వైఎస్ పుట్టినరోజు

వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టినరోజు

14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి 1949 జూలై 8 న వైఎస్‌ఆర్‌ జిల్లా, జమ్మలమడుగులో జన్మించారు. తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. పాఠశాల విద్యాభ్యాసం బళ్లారిలో సాగగా, తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్యనభ్యసించారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు.

వైఎస్ పుట్టినరోజుఅనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్‌ సర్జన్‌గా పట్టా పొందారు. వైద్య విద్య పూర్తైన తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేశారు. అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో కట్టించిన ఆస్పత్రిలో పనిచేశారు. వైఎస్సార్‌ సతీమణి విజయమ్మ. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. జగన్ మోహన్‌ రెడ్డి (కుమారుడు), షర్మిల (కుమార్తె).

1978లో జరిగిన ఎన్నికల్లో వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి తొలిసారిగా కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1983, 85లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మేల్యేగా గెలిచి, హ్యాట్రిక్‌ సాధించారు. ఆ తర్వాత 1989లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 1991, 96, 98లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు.

వరుసగా నాలుగు సార్లు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించిన ఆయన 1999లో పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా గెలిచారు. తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి ఎరుగకుండా విజయం సాధించి, అరుదైన ఘనతను దక్కించుకున్నారు.

వైఎస్సార్‌ తన రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టారు. 1980లో అప్పటి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్, విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 1983-85 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లోనూ తిరిగి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1999లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉంది. ఈ సమయంలో వైఎస్సార్‌ శాసనసభ ప్రతి పక్ష నేతగా ఎన్నికయ్యారు.

అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు విశేష కృషి చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనూహ్య విజయం సాధించింది. దీంతో పార్టీని విజయపథం వైపు నడిపించిన వై.ఎస్‌.రాజశేఖర రెడ్డిని ఎమ్మేల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అలా ఆయనకు తెలుగు ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం దక్కింది. ఐదేళ్ల అనంతరం అంటే 2009లోనూ వైఎస్సార్‌ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆయన తిరిగి రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు.

ఇదీ చదవండి!

ఎర్రగుంట్లలో రజనీకాంత్ సినిమా షూటింగ్

Calendar Add to Calendar Add to Timely Calendar Add to Google Add to Outlook Add …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: