
పట్టిసీమకు అనుకూలంగా తెదేపా నేతల ర్యాలీ
పట్టిసీమ ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకురావడానికి సీఎం చంద్రబాబు మహాయజ్ఞం చేస్తుంటే, విపక్ష నేత జగన్ దీనికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ శాసనమండలి ఉపాధ్యక్షులు సతీష్‌కుమార్‌రెడ్డి (తెదేపా) ఆధ్వర్యంలో సోమవారం పులివెందుల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లాలోని తెదేపా నేతలంతా హాజరై పట్టిసీమకు అనుకూలంగా మాట్లాడటం విశేషంగా ఉంది.
అనంతరం ర్యాలీనుద్దేశించి సతీష్‌రెడ్డి, తెదేపా నేతలు ప్రసంగించారు. వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితి మున్ముందు పునరావృతం కాకూడదనే సీఎం చంద్రబాబు ముందు చూపుతో పట్టిసీమ పథకాన్ని చేపడుతున్నారన్నారు.
ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు రావడం జగన్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని విమర్శించారు. దీనివల్ల తెదేపాకు ప్రజాబలం మరింత పెరుగుతుందనే భయంతోనే జగన్ దీనిని అడ్డుకుంటున్నారన్నారు. ఇక్కడి ప్రజలను అన్నివిధాలా దోచుకుంటున్నారని ఆరోపించారు.
పులివెందులలో చికెన్ ధరల విషయంలోనూ సిండికేట్ ఏర్పాటు చేసి అధిక దోపిడీ జరిగేలా చూస్తున్నది ఏ పార్టీ నాయకులనేది ఇక్కడి ప్రజలకు తెలుసునని అన్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి ఎద్దడిని తాను ముందే వూహించానని, అందుకే పార్నపల్లె నీటి పథకం వద్ద కొత్త మోటార్లు కొనుగోలు, ఇతర మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేయిస్తే, వాటి టెండర్లపై వైకాపా నేతలు కోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారని, ఇంత కంటే ప్రజాద్రోహం ఏముంటుందని ప్రశ్నించారు.
తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ…పట్టిసీమ పథకాన్ని వ్యతిరేకించడమే కాకుండా, జగన్ మళ్లీ బస్సుయాత్ర అంటూ దొంగ నాటకాలకు సిద్ధమయ్యారన్నారు.
మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి సీఎం కావాలని జగన్ కలలుగన్నారని, అందుకే విభజనకు సహకరించగా ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారన్నారు. పులివెందులతో పాటు జమ్మలమడుగు ప్రాంతం కూడా వర్షాలు లేక కరవుతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. చంద్రబాబు కృష్ణా జలాలలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు.
కడప పార్లమెంట్ ఇన్‌ఛార్జి ఆర్.శ్రీనివాసులరెడ్డి (వాసు) మాట్లాడుతూ దేవాలయం లాంటి అసెంబ్లీలో జగన్ వ్యవహారశైలి అందరూ చూస్తున్నారన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ట్యూషన్ పెట్టిస్తానన్న జగన్ అవివేకం ఎటువంటిదో తెలుస్తోందని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి మాట్లాడుతూ విభజన అనంతరం కష్టకాలంలో ఉన్న రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాల్సిన ప్రతిపక్షనేత కావాలనే రచ్చ చేస్తున్నారన్నారు. తమ పార్టీ నీరు తెస్తామంటే, జగన్ వద్దంటున్నాడని తెలిపారు.
ఈ సభలో కడప నగర నేత దుర్గాప్రసాదరావు, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, నంద్యాల హేమాద్రిరెడ్డి, పులివెందుల పట్టణాధ్యక్షుడు వెంకటరామి రెడ్డి, పచ్చ వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు
పట్టిసీమ నీళ్ళు రాయలసీమకు ఏ విధంగా వస్తాయో వీళ్ళు చెప్పి ఉంటే బాగుండేది. అయినా అధికారపక్షం నేతలకు పార్టీ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవడం తప్పదు కదా!