గాంధీజీ కడప జిల్లా పర్యటన (1929)

1929 (౧౯౧౯౨౯) మే 17 వ తారీఖున గాంధీజీ కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, మారెడ్డిపల్లి, ముద్దనూరు, చిలమకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల గ్రామాల మీదుగా రాత్రి 11 గంటలకు ప్రొద్దుటూరుకు చేరినారు. మహాత్మా గాంధి అమ్మవారిశాలను సందర్శించి శ్రీ వాసవీ మాతను సేవించారు. ఈ అన్ని చోట్లా గాంధీజీని అత్యంత ఉత్సాహముతో ఆదరించి సన్మానించారు.

ముద్దనూరులో…

 గాంధీజీ రాత్రి 9 గంటలకు ముద్దనూరు చేరినారు. ముద్దనూరులో గాంధీజీ దర్శనార్థం , అక్కడకు 12 మైళ్ళ దూరములో ఉన్న జమ్మలమడుగు నుంచి 100 మంది వచ్చినారు. జమ్మలమడుగు తాలూకా బోర్డు ప్రెసిడెంట్ టి. నరసా రెడ్డి, వకీలు కే.పి. శ్యామయ్యర్, వంకదారి వెంకట సుబ్బయ్య శెట్టి జమ్మలమడుగులో 226 రూపాయలు సేకరించి గాంధీజీకి సమర్పించినారు.

మహాత్ముడు విదేశ వస్త్ర బహిష్కారము, మద్యపాన నిషేధము, అస్పృశ్యతా నివారణము, హిందూ మహమ్మదీయ సఖ్యత గురించి సక్రమంగా ముచ్చటించి చిలమకూరుకు వెళ్ళినారు.

చిలమకూరులో…

 గాంధీజీ కడప పర్యటనచిలమకూరులో గాంధీజీ రాకకై స్త్రీలతో సహా 300 మంది వేచి ఉన్నారు. మహాత్ముని కారు రాత్రి 9.40 గం.కి చిలమకూరు చేరింది. ప్రజలు ఆయనకు పూలమాలలు వేసి, ఖద్దరు నిధికి 348 రూపాయలు విరాళముగా సమర్పించినారు.

మహాత్ముడు విదేశ వస్త్ర బహిష్కారము, మద్యపాన నిషేధము, అస్పృశ్యతా నివారణము, హిందూ మహమ్మదీయ సఖ్యత గురించి వారితో ముచ్చటించి తరువాత నిడుజువ్వికి వెళ్ళినారు.

చదవండి :  ఒంటిమిట్ట రథోత్సవ వివాదం గురించిన శాసనం !

నిడుజువ్విలో…

నిడుజువ్వి చేరేసరికి రాత్రి 10 గంటలయింది. అక్కడ 500 మంది ప్రజలు మహాత్ముని రాకకై నిరీక్షిస్తున్నారు. మహాత్ముడు రాగానే వారు ఆయనను సత్కరించినారు. ఇక్కడ భూతపురి నారాయణ స్వామి గారు ఖద్దరు నిధికి రూ.116 విరాళము సమర్పించినారు.

ఎర్రగుంట్లలో..

గాంధీజీ రాత్రి గం. 10.15కు ఎర్రగుంట్ల చేరినారు. ఐదు వేల మంది ప్రజలు ఎర్రగుంట్ల మైదానంలో సమావేశమైనారు. గాంధీజీ కారు మైదానము చేరగానే ప్రజలు ఆయనపై పూల వర్షము కురిపించినారు. ప్రజలు ఎంతో ప్రశాంతంగా ఉన్నందుకు గాంధీజీ చిరునవ్వుతో సంతృప్తిని వెల్లడించినారు. ఆయనను, కస్తూరిభా గాంధీ గారిని పుష్ప మాలలతో సత్కరించిన తరువాత కేతి వెంకటరెడ్డి గారు రూ.116 ఖద్దరు నిధికి విరాళముగా సమర్పించినారు.

తరువాత మహాత్ముడు మాట్లాడుతూ… ఈ దేశంలో లక్షలాది నిరుపేదలకు సహాయం చేయడానికి అందరూ ఖద్దరే ధరించడానికి ప్రమాణం చేయవలెనని, అస్పృశ్యతా నివారణకు కృషి చేయవలెనని పిలుపునిచ్చారు.

హిందూ ముస్లిం ఐక్యత గురించి, మద్యపానము వలన కలుగు కీడును గురించి ఉపన్యసించిన తరువాత తానూ ప్రొద్దుటూరు వెళ్ళడానికి ప్రజల నుంచి అనుమతిని కోరినారు. కానీ వారు మరొక్క ఐదు నిముషములు ఎర్రగుంట్లలో నిలువవలసినదిగా గాంధీజీకి సర్వోత్తమ రావు గారి ద్వారా విన్నవించారు. ఆ కోరికను మన్నించిన మహాత్ముడు తరువాత ప్రొద్దుటూరుకు వెళ్ళినారు.

