
21వ శతాబ్ది తెలుగు సాహిత్యం.. తీరుతెన్నులు
యోగివేమన విశ్వవిద్యాలయంలో ’21వ శతాబ్ది తెలుగు సాహిత్యం.. తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు రెండో రోజు సి.వి.రామన్ విజ్ఞాన భవన్‌లో కొనసాగింది.
ఈ సదస్సులో తెలుగుశాఖ సమన్వయకర్త ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ సంప్రదాయాలను, విలువలను జీవన మార్గాలనే మార్చివేసేంతగా సాహిత్యం ప్రభావం చూపిందన్నారు. రైతులు నేత కార్మికులు ఇతర వృత్తి కారులు జీవన విద్వంసానికి గురయ్యారన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికరంగం మనిషిని మనిషిగా బతకనీయకుండా చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. పేదలు- ధనికులకు మధ్య పెరుగుతున్న అంతరం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిదన్నారు.
సహాయ ఆచార్యులు వినోదిని మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాల నేపథ్యాన్ని సాహిత్యపరంగా విశ్లేషించారు. దళిత బహుజనులు మైనార్టీల పట్ల అణచివేత, దోపిడి వేర్వేరు రూపాల్లో ఇంకా కొనసాగుతోందన్నారు.
కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు శ్రీదేవి, హైదరాబాద్ పాలిటెక్నిక్ కళాశాల గ్రంథాలయ అధికారి కె.పి.అశోక్‌కుమార్, చిలకలూరిపేటకు చెందిన విశ్రాంత ఆచార్యుడు పి.వి.సుబ్బారావు వారివారి ప్రసంగాల్లో నవల, విమర్శ, కవిత్వం, కథ సాహిత్య ప్రక్రియల్లో ఈ శతాబ్దం తీసుకొచ్చిన భావపరిణామాలను వివరించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగుశాఖ లక్ష్మణచక్రవర్తి ప్రాంతీయ, ప్రాపంచీకరణవాద విమర్శ, బుక్కపట్నం ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడు షమీవుల్లా మహిళ మైనార్టీ వాద విమర్శపై, కె.నాగేశ్వరాచారి అభ్యుదయ, విప్లవవాద విమర్శపై పరిశోధనా పత్రాలు సమర్పించారు.
లలితకళల శాఖ సహాయాచార్యుడు డాక్టరు మూలమల్లికార్జునరెడ్డి ఈ దశాబ్దంలో నాటకాలపై విశ్లేషించారు. సదస్సు నిర్వాహకురాలు పాళెం రమాదేవి మాట్లాడారు. సాహితీ సదస్సులో ఆచార్య రాచపాళెంచంద్రశేఖర్‌రెడ్డి, సహ ఆచార్యులు డాక్టరు తప్పెట రామప్రసాద్‌రెడ్డి, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.