నమ్ముకొన్న నేల (కథ) – కేతు విశ్వనాథరెడ్డి

నమ్ముకొన్న నేల (కథ) – కేతు విశ్వనాథరెడ్డి

నమ్ముకొన్న నేల

ఎర్రగుంట్లలో ‘రాయలసీమ’ దిగగానే యెదురుగ్గా సి.సి.ఐ సిమెంటు ఫ్యాక్టరీ. చిలమకూరులో బస్సు దిగగానే రోడ్డుమీద, రోడ్డు కటూ యిటూ కోరమాండల్ వాళ్ళు కడుతున్న మరొక కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ హడావుడి.

జీపుల మొగం, కార్ల మొగం పెద్దగా చూడని చిలమకూరు రోడ్డుమీద యిప్పుడు జీపులూ, కార్లూ అదే పనిగా అటూ యిటూ తిరుగుతున్నాయి. ఫ్యాక్టరీ కట్టే చోటుకు రాళ్ళు తీసుకుపోతూ గతుకుల రోడ్డుమీద లారీలు. లారీల్లో ఆ రాళ్ళలాగే ఆడా మగా.

రోడ్డు పక్కల కొత్త అంగళ్ళు. చార్మినారు, సిజరు తప్ప మొన్న మొన్నటిదాకా మరే రకం సిగరెట్లు దొరకని అంగళ్ళలో రెడ్విల్స్ దాకా రకాలు కనపడుతున్నాయి. బ్రాందీషాపులే యింకా వచ్చినట్టు లేదు. కూరగాయలు, సరుకులు, తినుబండారాలు, టీలు, కాఫీలు, గుడ్డలు, సబ్బులూ, పేస్టూ కలగాపులగంగా ఒకే అంగట్లో, వేరు వేరు అంగళ్ళలో.

బస్సుల కోసం వచ్చిన వాళ్ళతో, రికామీ మనుషులతో, ఫ్యాక్టరీ కూలీ జనంతో సంబంధ మున్న వాళ్ళతో రోడ్డు సందడిగా వుంది. ఇన్నేళ్ళ వ్యవసాయమూ, వానమీద ఆధారపడిన వాణిజ్య పంటలూ, రాళ్ళ గనుల వ్యాపారమూ తేలేని కొత్త మార్పులు యిప్పుడు కనపడుతున్నాయి. గ్రామీణ బ్యాంకి ఈ మార్పుల మధ్య. రెండు మూడు భాషల జనం ఈ మార్పుల మధ్య.

రోడ్డుమీద మా వూరి వాళ్ళెవరూ కనపడలేదు. రోడ్డు దిగి మా వూరి కాలి దారి – చేలగుండా వెళ్లే కాలిదారి – పట్టినా.

చుట్టూ చేలు, నూర్ల యెకరాల చేలు. యెవరెవరి చేతుల్లోనో మారుతూ వస్తున్న ‘పుడమితల్లి’. అమ్మకాల్లో, కుటుంబ పంపకాల్లో చీలికలూ ముక్కలూ అవుతూ ‘నేలతల్లి’ గట్లమధ్య ‘భూదేవత’. సేద్యాలు అయికూడా చాలా మటుకు విత్తనం పడకుండా… దాదాపు చేలన్నీ బీళ్ళే. బీళ్ళన్నీ ఆకాశాన్నీ కరువున పడి చూస్తూ… ‘బీళ్ళు దున్నేరు’. వానలేదు, పంటలేదు.

పొలంలో జొన్నేగిలి లేదు. కొర్రేగిలి లేదు. కుసమేగిలి లేదు. సెనక్కాయేగిలి లేదు. యే యేగిలీ యేం లాభం? అక్కడో, యిక్కడో బెత్తెడెత్తు కూడా పెరక్కుండానే పసివాళ్ళ చావులాగా మాడి బుగ్గి అయిన సెనక్కాయ. యీ పాటికి యే రెండు మూడు వానలో అదును తప్పకుండా పడివుంటే, గట్లు కూడా కనపడకుండా పైరు పచ్చలతో కళ కళ లాడాల్సిన పొలాలు, గట్లు మాత్రం కనపడుతున్నాయి – వాళ్ళ బతుకుల్లోని భవిష్యత్తులా!

మళ్ళా కరువే. కరువు బతుకుల్లో భాగమైన కరువు. యెన్నో కరువో గుర్తులేదు. గుర్తులు సమస్యల్ని తీరుస్తాయా?

కాళ్ళకింద కొంపా, గోడూ కాలిన ఒక వీధిలా భూమి. పైన ఆకాశం బూడిద కుప్పలాగా. ఆకాశంలో ఒకటీ అరా మబ్బులేవో కనపడుతున్నాయి. తగిన వానల్లేక గాలికీ, యెండలకీ పగిలిన పత్తికాయల్లో కనపడే గొగ్గిపత్తి లాగా ఆ మబ్బులు. ఆకాశంలో ఒక్క కాకి లేదు. కాలి దారిలో ఒక్క మనిషి యెదురు పడలేదు. పైరగాలి రావలసిన కాలంలో, గాలి కాలంలో లాగా గాలి.

ఈ యేడాది కరువు యింత దారుణంగా వుంటుందనుకోలేదు. న్యూసు పేపర్లలో చదివిన వార్తలూ, యెవరెవరో చేసిన ప్రకటనలూ, వాగ్దానాలూ జ్ఞాపకానికి వచ్చినాయి. తెలివి తెలిసినప్పటినుంచీ ప్రకటనల్లో, వాగ్దానాల్లో మార్పు మాత్రం చూల్లేదు.

ఇంత ఘోరకలిలో హైదరాబాద్ నుంచి నేనేం పాముకోను యింతదూరం ఇక్కడికి వచ్చినట్లు? అంగడి సుబ్బరాయుడు వుత్తరం రాస్తానే, యింత దూరం పరుగెత్తుకొని రావాలా? ఆశ…

అవసరం…

పిత్రార్జితంగా మిగిలిన రెండెకరాల తోటనూ, నాలుగేండ్ల కిందట మా దాయాది వీరన్నకు అమ్మడంతో, నాకింకా వదలని మా వూరి బంధం; భూమితో ఆఖరి బంధం. ఈ రెండు మూడు రోజుల్లో పని కుదిరితే ఈ నేలతో నాకు తెగతెంపులు.

నాలుగేండ్ల కిందట వీరన్న తన తోటపక్క వుండే నా రెండెకరాల భూమినీ తానే తీసుకుంటానన్నాడు. ఆ వంతుల బావకింద వున్న నా తోటను మరొకరికి అమ్మి, వీరన్న గుండెలమీద కుంపటి పెట్టే దానికంటే, వీరన్నకే అమ్మడం మంచిదనిపించింది. వీరన్న తన వెలిపొలం నాలుగు ఎకరాలు అమ్మేవేళకు అప్పులవాళ్ళు చుట్టుకున్నారు. మిగిలింది రెండు వేలు. ఆ రెండు వేలూ సంచకారంగా నా చేతిలో పెట్టి క్రయపత్రం రాయించుకున్నాడు. తన రెండేండ్ల నిమ్మచెట్లు కాపుకొస్తానే మిగతా యెనిమిదివేలూ తీరుస్తానన్నాడు. అంతదాకా గుత్త యిచ్చేట్టు ఖరారయింది. అప్పటినుంచీ గుత్తాలేదు. భూమీ రిజిష్టరూ చేయించుకోలేదు. నాకేమో డబ్బు అవసరం. మా మూడో అమ్మాయి ప్రసూన పెళ్ళి నిశ్చయమైంది. వీరన్నకు రాస్తే జవాబు లేదు. మామూలు సమయంలో పోదాంలే అనుకుంటున్నాను. యింతలో అంగడి సుబ్బారాయుడు నుంచీ వుత్తరం. వీరన్న వ్యవసాయం యెత్తిపెట్టినాడంట! తోట అమ్మినాడంట! చెడిపోయినాడంట! నా రెండెకరాలు సుబ్బారాయుడు కొంటాడంట!

వుత్తరంలో వివరాలు లేవు. అంతా బీరకాయ పీచులాగా వుంది. వీరన్న నిమ్మ చెట్లేమైంది తెలియదు. అమ్మింది యెందుకయింది తెలియదు. దెబ్బతిన్న సంసారమే అయినా యింత యిదిగా వుంటుందనుకోలేదు.

వుత్తరం చూసి నా భార్య తొందర పెట్టింది, అసలే ఆడకూతురు. యిది చిక్కు వ్యవహారమని ఒకవైపు యిబ్బందిగా వుంది. గుత్తబాకీ చెల్లేసుకున్నా, వీరన్న సంచకారం నా దగ్గర వెయ్యికి పైగా వుంటుంది. అసలు వీరన్న భూమి వదులుకుంటాడా? సంచకారం వెనక్కు తీసుకుంటాడా? వెనక్కు తీసుకోమని నా నోటితో నేనెట్లా అడగడం? మరి నా అవసరం? అయితే ఈ కరువు రోజుల్లో నా అవసరం తీరేదెట్లా? అంగడి సుబ్బారాయుడి యెత్తులేమో?

మనసంతా చీకాగ్గా వుంది. వూరు దగ్గిర పడింది. చిన్నప్పుడు వానాకాలంలో, పైర్ల కాలంలో తిరిగిన పొలాలూ, కుంటా, కొండా జ్ఞాపకం వస్తున్నాయి. మమకారాలు ఒకంతట వదలవు. కరువుల ప్రాంతంలో భూముల ధరలు పెద్దగా పెరిగి చావవనీ తెలిసీ, యెన్నేళ్లు భూమి అమ్మకుండా వాయిదా వేసినాను? యేదో జీతం డబ్బులతో బతకడం బట్టి యిది నాకు సాధ్యమయిందేమో! చదువే లేకపోతే, వుద్యోగమే లేకపోతే యిట్లాంటి చోట నేనేమైవుండేవాణ్ణి? ఆలోచించడానికి భయం వేసింది.

వూరు గవినిలో వున్న వేపచెట్టు కింద, చెట్టుచుట్టూ కట్టిన అరుగుమీద యెప్పుడూ కనిపించే పుల్లయ్య కనపడలేదు. ఆ ముసిలోడు జీతాలోళ్ళమీద విసుర్లు విసురుతాడు. వూపిరి పీల్చుకున్నాను. ఆ అరుగు మీద మామూలుగా వుండే మా వూరి సగం సంఘ జీవితం కనపడలేదు. నా చిన్నతనంలో అక్కడే మోకులూ, పగ్గాలు పేనేవాళ్ళు. బయట నుంచీ వచ్చిన సరుకుల బండ్లమీద ఆడవాళ్ళూ, పిల్లలూ యెగబడేవాళ్ళు. చేటలు, చేటలు గింజలు వెంట తెచ్చుకుని పిల్లలు బొంగరాలు ఆడేవాళ్ళు. పుట్టచెండు ఆడేవాళ్ళు. రాత్రుళ్ళు పొద్దుపోయిందాక పిల్లలం కథలు చెప్పించుకునేవాళ్ళం. చెప్పుకునేవాళ్ళం. కథలు చెప్పే యెరికలయ్య అబ్బ చచ్చిపోయినాడంట. మిగతా నా సావాసగాళ్ళు అంతా కొందరైనా ఈ సమయంలో అరుగుమీద కనపడేవాళ్ళు. యిప్పుడు యిద్దరు కుర్రవాళ్ళు మట్కా చార్టు చూస్తున్నారు. వాళ్ళెవరి పిల్లలో నాకు జ్ఞాపకం రాలేదు. వాళ్ళు నన్ను గుర్తించలేదు. రెండేండ్లకో, మూడేండ్లకో చుట్టపు చూపుగా వచ్చే నన్ను యెవరు గుర్తిస్తారు? వూరు విడిచి యిరవై యేండ్లు పైబడింది.

వూరి మధ్య దేవళం దగ్గర మామూలుగా కనపడే మిగతా సగం, మా వూరి సంఘ జీవితం కనపడలేదు. అక్కడే ఒకప్పుడు వేమన్నలూ, సాధులూ, సన్యాసులూ, తత్వాల వాళ్ళూ, దొమ్మరాట, తోలు బొమ్మలాటల వాళ్ళూ దిగేవాళ్ళు. పౌరాణిక నాటకాలు నేర్చుకునేవాళ్ళు. కొన్నేళ్ళు బడి దేవళంలోనే. దేవళం ముందర యాటపోతులు తెగేవి. వానకోసం కప్పల పెళ్ళిళ్ళ ప్రారంభం అక్కడే. విరాటపర్వం చదవటం అక్కడే. భజనలు అక్కడే. శ్రీరామనవమి పానకాల పంపకం అక్కడే. మొలకల పున్నమి మొదలు కావడం అక్కడే. గిలకల కొట్లాటలు అక్కడే., వూళ్ళోకి వచ్చే కొత్తవాళ్ళూ వాళ్ళ పలకరింపులూ, అక్కడే. అక్కడే రెడ్డీ, రెవెన్యూ వాళ్ళు దిగేవాళ్ళు. అక్కడే నా చిన్నతనంలో కాశీనాథుని ఆంధ్రపత్రిక వొకరు చదువుతావుంటే నలుగురూ చేరి వినడం చూసినాను. వాళ్ళ చర్చలు విన్నాను. యస్సెల్సీ చదువుకొనే రోజుల్లో కాంగ్రెస్ రాజకీయాలూ, కమ్యూనిస్టు రాజకీయాలూ విన్నాను. సొతంత్రం వచ్చిన రోజు జెండా నాటడానికి కట్టిన రాళ్ళ దిమ్మెమీద పెట్టేందుకు తొలిచిన బండమాత్రం పక్కన పడి వుంది – పాడుబడిపోతున్న దేవళంలాగే.

పైరు కాలంలో యెవరెవరి చేలల్లో పంటయెట్లా పండిందీ చర్చలు సాగేది అక్కడే. చేలల్లో పడిన పశువుల పంచాయితీలు అక్కడే. దొంగలకు శిక్షలు అక్కడే. వూరు మంచీ, వూరు చెడ్డా అక్కడే. మా నాయన మంగతై ఆడి ముప్పయి యెకరాలూ, యిల్లూ పోగొట్టింది ఈ దేవళంలోనే. ఆ దేవళంలో కూర్చొని వున్న కుర్రవాడెవరో “ఈ పొద్దు పేపరు తెచ్చినారా?” అన్నాడు. “యెవరి పేపరు?” అన్నాను.

యిబ్బందిగా “ఈ వూళ్ళో పేపరు తెచ్చుకొనేదెవరు? మీరేమన్నా కొనుక్కొని వచ్చినారేమో” అన్నాడు.

లేదు.

“నిన్నటి తెలుగు పేపరుంది” అన్నాను.

“అదే యీండి” అని తీసుకున్నాడు.

యిది వార్తల దాహమో, చదువుకున్నవాడి చదువాకలో అర్థం కాలేదు. వీధిలో సంచలనం యిప్పుడు వూరు వూరంతా వలస పోయినట్లుంది. పిల్లలు తప్ప యింటి ముందర అరుగులమీద కూడా పెద్దవాళ్ళు కనపడడం లేదు. వూరు యింతగా మారిపోవాలా? యే వుత్సాహమూ లేక యిళ్ళల్లో ముడుచుకొని కూర్చుని వుంటారేమో! వానల్లేని యిట్లాంటి రోజుల్లో మూఢనమ్మకాల ద్వారా కనపడే సంఘజీవితం కూడా కనపడడంలేదు.

వీరన్న యింట్లో లేడు. వీరన్న భార్య రామలక్షుమ్మ జొన్న బియ్యం విసురుకుంటోంది. నన్ను చూసి బిత్తరపోయింది. గబగబా లోపలికెళ్ళి కాళ్ళకు కడుక్కోను నీళ్ళిచ్చింది. జగతి మీద నులకమంచం వాల్చి, దానిమీద ఒక చిరుగుల పరుపు పరచి కూర్చోమంది. కూర్చున్నాను.

రామలక్షుమ్మ కుశల ప్రశ్నలు వేసింది. యింట్లో పరిస్థితులు చూస్తూ జవాబులు గొణిగినాను.

“ఇప్పుడే వచ్చా (వస్తా) బావా!” అంటూ రామలక్షుమ్మ బయిటికి వెళ్ళింది. యిల్లు రైతిల్లులాగా లేదు. యే స్కూలు టీచరుకో అద్దెకిచ్చిన యిల్లులాగా వుంది. గాటిపాట యెద్దులు లేవు. యారముట్లు లేవు. యెనుములు లేవు. అటకమీద పొట్టులేదు. చొప్పా లేదు. ఒకటి రెండు కోళ్ళు మాత్రం తిరుగుతున్నాయి. అంగడి సుబ్బరాయుడు రాసింది నిజమేనని తేలుతూంది. వీరన్న వ్యవసాయం యెత్తిపెట్టినట్లే.

రామలక్షుమ్మ కొంగుచాటున యేదో దాచుకుని వచ్చింది. “కాపీ తెచ్చా (తెస్తా) నుండు బావా” అని గాట్లో వేసిన పుల్లలు తీసుకొని లోపలికెళ్ళింది. అరగంట తర్వాత కాఫీ తెచ్చి యిచ్చింది. బెల్లం కాఫీ. పొగవాసన. ఆమె పడిన అవస్థ అర్థమైంది.

“వీరన్న వూళ్ళో లేడా?” అని అడిగినాను.

రామలక్షుమ్మ కాసేపు మాట్లాడలేదు. చెప్పక తప్పలేదన్నట్లు మాటలు మింగుతూ చెప్పింది: “పొద్దుటూర్నుంచీ వచ్చినాక, సిమెంటు ఫ్యాక్టరీకి పోతాండాడు. మనూర్లో చానామంది పోతండారు, యీ నడుమ; సెపితే తీరదులే బావా!”

ఆమె కంఠంలో జీరపడింది. మరో ప్రశ్న వేయలేదు. కానీ ప్రొద్దుటూరి నుంచీ రావడమేమిటో నాకర్థం కాలేదు. వీరన్న వచ్చినాక తీరిగ్గా అడగవచ్చులే అనుకున్నాను.

“నీళ్ళు కాంచుతా బావా! పొంతలో నీళ్ళు అయిపోయినాయి. తెచ్చా (తెస్తా) వుండు” -రామలక్షుమ్మ బిందె తీసుకొని బయటికి వెళ్ళబోతోంది.

“నేను అట్లా వూర్లోకి పొయ్యొస్తా. నాకన్నం గిన్నం వండద్దులే” ఆమె వుండమని బలవంతం చేస్తుందని, విన్పించుకోకుండా బయటపడినా.

అప్పటికి యింకా పదిగంటలు కాలేదు. సాయంత్రం గానీ వీరన్న రాడు. యీ పరిస్థితుల్లో యెవరింటికి పోవాలన్నా బీతుగా వుంది. రెండు మూడు రోజులు వూర్లో వుండాల్సి వస్తే, యెట్లా వుండాలో దిక్కు తెలీకుండా వుంది. వీరన్న యింటి పరిస్థితి చూస్తావుంటే, వాళ్ళమీద పడి తినడం ఘోరం. దాయాదే కావచ్చు. మిగతా దాయాదులున్నారు. మా నాయన బతికివుండగా వాళ్ళతో మాకు మంచి సంబంధాలు లేవు. యీ శతృభావం ముదెబ్బల (ముత్తాతల) కాలం నాటినుంచీ వచ్చింది. ఆ తర్వాత బావుల్లో నీళ్ళు తగ్గుతూ వచ్చినప్పుడు నీటి వంతుల కోసం వచ్చింది. తలకాయలు బద్దలు కొట్టుకోవడం దాకా రాలేదు. కానీ బావుల దగ్గర కుక్కల్లా కాట్లాడుకున్నారు. పైర్లు యెండబెట్టుకున్నారు. కాపుకు రాబోతున్న నిమ్మచెట్లను యెండబెట్టుకున్నారు. పెళ్ళిళ్ళ దగ్గరో, చావుల దగ్గరో కలిసేవారు. శుభకార్యాల బంధుత్వం, సూతకాల రక్తస్పర్శ – అంతే. మళ్ళా మామూలే. అయితే నాకున్న చదువువల్లా, వుద్యోగం వల్లా, మా నాయన పోయాక నాతో పడే తగవు యేం లేదు కాబట్టి పలకరింపులున్నాయి. వూరొస్తే భోజనాలకు పిలవడాలున్నాయి. ఈ రెండు రోజులు అంగడి సుబ్బారాయుడింట్లోనే భోజనం యేర్పాటు చేయించుకుందామని నిశ్చయించుకున్నాను.

అంగట్లో సుబ్బరాయుడు కూర్చొని వున్నాడు. యిల్లు అదే, అంగడీ అదే – ఆయిలింజన్ల కోసం ఒక వారగా అరుగుమీద పెట్టిన కిరసనాయలు డ్రమ్ముతో సహా.

అంగట్లో వెయ్యి రూపాయల పెట్టుబడి వుండదు. ఒంటిమీద చొక్కాలేదు. మాసి చిరిగిపోయిన పంచె కట్టుకున్నాడు. గడ్డం మాసి వుంది. మనిషి మాత్రం దరిద్రం ఓడుతున్నాడు. మొలతాడుకు బీగాలు వేలాడుతున్నాయి. డబ్బు సంపాదనలో ఆ దీక్ష మానవ మాత్రులకు సాధ్యమయ్యేది కాదనీ, యోగులకు మాత్రమే సాధ్యమని, ఆ మనిషిని చూస్తూనే, అతను సరుకులమ్మే పద్ధతిని చూస్తూనే తెలిసిపోతుంది.

నన్ను చూస్తూనే జొన్నలు పోసుకొనే జాజిచెక్క పెట్టెమీద అడ్డపలక వేసి కూర్చోమన్నాడు. పిల్లలు అయిదు పైసల పది పైసలు బేరానికి బొంగో, జీడినో, వూపిరి బుడ్డా, మరొకటో చేతుల్లో పెడుతూ క్షేమసమాచారాలు అడిగి నింపాదిగా అన్నాడు!

“అన్నం సెయ్యిచ్చేదా? వీరన్నింటికి పోవాలా?”

“చేయించు” అన్నాను.

లేచి యింట్లో చెప్పి వచ్చినాడు. సుబ్బారాయుడి భార్య పరామర్శ చేసి పోయింది. సుబ్బరాయుడు నెమ్మదిగా అన్నాడు:

“వీరన్న భూమిని నన్నే తీసుకోమన్నాడు.”

“వీరన్న రానీలే మాట్లాడదాం” అన్నాను.

ఈ పొడి మాటలు ఒక కొలిక్కి రాకుండానే, అంగట్లోకి మా మరో పెద్దనాయన కొడుకు మునిరెడ్డి వచ్చాడు. నన్ను చూసి నేరుగా యింటికి రాకపోయినందుకు నిష్ఠూరం చేసినాడు. “యిదుగో యిప్పుడే రాబోతున్నా” అని బొంకినా. “భోజనానికి పద” అన్నాడు. “యిప్పుడీడ తింటాడు. రాత్రికి కోడిగోసి పెట్టుదువులే” అని సుబ్బారాయుడు హాస్యాని కన్నట్లు అన్నాడు. “యిప్పుడు కాఫీ అన్నా తాగొస్తువు రా” అంటూ బలవంతంగా లేవదీసినాడు.

మా మునిరెడ్డి అన్న కాఫీ యిచ్చి రెండు గంటలు గ్రామ పరిస్థితులూ, పంచాయితీలూ, రాజకీయాలూ, చదువులూ సంధ్యలూ, దేశ రాజకీయాలూ అన్నీ మాట్లాడినాడు. అది పెద్ద సోది. అన్నీ తెలుసుననుకొనేవాడి సోది. ఎంతకూ నా విషయం మాత్రం అడగలేదు. భరించలేక నేనొచ్చిన పని చెప్పినా. ముందు భూమినమ్ముకోడమెందుకన్నాడు. తర్వాత “జీతమంతా యేం చేస్తాండావు? యెంత మిగిల్చినావు? యిన్సూరెన్సెంత?’ వగైరా యక్ష ప్రశ్నలు వేసినాడు. మా ప్రసూన పెళ్ళి నిశ్చయమైన సంగతి చెప్పినా. పిల్లగాడు చదువు, వుద్యోగం, కట్నం అన్నీ అడిగినాడు.

“ఈ పాడు కరువులో ధర యాడపలుకుతుంది? అంగడి సుబ్బారాయుడికి అగ్గువగా యివ్వాల్సి వుంటుందేమో” అన్నాడు.

“వీరన్న చచ్చినాకనే ఆ బేరం” అన్నాడు.

అప్పుడు వీరన్న కథ చెప్పినాడు:

“వాడు మనోళ్ళందరికీ చెడ్డ పేరు దెచ్చినాడు. వూర్లో సాటి కాపోళ్ళకు చెడ్డపేరు. మన వంశం యెట్లాంటిది? దెబ్బ తిన్నోడు దాయాదే గదా అని మనింట్లో సేద్యాని కుండమన్నా. వాడు బడాశ మనిషి, ఒప్పుకోలేదు. ఆ పనికిమాలిన కామనూరోళ్ళ మాట విని ‘బోగం కంపెనీ’లో చేరినాడు. చేరినోడు మర్యాదగా వుండినా పొయ్యేది. ఆ రెండెకరాలూ అమ్మి బాకీలన్నా పూర్తిగా దీర్చకుండా, రెండువేలు తీసుకొని యింకెక్కడా బాగుండదని చిలకలూరిపేటకు పోయినాడంట. యిద్దరు బోగమోళ్ళను దెచ్చుకుంటే వాళ్ళు దొడ్డికి పొయ్యెస్తామని అదే పోయినారంట. వీడు అన్నెందాలా చెడిపోయినాడు. యేమయిందో యేమో తెల్దు. బామర్థులతో చెడిందని అంటా వుంటారు. పోలీసోళ్ళు వొక రోజు బాగా కొట్టినారంటా వుండారు. యీ మధ్యనే వూరు చేరి సిమెంటు ఫ్యాక్టరీకి పోతండాడు. కరువులే ఒకటి అనుకుంటే యీ సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చి రైతుల కొంప గూల్చింది. రోజుకు సిమెంట్ ఫ్యాక్టరీలో పదైదు రూపాయల కూలీ గిట్టుతుంది. రైతును అంత యిమ్మంటే యెక్కణ్నుంచి తెచ్చి యివ్వాల? యిప్పుడు అయిదు రూపాయలిచ్చినా వచ్చేవాడు లేడు. ఆడోళ్ళు కూడా అక్కడికే మరిగింటే. పది రూపాయలు దొరుకుతుంది. యింక భూములన్నీ అమ్ముకోవాల్సిందే. ఈ కూలోళ్ళు, మన పక్క పల్లె కూలోళ్ళే మన భూములన్నీ కొనే రోజులు దగ్గరపడినాయి”

కూలోళ్ళు యెంత భూములు కొనిందీ మునిరెడ్డి అన్నకు తెలియంది కాదు. అంగడి సుబ్బారాయుడి లాంటి వాళ్ళు ముందుకొస్తున్నారంటే వాళ్ళు వొకరకంగా వేదాంతులు. యాభై యెకరాల మునిరెడ్డి అన్న గోడు యెట్లా వున్నా, వీరన్న కథ వింటానే మనసంతా కెలికినట్లయింది. పదైదేండ్ల కిందట యిరవై యొకరాలు రైతు. నాకు తెలిసి ఒక్క చెడ్డ అలవాటు లేదు.

మునిరెడ్డి అన్నకు రాత్రికి మళ్ళా వస్తానని చెప్పి సుబ్బరాయుడింటికి బయలుదేరినా. దారిలో మరొక బంధువు కనపడి “వుద్యోగాలు చేసే మీ పనీ, కూలీనాకొడుకుల పనీ బాగుందిరా” అన్నాడు. యింతా చేసి ఆయనా పెద్ద రైతు కాదు. ఒకప్పుడు పెద్ద రైతు. ఆ ఒకప్పటి దర్పం యింకా చావలేదు.

సుబ్బరాయుడింటికి భోజనానికి వెళ్ళినా – అన్నానికి కూర్చున్నాము.

“అన్నం తిని తిని నోరు చెడిపోయి వుంటుంది. సంగటే బాగుంటుందని అన్నం చేయించలా” సుబ్బరాయుడు లౌక్యం యెట్లున్నా, సంగటి నా కభ్యంతరం లేదు. అయితే ఆ తెల్లవాయి కారం, అలవాటు తప్పిపోయింది. నెయ్యిలేదు.

పల్చటి మజ్జిగనీళ్ళు. సుబ్బరాయుడు ఈ రకంగా బతికితే తప్ప, భూమి పోగొట్టుకొనే వాళ్ళ భూమి కొనలేడు. సుబ్బరాయుడిమీద జాలిపడాలో, సుబ్బరాయుడిలో ముందు ముందు పెద్దదయ్యే దన దాహాన్ని చూసి అసహ్యించుకోవాలో తెలియలేదు.

మధ్యాహ్నం నిద్ర అలవాటు లేదు. దేవళం దగ్గిర కాసేపు కూచుందామనిపించింది. అక్కడికి వెళ్ళేతలికి, నేను వుదయం యిచ్చిన దినపత్రికనే యింకొక నలుగురు చేరి అధ్యయనం చేస్తున్నారు. దొరక్క దొరక్క దొరికిన పేపరు లాగుంది.

ఒక కుర్రవాడు వచ్చి నా పక్కన కూచున్నాడు. గుర్తుపట్టినా, పుల్లమనాయుడు కొడుకు. బి.ఏ., చదువుతున్నానని చెప్పినాడు. యెవరితోనో మాట్లాడుతున్నట్లు అన్నాడు:

“కడప జిల్లాను కరువు ప్రాంతంగా ప్రభుత్వ ప్రకటన… యీ కలెక్టరో, మంత్రులో ప్రకటిస్తే తప్ప, యిది కరువు ప్రాంతం కాకుండా పోతుందా? సిగ్గూ శరమూ లేని జాతి. సొతంత్రం వచ్చి యిన్నేండ్లయినా మంచినీళ్ళ కరువు తీర్చలేకుండా వుంది. యింక తెలుగుదేశం పార్టీమీద అభిమానం రమ్మంటే యెందుకు రాదు? యీసారి రైతులంతా తెలుగుదేశానికి వోట్లేస్తే తప్ప, కాంగ్రెస్కు బుద్ధిరాదు”

పొద్దున నా దగ్గిర పేపరు అడిగి తీసుకున్న కుర్రవాడు అందుకు ఒకేమాట బదులిచ్చాడు. “కాంగ్రెస్ హిందూమతం లాంటిది. చరిత్రలో అది అన్ని మతాలను మింగినట్లే తెలుగుదేశాన్నీ, అట్లాంటి సవాలక్ష పార్టీలను మింగి కూచుంటుంది. జనతా అప్పుడు చూసినాం. యిప్పుడూ అంతే. యిప్పుడు కావలసింది మింగే పార్టీలు కాదు. మింగుడుబోయే పార్టీ కాదు.”

“నీ కమ్యూనిస్టు మాటలూ…”

“నీ… మాటలు”

తారాస్థాయి నందుకోబోతున్న వాళ్ళను ఎట్లా వారించాలో తెలియలేదు. ఆ ఆవేశాల వెనుక వాళ్ళ అలజడి స్పష్టంగా కనిపిస్తోంది. అలజడే రాజకీయాలు కావని వాళ్ళకు తెలిసినట్లు నా కన్పించలేదు. కాంగ్రెసును హిందూమతంతో పోల్చిన కుర్రాడిలో మేధస్సు వుంది. నిజాయితీ వుంది. పుల్లమనాయుడు కొడుకులో అది లేదు. గాలివాటం రాజకీయాలు. నా అభిప్రాయం చెప్తామనుకున్నా. సుబ్బరాయుడి కొడుకు వచ్చి “నాయన రమ్మంటుండాడు” అని పిల్చాడు.

సుబ్బరాయుడు కాఫీ కషాయం అందించి అన్నాడు:

“దేవళంలో యింతసేపూ వుండావా? ఆడ పొద్దుబోని నాయాండ్లు చేరడం యెక్కు వైంది. మరీ యీ మధ్య యీ బియ్యేలు అవీ బూములమ్మించి సదివి, వుద్యోగాల్లేక తలకాయలు చెడిపోయిన పిల్ల నాయాండ్లే ఆడ. మట్కా ఆడడమో, వాణీ వీణీ తిడుతూ కూర్చోడమో.”

సుబ్బరాయుడితో యేం వాదించేది? సుబ్బరాయుడే వాళ్ళను కాసేపు తిట్టి “మరి యేం జెయ్యాల?” అన్నాడు.

“వీరన్న రానీ… పోనీ నువ్వు చెప్పు. వీరన్న కిష్టమయితే భూమి తీసుకో” అన్నాను.

సుబ్బరాయుడు తను పడుతున్న కష్టాలన్నీ యేకరువు పెట్టినాడు. నాకు డబ్బు అవసరమనే విషయం మీద సానుభూతి చూపినాడు. వూరి పరిస్థితి చెప్పినాడు. మునిరెడ్డి లాంటి వాడికే నలభై వేలు అప్పు వుందని, యెవరెవరికి యెంతివ్వాలో వివరించినాడు. మనూళ్ళో భూమి కొనేవాడెవడూ లేడంటూ, యెవరెవరి సంసారాలు యెట్లా వున్నాయో చెప్పినాడు. కూలోళ్ళు దొరకరనీ అన్నాడు. అన్నీ చెప్పి చెప్పి చివరకు అన్నాడు:! “ఆరువేల కంటే ఒక్క నయాపైసా యెక్కువ యివ్వలేను. కావాలంటే నీ మునిరెడ్డి అన్ననే అడుగు.”

పదివేలకు నాలుగేండ్ల కిందట అమ్మిన భూమిని సుబ్బరాయుడు ఆరువేలకు అడిగినాడు. యిది సుబ్బరాయుడి దృష్టిలో రూపాయి విలువ యెక్కడమో, తగ్గడమో? అంతకుముందే ఒక్క ముక్క కొబ్బెర యెవరో గోజినందుకు ‘ధరలన్నీ పెరిగిపోతాంటే నేనేం మొత్తుకొనేదా?’ అన్నవాడు. కరువూ, నా అవసరమూ భూమి విలువ తగ్గించినట్లుంది. దిక్కు తోచలేదు.

“వీరన్న రానీ, రాత్రికి మాట్లాడుకుందాం” అన్నాను.

“రానీలే. తొందర యేముంది?” అన్నాడు సుబ్బరాయుడు ధీమాగా.

పొద్దు గూకింది. వీరన్న వచ్చినాడు. కోడీగీడీ అంటూ భోజనం ఏర్పాట్లు హడావిడీ చేసినాడు. “మునిరెడ్డి అన్న రమ్మన్నా”డన్నాను. రాములక్షుమ్మ “పేదోళ్ళింట్లో తింటారా?” అంటూ నిష్ఠూర మాడింది. యేం చెప్పేది?

వీరన్నతో విషయం కదిపాను. అంతా విని నిశ్చింతగా “సుబ్బరాయునికే అమ్ము” అన్నాడు. యెక్కడో లోపల దాచిన క్రయపత్రాన్ని తెచ్చి నా చేతికిచ్చినాడు. నాకేం మాట్లాడాలో తోచలేదు. ఆఖరుకు మనసు కూడగట్టుకొని ధైర్యం తెచ్చుకొని అన్నాను:

“ప్రసూన పెళ్ళికి నేనేదో తంటాలు పడతా. లేదా జరిగేది జరుగుతుంది. భూమి నువ్వే చేసుకో. నీకు వీలున్నప్పుడే డబ్బు యిస్తువు.

“వీలేంది? యెట్లా వుంటుంది వీలు? యింత సదువు సదివినోడివి నీకేమన్నా పిచ్చా? కరువున్నమ్ముకోమంటావా? సుబ్బరాయుని నమ్ముకోమంటావా? బావిలో వంతు లేదంటే యేం జెయ్యాల? బాడుగకు యింజనీపొద్దు ఆడించను, పొమ్మంటే యేం జెయ్యాల? యెద్దుల్లేవు. యారముట్లు లేవు. దేన్ని చూసుకొని భూమి తీసుకోమంటావు? భూమిని నా కమ్మాల్సి వచ్చినాకే, యిరవై యేండ్లు నమ్ముకున్నా మిగిలిందేముంది? యింకా సుబ్బారాయుడి కివ్వాల్సిన పదైదు నూర్లు… యింకా గవర్నమెంటు లోన్లు…”

“యింకానా?”

“ఆ… యీ బాకీల్తో దిక్కు దోచకే పొద్దుటూరుకు పొయ్యింది. ఏ రైతూ చెయ్యని పని చేసింది. బోగం కంపెనీలో నీళ్ళు మోసినా. బోగమోళ్ళకూ అన్నం పొట్లాలు మోసినా. వాళ్ళ దగ్గరకొచ్చే వాళ్ళకు బ్రాందీలు, సారాయి తెచ్చినా. పోలీసోళ్ళకు బోగమోళ్ళను పంపినా. దొంగ రెయిడింగుల్లో దెబ్బలు తిన్నా.,.. కానీ నేనే సొంత కంపెనీ పెడదామనుకున్నా, మోసపోయినా. నేను అక్కడ పనికిరానని తెల్సిపోయింది. అక్కడ ఉండలేక రోజూ సిగ్గుతో సచ్చినా – తెలిసినవాడు యెవడు కనపడతాడోనని. కడకు వూరు చేరుకున్నా… భూమి లేకపోయినా చేతుల కష్టం వుంది. యిప్పుడు ఫ్యాక్టరీ వుంది – నాలాంటోళ్ళకు చానామందికి. ”

“రెండేండ్లో మూడేండ్లోనే కదా. ఫ్యాక్టరీ కట్టేపని పూర్తి అయితే ఆ తర్వాత నీ లాంటోడికి పని ఉంటుందా? అందువల్ల…”

“మళ్ళా భూమి చేసుకోమంటావు? భూమీవద్దు గీమీ వద్దు. అసలు నీకర్థం కాంది యింకొకటి వుంది. భూమి చేసుకుంటాననుకో. సుబ్బరాయుడికి బాకీ, గవర్నమెంటుకు బాకీ, నీకూ బాకీ. సుబ్బరాయుడు తన బాకీలోకి మళ్ళీ ఆయకం పెట్టుకుంటాడు. సొంతం చేసుకుంటాడు. సుబ్బరాయుడి బాకీ కింద నువ్వియ్యాలనుకునే రెండెకరాలు పోతాది. నీకు నేనివ్వాల్సిన పదివేలు యిరవైవేలవుతాది. అసలు సంగతి సుబ్బరాయుడు ఆరువేలకంటె యెక్కువ పెట్టనంటున్నాడు. నువ్వేం చెయ్యలేవు. యియ్యాల్సిందే. నేను సంచకారమిచ్చిన డబ్బు నాకు దమ్మిడీ రాదు. అది సుబ్బరాయుడే పట్టుకుంటాడు తనకు నేనివ్వాల్సిన బాకీ లోకి. మునిరెడ్డి అన్న కూడా సుబ్బరాయుడికి లోకువే కాబట్టి అన్నింటికి సై అంటాడు. నువ్వు జేసేదేముంది? నేను చేసేదేముంది? యేమంటావు?”

యేమంటాను? ఆ రాత్రే భూమి వ్యవహారం పూర్తి అయింది. మునిరెడ్డి అన్న ఒక మూడువందలు ఎక్కువకు పైసలు చేసినాడు.

“యిప్పుడు నాలుగు వేలిస్తాను. వచ్చే మాసాల్లో రెండు వేలిస్తాను. యిప్పుడే అంతా యిచ్చేవాడిని. మీ మునిరెడ్డి అన్న మరీ యిబ్బందిగా ఉందంటే యిచ్చినా. యింక మూడు నెలల్లో వీరన్నకు నువ్వు యివ్వాల్సిన పదమూడు నూర్లు పట్టుకుంటా. రెండువేల యేడునూర్లు నీకిస్తా” అన్నాడు సుబ్బారాయుడు. సరే నన్నాను.

యీ లెబలు తెగేవి కావు.

భూమితో, మా వూరితో ఆఖరు లింకు తెగిపోయింది.

అర్ధరాత్రి దాటేవరకు ఊరి విషయాలూ, ఫ్యాక్టరీ కబుర్లూ. వీరన్న ఫ్యాక్టరీ కబుర్లే యెక్కువ చెప్పినాడు. ఫ్యాక్టరీ తీసుకునే భూముల ధర విషయంలో పెద్ద మనుషులు రైతులకు చేస్తున్న మోసాల గురించి చెప్పినాడు. ఆ మధ్య అరవ కూలోళ్ళకూ, తెలుగోళ్ళకూ జరిగిన కొట్లాట గురించీ, సమ్మె గురించీ, యీ మధ్య యేర్పడిన యూనియన్ గురించీ, కూలీ పెంచమని సమ్మె గురించీ చెప్పినాడు.

తెల తెలవారుతోంది. ఫ్యాక్టరీ పనికి ప్రయాణమైపోతున్న వారి వెంట నేనూ బయలుదేరినా. నాకింకేం పని యిక్కడ? తిరుపతిలో వుండే పెళ్ళికొడుకు వాళ్ళకు యిప్పట్లో పెళ్ళి పెట్టుకోలేమని చెప్పి, హైదరాబాదుకు పోదామనుకున్నా.

వీరన్న ముందు నడుస్తున్నాడు. అతని వెంట యిరవైమందికి పైగా కరువు కాటకాలకు అప్పులపాలై భూమిని అమ్ముకున్న రైతు జనం. కరువు భూముల్లో ఫ్యాక్టరీ దిశగా సాగిపోతూ..

పైన సిమెంటూ, ఎముకల పొడీ కలిసిన రంగులో ఆకాశం.

ఆ మూల యెక్కడో యెర్రగావు…

రచయిత గురించి

డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి గారు ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1996) గ్రహీత. డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సంచాలకునిగా పదవీ విరమణ పొందిన వీరు 1939 జులై 10న కడప జిల్లా కమలాపురం తాలూకాలోని రంగసాయిపురం గ్రామంలో జన్మించారు. ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’,’ జప్తు’, ‘ఇఛ్చాగ్ని’ పేర్లతో వీరి కథలు సంకలనాలుగా వెలువడ్డాయి.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: