద సోపానంలో అది జగన్ కి నిచ్చెనేనని ప్రకాష్ తాడి  విశ్లేషణ (పునః ప్రచురణ)….

”వెళ్ళూ, వెళ్ళవయ్యా వెళ్ళు. కుర్రాడివి. తొందరేంటి? కాస్త అనుభవం సంపాదించు. చూద్దాం” అని జగన్‌మోహన్‌ రెడ్డిని ఈసడించి పంపేసిన కాంగ్రెస్‌ పార్టీయే ఇప్పుడా కుర్రాణ్ణి ముఖ్యమంత్రిని చేయడానికి సకల ఏర్పాట్లూ చేస్తోంది అదెలా?

ముందు శంకర్రావుతో హైకోర్టుకో లెటర్‌ రాయించు. అతడు దళితుడై వుండటం చాలా ముఖ్యం. ముందుముందు వ్యవహారం బూమరాంగ్‌ అయితే ఒక దళితుణ్ణి వేధిస్తున్నారంటూ శంకర్రావు మైక్‌ పట్టుకు చెలరేగిపోవచ్చు. ఎర్రబెల్లో, ఎర్రం నాయుడో ఎవరో ఒక వెర్రి నాయకుడితో ఓ పిటిషన్‌ పెట్టించు. విచారణకు స్వీకరించు. ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించు. చీఫ్‌జస్టిస్‌ కక్రూతో హుకుం జారీ చేయించు.

ఎంటర్‌ సి.బి.ఐ – అర్జెంట్‌గా మీ వ్యాపారాలు, పెట్టుబడులు, పార్ట్‌నర్‌ల వివరాలు తెప్పించు. తిరగెయ్‌. ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయి. ఇంత డబ్బేంటి? ఇన్ని కంపెనీలేంటి? అవినీతి జరిగినట్టు తెలిసిపోయిందని రిపోర్టు సిద్ధంచెయ్‌. కోర్టువారి కిచ్చెయ్‌. ఇంటర్వెల్‌ టీ తాగి సిగరెట్‌ కాల్చి వచ్చి మిగిలిన సినిమా వెండితెరమీద చూడండి.

తీగలాగితేనే తల తిరుగుతోంది. డొంకలాగితే డొక్క పగుల్తుందేమో చూడాల్సిందే! సి.బి.ఐ సంపూర్ణ దర్యాప్తుతో రంగంలో దిగాలి. కోర్టువారి ఆదేశం. అశుభం! సినిమా అయిపోయింది. సోనియా సమర్పించు, కాంగ్రెస్‌ ఆడించు. ‘జైల్లోకి జగన్‌’ అనే సినిమా సూపర్‌ హిట్టు అవుతుందనీ జగన్‌ బాక్స్‌ బద్దలవుతుందనీ రామోజీరావు ఈనాడు, రాధాకృష్ణ అనబడు ఆర్కే ఆంధ్రజ్యోతి ప్రచార బాకాలను ఆకాశానికెత్తి వూదాయి.

ప్రజాసామ్యం బతికి బట్టకట్టిందనీ, ఇంకా ఈ దేశంలో ధర్మం నాలుగుపాదాలా నడుస్తోందనీ కోర్టు తీర్పు సువర్ణాక్షరాలతో లిఖించతగ్గదనీ సవినయంగా పొగిడాయి. అంతేనా? ముందే రాశాం. ఏనాడో చెప్పాం అని ‘ఈనాడు’ పాతపేపర్‌ కటింగ్‌లన్నీ ప్రచురించి జగన్‌ పచ్చి అవినీతిపరుడని ముందు కనిపెట్టింది మేమే అని బోర విరుచుకుంది. అసలు, ముందు కూసింది మేము అని ప్రకటిస్తూ ఆంధ్రజ్యోతి తనపాత కటింగ్స్‌ అన్నీ అచ్చువేసి జగన్‌ దొంగ, వై.ఎస్‌. గజదొంగ అని ఎప్పుడో నిరూపించేశాం అంటూ జబ్బచరుచుకుంది. ఇక తెలుగు దేశం పార్టీ పసుపు చిచ్చుబుడ్లు వెలిగించి దీపావళి చేసుకుంది. మర్నాటి నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి కల్లు తాగిన కోతుల్లా రెచ్చిపోయాయి. జగన్‌ గళ్ళ చొక్కానే జైలు ఊచలుగా ఒక కార్టూన్‌. జగన్‌ని భార్య భారతి, ”అక్కడ మనల్ని బైటనుంచి భోజనం తెచ్చుకోనిస్తారా, వాళ్ళు పెట్టిందే తినాలా” అని అడుగుతున్నట్టుగా మరో కార్టూన్‌. జగన్‌ ఇక జైల్లో కౌవొత్తుల తయారు చేసుకోవాల్సిందే – ఒక నాయకుడి కామెంట్‌.

చదవండి :  పట్టిసీమ ల్యా... నీ తలకాయ ల్యా..!!

కోర్టు తీర్పు సమంజసమే. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అలా ఆదేశించే హక్కుంది. దర్యాప్తు జరుగుతుంది. కానీ జగన్ని జైల్లో పెట్టించాలన్న అత్యుత్సాహం దేనికి? జర్నలిజమూ, విలువలూ, హక్కులూ అటూ సంపాదక ఉపన్యాసాలు దంచే ఈ పత్రికలు ఇంతలా దిగజారడం దేనికి? జగన్‌ అవినీతి రుజువైతే జైలు శిక్షపడుతుందేమో! పడితే పడుతుంది. జైల్లో వుండాల్సివస్తే వుంటాడు.

ఈ దేశంలో ఇందిరాగాంధీనే అరెస్టు చేయడం మన కళ్ళముందే జరిగింది. కోట్లు తిన్నారన్న కేసుల్లో కరుణానిధి కూతురు కనిమొళి నుంచి రామలింగరాజు, సురేష్‌ కల్మాడీ, రాజా… ఇలా అనేకమంది జైళ్ళలో వున్నారు. నిజంగా రాజా, కనిమొళి తదితర నిందితులంతా జైల్లో గిన్నెడు ముద్ద, గొట్టం పులుసు తింటూ, కౌవొత్తులు చేసుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారనే అనుకుంటున్నారా? ఎప్పటికీ అలా జరగదు. మన జైళ్ళు, అధికారులు, పోలీసు పెద్దలూ ఎంత భయంకరమైన వాళ్ళో లక్ష ఉదాహరణలు చెప్పొచ్చు. కరుణానిధి కూతురికి చిప్పకూడు పెట్టడమే జరగదు. అదంతా స్టంటు. కట్టుకథ. కాసిన్ని నోట్ల కట్టలు విసిరేస్తే, సెల్‌ఫోన్లు, కోరుకున్న బిరియానీలూ, ఇంకా సకల సౌకర్యాలూ మన జైళ్ళల్లో డబ్బుగల ఖైదీలందరికీ దొరుకుతాయి. ఇన్ని వందల కోట్ల ఆస్తిపరులూ, కేంద్రమంత్రులుగా పనిచేసిన వాళ్ళూ ”జైలు లోపలి సుఖము ఇంతింత కాదయా” అని హాయిగా పాటలు పాడుకుంటూ వుంటారు.

చదవండి :  ఆ రాజధాని శంకుస్థాపనకు హాజరుకాలేను

పక్కరాష్ట్రం, కర్నాటకలో ఏం జరిగింది? ”గనులు లేవని మీరు కలతపడవలదు, నా గనులు నీవిగా చేసుకొని చూడూ…” అని గాలి జనార్ధనరెడ్డి పాడుతుంటే, నితిన్‌ గడ్కరి, వెంకయ్యనాయుడు, యడ్యూరప్ప తీన్‌మార్‌ దరువులకి డాన్స్‌ చేస్తున్న డప్పుల చప్పుడు మొన్నటి వరకూ విన్పిస్తూనే వుందిగా! ఈ పతనాన్ని మనం ముద్దుగా ‘ప్రజాస్వామ్యం’ అంటుంటాం. మనం తక్కువగా సిగ్గుపడతాం. అందుకే మన మొహాలకు నవ్వే సింగారం!

ఇక జగన్‌ విషయానికొస్తే, ఈనాడు, జ్యోతి ఐదేళ్ళ వేధింపునీ, కక్షసాధింపునీ జయించి ‘సాక్షి’పత్రిక, టీవీ ఛానల్‌ వచ్చాయి. వై.ఎస్‌.మరణించాకయితే, ‘యాడికిపోతావ్‌ రాజన్నా’, పచ్చని పొలాల్లో నువ్వే, ప్రజల గుండెల్లో నువ్వే అంటే ఆయన్ని దేవుణ్ణి చేసి హారతులు పట్టి పూజల్తో ఊదరగొట్టాయి. ప్రజలు ‘సాక్షి’ నే నమ్మారనీ, ‘ఈనాడు’ ప్రచారాన్ని పట్టించుకోలేదనీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

రెండు వ్యాపార సామ్రాజ్యాల మధ్య ఇక్కడ మహాసంగ్రామం జరుగుతోంది. ఈనాడు-సాక్షి, మార్గదర్శి- భారతి సిమెంట్స్‌, ఈటీవీ-సాక్షి టీవీ, అటు రామోజీ ఫిల్మ్‌ సిటీ, ఇటు జగన్‌ రాజభవంతులు… ఇవన్నీ తెరమీద. తెరవెనక- సీఎం పదవి నా సొంతం అంటాడు జగన్‌. నేను చెప్పిన వాడే సీఎం కావాలనేది రామోజీ పంతం. యుద్ధంలో ఏ నీతి నియమాలూ వుండవ్‌. నరుకు, చంపు లేదా చావు. చివరికిదెలా ముగుస్తుందో కానీ వార్‌లో మొట్టమొదట నెత్తురు కక్కుకు చచ్చిపోయింది మాత్రం తెలుగు జర్నలిజమే. కక్షరాతలు, విషపుమాటలు, నీచమైన ఆరోపణలు. బుద్ధిలేని కార్టూన్లు. రోజూ పొద్దున్నే పిచ్చి మొహాల్లాగా ఈ దరిద్రపు రాతలన్నీ మనం చదువుకొని జ్ఞానం పెంచుకోవడం. వీళ్ళలో ఎవ్వరూ ఉత్తములు కారని అందరికీ తెలుస్తున్నా, ఈనాడు, జ్యోతి వారు చేదువార్తలే వినబోతున్నారు. ”ఎచ్చుల పిల్లి ఏటపాలెం పోతే తన్ని తలగుడ్డ లాక్కున్నారు. మళ్లాపోతే మొలగుడ్డ లాక్కున్నారు” అని ప్రకాశం జిల్లా సామెత. ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇలాంటి అపశకునాలే ఎదురుకావచ్చు. ప్రస్తుత పరిస్థితులు ఎలావున్నాయంటే, జగన్‌కి బాత్రూంలో కాలు జారినా తూలి ముఖ్యమంత్రి కుర్చీలోనే పడతాడు. సుప్రీంకోర్టు చాచి తన్నినా ఎగిరి సీఎం సీట్లోనే పడతాడు. ఈ వాస్తవం తెలుసు గనకే ఈనాడు, ఆంధ్రజ్యోతి గంగవెర్రులెత్తినట్టు మిస్‌బిహేవ్‌ చేస్తున్నాయి. జగనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడానికి నువ్వెవరు? అంటే, అలా ఊహించడానికి ఒకరు ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌గానీ, సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌గానీ కానవసరం లేదు. మన దేశ దిక్కుమాలిన రాజకీయాలని గత పాతిక, ముప్ఫై సంవత్సరాలుగా గమనిస్తున్న వారెవరైనా చెప్పొచ్చు. ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి ఎవరవుతారు? ఎలా అవుతారు?

చదవండి :  చంద్రబాబు కోసం వైఎస్ రెకమండేషన్

ఏనాడూ ప్రజల ముఖం చూడని, వాళ్ళ బాధలు పట్టని – కేవలం 30 ఏళ్ళు హీరోయిన్లతో గంతులేసి పాటలు పాడిన పచ్చి కమర్షియల్‌ పాపానికి ఒక రాష్ర్టానికి ఎం.జి.ఆర్‌, మరో రాష్ర్టానికి ఎన్టీఆర్‌ నేరుగా ముఖ్యమంత్రులు అయిపోయారు. బుద్ధిగడ్డితిన్న డబ్బు కుంభకోణంలో లాలూప్రసాద్‌ యాదవ్‌ పదవి వదులుకుంటే, రబ్రీదేవి అనే ఒక ఇల్లాలు గబాగబా సావిట్లో గొడ్లకు గడ్డివేసి, వంటింట్లో బిడ్డలకు అన్నంపెట్టి, అలా అట్లకాడ పుచ్చుకొనే కేబినెట్‌ మీటింగ్‌లో కొచ్చేసి సీఎం కుర్చీలో కూర్చుండిపోయింది. 54 పార్లమెంట్‌ సీట్లున్న బీహార్‌ అనే పెద్ద రాష్ర్టాన్ని అయిదేళ్ళూ పరిపాలించి పారేసింది. లాలూప్రసాద్‌ భార్య అనేదే అర్హత. సెంటిమెంటూ అదే. ఎం.జి.ఆర్‌ సతీమణి జానకిని తమిళ జనం ఒప్పుకోలేదు. గ్లామరస్‌ హీరోయిన్‌ జయలలిత వాళ్ళకి బాగా తెలుసు. పైగా ఎం.జీ.ఆర్‌ ప్రియురాలు. అది చాలు సెంటిమెంటు పండడానికి, మాయావతిదీ అలాంటి కేసే. కాన్షీరాం ‘దళిత్‌’ అనే తురుఫు ముక్క తీశాడు. మాయావతిని ప్రమోట్‌ చేశాడు. ఖలాస్‌, కట్‌చేస్తే 85 ఎంపీ సీట్లున్న అతి పెద్ద రాష్ర్టం ఉత్తర ప్రదేశ్‌కి ఆమె సూపర్‌ బాస్‌. ఈ లాజిక్కే వై.ఎస్‌.విజయమ్మకీ వర్తిస్తుంది. వీళ్ళెవరికీ రాజకీయానుభవంలేదు. ప్రజల మనుషులు కారు. సీఎం అయిపోయాక నేను బతికేది కేవలం ప్రజల కోసం అని ప్రతీ పొలిటికల్‌ స్కౌండ్రల్‌ చెప్పుకోవచ్చు.

(source: TSI)

ఇదీ చదవండి!

అరటి పరిశోధనా కేంద్రం

పులివెందులలో ‘అరటి పరిశోధనా కేంద్రం’

కడప : పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధమయింది. ఏపీకార్ల్‌లో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: