కడప జిల్లాకు చెందిన పద్మ విభూషణ్ ఢాక్టర్ యాగా వేణు గోపాల్ రెడ్డి 14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది అక్టోబరు 31కల్లా నివేదిక అందజేయాల్సిందిగా ఆర్థిక సంఘాన్ని కోరినట్లు ఆర్థిక మంత్రి చిదంబరం బుధవారం చెప్పారు.
ఆర్థిక సంఘంలో సభ్యులుగా ప్రొఫెసర్ అభిజిత్ సేన్ (ప్రణాళికా సంఘం సభ్యుడు), సుష్మా నాథ్ (మాజీ కేంద్ర ఫైనాన్స్ కార్యదర్శి సభ్యులు), డాక్టర్ ఎం గోవిందరావు (డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ), సుదీప్తో ముండ్లే (మాజీ యాక్టింగ్ ఛైర్మన్, జాతీయ గణాంకాల కమిషన్ సభ్యులు) నియమితులయ్యారు. కమిషన్ కార్యదర్శిగా అజరు నారాయణ్ ఝా వ్యవహరిస్తారు.
ప్రతి ఐదేళ్ళకోసారి ఏర్పాటయ్యే ఈ కమిషన్ రాష్ట్రాలకు, ఇతర స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లకు సంబంధించిన సూత్రాలను, నిబంధనలను రూపొందిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి ఐదేళ్ళ కాలానికి ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ఆర్‌బిఐ గవర్నర్‌గా చేయడానికి ముందు వైవి రెడ్డి అంతర్జాతీయ ద్రవ్యనిధి బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వున్నారు. 13వ ఆర్థిక సంఘానికి మాజీ ఫైనాన్స్ కార్యదర్శి విజరు కేల్కర్ నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే.
కడప జిల్లా రాజంపేట సమీపంలోని పుల్లంపేట మండలం కొమ్మనవారి పల్లెలో 1941 ఆగస్ట్ 17 వ తేదీన జన్మించిన వేణుగోపాల్ రెడ్డి మద్రాసు యూనివర్సిటి నుంచి ఎం.ఏ. ఎకనామిక్స్, ఉస్మానియా యూనివర్సిటి నుంచి పిహెచ్ డి పట్టాలను పొందారు.
1964 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. రిజర్వు బ్యాకు గవర్నర్ గా 6 సెప్టంబరు 2003 నుంచి 5 సెప్టంబరు 2008 వరకు పనిచేశారు