చదవండి :  ఆకట్టుకున్న అలెగ్జాండర్ నాటక ప్రదర్శన

ప్రొద్దుటూరులో…

ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరుకు పోయే దారిలో గాంధీజీ కొంతసేపు కారులోనే కొంతసేపు నిద్రించినారు. కడప కోటిరెడ్డి గారితో సహా గాంధీజీ, ఆయన బృందం రాత్రి 11 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకొన్నారు.

ఊరి ముందర ప్రజలు చాలా మంది గుమికూడి మహాత్ముని రాకకై నిరీక్షిస్తుండగా స్వచ్చంద సైనికులు ప్రజలను సర్దుతూ శాంతిని కాపాడుతున్నారు. జాతీయ స్వచ్చంద సైనికులు, పోలీసు వారు పట్టణంలో చక్కని ఏర్పాట్లు చేసినారు. మహాత్ముని కారు కన్యకాపరమేశ్వరి గుడి వద్ద రెండు నిముషాలు నిలబడగానే జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన ప్రజలు సంతోషోత్సాహములతో ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.

అనంతరం విడిదికై శెట్టిపల్లి కొండారెడ్డి గారి భవనానికి మహాత్ముడు కారులో వెళ్లారు. ఆయన ఆ విడిదిలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని సుమారు అరగంట పాటు నూలు వడికారు. ఆ తరువాత గాంధీజీ అక్కడనే శయనించినారు.

స్థానిక వసంతపేటలోని మునిసిపల్ కార్యాలయం దగ్గర మహాత్మునికి సన్మాన పత్రాలను, విరాళాలను సమర్పించడానికి 18 వ తేదీ ఉదయం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6 గంటలకే కస్తూరిబాయితో సహా ఆ ప్రదేశానికి వెళ్ళినారు. ప్రొద్దుటూరు పౌరులు గౌరవ మర్యాదలతో, సాదరంగా వారిని ఆహ్వానించారు.

ఆర్యవైశ్య సమాజం వారు, తాలూకా బోర్డు వారు, పురపాలక సంఘం వారు గాంధీ దంపతులకు సన్మాన పత్రాలు సమర్పించినారు. పురపాలక సంఘం వారు రూ.50, తాలూకా బోర్డు వారు రూ.58, కడప మితపాన సమితి వారి పక్షాన క్రుష్ణముని గారు రూ.116 విలువ గల బంగారు కాసులను ఖద్దరు నిధికి విరాలముగా సమర్పించినారు.

చదవండి :  పాలెగాళ్ల పాలనకు సజీవ సాక్ష్యం "దుర్గం కోట "

గాంధీజీ దరిద్రనారాయణుని పక్షాన విజ్ఞప్తి చేయగా ప్రజలు రూ.1730 విరాళముగా సమర్పించినారు. కృష్ణ ముని గారు సీలు చేసిన గంగాజల పాత్రను కానుకగా ఇవ్వగా గాంధీజీ దాని వేలం పెట్టినారు. దానిని కృష్ణ ముని గారే రూ.10 కి కొన్నారు. తరువాత మహాత్ముడు కొన్ని మాటలు హిందీలో చెప్పి దరిద్రనారాయణుని సేవార్థం ప్రజలు అత్యుదారంగా ప్రవర్తించేట్లు వారి హృదయాలు మారవలేనని సూచించారు.

ఆర్యవైశ్య సమాజం వారు రూ.316 విలువ కలిగిన బంగారు కాసులను మాత్రమే సమర్పించినందుకు తనకు ఆశాభంగం కలిగిందని అన్నారు. ఈరోజు ఉదయం ఆశాభంగంతోనే ప్రారంభం కావటం చేత రోజంతా ఆశాభంగమే కలుగుతుందేమోనని భావిస్తున్నానంటూ నిరాశ (విచారం) వ్యక్తం చేశారు.

ప్రజలందరూ విదేశీ వస్త్రాలను బహిష్కరించావలెనని, అస్పృశ్యతను రూపుమాపవలెనని, హిందూ ముస్లింలు ఐకమత్యంతో ఉండవలెనని ఉద్భోదించినారు.

అనంతరం ఉదయం 6.30 గంటలకు శ్రీయుతులు కడప కోటిరెడ్డి గారితో కలిసి చాగలమర్రి బయలుదేరి వెళ్ళినారు.

ఇదీ చదవండి!

అష్టదిగ్గజాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: