జగన్ బహిరంగ లేఖ

ప్రతిపక్షం అదే. ఆరోపణలూ అవే. కానీ అసత్యాలంటూ ఒకపుడు వాటన్నిటినీ తిప్పికొట్టిన పాలక పక్షం… ఇపుడు ‘అవునా?’ అని ఆశ్చర్యం నటిస్తోంది. మనమే విచారిద్దాం… అంటూ సభా సంఘానికి సరేనంది. మొత్తమ్మీద అన్ని పక్షాలూ కలిసి ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కారణం ఒక్కటే. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారు లేకపోవటం. ఆత్మగౌరవం కోసం నేను సోనియాగాంధీని ఎదిరించటం. ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్న ఈ కుట్ర అసలు లక్ష్యం వేరే ఉంది. అది… ఎల్లో మీడియాకు అడ్డుగా ఉన్న ‘సాక్షి’ని తొలగించుకోవటం. కానీ నేను ప్రజల్లో ఉన్నా. వైఎస్‌ఆర్ సువర్ణ యుగాన్ని తిరిగి తెస్తానని మీకిచ్చిన మాటకు కట్టుబడి ఉంటా. ఈ కుట్రల వెనక అసలు కోణాలు, వీళ్ల ఆరోపణల్లో నిజానిజాలు మీకు తెలియజేయాలనే ఈ బహిరంగ లేఖ రాస్తున్నా…

ఒక్కడిని ఎదుర్కోవటానికి ఇంత డ్రామా నడపాలా? ప్రతిపక్షం, అధికార పక్షం కలిసి ఇంత నీచానికి దిగజారిపోవాలా? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అసలు ప్రజా సమస్యల్ని ఎవరైనా పట్టించుకున్నారా? బడ్జెట్‌పై చర్చించారా? నిధులు చాలని శాఖలకు అదనపు కేటాయింపులివ్వాలని ఎవ్వరైనా అడిగారా? మూలనపడ్డ సంక్షేమ పథకాలను ఏ ఒక్కరైనా ప్రస్తావించారా? వాటిపై చర్చకు ఏ పక్షమైనా పట్టు పట్టిందా? లేనే లేదు. అన్నిటినీ గిలెటిన్ చేసి పారేశారు. నన్ను ఎదుర్కోవటానికి మాత్రం అన్ని పక్షాలూ ఒక్కటైపోయాయి. చర్చ లేకుండా సభా సంఘాన్ని వేయాలని టీడీపీ సభను స్తంభింపజేయటం… లేదు చర్చిద్దామంటూ ప్రభుత్వమే ఆజ్యం పోయటం… ‘ముందే చెప్పారుగా. జేఎల్‌సీ వేయండి’ అంటూ మ్యాచ్ ఫిక్సింగ్‌ను చంద్రబాబు గుర్తుచేయటం… సరే! సభా సంఘానికి అభ్యంతరం లేదంటూ ముఖ్యమంత్రి సై అనేయటం. ఇదంతా డ్రామా కాక ఇంకేమిటి? మ్యాచ్ ఫిక్సింగ్ కాక ఇంకేమంటారు దీన్ని? కుట్ర కాక ఇంకేం పేరుంది దీనికి?

నాకు తెలుసు. ఈ కుట్ర ఇంకా లోతుగా ఉంది. ఇదంతా ఢిల్లీ నుంచే నడుస్తోంది. ఒక్కటి చూడండి. ఈ ఆరోపణలేమైనా ఇప్పటివా? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు బతికున్నప్పటి నుంచీ చేస్తున్నవే. 2009లో జరిగిన ఎన్నికల్లో సైతం ఎల్లో మీడియా ఈ ఆరోపణల్ని రోజూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించి జనం మదిలో విషం నాటబోయింది!! కానీ ప్రజలు వీటిని నమ్మలేదు. కాబట్టే నాన్నను మళ్లీ గెలిపించారు. ఆయన చనిపోవటం వల్ల అధికారం అనుభవిస్తున్న ఈ ప్రభుత్వ పెద్దలంతా అప్పట్లో ఈ ఆరోపణల్ని కొట్టిపారేసినవారే. అసెంబ్లీలో ఈ ఆరోపణలకు రాజశేఖరరెడ్డి గారు సమాధానమిచ్చినపుడు హర్షాతిరేకాలతో బల్లలు చరిచిన వారే. వారే ఇవే ఆరోపణలతో ఇటీవల కాంగ్రెస్‌కు చెందిన ఓ మంత్రి ద్వారా హైకోర్టులో పిటిషన్ కూడా వేయించారు. ఆయన కోర్టుకు సమర్పించిన ఆధారాలన్నీ… ఆ ఎల్లో పత్రికల్లో అచ్చేసిన కథనాలే. దీంతో పాటు ఆ కథనాలే ఆధారంగా చేసుకుని ఐటీ నోటీసులు కూడా ఇప్పించారు.

వారు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే ఇటు హైకోర్టులోనో, లేక ఐటీ పరిధిలోనో ఎక్కడో ఒకచోట న్యాయం గెలుస్తుంది. వ్యవహారం కొలిక్కి వస్తుంది. మరి మళ్లీ ఈ సభా సంఘమెందుకు? కోర్టులపై, ఐటీపై నమ్మకం లేకా? అదేమీ కాదు. వారు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వారికీ తెలుసు. ఎక్కడా వారు గెలవలేరని కూడా వారికి తెలుసు. అందుకని వారు ఎంచుకున్న మార్గం ఒక్కటే. చేయగలిగినంత దుష్ర్పచారం చేయటం. వీలైనన్ని మార్గాల్లో రచ్చ చేయటం. సాధ్యమైనన్ని మార్గాల్లో నన్ను వేధించటం. మూడేళ్లుగా ఇదే ఆరోపణల పర్వం సాగుతున్నా… 2008-09 సంవత్సరానికి సంబంధించిన ‘సాక్షి’ పెట్టుబడులపై నాకు నోటీసులొచ్చింది ఎప్పుడో తెలుసా? నేను సోనియాగాంధీతో విభేదించి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తరవాత. అంటే 2010 డిసెంబరు 31న. దానికన్నా ముందు ఈ పెట్టుబడుల వ్యవహారంపై తెలుగుదేశం ఆరోపణలు చేశాక 2009లో ఎన్నికలు జరిగాయి.

చదవండి :  ఆ ఆలోచనే వాళ్లకు లేదు ...

ఈ ఎన్నికల్లో విపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడి తలపడినా వైఎస్ ఒంటిచేత్తో గెలిపించటమూ జరిగింది. 2009లో ఆయన మరణం… కాంగ్రెస్‌లో ఆత్మగౌరవాన్ని చంపుకోలేక 2010 నవంబరు 29న నేను ఆ పార్టీకి రాజీనామా చేయటం అన్నీ జరిగాక. ఇన్ని చెప్పాక ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారన్నది వేరే చెప్పనక్కర్లేదు కూడా. అయినా సోనియా గాంధీతో విభేదించినప్పుడే నాకు తెలుసు. ఇలాంటివన్నీ ఎదురవుతాయని. ఎందుకంటే నేను విభేదించింది ఈ దేశంలోకెల్లా శక్తిమంతురాలితో. చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన సంస్థలన్నీ గుప్పిట్లో పెట్టుకున్న సర్వం సహాధికారిణితో. తెలిసే చేశా. ఎందుకంటే దేవుడెప్పుడూ న్యాయం వైపే ఉంటాడన్న నమ్మకంతో. ఇచ్చిన మాట కోసం… విలువల కోసం… ఆత్మగౌరవం కోసం.

నిన్నటి సభలోనే చూడండి. మరణించిన రాజశేఖరరెడ్డి గారు ఎలాగూ రారనుకున్నారో ఏమో! అడ్డూ అదుపూ లేకుండా బరితెగించేశారు!! ఒక ఐటీ అధికారి ఇచ్చిన నోటీసుల్ని పట్టుకుని… అదేదో తీర్పులా చూపించేస్తూ పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కై పేట్రేగిపోయాయి. ‘ఇంతకన్నా ఏం కావాలి?’ ‘ఇవిగో సాక్ష్యాధారాలు’ అంటూ చెలరేగిపోయాయి. ఏం…? మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో రామోజీరావుకు ఐటీ నోటీసులు రాలేదా? వాటిని ఆయన ఖాతరు చేశారా? కనీసం డిపాజిటర్ల పేర్లయినా వెల్లడించారా? లోతెంతో తెలియకుండానే దూకేసే జయప్రకాశ్ నారాయణ్ గానీ, ‘ఈనాడు’ లేకపోతే బతుకు లేదనుకునే చంద్రబాబునాయుడు గానీ వాటి గురించి ఏ ఒక్క రోజైనా ప్రశ్నించారా? అదీ ప్రజల వ్యవహారమేగా? మీరున్నది ప్రజా జీవితంలోనే కదా? రామోజీరావుకు సంబంధించినవైతే మీకు మాటలు రావా? మాట్లాడలేరా? అసలు రిలయన్స్ అనేది ఈ దేశంలోనే పెద్ద సంస్థ.

అలాంటి సంస్థ దేన్లో అయినా ప్రత్యక్షంగా, రాజమార్గంలో పెట్టుబడులు పెట్టాలి. మరి ఏటా భారీ నష్టాలు చూపిస్తున్న ఒక ప్రాంతీయ పత్రికలో (ఈనాడులో) రూ.2,500 కోట్లు అడ్డదారిలో పెట్టుబడి పెట్టడమే చోద్యం. దానికోసం లెక్కకు మించిన కాగితపు సంస్థల్ని సృష్టించటం మరీ చోద్యం. దీన్లో ఒకొక్క షేరుకూ రూ.5,28,630 చెల్లించి కొనటం అన్నిటికన్నా చోద్యం. ఈ చోద్యాలన్నీ చూస్తే… బాబు రిలయన్స్‌కు అప్పనంగా గ్యాస్ కట్టబెట్టినందుకేనని ఎవ్వరికీ అనిపిం చటం లేదా? దీన్నెన్నడూ ప్రశ్నించరేం? ఈ అక్రమార్కుల్ని శిక్షించాలని గొంతెత్తరేం? చంద్రబాబు అవినీతిపై కమ్యూనిస్టులు గతంలో ఏకంగా ఒక పుస్తకమే వేశారు. ‘బాబు జమానా- అవినీతి ఖజానా’ అని. తెహల్కా రాసింది ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజకీయ నాయకుడని.

అలాంటి బాబు నోటికి వచ్చినట్లు అసత్య ఆరోపణలు చేస్తుంటే లేని ఆవేశాన్ని తెచ్చుకుని ఊగిపోతుంటే… మిగిలిన పక్షాలంతా ఎందుకు మౌనం వహించినట్లు? ఫిక్సింగ్ చేసుకున్నాం కదా… కిమ్మనకుండా కూర్చోవాలని నిబంధనలేమైనా పెట్టుకున్నారా?

చదవండి :  ప్రొద్దుటూరు మున్సిపాలిటికీ 96 వసంతాలు !

అందరూ ఏకమై నన్ను ఒంటరిని చేసి, దాడులు చేస్తున్న నేపథ్యంలో మీకు కొన్ని విషయాలు తెలియాలి. నా సంస్థల్లో ఇన్వెస్టర్లు ఎందుకు పెట్టుబడి పెట్టారో… దానికి ప్రతిఫలమెలా పొందారో తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది. ఉదాహరణకు భారతీ సిమెంట్స్‌నే చూడండి. ఈ కంపెనీలో ఫ్రాన్స్ సంస్థ ‘వికా’కు మెజారిటీ వాటా విక్రయించాం. అలా విక్రయించినపుడు నాతో పాటు నా సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లంతా లాభపడ్డారు.

పెట్టుబడి పెట్టి మూడేళ్లు తిరక్కుండానే మ్యాట్రిక్స్ ప్రసాద్‌కు రూ.265 కోట్లు, ఇండియా సిమెంట్స్‌కు రూ.30 కోట్లు, దాల్మియా సిమెంట్స్‌కు రూ.41 కోట్లు లాభాలొచ్చాయి. దీన్లో ఇన్వెస్టర్లు ఈ ముగ్గురే. అంటే ఇన్వెస్టర్లంతా లాభపడినట్లేగా? లాభం కోసమే పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల లక్ష్యం నెరవేరినట్లేగా? మరి వారు ఈ లాభం కోసం కాక… ప్రభుత్వం నుంచి ఇంకేదో లబ్ధి పొందినందుకే దీన్లో పెట్టుబడులు పెట్టారనటం సమంజసమా? ‘సాక్షి’లో పెట్టుబడుల్నీ ఇదే కోణంలో చూడాలి. కానీ నన్ను దెబ్బతీయడం, ఎల్లో మీడియాను మించి ఎదిగిపోతున్న ‘సాక్షి’ని మూయించటమే లక్ష్యాలుగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, ఎల్లో సిండికేట్ ఏకమయ్యాయి. బాబు-సోనియా కుమ్మక్కై ‘సాక్షి’ పెట్టుబడులపై దుష్ర్పచారానికి పూనుకున్నారు.

మీరే చూడండి. ‘సాక్షి’ ఇన్వెస్టర్లలో అరబిందో ఫార్మా, పెన్నా సిమెంట్స్, మ్యాట్రిక్స్ ప్రసాద్, రాంకీ వంటివి ఉన్నాయి. వీటికి నిజంగా భూములిచ్చింది ఎవరు? నిజానికి జడ్చర్ల సెజ్‌కు భూసేకరణ, పరిహారం నిర్ణయం అన్నీ బాబు హయాంలోనే జరిగాయి. దాన్లో డజనుకు పైగా కంపెనీల మాదిరే అరబిందోకూ భూమినిచ్చారు. అదీ 33 ఏళ్ల లీజుకు మాత్రమే. ఈ కంపెనీలో చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు ఒకప్పుడు డెరైక్టరు కూడా. మరి అరబిందోకు భూమినిచ్చినందుకే అది ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టిందనుకుంటే మిగతా డజను కంపెనీలు కూడా పెట్టాలిగా? ఇక హెటెరో గ్రూప్ విషయానికొస్తే పోలేపల్లిలో అది సొంతంగా భూమి సేకరించుకుని సెజ్ కోసం దరఖాస్తు చేస్తే… ఆ దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేంద్రమే అనుమతినిచ్చింది. దానికి ప్రతిగానే అది ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టిందంటే నమ్మశక్యంగా ఉందా? ఇక రాంకీకి విశాఖలో ఫార్మా సిటీని కేటాయించింది చంద్రబాబు హయాంలోనే.

పెన్నా విషయానికొస్తే హోటల్‌కు అనుమతివ్వటం వల్లే వారు పెట్టుబడి పెట్టారన్నది బాబు మార్కు ఆరోపణ. ఒక హోటల్‌కు అనుమతి ఇచ్చినందుకే వారు ‘సాక్షి’లో పెట్టుబడి పెడితే ఈ రాష్ట్రంలో బాబు అనుమతిచ్చిన ఎన్ని హోటళ్లు ఆయన కంపెనీల్లో పెట్టుబడి పెట్టాయో ఆయనొక్కరే చెప్పగలరు. వాన్‌పిక్ అధినేత మ్యాట్రిక్స్ ప్రసాద్ వ్యవహారం తీసుకున్నా దానికి ప్రయత్నాలు జరిగింది బాబు హయాంలో. చెకొస్లొవేకియా ప్రభుత్వం వచ్చి వెనక్కెళ్లిపోతే… ఆ స్థానంలో రస్ అల్ ఖైమా ప్రభుత్వం వచ్చింది. నిర్వహణ సౌలభ్యం కోసం దానికొక స్థానిక భాగస్వామి కావాలి కనక… ఆ తరవాత అది అంతర్జాతీయ సంస్థ మైలాన్ ల్యాబ్స్‌లో భాగస్వామిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఎంచుకుంది. వీరంతా ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టింది ఇన్వెస్ట్‌మెంట్‌కు తగిన లాభం ఉంటుందనే ఉద్దేశంతో.

తెలుగు మీడియాలో ఒక కొత్త పత్రిక అవసరాన్ని గుర్తించటం వల్లే. కానీ ఇన్వెస్టర్లను బెదరగొట్టడమనేది ఎల్లో మీడియాకు కొత్త కాదు. సాండూర్ పవర్ విషయంలోనూ ఇలాగే యాగీ చేసి ఇన్వెస్టర్లను బెదరగొట్టబోతే… కాంగ్రెస్ నుంచి నేను బయటకు వచ్చాక వారి వాటాను కూడా నేనే తీసుకున్నా. నన్ను నమ్మిన ఇన్వెస్టర్లకు నష్టం రాకూడదని, ఇబ్బందులు ఉండకూడదని భావించాను కనక వారి పెట్టుబడి కన్నా ఎక్కువ చెల్లించి ఆ వాటాలు కొన్నా. వారిని లాభాలతో పంపించా. ఎల్లో మీడియా రాసినట్లు అవన్నీ బినామీ వాటాలైతేనో… అయాచిత లబ్ధికి ప్రతిఫలంగా పెట్టిన పెట్టుబడులైతేనో నేనెందుకు కొంటాను? ఎక్కువ డబ్బులు ఎందుకు చెల్లిస్తాను?

చదవండి :  తెదేపా పరిస్థితి దయనీయం

నిజానికి తెలుగు మీడియాలో ‘సాక్షి’ ఓ అవసరం. ఎల్లో రాతలకు వాతలు పెట్టే ఏకైక పత్రికగా అటు పాఠకుల ఆదరణ పొందటంతో పాటు, ఇటు ఇన్వెస్టర్ల నమ్మకాన్నీ నిలబెట్టుకుంది. 30 ఏళ్లుగా ఎదురులేకుండా ఆధిపత్యం చెలాయిస్తున్న ‘ఈనాడు’కు దీటుగా… వచ్చీ రావటంతోనే ‘సాక్షి’ అత్యధిక సర్క్యులేషన్ సాధించింది. యేటికేడు పెరుగుతూనే ఉంది. 14 లక్షల 50 వేల పైచిలుకు సర్క్యులేషన్‌ను తాజాగా ‘ఏబీసీ’ నిర్ధారించింది. కోటీ 36 లక్షల మంది పాఠకులున్నట్లు ఇండియన్ రీడర్‌షిప్ సర్వే వెల్లడించింది. ప్రజాదరణలో దేశం మొత్తమ్మీద తొమ్మిదవ స్థానంలో ఉంది.

ఇదే ‘ఈనాడు’ తన విలువను రూ.6,000 కోట్లుగా వాల్యుయేషన్ చేయించుకుని రూ.100 విలువ ఉన్న ఒకో షేరును రూ.5,28,630కి విక్రయించినపుడు… సర్క్యులేషన్లో దాంతో దాదాపు సమానంగా… మౌలిక సదుపాయాల్లో, టెక్నాలజీలో దానికన్నా మిన్నగా ఉన్న ‘సాక్షి’ వాల్యుయేషన్‌ను డెలాయిట్ సంస్థ రూ.3,500 కోట్లుగా నిర్ధరించటం తప్పా? ఇన్వెస్టర్లు రూ.10 విలువగల షేర్లను రూ.350కి కొనుగోలు చేయటం తప్పా? రెండేళ్ల తరవాతో, మూడేళ్ల తరవాతో ‘సాక్షి’ పబ్లిక్ ఇష్యూకు వెళ్లినపుడు ‘ఈనాడు’తో సమానమైన వాల్యుయేషన్ దానికి రాదా? ఆ మేరకు ఇన్వెస్టర్లందరికీ రెట్టింపు లాభాలు రావా? ఇదంతా జయప్రకాష్ నారాయణ్‌కు గానీ, చంద్రబాబుకు గానీ, వారితో కుమ్మక్కైన ప్రభుత్వానికి గానీ తెలియదనుకోవాలా?

తెలియకేమీ కాదు. అందరికీ తెలుసు. కానీ ఇదంతా ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న మహా కుట్ర. ‘సాక్షి’ని మూయించేస్తే ఇక తమకు ఎదురుండదనుకునే ఎల్లో సిండికేట్ డెరైక్షన్లో… సోనియాగాంధీని ఎదిరించినందుకు నన్ను ఎలాగైనా అణచేయాలన్న ధ్యేయంతో సాగుతున్న కుట్ర. ఆ కుట్రలో భాగమే ఈ సభాసంఘం కూడా. పది రోజుల డ్రామాలో భాగంగా వేసిన ఈ సభాసంఘం… నన్ను, ‘సాక్షి’ని దెబ్బతీసే కుట్రలో ఒక అంకం. ఈ సభా సంఘం ఏం చేస్తుందో ఊహించటం కష్టమేం కాదు. ఎందుకంటే దీన్లో సభ్యులుగా ఉండేది టీడీపీ… వారితో కుమ్మక్కయి సరేనన్న కాంగ్రెస్ సభ్యులే. ఐటీ నోటీసులే కోర్టు తీర్పులా చెబుతున్న జయప్రకాశ్ నారాయణ్ వంటి వారే! నా ఉద్దేశం ప్రకారం ఈ సభాసంఘం వేయాలని మాత్రమే కాదు.

ఏఏ వ్యవహారాలపై విచారణ జరపాలో, ఏఏ నిర్ణయాలు తీసుకోవాలో ముందే ‘ఫిక్స్’ అయిపోయి ఉంటుంది. నేనైతే మీకు చెప్పేదొక్కటే. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్నెన్ని రకాలుగా వేధించినా ఎదుర్కొంటాను తప్ప ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోను. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశించిన సువర్ణయుగాన్ని తెస్తానన్న మాటకే కట్టుబడి ఉంటా. ఎన్నాళ్లు బతికామన్నది కాదు… ఎలా బతికామన్నది ముఖ్యమని నమ్మేవాణ్ణి నేను. దేవుడు చూస్తున్నాడు. నాన్న ఆశీస్సులున్నాయి. న్యాయం గెలుస్తుంది. నాన్నను ప్రేమించే ప్రతి గుండె నాకు తోడుంది.YS Jagan SIgn

ఇదీ చదవండి!

ఈనాడు పైత్యం

పులివెందుల పేర మళ్ళా ఈనాడు పైత్యం

తెలుగు రాష్ట్రాలలో అత్యధికులు చదివే పత్రికగా చెలామణి అవుతున్న ఈనాడు ఒక వార్తకు పెట్టిన హెడింగ్ ద్వారా మళ్ళా తన …

ఒక వ్యాఖ్య

  1. K. Ravi Prakash Reddy

    shabasheeeee anna edhi kadapodi debba..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: