డి ఎల్ రవీంద్రా రెడ్డి
ప్రభుత్వ పథకాలు పొందాలంటే వాళ్ళ కాళ్లు పట్టుకోవాలా? :డిఎల్
పచ్చచొక్కాలకే పక్కా ఇళ్ళా?
చంద్రబాబును గెలిపించడం ప్రజల ఖర్మ
మైదుకూరు: అర్హులు ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని.. ఈ పరిస్థితి చూస్తుంటే కర్మపట్టి ప్రజలు చంద్రబాబును గెలిపించారనిపిస్తోందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఖాజీపేటలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం జన్మభూమి మాఊరు గ్రామసభకు డీఎల్ హాజరయ్యారు. అధికారులు వేదికపైకి ఆహ్వానించినా.. ఆయన ప్రజల మధ్య కూర్చొని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీల వల్ల పథకాల అమలులో అర్హులకు అన్యాయం జరుగుతోందని, ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. జన్మభూమి కమిటీల పెత్తనం వల్ల పచ్చచొక్కాలు తొడుక్కున్న వారికి మాత్రమే పక్కాగృహాలు మంజూరు చేస్తున్నారన్నారు. బడ్జెట్‌లో నిధులే కేటాయించనప్పుడు కొత్త ఇళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జన్మభూమి మాఊరు మంచి కార్యక్రమమే అయినా అధికారులు ప్రజా సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో తెలియడం లేదన్నారు. గ్రామసభ ఎక్కడ నిర్వహించాలో కూడా తెలియని స్థితిలో అధికారులున్నారని అసహనం ప్రదర్శించారు.
ఉన్నత పాఠశాలల్లో సభలు నిర్వహించడం వల్ల యూనిట్ పరీక్షలు రాస్తున్న పదో తరగతి విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని విమర్శించారు. గత జన్మభూమిలో వచ్చిన వినతుల్లో ఎన్నింటిని పరిష్కరించారో చెప్పాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు వల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి అధికార పార్టీ వారి పంటనష్టం వివరాలు మాత్రమే నమోదుచేసి మిగతా రైతులకు అన్యాయం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.