శివతాండవం

ఊహాతీతం – ఈ ఆనందం

సరస్వతిపుత్ర శ్రీ పుట్టపర్తి వారి శివతాండవం పై వ్యాఖ్య

శివరాత్రి వచ్చిందంటే చాలు ఆ చిదానందరూపుడి వైభవాన్ని తలుచుకుంటూ ఉంటాం. మూడుకన్నులు.. మెడలో నాగులు.. ఒళ్లంతా విభూది.. ఈ వెండికొండ వెలుగు రేడు గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. ఇక ఆనందమొచ్చినా.. ఆగ్రహమొచ్చినా.. అనుగ్రహించే శివతాండవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ శివతాండవ చిత్రాన్ని ప్రముఖ కవి పుట్టపర్తి నారాయణాచార్యులు అత్యద్భుతంగా ఆవిష్కరించారు. శివతాండవమట-శివలాస్యంబట.. ఏమానందం-ఏమానందం, ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు అంటూ శివుడి నాట్యానికి సరితూగేలా సాగిన రచన యథాతథంగా చదువుకోగలిగినా, పాడుకోగలిగినా ఆ అనుభూతి వేరు. శివరాత్రి సందర్భంగా ‘శివతాండవం’ విశేషాలు..

***************************************************************************************************

శివ తాండవమట-శివలాస్యంబట. అలలై, బంగారు కలలై మబ్బులు పక్షుల్లా ఎగురుతున్నాయి. అప్సరలొచ్చి కూర్చున్నారు. పక్షులు రాగాలు తీస్తున్నాయో..? లేక పార్వతి కాలి మువ్వల సవ్వడిని అనుకరిస్తున్నాయో..? చుట్టూ చెట్ల కొమ్మలు ఆనందంతో ఊగిపోతున్నాయి. దాంతో గుత్తులు గుత్తులుగా పూలు నేల మీద పడుతున్నాయి. ప్రతి పువ్వూ పరవశంతో నవ్వుతోంది.. పార్వతి మెడలో హారంగా మారుతున్నాను కదా అని. ఈ పూలతో పార్వతి మెడ కందిపోదు కదా! పార్వతిని అలంకరించేది సరస్వతి. శివుడి మెడలో పాములు కాస్త అటుఇటుగా కదిలినపుడు సరిచేసేవాడు బ్రహ్మ. మలయ మారుతాలు శివుడికి చెమట పట్టకుండా సిద్ధంగా ఉన్నాయి. లయ, గతి తప్పకుండా తుమ్మెదలు గొంతు సవరించుకున్నాయి. ఎవరు చెప్పారో కానీ చిన్న చిన్న సెలయేళ్లన్నీ కుచ్చిళ్లు సవరించుకుని వచ్చి కూర్చున్నాయి. సూర్యుడా! కాస్త ఆగు.. శివతాండవం చూసి పశ్చిమాద్రిలో మునిగినప్పుడు అక్కడి వారికీ కథ చెప్పు. పెద్ద జంతువుల కళ్లల్లో నీళ్లేమిటి? ఓహో శివుడి కాళ్లు కడగడానికేమో! చివుళ్లన్నీ చెవులు కొరుక్కుంటున్నాయి.. ఏమిటో? ఇంకేముంది? శివుడి నాట్యం గురించి మాట్లాడుకుంటున్నాయి.

చదవండి :  కడప నుండి కలెక్టరేట్‌ వరకూ .... తప్పెట ప్రభాకర్‌రావు ఐఏఎస్‌

ఓహోహో ఊహాతీతం – ఈ ఆనందం
***************************************
శివుడి తలపైన ఆకాశగంగ అలలతో నాట్యం చేస్తోంది. ఆ అలల మధ్య నెలవంక పువ్వులా కదులుతోంది. నుదిటి మీద ముంగురులు కదులుతున్నాయి. కనుబొమలు కదులుతున్నాయి. కళ్లలో గౌరి కసినవ్వు ప్రతిబింబిస్తోంది. మూడో కంట్లో నుంచి నిప్పులు రాలుతున్నాయి. బుసలు కొడుతూ పాములు తల చుట్టూ వేలాడుతున్నాయి. శ్వాస వేడెక్కుతోంది. మొలక మీసపు కట్టు, ముద్దు చందురు బొట్టు, పులితోలు హోంబట్టు, జిలుగు వెన్నెల పట్టు, నన్నెడుముకు చట్టుకున్న క్రొన్నాగు మొలకట్టు, ఎగిరెగిరి పడుతున్న పూలహారాల నుంచి సుగంధాలు, పెదవుల నుంచి తాంబూల వాసనలు, ఆ వాసనల వెంట తుమ్మెదలు.. చూస్తున్నవారికి కనులపండుగ కాగా, మనసు నిండుగా పూయగా…

ఆడెనమ్మా శివుడు – పాడెనమ్మా భవుడు
*******************************************
సకల భువనాలు ఆంగికం, సకల వాఙ్మయం వాచికం. నక్షత్రాలు అలంకారాలు. చేతిముద్రలు ఎటు అంటే అటే దృష్టి, అటే హృదయం. దాని వెంట భావం. భావం వెంట రసం. పొరలు పొరలుగా చిరుగాలి. ఆ చిరుగాలికి కదిలే పూలు. కదిలిన పూల నుంచి సుగంధాలు. ప్రకృతి తెరపై కొత్త చిత్రాలు. నెమలి పురివిప్పింది. చిగురుటాకులు వగలు పోయాయి. నవ్వులో కొత్త వలపు జారినట్టు..

చదవండి :  శివరాత్రికి ప్రత్యేక బస్సు సర్వీసులు

ఆడెనమ్మా శివుడు – పాడెనమ్మా భవుడు
ఒక్కసారిగా పుక్కిలించినట్లు మొగలి పూల వాసన గుప్పుమంది. నవ వసంత శోభ భూమిని కప్పేసింది. శివుడి ముందు పార్వతి సిగ్గుతో నిల్చుంది. కన్నె మనసు కోరికల కలల్లో దూకింది. సన్నజాజులు, పచ్చి సంపెంగ పూలు ఆశ్చర్యంగా పరుచుకుని పరుపులా పడినట్లు..

ఆడెనమ్మా శివుడు – పాడెనమ్మా భవుడు
******************************************
నవ్వులే నవ్వులు. బిగువులే బిగువులు. సొగసులే సొగసులు. తొలికారు మెరుపు దోబూచులాడింది. తొలిసంధ్యలో వెలుగు దూకుతోంది. మలిసంధ్యలో కాంతి మరలిపోతోంది. తీగలు సాగుతున్నాయి. మెరుపులే మెరుపులు. అరమోడ్పు కన్నుల్లో అణిగిపోయేవి కొన్ని, ఉయ్యాల తూగులో ఊగేవి కొన్ని. లేఎండలా లేచేవి కొన్ని, పందెపు గుర్రాల్లా పరుగెత్తేవి కొన్ని. మంచులా నెమ్మదిగా వెనక్కు తిరిగేవి కొన్ని. కిందమీదై సందు సందులో మెరుపులు నక్కి సాగిపోయినట్లు..

ఆడెనమ్మా శివుడు – పాడెనమ్మా భవుడు
*******************************************
ఎలగాలిలో తేలే పాటలా, పసిపాప పెదవిపై నవ్వులా, చలివెలుగులో పడ్డ పల్చటి తుంపరలా, పింఛం విప్పుతున్నప్పటి నెమలిలా, మనసులో ఊహలకు శరీరమే భాషగా, కాళ్లతో భూమ్యాకాశాలు, చేతులతో దిక్కులను కొలుస్తున్నట్లుగా, కుడిఎడమలకు తల తిప్పుతుంటే వేగానికి జడలు సమానంగా ఆడుతుంటే, రుషులు స్తోత్రం చేశారు. భూమ్యాకాశాల్లో కొత్త చిత్రం ఆవిష్కృతమైంది. కలలన్నీ నిజమై కనిపించినట్లు..

ఆడెనమ్మా శివుడు – పాడెనమ్మా భవుడు
********************************************
కళ్లలో భావాలను కనుబొమలు అనుకరిస్తున్నాయి. మదిలో ఊహకు శరీరం పులకలు పోతోంది. అడుగు అడుగులో లయ తూగుతోంది. పెదవిపై నవ్వుకు మువ్వలు తోడవుతున్నాయి. ఎన్ని భంగిమలు? అవి పాదాలా స్తంభాలా? ఎన్ని హొయలు? అవి పాదాలా తీగలా? నాగుపాములా పడగెత్తి ఒకసారి, ముడుచుకున్న తామర మొగ్గలా ఒకసారి, ఆ చేతుల్లో ఎముకలున్నాయా? వేళ్లు పెట్టే ముద్రలు చూడటానికి ఎన్ని కళ్లు కావాలి? కైలాస శిఖరం పొంగిపోతోంది. ఆకాశం కళ్లు విప్పార్చి చూస్తోంది. నదులన్నీ మది పొంగి నాట్యం చేస్తున్నాయి. వనాలన్నీ పులకింతతో పూల ఆభరణాలు ధరించాయి..

చదవండి :  కార్వేటినగరం ఓ మధుర జ్ఞాపకం - నటి టి.జి.కమలాదేవి

ఆడెనమ్మా శివుడు – పాడెనమ్మా భవుడు
*******************************************
మేళకర్తరాగాలు, ఆలాపనలు, గమకాలు, మూర్ఛనలు, మంద్రమధ్యమతార మధురిమలతో రాగ సాగరాన్ని మధించారు. తాండవం, లాస్యం, గాంభీర్యం, శృంగారం.. ఒక్కోసారి ఒక్కో అభినయం. అడుగు అడుగులో రసావిష్కారం. ఒక అడుగు జననం, ఒక అడుగు మరణం. ఒక భాగం సృష్టి, ఒక భాగం ప్రళయం. భరతముని శివుడి పాదాలు పట్టి హరహరా అంటున్నాడు. సృష్టికర్త బ్రహ్మ తన్మయత్వంతో నిల్చున్నాడు. అటు ఇటు అష్టదిక్పాలకులున్నారు. వేయి కనులున్నందుకు ఇంద్రుడు సంతోషిస్తున్నాడు. శివుడిలో విష్ణువు, విష్ణువులో శివుడు, పార్వతిలో లక్ష్మి, లక్ష్మిలో పార్వతిని చూస్తూ దేవతలు, మునులు పొంగిపోయారు. స్తోత్రాలు చేశారు. జగమే ఒక భావం. సడియే ఒక రాగం. కదలికే ఒక నాట్యం. శివుడిని చూసి విష్ణువు నవ్వాడు. శివుడే విష్ణువై నవ్వాడు. లోకమంతా వెన్నెల కురిసింది.

పమిడికాల్వ మధుసూదన్‌ :99890 90018

ఇదీ చదవండి!

రాయలసీమ జానపదం

రాయలసీమ జానపదం – తీరుతెన్నులు:అంకె శ్రీనివాస్

రాయలసీమ జానపదం రాయలసీమ సాంస్కృతికంగా చాలా విలక్షణమైనది. తొలి తెలుగు శాసనాలు రాయలసీమలోనే లభించాయి. తెగల వ్యవస్థలనుండి నాగరిక జీవనానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: