
కోస్తా వారు చేస్తున్న మరో మోసమే ‘పట్టిసీమ’
కృష్ణా నీటిని పునః పంపిణీ చేయాల
రాజధాని పారిశ్రామిక కారిడార్ కోసమే పట్టిసీమ
ఓవైపు సీమ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం.. మరో వైపు సీమ కోసమే పట్టిసీమ అనడం కుట్ర
పట్టిసీమ ఉత్తర్వులో సీమకు నీరిస్తామన్న అంశాన్ని ఎందుకు పొందుపరచలేదో చెప్పాల
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
కడప: రాజధాని ప్రాంతం చుట్టూ ఏర్పాటయ్యే పారిశ్రామిక కారిడార్‌కు నీరందించడం కోసం రాయలసీమ పేరు చెప్పి కోస్తా వారు చేస్తున్న మరో మోసమే పట్టిసీమ అని ఏపీ రైతుసంఘం (ఏఐకేఎస్)జిల్లా శాఖ ఆధ్వర్యంలో ‘పట్టిసీమ నిర్మాణం-రాయలసీమ ప్రాజెక్టులపై ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు విమర్శించినారు.
ఆదివారం వైఎస్సార్ పాత్రికేయ సమావేశమందిరంలో జరిగిన ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ… అరకొర నిధుల కేటాయింపులతో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పట్ల వివక్ష చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం, సీమకు నీరివ్వడానికే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నామని చెప్పడం పచ్చి మోసమని ధ్వజమెత్తారు. మరో విభజన ఉద్యమానికి బీజం పడితే అందుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ 2015-16 వార్షిక బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ. 5258 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఇందులో పట్టిసీమకు రూ.1030 కోట్లు కేటాయించగా, రాయలసీమ ప్రాజెక్టులైన గాలేరు-నగరికి రూ. 169 కోట్లు, హంద్రీ-నీవాకు రూ. 212 కోట్లు, వెలిగొండకు రూ. 153 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారన్నారు. ఇలాంటి నామమాత్రపు కేటాయింపులతో 50 ఏళ్లైనా సీమ ప్రాజెక్టులు పూర్తి కావన్నారు. పోలవరం నిర్మాణం వల్ల కూడా రాయలసీమకు పెద్దగా ఉపయోగం లేదన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా నీటిని పునః పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఇంజనీర్లు, మేధావులు, సాగునీటి ప్రాజెక్టులపై తీసిన వీడియోలతో సహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు హాజరవగా సమావేశం నిర్వహిస్తామని, తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలు హాజరై ఏ విధంగా పట్టిసీమతో రాయలసీమకు నీళ్లు తెస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి మాట్లాడుతూ…పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదని పట్టిసీమ పేరుతో కోస్తా వారు చేస్తున్నది మరో మోసమని ఆరోపించారు. రాజధాని చుట్టూ ఏర్పాటయ్యే పారిశ్రామిక కారిడార్ కోసమే పట్టిసీమ చేపడుతున్నారు తప్ప ‘సీమ’ ప్రాజెక్టుల కోసం కాసదన్నారు. కృష్ణా నీటిని పునః పంపిణీ చేస్తే ‘సీమ’కు 120 టీఎంసీలు కేటాయించేందుకు వీలుంటుందని, కావాల్సిందల్లా ప్రభుత్వానికి చిత్తశుద్ధేనన్నారు.
మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ పట్టిసీమకు వ్యతిరేకంగా అఖిలపక్షంతో కలిసి తాము కూడా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రక్కన పెట్టి బాబు పట్టిసీమను పట్టుకుని వేలాడటం తగదన్నారు. పట్టిసీమ టెండర్లను 21 శాతం ఎక్సెస్‌తో కట్టబెట్టి ముఖ్యమంత్రి ముడుపులు స్వీకరించారని ఆరోపించారు. పట్టిసీమ జీఓలో రాయలసీమకు నీరిస్తామన్న అంశాన్ని ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైఎస్‌దేనన్నారు. గండికోట రిజర్వాయర్ నిర్మాణ పనులు కూడా ఆయన హయాంలో 70 శాతం జరిగాయన్నారు. ప్రస్తుతం మొదటి దశ కింద నీరివ్వడానికి రూ. 1400 కోట్లు అవసరం కాగా, కేవలం రూ. 169 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. పెండింగ్ పనుల పూర్తికి డబ్బులు ఇవ్వకుండా జూన్ నాటికి గండికోట ద్వారా ఎలా నీరిస్తారో చంద్రబాబు చెప్పాలన్నారు.
ఎమ్మెల్యే అంజాద్‌బాషా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి సీమ పట్ల సవతితల్లి ప్రేమ కనబరుస్తున్నారని చెప్పారు. ‘సీమ’కు నీరిస్తామని జీఓలో కూడా ఎక్కడా పొందుపరచలేదన్నారు. పోలవరం కుడికాలువ పనులు 35 కిలోమీటర్లు ఇంకా అసంపూర్తిగా ఉన్నప్పటికీ పట్టించుకోని చంద్రబాబు ఆ కాలువ ద్వారా పట్టిసీమ నీటిని లిఫ్ట్ చేస్తామని చెప్పడం ప్రజలను మోసగించడమేనన్నారు.
వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి మాట్లాడుతూ… పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఓవైపు సీమ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న చంద్రబాబు సీమకు నీరందించడం కోసమే పట్టిసీమను చేపడుతున్నామని చెప్పడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రాయలసీమ నీటిని కోల్పోయి శాశ్వత ఎడారిగా మారిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. సీమకు పట్టిసీమవల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. పట్టిసీమ కాదు ఒట్టిసీమ మాత్రమేనని అధికార పార్టీకి లాభం చేకూర్చడం తప్ప దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి జి.చంద్ర, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు కేసీ బాదుల్లా, కార్మిక నాయకుడు సీఆర్‌వీ ప్రసాద్‌రావు, సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా పైన (పసుపు) పచ్చని విషం
Wednesday, July 24, 2019