కాంగ్రెస్‌ సమర్పించు.. హైప్‌ మీడియా డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌.. జైల్లో జగన్‌ – 2

జగన్ ప్రత్యర్ధులు కంటున్న ఈ కల నిజమైతే పరమపద సోపానంలో అది జగన్ కి నిచ్చెనేనని ప్రకాష్ తాడి  విశ్లేషణ….

జయలలితని అరెస్ట్‌ చేస్తే ఒక ఇరవై మంది పెట్రోలు పోసుకు తగలబడిపోతారు. రాజశేఖరెడ్డి చనిపోతే కొన్ని వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు దేశంలో ఎన్నికలు ఒక దశ ముగిసి, రెండో దశ జరగడానికి ముందు రాజీవ్‌ గాంధీ చనిపోయారు. తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోతే, మలిదశ పోలింగ్‌లో తొంభైశాతం సీట్లు గెలుచుకుంది. భావోద్వేగమనే సెంటిమెంటే మన ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తోంది. భారతదేశంలో రాజకీయాధికారం సాధించడానికి కన్నీళ్ళే కొలమానం.

ఓ పాత తెలుగు సినిమాలో సావిత్రి ఓ పెద్ద కోటీశ్వరుడి కూతురు. ఎవర్నో ప్రేమిస్తుంది. తండ్రి కాదంటాడు. ఇంట్లోంచి వెళిపోతుంది, ఏ గుడి అరుగు మీదో కొంగుపరుచుకొని పడుకుంటుంది. జనం ఏడుపు ఆపుకోలేకపోయారు. అంత డబ్బున్నావిడకి ఎంత కష్టం వచ్చింది అని విలవిల్లాడి పోయారు. ఇలాంటి సీన్లు ఒక అరడజను పండితే సహజంగానే సినిమా సూపర్‌హిట్‌. నిర్మాత ఫుల్‌ హేపీస్‌. అయితే నిర్మాతలే బెటరేమో! కన్నీళ్ళని డబ్బుగా పిండుకున్నాక ఫుల్లుగా తాగి నిద్రపోతారు. లేదా ఇంకో సినిమా తీస్తారు.

రాజకీయ నాయకులనే వాళ్ళు కన్నీళ్ళని ఓట్లుగా మార్చుకొని అధికారంలో కొస్తారు. ‘భరతఖండంబు చక్కని పాడియావు’ అని కవి ఏనాడో చెప్పాడుగా. ఆ బలంతో కమ్మని ఆవుపాలు పిండుకుంటారు. చంద్రబాబు నాయుడు లాంటి నిపుణులు అధికారంలో వుండగానే ‘హెరిటేజ్‌’ పెట్టి, ప్రభుత్వ పాలపరిశ్రమని ఎండగట్టి, పదవిపోయినా పది చేతులా పాలుపిండుకుంటూనే వుంటారు.

అమ్మా బైలెల్లినాదో….

చదువూ సంధ్యాలేని వెర్రిజనం కన్నీళ్లే తమని గెలిపిస్తాయని జగన్‌ అండ్‌ కోకి బాగా తెలుసు. ఓదార్పు యాత్రకి వస్తున్న జనమూ, పోల్‌ సర్వేలు చెబుతున్న విషయమూ ఒకటే. రెక్కాడితేగానీ డొక్కాడని మామూలు జనంతో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి కనెక్ట్‌ కాగలిగారు. ప్రజల్లో తనపైనా, తన పాలనపైనా గొప్ప విశ్వాసాన్ని నింపగలిగారు. సామాన్య జనంలో, మధ్యతరగతిలో, చాలా మంది ఇతర పార్టీల నాయకుల్లో కూడా, ”ఎంకమ్మ! వీడురా నాయకుడంటే” అనే ఇమేజ్‌ పొందగల ఇంద్ర జాలమేదో చేశాడు. రైతుల హృదయ తంత్రిని మీటగలిగాడు. పుట్రలాగ పొంచి దూకిన రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ వై.ఎస్‌. ప్రతిష్ఠని బాగా పెంచింది. నాన్నపెట్టిన పెట్టుబడంతా ఓట్ల వరదలై కొడుకుని ఈ రాష్ర్టానికి తిరుగులేని నాయకుణ్ణి చేయబోతోంది. ఒకవేళ జగన్‌కి కోర్టులో ఎదురుదెబ్బ తగిలి, ఈనాడు, ఆంధ్రజ్యోతి వారి పూజలు ఫలించి, జైలుకెళ్ళే పరిస్థితి వస్తే ఏంచేయాలో వై.ఎస్‌.ఆర్‌. పార్టీ నిర్ణయించుకుంది. జగన్‌ తల్లి విజయమ్మ ఓదార్పు యాత్ర కొనసాగిస్తారు. అప్పుడు సెంటిమెంటు యింకా పండుతుంది.

చదవండి :  సీమవాసుల కడుపుకొట్టారు

షాట్‌ ఒన్‌: సాక్షి టీవీ ఓబీవ్యాన్లు, కెమెరాలు సిద్ధం. పక్కనించి యాక్షన్‌ అనే అరుపులాంటి పిలుపు. హారతి పళ్ళేలు పట్టుకొని రోజా, వాసిరెడ్డి పద్మ, తాడి శకుంతల వంటి రాజకీయ చెలికత్తెలు ప్రవేశిస్తారు. వెండి హారతి పళ్ళేలను వై.ఎస్‌.ఆర్‌ పార్టీయే సప్లయి చేస్తుంది. ఎవరి కర్పూరం మాత్రం వాళ్ళే తెచ్చుకోవాలి. పార్టీకోసం కరిగిపోవాలి కదామరి. పాట ప్రారంభం. ”కొత్త ముఖ్యమంత్రి రారా. నీ కుడికాలు ముందు మోపి రారా…..” ఇంతలో కోడలు భారతి ముందుకొచ్చి విజయమ్మకు బొట్టుపెడుతుంది. కూతురు షర్మిల మైకు అందిస్తుంది. చుట్టూ జనం… జనం… విజయమ్మ మూడు నాలుగు వాక్యాలు మాట్లాడుతుంది. స్వరం గద్గదమౌతుంది. దించిన కళ్ళను నెమ్మదిగా పైకెత్తి జనం వైపు చూస్తుంది. నీళ్ళునిండిన రెండు జాలి కళ్ళు. ఎలాంటి రాజకీయ మకిలీ అంటని ఒక పల్లెటూరి ఇల్లాలు.

షాట్‌ టూ: ఆమె ఇక మాట్లాడినా, మాట్లాడకపోయినా ఒకటే. జనానికి తెలుసు. మహా నాయకుడైన భర్తని పోగొట్టుకున్న మహా ఇల్లాలు. ఇప్పుడు కొడుకూ ఎక్కడో దూరంగా…. జనం కదిలిపోతారు. జనం రగిలిపోతారు. జగన్నో, విజయమ్మనో ముఖ్యమంత్రిని చేసేదాకా నిద్రపోం అంటారు. జై జగన్‌ నినాదాలు. జై జై జగన్‌ – పూనకాలు.

చదవండి :  ఆశలన్నీ ఆవిరి

ఫలితం: ప్రచారం రక్తికడుతుంది. స్వర్గంలో తండ్రి, జైల్లో కొడుకు, చేతులు సాచి ప్రజలను అర్థిస్తూ తల్లి. కథ కత్తిలా వుంది. మెలోడ్రామా కేక. సంపూర్ణ కుటుంబ కథా చిత్రం. బడా కోటీశ్వరుడి కష్టాలెపుడూ జనాన్ని కలచి వేస్తాయి. అధికార పీఠాలకు ఓట్లని పరిచివేస్తాయి.

రాష్ర్టానికి కష్టకాలం

మన ఆంధ్రప్రదేశ్‌ అనే గొప్ప రాష్ట్రం చెప్పనలవిగాని కష్టంలో పడికొట్టుకుంటోంది. ఇటు తెలంగాణా మహోద్యమం, అటు నాయకుల వాగుడు, బంద్‌లు, పేదజనం విలవిల్లాడిపోతున్నారు. కే.సీ.ఆర్‌ లాంటి నాయకుడు, ”తెలంగాణా యివ్వండి, తర్వాత రాష్ర్టాన్ని 66 ముక్కలు చేస్కోనివ్వండి” అన్నాడంటే ఎంత బాధ్యతారాహిత్యం! సీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర ప్రజలు ఏమైపోయినా ఫర్లేదా? అక్కడ బతుకుతున్నదీ సాదా సీదా జనమే! గుజరాత్‌లో వున్న ఒక రౌడీ ముఖ్యమంత్రి, ”మూడు రోజులు టైం యిస్తున్నా, ముస్లింలను ఏమైనా చేస్కోండి. తర్వాత నేను చూసుకుంటాను”అని మూకలకు అభయమిచ్చి పంపితే, ముస్లిం పెద్దల్ని, స్ర్తీలని, పిల్లల్ని నరికి, నెత్తురు పారించి, ఆస్తులు తగలబెట్టి భయానక విధ్వసం సృష్టిస్తే, మన రాష్ట్రం నుంచి రచయితలు, కవులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు ఎందుకు గుజరాత్‌ వెళ్ళారు? అది మన గుజరాత్‌, అది మనదేశం గనక. ఆ ప్రజలూ మన ప్రజలే గనక. ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా మిగతా రాష్ట్రం ఏమైపోతే పోనియ్‌ అన్నట్టు మాట్లాడటం ఎంత దుర్మార్గం.

పాపం కాంగ్రెస్‌:

వై.ఎస్‌. విషాదాంతం తర్వాత ముఖ్యమంత్రి ఐన రోశయ్య అనుభవజ్ఞుడు, సమర్థుడు. పాపం వయసు ఆయనకి సహకరించలేదు. పీలేరు పిలగాడు కిరణ్‌కుమార్‌ రెడ్డి అధిష్ఠానం వారివి ఎన్ని కాళ్ళు పట్టారో, ఎన్ని తలలకు మాలిష్‌ చేశారోగానీ ఢిల్లీలో తంతే హైద్రాబాద్‌లో సీఎం కుర్చీలో పడ్డారు. ఆయనపై అవినీతి ఆరోపణ లేవీ లేవు. నిక్కచ్చి మనిషి. రూలు ప్రకారం పోయేవాడు. పాలకుడేగానీ ప్రజల మనిషి కాలేకపోయాడు. నాలుగు వాక్యాలు తిన్నగా గడగడ మాట్లాడలేరు. జోకేసి నవ్వించి జనాన్ని ఆకట్టుకోనూలేడు. తెలంగాణా ఉద్యమం ఒకటి తోసుకొచ్చింది. ప్రభుత్వంలో ఏ పనన్నా జరుగుతుందో? లేదో తెలీదు. దాంతో పాలన చైనీస్‌ నూడుల్స్‌లో పప్పు చారు కలుపుకొని తిన్నట్టుగా తయారైంది. ఈ బాధాకర, నిరాశామయ సమయంలో జనానికి జగనే మా నాయకుడనిపిస్తే అది వాళ్ళ తప్పు కాదేమో! అయితే జగన్‌ ఆంధ్ర సీఎమ్మా? ఆంధ్రప్రదేశ్‌ సీఎమ్మా అనేది తేలవలసి వుంది. 2014 ఎన్నికలు రెండు ప్రధాన అంశాలపై ఆధారపడి వున్నాయి.

చదవండి :  అలాంటి ప్రశ్న అడగవచ్చునా?

ఒకటి : తెలంగాణా.
రెండు : సోనియాగాంధీ ఆరోగ్యం.

తెలంగాణ ఇస్తే…. తెలంగాణా ఇవ్వకపోతే…. ఏం జరుగుతుందనేది అతి సామాన్యుడి నుంచి అధిష్ఠానం దాకా అంతుచిక్కని ప్రశ్న. సోనియాగాంధీ ఆపరేషన్‌ సక్సెస్‌ అంటున్నారు. పాంక్రియాస్‌ కేన్సర్‌ అని తాజా కబురు. అది చాలా ప్రమాదకరమైనది. రాజకీయాలకు సంబంధించి కొంత కటువుగా మాట్లాడుకోక తప్పదు. చెప్పుకోలేని బాధ లోపల సుళ్ళు తిరుగుతుంటే అది క్రమంగా పాంక్రియాస్‌ కేన్సర్‌గా మారుతుంది. బహుశా రాజీవ్‌ గాంధీ మరణం ఆమెకు భరించలేని వేదనగా మారి వుండొచ్చు. వ్యాధి ముదిరి 2014 ఎన్నికలకు ముందు సోనియా గాంధీకి జరగరానిదేమైనా జరిగితే – కాంగ్రెస్‌ పార్టీ కనీసం 300 పైనే పార్లమెంట్‌ సీట్లు గెలుచుకుని, పవర్‌ఫుల్‌ ప్రధానిగా రాహుల్‌ గాంధీ స్థిరపడతారు. సోనియా ఆరోగ్యంతో సంబంధం లేకుండా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయావకాశాలున్నాయని ఎన్నికల సర్వేలు గట్టిగా చెబుతున్నాయి.

కేంద్రంలో రాహుల్‌, రాష్ట్రంలో జగన్‌ యువనాయకత్వాలను మనం చూడబోతున్నామా?ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి… నెత్తురుమండే శక్తులు నిండే సైనికులారా రారండి అన్న శ్రీశ్రీ పిలుపు నిజమై, వృద్ధ నాయకులతో విసిగిన ప్రజలకి వీళ్ళు కొత్త ఉత్తేజాన్ని ఇవ్వగలరేమో…

(Source: TSI,సెప్టెంబర్ 22, 2011)

వార్తా విభాగం

ఇవీ చదవండి

4 Comments

  • chaalaa bagaa nijalanu rasharu congress samarpinchu ane artical my best wishes to u

  • గుజరాత్ ముఖ్యమంత్రి రౌడీనా? తెలిసే మాట్లాడుతున్నారా? లేదా అందరూ అంటున్నారు కదా అని మాట్లాడుతున్నారా? మీరెప్పుడన్నా కొంతకాలం గుజరాత్ లో గోద్రా సంఘటన ముందు లేదా తరువాత ఇక్కడ ఉన్నారా? ఒక బ్లోఅవుట్ ని ఆర్పేయాలంటే ఒక డైనమైట్ ని పేల్చాలి. మోడి ఒక డైనమైట్. అందుకే ఇప్పుడు హిందువులూ, ముస్లిములూ ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు. హిందువుల ఓట్లతోనే గెలుస్తున్నాడు మోడీ అనుకుంటున్నారా? http://nuvvusetty.wordpress.com/2007/12/25/ee-vijayam-himduvuladaa/

  • ఎవరేమనుకున్నా జగన్ గట్స్ ఉన్న వ్యక్తి. పార్లమెంట్ లో ప్లేకార్డ్ లాక్కుని సమైఖ్యాంధ్రని సపోర్ట్ చేశాడు. కొండతో ఢీకొన్నాడు. అంత పెద్ద సోనియాని ఎదిరించే సత్తా తెలుగోళ్ళలో ఎవరికైనా ఉందా? అక్రమమో సక్రమమో . లోతుగా ఎంక్వయిరీ చేస్తే మన అందరిదీ ఎంతో కొంత అవినీతి బయటపడక తప్పదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏకమై ఒక వ్యక్తిని టార్గెట్ చేయటం, అతనికి రాజకీయ అండ లేకపోవటం అతని దురదృష్టం. ఇదే ఎంక్వయిరీ ysr ఉండి ఉంటే జరిగి ఉండేదా? సోనియా సిగ్గుపడాలి. మీరు వ్రాసిన వ్యాసం అద్భుతంగా ఉంది.

  • peru vooru thappani sari ani undi na comments neutral ga unna oka vargam gurinchi cheppanu ani project chesthaaru so peru govindayya vooru maa vooru. comments nenu cheppanu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *