అన్నమాచార్యుని గురించి ఆయన మనవడు రాసిన సంకీర్తన
అన్నమాచార్యుని గురించి ఆయన మనవడు తాళ్లపాక చినతిరుమలాచార్య రాసిన సంకీర్తన ఇది …
రాగం-సాళంగనాఁట
ప : అప్పనివరప్రసాది అన్నమయ్యా
అప్పసము మాకె కలఁ డన్నమయ్యా
చ : అంతటికి నేలికైన ఆదినారాయణుఁ దన
యంతరంగాన నిలిపీ నన్నమయ్యా
సంతసానఁ జెలువొందె సనకసనందనాదు
లంతటివాఁడు తాళ్ళపా కన్నమయ్యా

చ : బిరుదుటెక్కెములుగా బెక్కు సంకీర్తనములు
హరిమీఁద విన్నవించె నన్నమయ్యా
విరివిగలిగినట్టి వేదముల యర్థ మెల్లా
అరసి తెలిపినాఁడు అన్నమయ్యా
చ : అందమైన రామానుజాచార్యమతమున
అందుకొని నిలిచినాఁ డన్నమయ్యా
విందువలె మాకును శ్రీవేంకటనాథుని నిచ్చె
అందరిలోఁ దాళ్ళపాక అన్నమయ్యా