
గువ్వలచెన్న శతకకర్త ఘటికాశతగ్రంథి పట్టాభిరామన్న
గుడికూలును నుయి పూడును
వడి నీళ్లం జెఱువు తెగును వనమును ఖిలమౌ
చెడనిది పద్యం బొక్కటి
కుడియెడమల చూడకన్న గువ్వలచెన్నా!
సప్తసంతానాలు కొన్నింటిని పేర్కొని అవన్నీ ఒకనాటికి నశించిపోయేవే కాని చెడనిది పద్యం ఒక్కటే అని చెబుతున్నది గువ్వల చెన్న శతకం. ఇలాంటి ఆణిముత్యాలు మరికొన్ని ఉన్నాయీ శతకంలో. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు ఈ శతకాన్ని అధిక్షేపశతకం క్రింద ప్రచురించారు. శతక రచనా కాలానికి చెందిన సామాజికాంశాలు ఈ శతకంలో చోటు చేసుకొన్నాయి. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ను రచించిన సురవరం ప్రతాపరెడ్డిగారు ఈ శతక రచయిత క్రీ.శ. 1700 ప్రాంతం వాడన్నారు. రచయిత పేరు చెప్పలేదు.
మొదట రచయిత పేరు ప్రకటించినవారు వైయాకరణం గోపాలజయదేవరాజు గారు. ఈ సంగతి ప్రస్తావిస్తూ ”తెలుగు చాటువు – పుట్టుపూర్వోత్తరాలు” అనే తన గ్రంథంలో బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు ”గువ్వలచెన్న శతకకర్త పట్టాభిరామకవి. రాళ్లభండివారు, భట్రాజ కులస్థులు. ఈ కవి గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని మల్రాజు సంస్థానం ఆస్థానకవి. క్రీ.శ. 1784-1814 మధ్య కాలం వా”డని అన్నారు. శతక కవుల చరిత్ర, ఆంధ్ర కవి సప్తశతి పట్టాభిరామ కవి పేరు, కులం ప్రస్తావించాయి కాని కాలం, ఆస్థానం సంగతి శ్రీనివాసాచార్యులు మాత్రమే చెప్పారు.
రచయిత గురించి చెప్పే ముందు శతకంలోని విషయాలు కొన్నింటిని చూద్దాం. అందులో రెండు పద్యాలివి.
1.చెన్నయను పదము మునుగల
చెన్నగుపురమొకటి నీదు చెంతను వెలయున్
సన్నుతులు వేల్పునుతులును
గొన్నాతని కరుణ చేత గువ్వల చెన్నా!
2. ధర నీపేర పురంబును
గిరిజేశ్వర పాదభక్తి కీర్తియు నీయు
ర్వర నుతులు గాంతు విదియొక
గురువరముగ నెంచుకొమ్ము గువ్వలచెన్నా!
ఈ రెండు పద్యాలలోని ప్రధానాంశం ఒక్కటే. చెన్న పదం ముందుగా చేరుతూ నీ సమీపంలో ఒక పురం వెలుస్తుంది అని మొదటి పద్యం చెబుతూ ఉంటే రెండో పద్యం గువ్వల చెన్నా నీ పేరుమీద పురాన్ని చూస్తావు అంటుంది. ఈ పద్యాల ప్రకారం చెన్నకు పురం తోడై చెన్నపురం అవుతుంది. చెన్నపురం పేరుతో ప్రసిద్ధి చెందిన పురం మద్రాసే కదా! శతకంలోని ఇతరాంశాలు కూడా చెన్నపట్టణాన్నే బలపరుస్తాయి.
శతకంలో బ్రాహ్మణుల ప్రస్తావన, వకీళ్ల ప్రస్తావన ఉంది. పద్యాలు వాళ్లని విమర్శిస్తూ సాగినవే.
తెలుపైన మొగము గలదని
తిలకము జుట్టును త్యజించి తెల్లయిజారున్
తలటోపి గొనగ శ్వేతము
ఖులలో నొకడగునె ద్విజుడు గువ్వల చెన్నా!
