రెక్కమాను

రెక్కమాను (కథ) – డా|| ఎమ్‌.వి.రమణారెడ్డి

రెక్కమాను కథ

ఏ కాలంలో పుట్టిందో ఏమో, చేపా చేపా ఎందుకు ఎండలేదనే కథకు ఈనాటి పరిపాలనతో ఎంతో చక్కటి సారూప్యత వుందో మూర్తికి ఆశ్చర్యం కలిగించింది. సింపుల్‌గా ఎండుతుందనుకునే చేప, ఎన్ని అవరోధాలు ఎదురై చివరకు ఎండకుండా ఆగిపోతుందో మన ప్రభుత్వయంత్రాంగంలో ప్రతి చిన్న పని అలాగే ఆగిపోతుంది. పని తెగకుండా ఫైలు నడపడం పరిపాలనలో ప్రత్యేక నైపుణ్యం. అనాదిలో ఎవడో పనికిమాలిన రాజును దెప్పి పొడుస్తూ రాసిన కథ ఇప్పటి ప్రజాస్వామ్యానికి అతకడం మూర్తివంటి స్వరాజ్యవాదికి నామోషీగా వుంది.

హైదరాబాదు నుండి నిరాశగా తిరిగొస్తున్న మూర్తికి ఊరు చేరువౌతున్న కొద్దీ నీరసం పెరుగుతూంది. చేతగాక తిరిగిరావడం చిన్నతనంగా వుంది. బాబాయికి ముఖం చూపడం ఎలా? బాబాయికి తనమీద ఎంతో నమ్మకం. ఏ పని అప్పగించినా ఇంత వరకు చేతగాక తిరిగి రాలేదు. వృద్దాప్యంలోకి జారుకుంటున్న బాబాయి నాలుగైదేళ్ళగా అన్ని పనులు మూర్తికే అప్పగిస్తున్నాడు. గురుమూర్తికి ఆయన దైవం. దిక్కూ మొక్కూ లేని అనాధగా లోకంలో మిగిలిపోయిన మూర్తిని చిన్నప్పటి నుండి పెంచి, పోషించి, డిగ్రీ వరకు చదువు చెప్పించి, వొక మనిషిగా తయారుచేసిన బాబాయి అతనికి ఈ ప్రపంచంలో మిగిలిన ఏకైక అనుబంధం. మూర్తి ఈడులో వుండే యువకులకు విలాసాల మీద మోజు సహజం. బాబాయి ఆదర్శాలతో పెరిగిన మూర్తికి వాటి మీద ఆసక్తి లేదు. బాబాయి అప్పగించిన పని శ్రద్ధగా నెరవేర్చడం మినహా మరో ధ్యాస వున్నట్టు అనిపించదు. పిల్లకు చదువు చెప్పడం, ప్రవేశ పరీక్షలు రాయించి పట్నం తీసుకెళ్లి హైస్కూల్లో చేర్పించడం, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు సంపాదించటానికి తిరగడం, పల్లెటూరి రైతులకు చేదోడు వాదోడుగా ఉండటం మొదలైన పనులన్నీ ఇప్పుడు మూర్తి ద్వారా జరుగుతున్నాయి.

ఇంత వరకు ఆటంకం లేకుండా పనులు సాగటానికి కారణం మూర్తి కనబరిచే శ్రద్ధ వొక్కటే గాదు, ఆ ప్రాంతంలో బాబాయికున్న పలుకుబడి ప్రధానంగా ఉపయోగ పడేది. స్థానిక కార్యాలయాల్లో మూర్తిని బాబాయి ప్రతినిధిగా వ్యవహరించే వారు. బాబాయికి చెల్లించే భక్తిలో భాగంగా పనులు జరిగిపోయేవి. ఇప్పుడు తలపెట్టిన పని స్థానిక సరిహద్దులు దాటింది. హైదరాబాదు స్థాయిలో బాబాయిని గౌరవించేవాల్లు కాదు గదా, అనుకునే మనుషులే లేరు. దేశం ఎంతో మారింది. ఆదర్శానికి చిహ్నమైన ఖద్దరు అధికారానికి సంకేతమైంది. స్వయంకృషికి నిదర్శనమైన రాట్నం ఎన్నికల గుర్తుగా మారింది. స్వరాజ్య సంపాదనకు చైతన్యం రగిలించిన గాంధీజీ విగ్రహంగా మారాడు. స్వాతంత్య్రం పాతబడింది. స్వాతంత్య్రం కోసం చేసిన త్యాగాలు అడుగు పేజీలలో పడిపోయాయి. ఆ వాతావరణంలో ఎప్పుడో స్వాతంత్య్రం కోసం పోరాడిన బాబాయి రాజధానిలో ఎవరికి ఎరుక? ఎం.ఎల్‌.ఎ.గా ఆయన ఒక్కసారైనా పోటీ చేయలేదు, ఎం.ఎల్‌.సి. గా నామినేట్‌ కావాలని తిరగలేదు, కాంట్రాక్టుల కోసం ప్రాకులాడలేదు, ఖద్దరు పరిశ్రమ కోసం లోను తెచ్చుకోలేదు. మూడున్నర కోటి జనాభాలో ఈ గత చరిత్రులను గుర్తుంచుకునే ధ్యాసలో లేదు హైదరాబాదు.

స్టేషన్‌లో ప్రవేశించబోతున్నానని హెచ్చరిస్తూ రైలు కూతేసింది. మూడో తరగతి పెట్టెలో కిటికీ పక్కనున్న మూర్తి బయటకి తొంగిచూశాడు. చీకటి పూర్తిగా విచ్చుకోలేదు. అప్పుడప్పుడే పలచబడుతూంది. స్టేషన్‌లో వెలుగుతున్న లైట్లు వేగంగా దగ్గరౌతున్నాయి. రైలు ఆ స్టేషన్‌లో ఎక్కువ సేపు ఆగదు. బండి కదిలే లోపు సామానంతా గబగబ దించుకోవాలనే ఆత్రుత మూర్తికి లేదు. చేసంచి వొక్కటే అతని దగ్గరుండే సామగ్రి. బండి ఆగగానే దిగటానికి సిద్ధంగా తలుపు దగ్గర నించోవటం అతని అలవాటు. లేచి చేసంచి భుజానికి తగిలించుకొంటూ తలుపు వైపు బయలుదేరాడు. సూట్‌కేసులో పెట్టుకునేంత విలువైన వస్తువులు మూర్తికి లేవు. అతడు తొడిగేది ఖద్దరు చొక్కా, ఖద్దరు పైజమా. అవి రెండు జతలుంటే చాలు, ఎంత దూరమైనా వెళ్ళొస్తాడు. ఒక జత ఉతుక్కొని ఆరేసుకుంటే మరో జత మిగులుగా వుంటుంది. కాలేజీ చదివే రోజుల్లో గూడా అంతే, వీడు పుట్టడమే ముసలాడిలా పుట్టాడని స్నేహితులు ఎగతాళి చేసినా మూర్తి నొచ్చుకోలేదు.

ఫ్లాట్‌ఫాంను వొరుసుకుంటూ బండి నెమ్మదిగా ఆగింది. మూర్తి ఫ్లాట్‌ఫాం మీదికి దిగాడు. తనుగాక అక్కడ ఇంకెవరూ దిగుతున్నట్టు లేదు. ”టీ సార్‌… టీ” అంటూ చివరి పెట్టె నుండి మొదలెట్టి ప్రతి కిటికీలో తొంగిచూస్తూ టీకొట్టు కుర్రాడు ముందుకు వస్తున్నాడు. ఆ సమయంలో టీ తప్ప ఆ స్టేషన్‌లో మరేమి దొరకదు. పగటి పూట సోడాలు, వేయించిన వేరు శనగలు దొరుకుతాయి. మూర్తిని చూడగానే టీ కుర్రాడు ఆగిపోయి, వినయంగా ”నమస్కారం సార్‌” అన్నాడు. ”టీ తీసుకోండి సార్‌” అనలేదు. మూర్తి టీలు, కాఫీలు తీసుకోడని వాడికి తెలుసు.

”ఏరా భాషా! నువ్వీ పని మానుకోవా?” అడిగాడు మూర్తి.

”ఈ నెల ఐపోతే మానుకుంటాను సార్‌.”

మూర్తి వాడిని ఈ ప్రశ్న అడగబట్టి ఏడాదైంది. వాడు ఇదే సమాధానం చెప్పబట్టి సంవత్సరమైంది. ఈ పని మాన్పించి వాడు చదువుకొనేలా చేయాలని మూర్తి తాపత్రయం. వాడు చేతికి చిక్కకుండా జారుకుంటున్నాడు. పావలా డబ్బులు మిగిలించుకొని టెంటులో సినిమా చూడకపోతే వాడికి నిద్ర పట్టదు.

రైలు బండి కూతేస్తూ భారంగా కదిలింది. దాన్ని సాగనంపుతున్నట్టు మూర్తి అటువైపు తిరిగి నుంచున్నాడు. రైలు దాటిపోయింది. స్టేషన్‌ నిర్మానుష్యంగా వుంది. పచ్చజండా మడత చుట్టుకుంటూ వస్తున్న స్టేషన్‌ మాస్టరు మూర్తిని పలకరించి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రైలు వెళ్ళిపోయిన దిశగా ఫ్లాట్‌ఫాం అంచు చేరడానికి మూర్తి నింపాదిగా కదిలాడు. అతడు స్టేషన్‌ బయటికి రావలసిన అవసరం లేదు. రైలు కట్టవెంట నడిచి వెలితే ఆశ్రమం దగ్గర. ఊరి మీద వెళ్ళాలంటే రెండు మైళ్లవుతుంది. ఫెన్సింగు మధ్య సందుల్లో, దూరంగా ఊరు కనిపిస్తూంది. స్టేషనుకూ ఊరికి మధ్య నాలుగైదు ఫర్లాంగులదూరం వుంటుంది. ఆ ఊరు పెద్దదీ గాదు, చిన్నదీ గాదు. ఒక మోస్తరు తాలూకా కేంద్రం. గతుకుల రోడ్డొకటి స్టేషన్ను ఊరితో కలుపుతుంది. ఆ దారి మధ్యలో, రోడ్డుకు ఆనుకుని మూర్తి శ్రమపడే పదెకరాల బంజరు స్థలముంది.

రోడ్డుకు ఇరువైపులా ఊరు చేరిందాకా వుండేదంతా బంజరే. సీకు చెట్లు పెరిగి భయంకరంగా వుంది. పైరుకు పనికిరాదు. ఇరవై హరిజన కుటుంబాలు ఇటీవల చెట్లు నరికి గుడిసెలు వేసుకున్న కొద్దిపాటి జాగా తప్ప, మిగిలినదంతా నిరుపయోగంగా వుంది. హైస్కూలు కట్టించడానికి అక్కడైతే అనుకూలంగా వుంటుందని కమిటీ నిర్ణయించింది. ఆ చుట్టుపక్కల ఇరవై మైళ్ళలోపు హైస్కూలు లేదు. దూరంగా వుండే టౌన్లో వుంచి పిల్లలను చదివించే చొరవ, స్థోమత ఆ గ్రామాల్లో లేదు. బాబాయి ప్రోద్బలంతో ఇటీవల విద్యార్థుల సంఖ్య పెరిగినా, అది చెప్పుకో తగ్గ స్థాయిలో లేదు. ప్రతి పౌరునికి విద్య అందించినపుడే దేశం ముందుకు పోగలదని బాబాయి నమ్మకం. అందుబాటులో హైస్కూలుంటే ఎక్కువమందికి చదువుకునే అవకాశం కలుగుతుందని ఆయన ఈ ప్రయత్నం ప్రారంభించాడు.

ఏటవాలుగా కట్టమీదికి దిగుతున్న ఫ్లాట్‌ఫాం కొసనుండి కాలిబాట చేరుకున్నాడు మూర్తి. రైలు కట్ట మీద పట్టాలకు సమాంతరంగా నడుస్తుంది కాలిబాట. గ్యాంగ్‌ కూలీలూ, ఆ వైపు పొలాలున్న రైతులు కట్టమీద రోజూ నడవటం వల్ల ఆ బాట ఏర్పడింది. అనుభవం ఉంటే తప్ప ఆ బాట వెంట నడవడం కష్టం. కంకరరాల్లు, పట్టాల అడుగున పేర్చిన స్లీపర్లూ అడుగడుగునా అడ్డుకుంటాయి. అలాటి బాటవెంట మూర్తి జెర్రిపోతులా దొర్లిపోయేవాడు. ఈ రోజు నడకలో ఆ హుషారు లేదు.

అనవసరంగా బరువు నెత్తికెత్తుకున్నాడు బాబాయి. జిల్లా పరిషత్‌ ద్వారా కట్టిద్దామని కమిటీ సభ్యులు ఎంతజెప్పినా వినలేదు.

”బరువంతా ప్రభుత్వం మీద పడేస్తే ఎంత దూరం సాగుతుంది. నడ్డి విరిగి ప్రజాస్వామ్యం కూలబడుతుంది. తెల్లోడు ఏ స్థితిలో దేశాన్ని విడిచి వెళ్లాడో మీకు తెలీదా? మొత్తం దోచుకొని మన చేతికి చిప్ప మిగిల్చాడు. ఖాలీ ఖజానాతో ప్రభుత్వం అప్పగించాడు. ప్రభుత్వమే ప్రతి పని చేయాలని ఎదురు చూస్తే ఎప్పుడౌతుంది? ఎవరి శక్తి కొద్ది వాల్లం చేసుకుంటూ దేశాన్ని నడిపించాలి.” అన్నాడు.

తాతలనాడు గొప్ప రైతులుగా బతికిన కుటుంబానికి ఏకైక వారసుడుగా మిగిలిన బాబాయికి ఇంకా ఐదుకరాల మాగాణి నిలిచింది. ఆయన పూర్వీకులకు జూదాలు, గుర్రపు పందాల వంటి వ్యసనాలు లేవు. బాబాయి తండ్రి కమాషులో గాంధీ మహాత్ముడొకసారి ఆ ఊరు రావడం జరిగింది. కాంగ్రెసును పటిష్టం చేస్తూ గాంధీగారు దేశం నలుమూలలా పర్యటిస్తున్న రోజులవి. చెన్నపట్నంలో చదువుతున్న బాబాయి ఇంటర్‌ పరీక్షలు రాసి ఇంటి కొచ్చాడు. గాంధీగారిని చూడటానికి తండ్రితో పాటు తనూ వెళ్ళాడు. ఆ పూట తనింట్లో గాంధీగారికి భోజనం పెట్టాలని బాబాయిగారి తండ్రి ఉబలాట పడ్డాడు.

చదవండి :  ఎదురెదురు ! (కథ) - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

”నాకు పిడికెడు మెతుకులు పెట్టడం దేశసేవ కాదు. స్వరాజ్యం కోసం నువ్వు ఇవ్వగలిగేదేమిటి?” గాంధీజీ అడిగాడు.

”నా యింటికొచ్చి చూడండి.” అన్నాడు బాబాయి తండ్రి.

అతని ముఖంలో గాంధీ గారికి ఏమికనిపించిందో ఏమో, వెంటనే బయలు దేరాడు. ఉద్యమానికి యాచించడంలో మహాత్ముడు వామనావతారానికి తీసిపోడు. బాబాయి తండ్రి బలిచక్రవర్తికి అన్న. భోజనాల తరువాత పెద్ద వెండి తట్టను గాంధీగారి ఎదుట వుంటాడు. దాన్నిండా అంచులకు జారేటన్ని ఆభరణాలు, ఆభరణాల అడుగున రెండు దోసిల్లు వెండి రూపాయలు, బీరువాలో వున్న బంగారం, నగదు మొత్తం ఊడ్చి గాంధీగారి ఎదుట తట్టలో వుంచాడు.

మహాత్మునికి కళ్ళు చెమ్మగిల్లాయి. ముఖం మీద చిరునవ్వు మాత్రం చెరగలేదు.

”ఇంతకంటే నీ దగ్గర ఏమీ లేదా?” అని అడిగాడు.

”అడగండి స్వామీ!” బాబాయి తండ్రి వినయంగా వెనకాడ కుండా జవాబిచ్చాడు. ఈ దిగంబరునికి ఇంత ఆశ ఏమిటా అని చూస్తున్న జనం నివ్వెరపోయారు. మహాత్ముడు బాబాయిని దగ్గరగా లాక్కుంటూ-

”ఈ బిడ్డను ఉద్యమానికి ఇచ్చెయ్‌” అన్నాడు.

బాబాయి తండ్రి కళ్ళల్లో ఆనందం విరిసింది. మహాత్ముని కోరిక తీర్చే మరో సాధనం తన ఆధీనంలో వున్నదని తెలుసుకున్న సంతోషం అది!

”అంతకంటే భాగ్యమా స్వామీ!” అన్నాడు కళ్ళొత్తుకుంటూ.

”ఇప్పుడే కాదు. స్వరాజ్యం కోసం జరిగే ఉద్యమంలో తనవంతు పాత్ర నిర్వహించే బాధ్యత వుందని ఈ పసివాడు తనకై తాను గుర్తించినప్పుడు తీసుకొంటా. అంతవరకు నీ దగ్గరే వుంచు” అన్నాడు మహాత్ముడు.

డిగ్రీ చదవటం కోసం బాబాయి మద్రాసుకు తిరిగి వెళ్ళాడు. తొలి సంవత్సరం పూర్తి చేసిన తరువాత చదువు సాగలేదు. సహాయ నిరాకరణోద్యమానికి కాంగ్రెస్‌ పిలుపిచ్చింది. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా దేశం నలుమూలల దావాగ్ని చెలరేగింది. వేలాది మంది విద్యార్థులు చదువులు మానేసి ఉద్యమంలో దూకారు. బాబాయిని అరెస్టు చేసి చెంగల్పట్టు జైలుకు పంపించారు.

సంవత్సరం తరువాత బాబాయి జైలు నుండి విడుదలయ్యాడు. ఆ తరువాత కొద్ది రోజులకు, సబర్మతి ఆశ్రమాన్ని నిర్వహించటానికి తనకు తోడుగా వుండమని మహాత్ముని వద్ద నుండి కబురొచ్చింది. గాంధీజీ సహచర్యంలో బాబాయి నాలుగేళ్ళపాటు సబర్మతి ఆశ్రమంలో గడిపాడు. తండ్రి ఆరోగ్యం దెబ్బతిన్నదని తెలిసి మహాత్ముని అనుమతితో స్వగ్రామం తిరిగొచ్చాడు.

తండ్రి ఆరోగ్యం క్షీణించినప్పటి నుండి వ్యవసాయం కుంటుబడింది. ఆయన కాలం చెయ్యడంతో పూర్తిగా మూలన పడింది. ఇంటి యాజమాన్యం స్వీకరించడానికి బదులు బాబాయి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని చక్కబెట్టడంలో మునిగిపోయాడు. ఏ అవసరమొచ్చినా మరొకరిని అడిగే అలవాటు బాబాయికి లేదు. తరుగుతున్న ఆదాయానికి తోడు ఖర్చులు పెరిగిపోయాయి. ఏ చిన్న అవసరం కలిగినా బ్రిటిష్‌ అధికారులు బాబాయిని జైలుకు పంపడం మరవటం లేదు. అప్పుడింత అప్పుడింతగా ఆస్తి కరుగుతూంది. ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి చేసుకుంటే వంశం నిలుస్తుందని తల్లి ఆశపడింది. కార్యసాధనకు వివాహం ప్రతిబంధకమని బాబాయి బ్రహ్మచారిగా వుండిపోయారు. ”భార్యా పిల్లలు వుండి గూడా సర్వసంగ పరిత్యాగిలా బ్రతకడం మహాత్మునికొక్కడికే సాధ్యం. మనకంత నిగ్రహం ఎక్కడుంటుంది? సంసారం మీద మమకారం పెరిగితే దేశాన్ని మరచిపోతాం” అన్నాడు బాబాయి.

తల్లి, ఇల్లు, సంపద పోగొట్టుకోగా మిగిలిన ఐదుకరాల పొలం మీద వచ్చే ఫలసాయంతో బాబాయి జీవితం గడుస్తోంది. అది సరిపోదనే సమస్య ఆయనకెన్నడూ రాలేదు. ఆయనకు సొంత ఖర్చు దాదాపు లేదనే చెప్పాలి. ఏటి వొడ్డున చిన్న కుటీరం వేసుకున్నాడు. కుటీరం చుట్టూ కూరగాయలు పెంచుకుంటాడు. పిడికెడు బియ్యం ఉడికేసుకుని తింటాడు. అందువల్ల భూమ్మీద వచ్చే కౌలు చాలా వరకు మిగిలిపోయి జమ పడింది. ఆ డబ్బుతో హైస్కూలు కట్టించాలని బాబాయి సంకల్పం.

బాబాయి సాయంతో చదువుకున్న పేద విద్యార్థులు వందల సంఖ్యలో వున్నారు. వాల్లలో చాలా మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఎప్పుడైనా వచ్చి బాబాయిని చూసి వెళుతుంటారు. బంజరు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టడం అవివేకమని వారిలో చాలామంది అభిప్రాయం. ఆ మాట బాబాయితో చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. మనం చెబితే గాని అక్కడ బంజరు వున్నట్టు ప్రభుత్వానికి తెలీదట. ఆక్రమించుకుంటే అడిగే దిక్కుండరు. చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకోడానికి బాబాయి వొప్పుకోడు. ప్రభుత్వాన్ని ఉచితంగా ఇవ్వమని అడగటం లేదు. ఖరీదుకే అమ్మమని అడుగుతున్నారు. దానికి గూడా సంవత్సరం నుండి చెప్పులు అరిగేలా తిరుగుతున్నా పలికే దిక్కులేరు.

కాలికింద కంకర్రాయిపడి కలుక్కుమంది. మూర్తి ఆలోచనా ప్రపంచం నుండి భూమ్మిదికొచ్చాడు. కాలికింద పడిన కంకరరాయిని పట్టాలకింద పరచిన కంకరలోకి ఎగదోసి పట్టామీద కూర్చున్నాడు. వేల్లతో మడమ వొత్తుకుంటూ పరిసరాలు పరికించి చూశాడు. నునులేత ఎండతో దిక్కులు ఎర్రబడ్డాయి. కోతకు సిద్ధంగా వున్న పంట పొలాలు బంగారు వన్నెతో గనిలా మెరుస్తూంది. ఏటి వొడ్డున బాబాయి కుటీరం వొంటరి బాటసారిలా నిలబడింది. ఆలోచనలోపడి ఎంత దూరం వచ్చింది మూర్తికి అప్పటికిగాని తెలీలేదు. అప్పటికే అతను రెండో రెక్కమాను దాపుకు చేరుకున్నాడు. పట్టాలకూ రెక్కమానుకూ నడుమ కాలిబాట ఆవలకు సాగిపోతుంది. రెక్కమాను దాటగానే కట్టదిగి పొలంగట్టు వెంట నడిచి ఆశ్రమం చేరుకోవాలి. కాలికింద రాయిపడటం మంచిదైంది. లేకపోతే అలాగే ఆలోచించుకుంటూ మలుపు తిరగకుండా ఎంతదూరం వెళ్ళేవాడో!

రెక్కమాను వైపు తలెత్తి చూశాడు మూర్తి. అది పట్టాలకు రెండు బార్ల ఎడంగా కట్టను అంటిపెట్టుకొని నిలుచుంది. అది ఇనపకడ్డీలతో వలలా అల్లిన జాలీ స్తంబం. నిటారుగా ఆకాశంలోకి ఎదిగి, పన్నెండడుగుల ఎగువన రెండు కొమ్మలుగా చీలింది. కొమ్మల్లో వొకటి పెద్దది, రెండోది చిన్నది. పెద్దకొమ్మ ఎత్తుగా, స్టేషన్‌ వైపుగా వుంటుంది. రెండోది దానికంటే కొంచెం పొట్టిగా వుంటుంది. వాటికొసల్లో వొక్కోకొమ్మకు వొక్కో ఆకు. ప్రతి ఆకుకు రెండు గుబ్బలు- పైవైపు ఎర్రగుబ్బ, కిందివైపు పచ్చగుబ్బ. ప్రతి ఆకుకు బారెడు జంపున సాగిన తోక. మూర్తికి ఆ ఆకారం కొత్తగాదు. రైలు పట్టాలకు దగ్గరగా వుండటం వల్ల చిన్నప్పటి నుండి రెక్కమాను చూస్తున్నాడు. దాన్ని పట్టుకుని వేలాడుతూ ఎన్నోసార్లు ఆడుకున్నాడు. ఆ రోజెందుకో అది వింతగా కనిపించింది మూర్తికి.

రైల్వే వ్యవస్థ వంటి భారీ యంత్రాంగంలో ఆ చిన్న యంత్రానికి ఎంత అధికారం వుందో మూర్తికి కొత్తగా తెలిసినట్టయింది. వేలాది మైల్ల పొడవున ప్రాకిన పట్టాలు, వాటి మీద ఘీంకరిస్తూ పరిగెత్తే భారీ ఇంజన్లూ, ఓడలవంటి బోగీలు- వీటి మధ్య రెక్కమాననే చిన్న యంత్రానికున్న ప్రాముఖ్యత గుర్తింపుకు రాదు. కానీ, ఎంత పెద్ద రైలైనా, ఎంత దూరం నుండి వస్తున్నా, రెక్కమాను వంగితే గాని స్టేషన్‌లో ప్రవేశించలేదు. రెక్కమాను వంగితే తప్ప స్టేషన్‌ వదల్లేదు. ఏ రెక్క వంగితే రైలు ఆ వైపుండే లైనుకే నడుస్తుంది. పెద్ద రెక్క వంగితే మెయిన్‌ లైను మీద ప్లాట్‌ఫాం అందుకుంటుంది. చిన్న రెక్క వంగితే లూప్‌లైన్‌ మీద పక్కకు పడిపోతుంది. ఇలాంటి రెక్కమాన్లు ఎన్నింటినో దాటుకుంటేగాని రైలు బండి గమ్యం చేరదు.

పట్టాకోసం పెట్టుకున్న దరఖాస్తు ఆరునెలలైనా జవాబు రాకుంటే, విషయం తెలుసుకోటానికి కలెక్టరేటుకు వెళ్ళాడు మూర్తి. గుమాస్తా కొత్తవాడు. ఫైలు అతని దగ్గరే నిలబడి వుంది. అదే ఆఫీసులో పనిజేసే తన సహచరుల సహాయంతో రెక్కమానేయించాడు. ఫైలు రైలులా కదిలి, సెక్షన్‌ ఆఫీసరు, హుజూర్‌ సిరద్దార్‌ పేర్లు గల స్టేషన్లు దాటి జిల్లా కలెక్టరుకు చేరింది. ఆయన ఆర్‌.డి.వో. రిపోర్టుకు ఆదేశించాడు. ఫైలు తిరుగు ప్రయాణంలో మునుపటి స్టేషన్ల దగ్గర ఆగుతూ గుమస్తాకు తిరిగొచ్చింది. ఆర్‌.డి.వో.ను ఉద్దేశించి ఆ గుమాస్తా తయారుచేసిన ఉత్తరం చిత్తుప్రతి మునుపటి స్టేషన్ల దగ్గర ఆగుతూ పైకెళ్ళి తిరిగొచ్చింది. చివర టైపిస్టు దగ్గర ఉత్తరం తుది రూపం తయారై మరో సారి పైకెళ్ళి, ఆర్‌.డి.వో. కార్యాలయానికి తపాలా చేయబడింది. ఆర్‌.డి.వో. ఆఫీసులో గూడా ఇదే తంతు- యల్‌.డి.సి, యు.డి.సి., ఆర్‌.డి.వొ. – పైకీ కిందికీ ప్రతి స్టేషన్‌లో ప్యాసింజర్‌ బండిలా ఆగి ఆగి తిరుగుతూ చివరకు తాసిల్దారుకు పంపబడింది. తాలూకాఫీసులో ప్రయాణంగూడా అలాగే వుంది. యల్‌.డి.సి., యు.డి.సి, డిప్యూటీ తాసిల్దారు, తాసిల్దారు, అదే మార్గంలో తిరిగి యల్‌.డి.సి., అక్కడి నుండి రెవెన్యూ ఇన్పెక్టర్‌, ఇంకోసారి యల్‌.డి.సి. నుండి మునుపటి స్టేషన్ల గుండా తాసిల్దారుకు వెళ్ళి యల్‌.డి.సి.కి తిరిగి రావడం, సర్వేయరు, మరోకసారి పైకి కిందికి, కిందికీ పైకి, పైకి కిందికి, కిందికీ పైకి, మొత్తం మీద అంతా తెలిసినవాళ్లు వుండటం వల్ల తాలూకాఫీసు నుండి కాస్త తొందరగా బయట పడింది.

చదవండి :  గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయశర్మ

”భూమి నీది కాదు. అడిగేది నీ సొంతానికి కాదు. ఎందుకయ్యా మా ప్రాణం తింటున్నావ్‌?” అన్నాడు గుమాస్తా రెవెన్యూ కమిషనర్‌ ఆఫీసులో. అక్కడ ఫైలు కదిలించడం తన వల్ల కాదని మూర్తికి తేలిపోయింది. హైదరాబాదు నుండి తిరుగు ముఖం పట్టాడు. తనలో తను నవ్వుకుంటూ లేచి నిలుచున్నాడు మూర్తి. రెక్కమాను దాటుకుని, కట్టదిగి పొలంగట్టు చేరుకున్నాడు. పంటకాలువలో తడిలేదు. గట్టు గట్టిపడి నడకకు అనుకూలంగా వుంది. గట్టు తడిగా వుంటే కొంచెం జాగ్రత్తగా నడవాలి. అజాగ్రత్తగా అడుగేస్తే జారుతుంది. ఈ కాలిబాట కాక ఆశ్రమానికి ఊరి మీదుగా బండ్లబాట నడుస్తుంది. పది చినుకులు రాలితే అది మనుషులకు ఉపయోగపడదు. అంత మాత్రాన్నే దాన్ని చులకనగా చూడటం కుదరదు. ఎడ తెరపి లేకుండా కార్లూ, జీపులూ నడిచిన చరిత్ర ఆ గతుకుల బాటకు వుంది. ఎన్నికల్లో పోటీ చెయ్యమని వొత్తిడి చేస్తూ మొదట్లో పెద్ద పెద్ద నాయకులు బాబాయిని బ్రతిమాలేవారు. స్వరాజ్యం రావడంతో దేశానికి కాంగ్రెస్‌ పార్టీ అవసరం తీరిపోయిందని బాబాయి అభిప్రాయం. పార్టీ కోసం ప్రచారం చెయ్యడానికిరమ్మని ఆ తరువాత ఎంతో మంది ప్రాధేయపడుతూ తిరిగారు. చిరునవ్వుతో సమాధానం చెప్పి బాబాయి తప్పుకుంటూ వుండేవారు. ఆ తరువాత ఎన్నికల్లో ఎంతో మంది అభ్యర్థులు ఆశీర్వాదం కోసం వచ్చేవారు. జిల్లాలో పర్యటించడానికి వచ్చిన మంత్రులు బాబాయి దర్శనానికి వచ్చేవారు.

క్రమంగా ఇలాటి రాకలు తగ్గిపోయాయి. ఇటీవల బొత్తిగా లేకుండా పోయాయి. వారి తాకిడి తగ్గిన తరువాత బాబాయికి ప్రశాంతత ఎక్కువైనట్టు ఆయన నడవడిక వల్ల అర్థమౌతుంది. మూర్తి కుటీరంలో అడుగుబెట్టిన సమయాన పూజ ముగించుకుని బాబాయి రాట్నం దగ్గర కూర్చుంటున్నారు.

”ఇదేనా రావడం మూర్తీ! ఇంకా ముఖం కడిగినట్టు లేదు.” దిగులుతో వాడిపోయిన మూర్తి ముఖాన్ని గమనిస్తూ అడిగాడు బాబాయి.

”లేదు బాబాయ్‌.”

”వెళ్ళి ముగించుకొని రా. తరువాత మాట్లాడొచ్చు”.

మూర్తి స్నానం ముగించుకుని బాబాయి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. కుటీరం మధ్యలో జంపకానా పరిచి, దాని మీద కూర్చుని రాట్నం వడకడం బాబాయి అలవాటు. అది పదిహేను అడుగుల వెడల్పు, ఇరవై అడుగుల పొడవు వున్న కొట్టం. అరలు లేకుండా వొకే గదిగా ఉండడం వల్ల విశాలంగా కనిపిస్తుంది. అందులో వొకమూల పూజాస్థలంగా కేటాయించబడింది. మరోమూల వంట, గోడలకు చుట్టూరా గాంధీ, నెహ్రూ, పటేల్‌, తిలక్‌ మొదలైన నాయకుల పటాలు తగిలించి వున్నాయి. మరో మూల ఐదడుగుల టేకు అల్మేరా వుంది. అక్కడక్కడ తగిలించిన తట్టలూ, బుట్టలూ, చెక్క అటకలూ తప్ప చెప్పుకో తగ్గ సామగ్రి లేదు. బాబాయి విశ్రాంతి తీసుకునేప్పుడు ఉపయోగించే పడక కుర్చీ గోడకు ఆనించివుంది. ఆయన మంచం ఉపయోగించరు. పడక నేలమీద పరుచుకుంటారు. రాత్రి పడుకోవటానికి తప్ప పడక పరచడం మూర్తి చూడలేదు.

రెండు మూడు రకాల పళ్ళుండే తట్టను మూర్తికి అందించాడు బాబాయి. అది వారి ఫలహారం. అవి తిని పాలు తాగుతారు. మూర్తి తట్టను అందుకుని నింపాదిగా తొక్క తీసి, కొద్ది కొద్దిగా నోట్లో వేసుకుంటున్నాడు. మూర్తి మందకొడితనం చూస్తూనే బాబాయికి విషయం తెలిసిపోయింది. తను కుతూహలం కనబరుస్తూ అడిగితే చెప్పడంలో మరింత కుంగిపోతాడు. అందువల్ల, మొదలెట్టే అవకాశం మూర్తికే వదిలేస్తూ తన దృష్టి రాట్నం మీద వుంచాడు.

”మీరొస్తేగాని పని అయ్యేలా లేదు” మూర్తి మెల్లిగా అన్నాడు.

”నేనా?”బాబాయి ఊరి పొలిమేర దాటి చాలా రోజులైంది. మూర్తి చేతికొచ్చిన తరువాత ఆ అవసరం కలగలేదు.

”నాతో అయ్యే పనిగాదు.”

కమీషనర్‌ ఆఫీసులో పరిస్థితి వివరించాడు మూర్తి.

”అక్కడ నాకు మాత్రం తెలిసినోల్లు ఎవరున్నారు?”

”లక్ష్మయ్యగారు తలుచుకుంటే క్షణంలో ఔతుంది. ఆయనిప్పుడు రెవెన్యూ మంత్రిగా వున్నారు.”

లక్ష్మయ్యగాక మరొకరైతే, బాబాయికి ఆ సలహా యిచ్చే సాహసం మూర్తి చెయ్యలేడు. మంత్రుల దగ్గరికి సిఫారుసుతో వెళ్ళడం బాబాయికి ఇష్టముండదు. లక్ష్మయ్యతో ఆయనకు చాలా చనువుంది. బాబాయిని పరామర్శించడానికి వచ్చే నాయకులంతా మానుకున్నా లక్ష్మయ్య మాత్రం వచ్చేవాడు. ఇటీవల ఎందుకో రాలేదు గానీ, రెండేళ్ళ కిందట వచ్చాడు. ఇతర నాయకులు వచ్చినప్పుడు కనిపించే ఇరకాటం లక్ష్మయ్య వచ్చినప్పుడు బాబాయిలో కనిపించదు. ఆయన బాబాయితో పాటు చాపమీద కూర్చుంటాడు. కొద్దిసేపు రాట్నం తిప్పుతాడు, పాలు తాగుతాడు, సొంత ఇంట్లో వున్నంత స్వతంత్రంగా వుంటాడు.

”మంత్రి హోదాలో నువ్వొస్తే, గౌరవించడానికి నా ఇంట్లో ఏముందిరా.” అన్నాడు బాబాయి.

”నన్ను మంత్రిగా ఎందుకు చూస్తావురా? కాలేజీలో నాకు పుస్తకాలు కొనే గతిలేనప్పుడు ఆదుకున్నావే. ఆ హోదాలో నువ్వుండు.” అన్నాడు లక్ష్మయ్య.

”ఛ. అది స్నేహం. స్నేహానికి అంతస్తులు వుండవు.”

”అయితే ఇప్పుడూ లేవు.”

లక్ష్మయ్యకు మూర్తిని పరిచయం చేశాడు బాబాయి. ఇద్దరూ కలిసి చదవుకున్న రోజులు, సబర్మతి ఆశ్రమంలో కలిసి పనిచేసిన రోజులు గుర్తుచేసుకుంటూ కొద్దిసేపు గడిపేవారు. బాబాయి సబర్మతి నుండి తిరిగొచ్చిన తరువాత గూడా లక్ష్మయ్య అక్కడ చాలా కాలం పనిచేశాడట. ఆనాడు ఉద్యమంలో త్యాగాలు చేసిన గొప్ప వాల్లందరిని వెనక్కు తోసి, అధికారం కోసం వచ్చే అవకాశవాదులతో కాంగ్రెస్‌ ఖరాబైపోతూందని లక్ష్మయ్య వాపోయారు. దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన నోట వింటే గుండె తరిగిపోతుంది. బాబాయి కళ్ళు చెమ్మగిల్లాయి.

లక్ష్మయ్య నిర్వహించే శాఖలో వొక ప్రజాకార్యం ముందుకు సాగకుండా ఆగిపోవడం బాబాయికి నమ్మబుద్ధిగాలేదు. ”పాపం వాడి చేతికి ఈ శాఖ ఇటీవలే వచ్చింది” అని సర్దుకున్నాడు.

”ఇది వాని దృష్టికి పోతే వోర్చుకోడు. కొద్ది రోజులు ఆగి చూద్దాం” అన్నాడు మూర్తితో.

”ఇలాంటివన్నీ మంత్రుల దృష్టికి పోతాయా? ఎవరో వొకరు తీసుకు పోతేగాని ఇంత చిన్న విషయాలు వారిదాకా పోవు. కమిషనర్‌ నుండి రిజెక్టయి ఫైలు తిరిగొస్తే మల్లీ కథ మొదటి కొస్తుంది. ఆలోపు ఆయనకు శాఖ మార్చితే మనపని ఎప్పటకీ కాదు” అన్నాడు మూర్తి.

బాబాయి ఎలాగైనా బయలుదేరేట్టు చెయ్యాలని మూర్తి పట్టుదలగా వాదించాడు. బయలుదేరక తప్పదని బాబాయి నిర్ణయించుకున్నాడు.

తెలుగు ప్రజల రాజధానిగా మారిన తరువాత హైదరాబాదును బాబాయి చూడటం అదే మొదటిసారి. రెవెన్యూ మంత్రికి కేటాయించిన బంగళా ఎక్కడుందో మూర్తి అదివరకే చిరునామా సేకరించాడు. లక్ష్మయ్య బంగళా చూసి బాబాయి గాబరా పడ్డాడు. లంకంత ఇల్లు, ముందువైపు ఉద్యానవనంతో రాజభవనంలా వుంది. బంగ్లా చుట్టూ ఎతైన ప్రహరీ గోడ. వాహనాల రాకపోకలకు అనుకూలంగా విశాలమైన గేటు. గేటు పక్కన సెంట్రీ పోస్టు. అందులో ఇద్దరు సాయుధ సిపాయిలు. గేటు దిమ్మకు కొండా లక్ష్మయ్య, రెవెన్యూ శాఖామాత్యులు అని బోర్డు తగిలించి వుంది. ఆ ఆర్భాటం చూసి, లోపలికి అడుగుపెట్టడం మంచిదా కాదా అని ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. మూర్తి తమాయించుకొని ”పద బాబాయ్‌” అన్నాడు. బాబాయి అనుమానంగా ముందుకు అడుగేశాడు.

”ఆగు ఎక్కడికి?” గేటులో అడుగు పడిందో లేదో, సాయుధ సిపాయిల్లో వొకడు తుపాకితో అడ్డొచ్చాడు.

”మంత్రిగారిని కలుసుకోటానికి” ముందుకొచ్చి మూర్తి జవాబిచ్చాడు.

”ఎవరు మీరు?”

ఎవరని చెప్పాలి? చెప్పుకోవలసిన హోదా తమకేముంది?

”ఈయన మంత్రిగారి స్నేహితులు” తడుముకుంటూ అన్నాడు మూర్తి.

సిపాయి ఎగాదిగా చూశాడు. ముతక ఖద్దరు చొక్కా, నీరుకావి గోచిపంచ, పాతకాలం కళ్ళజోడు, చంకలో గుడ్డ సంచి – సిపాయికి ఎంత మాత్రం నమ్మకం కలగలేదు. సిపాయి చూపు మూర్తి వైపు తిరిగింది ఖద్దరు పైజామా, ఖద్దరు కుర్తా, ఖద్దరు సంచి- ముసలాడికీ కుర్రాడికీ వయసులో తేడా తప్ప నాగరికతలో తేడా లేదు. సిపాయి పెదవుల మధ్య చిన్న పరిహాసం విచ్చుకుంది.

”అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారా?”

”లేదు.”

”లోపలికి పంపడానికి మాకు ఆర్డరు లేదు.”

సిపాయి మంచివాడులా వున్నాడు. మరొకడైతే వెళ్ళిపొమ్మని అంత మర్యాదగా చెప్పివుండడు.

బాబాయి విగ్రహంలా బిగుసుకు పోయాడు. గత్యంతరమేమిటో మూర్తికి తోచలేదు. అంతలో, పోర్టికోలో బయలుదేరబోతున్న కారు హారన్‌ వినిపించింది. సిపాయి నాజూగ్గా వాళ్లిద్దరిని దారికి అడ్డులేకుండా తొలగించాడు. రెండో సిపాయి బయటికొచ్చాడు. ఇద్దరూ అటెన్షన్‌లో నిలుచున్నారు. మబ్బుచాటు నుండి బయటికి వస్తున్న చందమామలా తెల్లటి కారు పోర్టికో దాటుకుని గేటులో ప్రవేశించింది. అశోకచక్రం మధ్యలో వుండే మూడు రంగుల జెండా కారు ముక్కుమీద రెపరెప లాడుతూంది. ఠక్కుమని బూట్లు చరుస్తూ సిపాయి లిద్దరూ సెల్యూట్‌ చేశారు. గేటు వారన వొత్తిగిల్లిన మూర్తిని, బాబాయిని దాటుకుంటూ కారు రోడ్డుమీదికి జారుకుంది. మంత్రిగారు బయటికి వెళుతున్నారు. ఎక్కడికి వెళుతున్నారో, ఎప్పుడు తిరిగొస్తారో ఏమో!

చదవండి :  జుట్టుమామ (కథ) - ఎం.వి.రమణారెడ్డి

గేటు దాటి పదిహేను గజాలు వెళ్ళిన మీదట, కారు వొక్క ఊపున ఆగింది. సిపాయిలు అదిరిపడి కారువైపు పరిగెత్తారు. కారు నెమ్మదిగా వెనక్కు దొర్లుతూ గేటు దగ్గరికొచ్చి ఆగింది. డోరు స్వయంగా తెరుచుకుంటూ మంత్రి కిందికి దిగాడు. ఒక్క అంగలో బాబాయిని చేరుకుని కౌగిలించుకొన్నాడు. ఆనందంతో మూర్తి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గాయపడిన అభిమానం కోలుకుంది. సిపాయిల వైపు చూశాడు మూర్తి. మొదటి సిపాయికి చెమటలు పట్టాయి. రెండో సిపాయి ముఖం అయోమయంగా మారింది. బట్టలకు ఇస్త్రీలేని పాపర్లు మంత్రులకు సన్నిహితులైవుంటారని వారికేం తెలుసు?

”అబ్బ! ఎన్నాల్లకు ప్రపంచంలో పడ్డావురా!” అన్నాడు మంత్రి. ఏం సమాధానం చెప్పాలో బాబాయికి తోచలేదు. మంత్రి చూపు మూర్తి మీదికి మల్లింది. ”నీ పేరు …. గురుమూర్తి కదూ?”

ఎంత జ్ఞాపక శక్తి! ఎప్పుడో రెండేళ్ళ కిందట పరిచయం.

”ఔనండీ.” నమస్కారం చేస్తూ జవాబిచ్చాడు మూర్తి.

”ఈ కుర్రాడిని ఈ తరంలో బతకనీయకుండా ఇలా వుంచావేమిట్రా?” అన్నాడు మంత్రి బాబాయితో.

మూర్తి సిగ్గుతో తలొంచుకున్నాడు. అతని కళ్ళలో మంత్రి గారి రూపం లీలగా మెదిలింది. తలెత్తి ఆయనవైపు చూశాడు. ఆయన కట్టింది గూడా ఖద్దరే. కానీ, దూదిపింజ లాంటి తెల్లని ఖద్దరు. గంజి బిర్రున పలపల మంటున్నాయి. పంచెకు మూడేళ్ళ వెడల్పు జరీ అంచుంది. ఎరుపు, ఆకు పచ్చ అంచులుండే కండువా మడత అతికించినట్టు ఇస్త్రీ వొత్త బడింది.

సెక్రటరీని దగ్గరకు రమ్మని చేత్తోపిలిచాడు మంత్రి అతడు దగ్గర కొచ్చి వినయంగా నిలుచున్నాడు.

”ఇవాళ ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్‌ చెయ్‌.”

”అలాగే సర్‌.”

”అబ్బే. నా మూలంగా నీ పని కుంటు పడగూడదు.” ఆక్షేపించాడు బాబాయి.

”ఒక్కరోజులో మునిగిపోయేది ఏమీ వుండదుగానీ, పద లోపలికెల్దాం.”

బాబాయి భుజం మీద చెయ్యి వేసి నడిపించాడు మంత్రి. వెనకగా మూర్తి. సెక్రటరీ అనుసరించారు.

పునాది భూమ్మీద నాలుగడుగులు లేపి నిర్మించిన బంగ్లా. ఆరు మెట్లు ఎక్కుతే గాని కింది అంతస్తు చేరుకోలేం. తలుపులూ, కిటికీలు, స్తంభాలూ నవాబులనాటి తీరులో వున్నాయి. వరండాలో గోడవార విజిటర్ల కోసం పేము కుర్చీలు ఏర్పాటు చేసున్నాయి. దానికి ఇరువైపులా రెండు గదులున్నాయి. మూర్తి వెంట నడుస్తున్న సెక్రటరీ వొకవైపు గదిలోకి తప్పుకున్నాడు. అది అతని ఆఫీసు గదిలా వుంది. మూర్తి బాబాయి వెంట హాల్లోకి చేరుకున్నాడు. విశాలమైన హాలు నిండా మెత్తని తివాచీ పరచివుంది. గోడల వెంట ముచ్చటగా వుండే కుషన్‌సోఫాలు వరుసగా వేసున్నాయి. వాటికి ఎంబ్రాయిడరీ అల్లిన గుడ్డలు సగందాకా కప్పి వున్నాయి. హాలు మధ్యలో, వొకదానికొకటి కొంచెం ఎడంగా మూడు ఖరీదైన టీపాయిలు వేసున్నాయి. వాటిమీద పూలతో అలంకరించిన పింగాణీ కుండీలున్నాయి. బాబాయిని సోఫా మీద కూర్చోబెట్టి, మంత్రి ఆయన పక్కన కూర్చున్నాడు. మూర్తి జంకుతూ దూరంగా నిలబడి పోయాడు.

”అలా కూర్చోవోయ్‌ ఫరవాలేదు. నీ ఆశ్రమంలో ఎంత ఫ్రీగా వుంటావో ఇక్కడ అలాగే వుండొచ్చు” అన్నాడు మంత్రి. అది తనను ఉద్దేశించి అన్నాడో, బాబాయిని ఉద్దేశించి అన్నాడో మూర్తికి అర్థం కాలేదు. దూరంగా వుండే సోఫా మీద మోసీమోయనట్టు కూర్చున్నాడు.

కరెంటు బెల్లు గిర్రున మోగింది. పరిచారకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు.

”గెస్టుకు భోజనానికి ఏర్పాటు చెయ్యమని చెప్పు. పూర్తి వెజిటేరియన్‌” ఆదేశించాడు మంత్రి. తలూపి లోపలికి దౌడు తీశాడు సేవకుడు.

”ఈ రోజు నువ్వు నాతో భోంచెయ్యాలి. మనం కలిసి భోంచేసి ఎన్నేళ్ళయిందో!” మంత్రి బాబాయితో అన్నాడు.

”నేనొచ్చిన పని నెరవేరిస్తే నూరు విందులు చేసినంత తృప్తి పడతాను.” అన్నాడు బాబాయి.

”అంత బరువైన పనిమీద వచ్చావన్న మాట! ఈ పర్వతం కదిలిందంటే పెద్దపనే అయ్యుండాలి. ఇంతకూ పని ఎవరితో?”

”నీ తోనే.”

”మరీ మంచిది. నీ కోసం నేను చేయగలిగిన పని వొకటుండడం నా అదృష్టం.”

”నీ ధోరణి కొంచెంమైనా మారలేదు.” అధికార ప్రపంచపు మాయ స్నేహితునికి కప్పలేదని బాబాయికి కొద్దిగా నమ్మకం కుదురుతూంది. కానీ, ఇదివరకటి చనువుతో ‘ఒరే’ అనలేకపోతున్నాడు.

”ఇంతకూ పనేమిటి?”

మూర్తి దగ్గరగా జరిగి, బాబాయి కంటే ముందుగా అందుకున్నాడు. ఫైలు పరిస్థితి మంత్రికి వివరించాడు.

”ఫైలు నెంబరుందా?” మూర్తిని అడిగాడు మంత్రి.

మూర్తి తటపటాయించాడు. ఆఫీసు ఫైలు రహస్యంగా నడిచేది. నెంబరు చెబితే ఎలా తెలిసిందనే సమస్య రావచ్చు. బాబాయి ఇలాటి పనులు మెచ్చుకోడు. ఇంతదూరం వచ్చాక పని ఆగగూడదనే పట్టుదల మూర్తికి ధైర్యం కలిగించింది. జేబులో నుండి నోటు బుక్కు తీసి, అందులో మరో కాగితం మీద ఆ నెంబరు రాసి మంత్రి చేతికి అందించాడు.

మూర్తికి సంకోచించిన సమస్య ఎదురుగాలేదు. చీటీ చూసుకుంటూ మంత్రి కరెంటు బెల్లు మోగించాడు. ఈసారి వినిపించిన మోత మునుపటి దానిలా లేదు. సెక్రటరీ పరిగెత్తుకుంటూ వచ్చాడు.

”ఈ ఫైలు చూసి వెంటనే నాతో మాట్లాడమని కమీషనరుతో చెప్పు” అన్నాడు మంత్రి.

”అలాగే సర్‌.” సెక్రెటరీ వెళ్ళిపోయాడు.

”ఇంగ్లీషోడికి మన ఉద్యోగుల మీద నమ్మకం లేక వొకని మీద వొకన్ని తనిఖీ పెట్టుకున్నాడు. దానికి సర్కులేషన్‌ అని పేరు పెట్టాడు. స్వరాజ్య మొచ్చి ఇన్నేండై ్లనా ఈ పద్ధతి మానలేదా?” బాబాయి అమాయకంగా అడిగాడు. ”పిచ్చిమాలోకమా! ఇంగ్లీషోడు పోతూనే ఇంట్లో దొంగలు పోతారా? ఈ వ్యాపారస్థులు, కంట్రాక్టర్లూ, కబ్జాదారులు ఎవరు? ఆ రోజూ మనవాళ్లే, ఈ రోజూ మనవాళ్లే. అజాగ్రత్తగా వుంటే దేశాన్ని అమ్మేస్తారు.”

”ఈ మాత్రానికి తెల్లోడు ఏలితేనేం, నల్లోడు ఏలితేనేం?”

”అమ్మో…! సన్యాసంలో వున్నావనుకున్నాను గాని కమ్యూనిజంలో దిగినావని అనుకోలేదోయ్‌! తెల్లోడు దోచుకుని వాని దేశం పట్టుకెలతాడు. ఇప్పుడు ఎటుతిరిగినా సంపద దేశంలోనే వుంటుంది.”

ఫోన్‌ మోగింది. మంత్రి ఎత్తుకున్నాడు.

”ఏస్‌…”

”ఇవ్వు.”

”… … ….”

”నమస్తే, ఆ ఫైలు చూశారా?”

”… … …”

”పట్టాకు ఈ రోజే ఆర్డర్‌ ఐపోవాలి.”

”… … …”

”వెరీగుడ్‌” ఫోన్‌ పెట్టేశాడు.

అది తమ పనిగురించేనని మూర్తికి బోధపడింది. ఎందుకింత ఆలస్యం చేశారని మంత్రి కమీషనర్ను అడగలేదు. ఇప్పటికైనా ఔతున్నందుకు మూర్తి సంతోషించాడు.

”ఆర్డరు వేస్తారు. కాపీ ఈ రోజే పట్టుకెళ్ళు.” మూర్తిని ఉద్దేశిస్తూ అన్నాడు మంత్రి.

”సార్‌! మీ కోసం హోం మినిస్టరు గారు వస్తున్నారు.” సెక్రటరీ వర్తమానం అందించాడు మంత్రికి.

”ఆయన్ను పంపించి వచ్చేస్తా” అని బాబాయికి చెబుతూ మంత్రి తన సహచరుని కోసం ఎదురు వెళ్ళాడు. ఇద్దరూ మరో గదిలోకి వెళ్ళారు. రెండు గంటల సేపు వాళ్ళ సమాలోచన సాగింది. మధ్య మధ్యన టీలూ, చిరుతిండ్లూ అక్కడికే అందుతున్నాయి. చివరకు మధ్యాహ్నం వొంటి గంటకు సహచరుని సాగనంపి మంత్రి తిరిగొచ్చాడు.

”ఏమి అనుకోకురా. అర్జంటు పని. వ్యవహారం మీద ఆయన స్వయంగా వచ్చాడు.” క్షమాపణ పూర్వకంగా బాబాయికి చెప్పుకున్నాడు.”ఛ. అంతమాటెందుకురా. పని ముఖ్యంగాని, మన కబుర్లు ముఖ్యమా?” మంత్రుల విలువైన కాలం వృధా కానందుకు బాబాయి నిజంగా సంతోషించాడు.

”భోజనానికి లేద్దామా?”

”సరే.” అంటూ బాబాయి లేచాడు.

”రావోయ్‌ మూర్తీ!” మంత్రి ఆహ్వానించాడు.

బాత్‌రూంలో ఎక్కడ జారిపడతానో అన్నట్లు భయం భయంగా బాబాయి కాళ్ళు కడుగుతున్నాడు. జారితే పడకుండా పట్టుకోడానికి మూర్తి సిద్ధంగా నిలుచున్నాడు. ఏ ప్రమాదం జరక్కుండా ఇద్దరూ బయటికొచ్చారు.

డైనింగ్‌ టేబుల్‌ వైపు చూడగానే బాబాయి నోరు తెరిచి, గుడ్లప్పగించి చూస్తూ ఆగిపోయాడు. అది బాదమాకు ఆకారంలో వుండే పెద్ద బల్ల. దాని చుట్టూరా ఎనిమిది కుర్చీలు, టేబుల్‌ నిండా క్రిక్కిరిసిన పింగాణీపాత్రలు వాటి నిండా ఆవిర్లు ఎగజిమ్మే రకరకాల వంటకాలు. ఎన్ని రకాల వంటకాలో మూర్తికి లెక్క తెలీలేదు.

”ఏమిటీ ఆగిపోయావ్‌? అన్నీ వెజిటెబుల్సే.” బాబాయితో అన్నాడు మంత్రి.

”అది సరేగాని లక్ష్మన్నా! ఇవన్నీ తినడానికేనా?” బాబాయి ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అడిగాడు.

”నాలుకకు నాలుగు రుచులు తగిలితే కడుపులోకి నాలుగు ముద్దలు దిగుతాయి. రవ్వంత ఈ జిహ్వచాపల్యం లేకపోతే గాంధీగారికీ మనకూ తేడా ఏముంది?” అన్నాడు మంత్రి. బాబాయి ఇరకాటంలో పడ్డాడు. గాంధీ మహాత్మునికీ తనకూ తేడా లేదని భావించనూలేడు. గాంధీగారు అలవాటు చేసిన నడవడికను మార్చుకోనూ లేడు. ఈ మనిషిని ఇంకెప్పుడూ హైదరాబాదు తీసుకురాగూడదని మూర్తి తన మనసులో ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు. లూప్‌ లైను బండ్లు మెయిన్‌ లైను రద్దీని తట్టుకోలేవని ప్రత్యక్షంగా తెలిసింది.

(రైల్వే సిగ్నల్‌ పోల్‌ను వాడుకలో రెక్కమాను అంటారు.)

ఇదీ చదవండి!

బండీరా

బండీరా..పొగబండీరా… జానపదగీతం

వర్గం: కోలాటం పాట పాడటానికి అనువైన రాగం: హనుమత్తోడి స్వరాలు (తిశ్రం) బండీరా..పొగబండీరా దొరలేక్కే రైలూబండీరా దొరసానులెక్కే బండీరా అది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: