వర్గం: భిక్షకుల పాట
అనువైన రాగం : సావేరి స్వరాలు (ఏక తాళం )
ఉత్తరాది ఉయ్యాలవాడలో
ఉన్నది ధర్మం సూడరయా
నేటికి బుడ్డా యంగలరెడ్డి
ధర్మ పెబువని పాడరయా
దానపరుడూ యంగళరెడ్డి
ధర్మదేవత బిడ్డడయా
పచ్చి కర్వులో పాసెమూ పోసేను
బెమ్మదేవుడే ఆయనయా ||ఉత్తరాది||
యెచ్చుగానూ పుణ్యాత్ముడు రెడ్దని
యంగళరెడ్డిని ఎంచరయా
యంగళరెడ్డి దానపరుడని
శానామంది పొగిడిరయా ||ఉత్తరాది||
గుడ్డోల్లకు కుంటోళ్లకు
గురుతుగా బండ్లే సేయించేనయా
దొడ్డా బుద్ది కలిగిన పెద్ద
దొరకు దండామని తెలిపిరయా ||ఉత్తరాది||
సాదులకు సన్నాసులకంతా
సంతర్పణలు సేసేనయా
లేదనకుండా బీదలకిచ్చే
దానకర్ణుడని పొగిడిరయా ||ఉత్తరాది||
యంగళరెడ్డి ధర్మకీర్తులు
డిల్లీ కోటకు పాకేనయా
అచ్చిరికి పోయిన రానెమ్మా
డిల్లీకి పిలిపించెనయా ||ఉత్తరాది||
రాణమ్మ తన పక్కన తకుతులో
రెడ్డినీ కూసునబెట్టేనయా
రంగుగాను బంగారూ పతకము
సందితికి అమరించెనయా
యంగళరెడ్డి సాటీ యవరని
ఎక్కడని అందరూ పొగిడిరయా ||ఉత్తరాది||