(తన సంప్రదాయ వేషం మాని ఆంగ్లేయుల్ని అనుకరించినంత మాత్రాన బ్రాహ్మణుడు ఆంగ్లేయుడవుతున్నాడా)
మరో పద్యంలో ”వేషములన్, మరిమరి మార్చిన దొరలకు, గురువగునా బ్రాహ్మణుండు” అంటాడు రచయిత.
వకీళ్లుగా పనిచేస్తున్న వాళ్లు మరగిన అలవాట్లను బయటపెండుతుందీ పద్యం భవిష్యం చెప్పినట్లుగా
ప్లీడరులమని వకీళ్లీ
వాడుక చెడ స్వేచ్ఛ దిరిగి పాడుమొగములన్
గూడని వారిం గూడుచు
గూడెముల చరింత్రు మున్ను గువ్వల చెన్నా!
ఈ పద్యం చూడండి:
పక్కల నిడి ముద్దాడుచు
చక్కగ కడుగుచును దినము సబ్బుజలముచే
అక్కఱదని యస్పృశ్యపు
కుక్కల బెంచుదురు ద్విజులు గువ్వల చెన్నా!
అప్పటికి భారతీయులు కుక్కల్ని తమ యిండ్లలోనికి రానీయరు. ఆంగ్లేయుల నుంచి ఈ అలవాటు ప్రవేశించింది. కుక్కల్ని తమ యిండ్లలో పెంచుకోవడమేకాదు; సబ్బుతో స్నానం చేయించడం, తమ పడకల్లో పరుండబెట్టుకొని ముద్దాడడం చేస్తున్నారు.
ఇలాంటి పద్యాలు మరెన్నో ఉన్నాయీ శతకంలో. వీటినీ చెన్నపట్టణం ప్రసక్తి ఉన్న పద్యాలను కలుపుకొని ఆలోచిస్తే ఈ శతక రచన చెన్నపట్టణం ఆశ్రయించుకొని జరిగిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
చెన్నపట్టణం పట్టణదిశగా మార్పుచెందింది అక్కడ ఆంగ్లేయులు అడుగు మోడినప్పటి నుంచే. క్రీ.శ. 1639లో వందవాసిని పాలిస్తున్న దామెర్ల వెంకటరాజు ఫ్రాన్సిస్ డే అనే ఆంగ్లేయాధికారికి కోట మరియు గిడ్డంగి కట్టుకోడానికి అనుమతి మంజూరు చేశాడు. 1640లో ఆంగ్లేయులు అక్కడి నుంచి వర్తకం ప్రారంభించారు. తెల్లవాళ్లు నివసించిన కోట ప్రాంతం మద్రాసు గాను, తెల్లవాళ్లకోసం పనిపాట్లకుగాను, వకీళ్లుగాను, దుబాసీలుగాను తమిళులు తెలుగువాళ్లు నివసించిన బయటి ప్రాంతాన్ని చెన్నపట్టణమని పిలిచారు. అప్పటికే అక్కడ సముద్రతీరంలో చెన్నకుప్పం అనే గ్రామ ముండేది. ఆ గ్రామంలో చెన్నకేశవపెరుమాళ్లు గుడి ఉండేది. మద్రాసు, చెన్నపట్టణం అన్న రెండు పేర్లూ మహానగరం అయినప్పుడూ నిలిచాయి. చెన్నపట్టణం నేడు ”చెన్నయ్”గా మారింది.
వర్తకం పెరిగే కొద్దీ స్థానికంగా పరిపాలన కూడా చేపట్టిన ఆంగ్లేయులు చెన్నపట్టణం పరిసరంలోని ప్రాంతాలమీద ఆధిపత్యం సంపాదిస్తూ వచ్చారు. 1693 నాటికి ఎళుంబూరు, పొరసువాకం, తండయార్ పేట, తిరువళ్లిక్కేణి చెన్న పట్టణంలో కలిశాయి. 1708లో తిరువొత్తియారు, నుంగం బాకం, సత్తనగాడు కలిశాయి. 1742 నాటికి చింతాద్రి పేట పెరుంబుదూరు, పుదుప్పాకం, పరసనవూరు, సదయారు కుప్పం కలిశాయి. 1746లో ఫ్రెంచివాళ్ల చేతిలో ఆంగ్లేయులు ఓడిపోయే నాటికే చెన్నపట్టణం పట్టణంగా విస్తరించింది. 1749లో ఫ్రెంచి వాళ్లతో సంధిచేసుకొని ఆంగ్లేయులు తిరిగి చెన్నపట్టణం సంపాదించుకొన్నారు.
గువ్వలచెన్న శతకానికి భూమికా ప్రాంతం చెన్నపట్టణమని, ఆ పట్ణణం క్రీ.శ. 1640 నుంచి క్రీ.శ. 1746 దాకా సాగిన క్రమాభివృద్ధిని చారిత్రక నేపథ్యంతో తెలుసుకొన్నాక, ఆ శతక కర్త 1784 – 1814 మధ్య ప్రాంతంలో గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని మల్రాజు సంస్థానం ఆస్థానకవి రాళ్లభండి పట్టాభిరామకవి అని నిర్ధరించ డానికి వీలుకాదు. శతకకర్త అదే పేరున్న మరోకవి అయి ఉండాలి. పదిహేడో శతాబ్దం వాడుకాని, పద్దెనిమిది తొలినాళ్ళవాడయి కాని ఉండాలి.
కైఫీయత్తులో మరో పట్టాభిరామకవి దొరుకుతున్నాడు. ఆయన క్రీ.శ. 1700 ప్రాంతంలో జీవించాడు. కడప జిల్లాకు చెందిన ఊటుకూరు కైఫీయత్తులో ఈ సమాచారం ఉంది. మట్ల తిరువేంగళనాథరాజు ఉరఫ్ అప్పయ్యరాజు సాహిత్యాభిమాని. కోడూరు సమీపంలోని ఎర్రగుంట్లకోట కేంద్రంగా పొత్తపినాడు పులుగులనాడు ప్రాంతాల్ని పాలిస్తూ ఉన్నాడు. ఊటుకూరుకు తూర్పుగా ఉన్న రామసముద్రం అనే గ్రామాన్ని పట్టాభిరామ కవికి గ్రాస గ్రామంగా ఇచ్చాడు. ఈ గ్రామం ఈ కవికి పది సంవత్సరాలు నడిచింది. ‘ఘటికా శతగ్రంథి’ అని ఈ కవికి బిరుదముంది. ఆయన రచన లేవీ అందులో చెప్పలేదు. కైఫీయత్తులో ఒక కవిని గురించి ఇంత సమాచారం దొరకడం అదృష్టమనాలి. అప్పయ్య రాజు క్రీ.శ. 1700లో రాజ్యానికి వచ్చాడు. 1710లో దాయాదుల చేతిలో మరణించాడు. కాబట్టి ఈ కవి క్రీ.శ. 1700 కంటె ముందు జన్మించి 1710 తరువాత కూడా జీవించి ఉండాలి. ఈ పట్టాభిరామకవి క్రీ.శ. 1700కు అటుగాని, ఇటుగాని చెన్నపట్టణంలో ఉండేందుకు అవకాశం ఉంది. చెన్నపట్టణంలో వడివడిగా సాగిపోతున్న సామాజిక పరిణామాలకు విభ్రాంతి చెంది ఘటికాశతగ్రంథి పట్టాభిరామన్న గువ్వల చెన్న శతకం రచించి ఉంటాడు. (కడపలోని సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ప్రకటించిన మెకంజీ కైఫీయత్తులు 6వ భాగంలో ఊటుకూరు కైఫీయత్తు ఉంది.)
ఆధారాలు :
1. ఊటుకూరు కైఫీయత్తు.
2. ఆనాటి చెన్నపురి – శ్రీ కాసల నాగభూషణం.
3. మద్రాసు గ్రామ నామాల చరిత్ర – డా|| ఎస్. అక్కిరెడ్డి. `