మే 8న కడప, పులివెందుల ఉప ఎన్నికలు
ఏప్రిల్ 11న నోటిఫికేషన్.. మే 8న పోలింగ్.. మే 13న కౌంటింగ్
జిల్లాలో అమల్లోకి ఎన్నికల నియమావళి
కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానాల ఉప ఎన్నికల షెడ్యూలు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా మొత్తం నాలుగు రాష్ట్రాల్లోని ఐదు స్థానాలకు (రెండు లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాలకు) ఉప ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఈ షెడ్యూలు ప్రకారం కడప, పులివెందుల స్థానాల్లో మే 8వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ పోలయ్యే ఓట్లను ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లతోపాటే మే 13న లెక్కిస్తారు. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు.
కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలతోపాటు.. ఉత్తరప్రదేశ్‌లోని పిప్రయిచ్, నాగాలాండ్‌లోని ఆంగ్‌లెండెన్ అసెంబ్లీ స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ (ఎస్‌టీ) లోక్‌సభ స్థానానికి పోలింగ్ ఒకే రోజు జరుగుతుందని.. ఈ ఐదు నియోజకవర్గాల్లోనూ మే 15వ తేదీకల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాల్సివుంటుందని ఈసీ షెడ్యూలులో తెలిపింది. ఉప ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) ఉపయోగించనున్నామని, ఇందుకు తగ్గట్లుగా ఈవీఎంలను సిద్ధం చేశామని ఈసీ పేర్కొంది.
ఉప ఎన్నికలను ప్రకటించిన ఈ స్థానాలన్నింటిలోనూ, అలాగే ఈ స్థానాలు మొత్తంగా లేదా పాక్షికంగా ఉన్న జిల్లాలన్నింటా ఎన్నికల నిబంధనావళి వెంటనే అమల్లోకి వచ్చింది. ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నిబంధనావళి వర్తిస్తుందని ఈసీ స్పష్టంచేసింది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను ఇప్పటికే ప్రకటించినట్లు కూడా ఈసీ తెలిపింది.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి పులివెందుల శాసనసభ స్థానానికి, వారి కుమారుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కడప లోక్‌సభ స్థానానికి గత నవంబర్‌లో రాజీనామా చేయటంతో ఆ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం తమ కుటుంబాన్ని చీల్చేందుకు కుట్ర పన్నినందుకు నిరసనగా.. వారిద్దరూ ఆ పార్టీని వీడుతూ ఆ రెండు స్థానాలకూ రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు స్థానాలకూ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.