
బంద్ విజయవంతం
కడప: కడప జిల్లా పట్ల ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యింది. సీమలో ఉక్కు పరిశ్రమ, నిరకజలాల సాధనకు ప్రాణ త్యాగాలు చేయడానికైనా వెనుకాడమని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు స్పష్టం చేశారు. విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందగా మూసి బంద్‌కు మద్దతు తెలిపారు. కొన్ని చోట్ల సంస్థలను సమాఖ్య ప్రతినిధులు మూయించారు.
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగాసురేష్, నగర అధ్యక్షుడు అంకుశం, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొమ్మద్ది ఈశ్వరయ్య, కార్యదర్శి మద్దిలేటి బంద్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ బంద్ చేపట్టామన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక, వ్యవసాయ, రోడ్డు రవాణా రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు నీరు, నిధులు, నియామకాలు, రాజధాని కేటాయింపుల్లో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కృష్ణా నదిలో రాయలసీమకు నికరజలాలు కేటాయించి పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో సామాఖ్యల ప్రతినిధులు ప్రదీప్, సంజయ్, శ్రీరామ్, పవన్, శ్రీధర్‌రెడ్డి, జగన్‌నాయక్, వీరయ్య, గురుశేఖర్, కేశవ, కిరణ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాపై వివక్ష తగదు
జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని ఐటీఐ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనాల రాకపోకలు ఆగిపోయి ట్రాఫిక్‌ను స్తంభించడంతో పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టుచేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, నగర కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపై పూర్తి వివక్ష, నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఓట్లు, సీట్లు రాలేదనే కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించడం లేదన్నారు. ఎన్నికల సమయంలో జిల్లాకు హామీల వర్షం కురిపించిన తెదేపా ప్రస్తుతం ఆ వూసే ఎత్తడం లేదన్నారు. జిల్లాలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు అభివృద్ధిపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించాలని.. లేనిపక్షంలో ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు సుబ్బారెడ్డి, నాయకులు స్టీఫెన్, కుమార్, మహేష్, గిరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.