రచయితకు “స్పిరిచ్యువల్ శాటిస్పాక్షన్’ అవసరం

పరుగులపోటీలాగ కథల పోటీ ఏంటి? సృజనాత్మకతకు పోటీ ఉంటుందా? అసలు సృజన అనేదే పోటీ లేనిది. కాకపోతే ఎవరి సృజన వాళ్లది. ఒకటి తక్కువ కాదు. మరొకటి ఎక్కువా కాదు. కథల పోటీల గురించి తలచినప్పుడల్లా నాకు సొదుం జయరాం (చనిపోయి ఎక్కడున్నాడో మహానుభావుడు. ఊరిపక్కనే ఉన్నా ఒక్కసారి కూడా కలవలేకపోయాను) గుర్తుకొస్తాడు.

అతను రాసిన “పుణ్యకాలం మించిపోయింది’ అనే కథ ఇలా ఉంటుంది :

పోటీలకొచ్చే డబ్బు మీద ఆశతో ఒక మధ్యతరగతి పెళ్లాం రచయితను గడువులోగా కథ రాయమని పోరుతూ ఉంటుంది. ఇతనేమో వందలు వేలు కాదు కదా ..కోట్లు ఇచ్చినా స్పందన లేకుండా కథను రాయలేడు. తాత్సారం చేస్తూ ఉంటాడు. గడువు దగ్గరపడుతూ ఉంటుంది. పెళ్లానికి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. చివరికి ఆమె బాధ పడలేక “సరే.. ఏదో రాస్తాన్లే.. ‘అంటాడు. కానీ ఆరోజే దూరపు బంధువు ఒకాయన చనిపోతాడు. అర్జంటుగా వెళ్లాల్సి వస్తుంది. అక్కడి మరణం అతన్ని తీవ్రంగా కలచి వేస్తుంది. వచ్చాక పెళ్లాం భోజనానికి పిలుస్తున్నా పట్టించుకోకుండా పిల్లాడు గుక్క పెట్టి ఏడ్చినట్టు కథ రాసి పారేస్తాడు. కానీ అప్పటికే పోటీల గడువు ముగిసిపోయి ఉంటుంది. గడువు ముగిసినందుకు ఇల్లాలు బాధపడుతుంటే రచయితలో మాత్రం “స్పిరిచువల్ శాటిస్పాక్షన్’ కనిపిస్తోందని కథ ముగిస్తాడు సొదుం జయరాం.

చదవండి :  రాయలసీమ కథా సాహిత్య ప్రాభవ వైభవాలు -డాక్టర్ వేంపల్లి గంగాధర్

ఇక్కడ “స్పిరిచువల్ శాటిస్పాక్షన్’ అనే మాట చాలా జాగ్రత్తగా వాడాడు. ఎంత మనం పోటీలకోసమే రాస్తున్నప్పటికీ పర్సనల్గా ఒక శాటిస్పాక్షన్ అనేది ముఖ్యమని ఆయన భావన.

కథలో డబ్బు కోసం ఒక అనివార్యత ఉంటుంది. చాలీ చాలని డబ్బుతో ఇల్లు గడపలేక ఇబ్బందులు పడుతూ ఉంటుంది ఆ ఇల్లాలు. పైసా ఆదాయం లేని రచనావ్యాసాంగాన్ని ఎప్పుడూ అస్సహించ్యుకునే భార్య తొలిసారిగా భర్తను పోటీల కోసం కథ రాయమంటుంది. అంతటి అనివార్యత ఉన్నప్పటికీ రచయిత మాత్రం “ఒక సాటిశ్పాక్షన్ ‘ లేకుండా కథ ఎలా రాయాలి అని తలపట్టుకుంటాడు. జీవితాంతం కథారచన పట్ల సొదుం జయరాంకున్న నిబద్ధతను ఈ కథ తెలియజేస్తుంది.

చదవండి :  రాజధాని వాడికి...రాళ్ళ గంప మనకు

ఇష్టం లేకుండా ఏదీ రాయలేకపోయాడాయన. ఇష్టం లేకుండా రాసినా అది రచయితను జీవితాంతం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మొన్నకు మొన్న జ్ఞాన్ పీఠ్ అవార్డు పొందిన రావూరి భరద్వాజ సైతం ఇదే మాట అంటాడు.
“నేను ఆకలి కోసం రాశాను. డబ్బు కోసం రాశాను. ఆకలే అన్నీ నేర్పింది. రాసినవాటిలో కొన్ని నచ్చనివి ఉన్నాయి.. కొన్ని నచ్చినవీ ఉన్నాయి..”

నచ్చనివాటిని రాయడంలో ఉన్నఇబ్బంది ఈ మాటల్లో సరిగ్గాధ్వనించకపోయుండొచ్చు కానీ.. సొదుంజయరాం రాసిన ఈ కథలో మాత్రం అది ఎప్పటికీ ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటుంది.

చదవండి :  గువ్వలచెన్న శతకకర్త ఘటికాశతగ్రంథి పట్టాభిరామన్న

– వేంపల్లి షరీఫ్

రచయిత గురించి

సాక్షి సంస్థలో సంపాదకునిగా పని చేస్తున్న వేంపల్లె షరీఫ్ మైనారిటీ వర్గానికి చెందిన రచయితే ఐనా మైనారిటీ అస్తిత్వం ఒక్కటే ఉన్న రచయిత కాదు. షరీఫ్ స్వస్థలం కడప జిల్లా వేంపల్లె. షరీఫ్ కథ జుమ్మా పలువురు విమర్శకుల ప్రశంసలు పొందింది. వీరు ఈ మధ్యే జుమ్మా పేరుతో తన కథలను సంకలనంగా వెలువరించారు. ఈ సంకలనానికి గాను వీరు కేంద్ర సాహిత్య అకాడమీ నుండి ‘యువపురస్కారం’ అందుకున్నారు.

ఇదీ చదవండి!

సొదుం జయరాం

మన జయరాం, మన సొదుం

మధ్య తరగతి ఆలోచనల్ని భూ మార్గం పట్టించిన కథాశిల్పి సొదుం జయరాం. వీరికి 2004లో రాచకొండ రచనా పురస్కారం శ్రీకాకుళంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: