గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? (కవిత)

గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? (కవిత)

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయావా?
గణనాయకా ఈ అభాగ్యుల క్షమించు..!
ఉండ్రాళ్ళు తినే ఓ బొజ్జ గణపయ్యా..!
గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా?

మా గుండె చప్పుళ్ళన్నీ ఆర్తనాదాలై
అధికారాన్ని అంధత్వం ఆవరించినవేళ
కన్నీళ్ళే ఇంకిపోయిన ఈ సీమలో
నిమజ్జనానికి మాత్రం నీళ్ళీక్కడివి?

ఆప్యాయతలకూ అనురాగాలకూ
కొదువలేని ఈ రాయలసీమలో
ఎండిన చెరువులూ, బావులూ
గుండెలు బాదుకునే జీవులూ
ఎడారిలో ఎండమావులై
తడారిపోయిన గొంతులతో
ఆకాశం దిక్కు ఆశగా చూస్తూ
ఆశ సచ్చి అంతమై పోతున్నారెందరో!

గుక్కెడు నీళ్ళకు మొహం వాచి
గుక్కపెట్టి గీపెడుతున్నోళ్ళం!
పిడికెడు గింజలు పండని అన్నార్తులం
మునకెడు జలాలు ఎక్కడ త్యాగలం ?
గణనాయకా ఈ అభాగ్యుల క్షమించు..!
వినాయకా ఈ నేతల కళ్ళు తెరిపించు!

-తవ్వా ఓబుల్ రెడ్డి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: