పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని వశీకరణకు గురైన ఒక నాయిక ఆ ‘మాయగాడి’ని మోహిస్తూ.. వచ్చి వలపులందుకొమ్మని ఇట్లా పిలుస్తోంది…
వర్గం: శృంగార సంకీర్తన
రాగము: సామంతం
రేకు: 0879-5
సంపుటము: 18-472
‘కన్నుల మొక్కేము…’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.
కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ నన్నుఁ
గన్నెనాఁడె యేలితివి కడపరాయ ॥పల్లవి॥
కందర్పగురుఁడ వో కడపరాయ మాకు
గంద మీయఁ గదవోయి కడపరాయా
కందము నీగుణములు కడపరాయా తొంటి-
కందువకు రాఁ గదోయి కడపరాయా ॥కన్నుల మొక్కేము॥
కలువపూవుల వేసి కడపరాయా నేఁ
గలికి నంటా మెచ్చేవు కడపరాయా
కలకాలముఁ బాయకు కడపరాయా నీ-
కలపుకో లెరుఁగుదుఁ గడపరాయా ॥కన్నుల మొక్కేము॥
గరిమ శ్రీ వేంకటాద్రి కడపరాయా నన్నుఁ
గరుణించి కూడితివి కడపరాయా
గరిమేలు నేరుతువు కడపరాయా నా-
గరువ మీడేర్చితివి కడపరాయా ॥కన్నుల మొక్కేము॥
‘కన్నుల మొక్కేము…’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.