సీమ బొగ్గులు (కథ) – దేవిరెడ్డి వెంకటరెడ్డి

దేవిరెడ్డి వెంకటరెడ్డి రాసిన ‘సీమ బొగ్గులు’ కథ

రోడ్డు మొగదాలున్న చేన్లోకి దిగీ దిగకముందే అశోకుడి పయి జలదరించింది. తిన్నగ అడుగులేస్తూ ఎప్పటిలాగా వేరుసెనగ పైరు వైపు తేరిపార చూశాడు. పచ్చదనం పావలాభాగం లేదు. ఎండకు మాడిన ఆకులు. అక్కడక్కడ అవి రాలిపోగా మిగిలిన ఒట్టి పుల్లలు. మూడో చోట మరోచెట్టు పెరికి మట్టి విదల్చాక కళ్ళు చెమ్మగిల్లాయి. చెట్టుకు రెండు తప్పితే మూడుకాయలు. అందులో ఒకటీ అరా లొట్టలు. ఐదెక రాల ఖర్చూ, గుత్తా వెరసి పన్నెండు వేల అప్పు అతని గుండెల్లో పిడిబాకులా దిగబడింది.

వూడలు దిగి పిందెలు పడినప్పుడు ఆకాశం నంగనాచిలా చిరుజల్లులు చిలకరించింది. అప్పుడే పొలం మీద నీళ్ళు పారింటే ఇప్పటికీ పంటలు కళకళలాడేవి. పంచభూతాలకు, పండించే రైతుకు శత్రుత్వమేమిటి? అనుకుంటూ జమ్మిచెట్టు నీడలో టవలు పరచుకుని కూర్చున్నాడు.

“ఒరే అశోకుడూ! జమ్మిచెట్టు చేను మాత్రం అమ్మాకు. తుంగభద్ర నీళ్ళొచ్చాయా అది నీ పాలిట కల్పతరువు అవుతుందిరా” చచ్చేనాడు తండ్రి అన్నమాటలు అశోకుని చెవుల్లో గింగురుమన్నాయి. తను పుట్టకముందు నెహ్రూ శిలాఫలకం వేసిపోయాడు. నాలుగు దశాబ్దాలు పైబడినా తుంగభద్ర జలాల పారకం లేదు. డజనుకు మించి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మారారు. అయినా రాయలసీమకు మహా ఒరిగిందేమిటి? వాళ్ళకుకావాల్సింది ఓట్లు, పదవి, సంపాదన. నీళ్ళుగాదు. ప్రకృతిరీత్యా అదునుకు వానలొచ్చేది అరుదైపోయింది. సముద్రం పాలవుతున్న నీళ్ళను రైతుల వైపు తిప్పే నవీన నిస్వార్ధ భగీరథుడు రాజకీయాల్లోకి ఎప్పుడొస్తాడో మరి? ఆ లోపల జలయుద్దాలు జరగకపోవు. నా వెర్రిగాక పోతే కరువు మీద కరువు లొస్తున్న ఈ సీమలో భూములు నిలబెట్టుకోవడం సాధ్యమా? తల విదుల్బుకుని లేచాడు అశోకుడు. ఎవరో ప్యాంటు మనిషి చేన్లోంచి చెనక్కాయ చెట్లు పెరుక్కుని పోతున్నాడు. రోడ్డుమీద ఆగిన జీపు అతడు కూర్చున్నాక కదిలింది.

“ఎన్ని కాయలున్నాయి అశోకా?” కింది బజారు పెద్దాయన పసులాస్పత్రి కాడ ఎదురుపడ్డాడు. భూతద్దాల కళ్ళజోడులోంచి అతని చూపు చెట్ల దాకా వచ్చింది.

“ఉడ్డాకు లోపే” అశోకుడి పెదాలు బలవంతాన విడివడి మళ్ళీ అతుక్కుపోయాయి. కొంపలో పడే దాకా బండ చెవుడు దొందుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది.

“జమ్మిచెట్టు చేలో రెండూ మూడా? ఏమి కాలమొచ్చె నాయనా” పెద్దాయన చేతికర్ర ముందుకు సాగింది. సకాలంలో వానలు కురిస్తే ఎకరాకు పదారు పదేడు మూటలయ్యే నాలుగు చేన్లలో జమ్మిచెట్టు చేనొకటి. అట్లాంటిది ప్రకృతి పెట్టే పరీక్షలో ఆరేడళ్ళుగా అట్లర్‌ ఫెయిలవుతోంది. గంగమ్మ గుడి మలుపు తిరిగి ముందుకు అడుగేయడానికి అశోకుడికి సిగ్గయింది. చిన చిన్న సందుల్ని కలుపుకుంటూ గ్రామపంచాయితీ ఆఫిసు దాటి రెండు పాయలుగా చీలే పొడవైన బజారది. కొత్తగా వచ్చిన కోడళ్ళు తప్ప అంతా చిన్నాన్నా, పెదనాన్నా, మామా, అన్నా అనేంత పరిచితులు. బంధువులున్నారు. సావాసగాళ్ళున్నారు. రైతుతత్వంతో ఏవేవో అడుగుతారు. వాటీలో ఏదో మాట ఎదలో గుచ్చుకోవచ్చు. ఇట్లా పంట పండితే పిల్లదాని పెళ్ళేం చేస్తావన్నా పడాల్సిందే. చాటుగా ఇల్లు చేరే సొరంగమూ లేదు. పీర్ల’సావిడి వెనక్కి జారుకుంది. సర్పంచి మేడ కంటికింపైన రంగుతో మెరిసిపోతోంది. తొమ్మిది పది బారల్లో రాముల దేవళం. వేపచెట్టు కింద పులిజూదం చుట్టూ ఏడెనిమిది మందున్నారు.

“రేపు చెనక్కాయ కట్టె పెరుకుతున్నారా అశోకన్నా? కట్టె పెరకటానికొస్తాం గాని కాయల కోతకు రాలేమబ్బా అంటున్నారు కూలోళ్ళు. ఎవరిగోడు వాళ్ళది” పొరుగింటి కోదండ కొడుకు గొంతు. వాగుడుకాయ. వీధి వీధీ తిరిగి విషయాలు సేకరించి ముందు తనే ప్రసారం చేయాలని ఉబలాటం మెండు. అశోకుడు తలాడించి ఆగాడు. కొందరి చూపులు చెట్లమీద వాలి అందరి కాపూ ఈ ఏడుపే అన్నట్లు అర నిముషంలో మళ్ళుకున్నాయి.

సీమ బొగ్గులు కథ

“శాంపిల్సు కోసం పంటల బీమా వాళ్ళెవరైనావచ్చారా మిత్రమా?” అశోకుడి చిన్ననాటి స్నేహితుడు వీరశేఖర అడిగాడు. సుఖానికి సుఖమూ, ఆదాయానికి ఆదాయమూ వుంటుందని ఇటీవల రాజకీయాల్లోకి దిగాడు. అశోకుడికి జీపును చూసింది. గుర్తుకొచ్చింది. ఇంతలో అటువైపుగా వచ్చిన కట్టుబడి అక్కడి సంగతి చెప్పాడు. సెకండ్లలో అరుగు మీది మొగాల్లో సంబరం పుట్టుకొచ్చింది.

చదవండి :  కసాయి కరువు (కథ) - చక్రవేణు

“ఎనభై శాతం రావచ్చా శేఖర మామా?” ప్రశ్న వేశాడు కోదండ కొడుకు ఈ వార్తను ఇంకో వీధికి మోసుకు పోవడానికి.

పులుల్ని జరుపుతున్న ఒకటవ వార్డు మెంబరు ఐదుశాతం పెంచాడు.

“తొంభయ్‌కి పైమాటే” ధీమాగా అన్నాడు వీరశేఖర.

“గత ఏడాదీ మీ రాజకీయం చలువే” రాళ్ళ మేకలొడ్డుతున్న నడిపాయం రైతు కృతజ్ఞత వెలిబుచ్చాడు. అశోకుడి తలకాయ చిమ చిమ మంది.

పెద్ద పెద్ద అంగలేశాడు. వూరబావిని, పంచాయితీ ఆఫీసును దాటేసి దిక్కులు చూడకుండా గడప తొక్కాడు.

“అన్ని చెట్లకూ ఇదే కాపుంటుందా? దిగులు పడకు బావా” కందనంపైన పడేసిన చెట్లను చూసి గొంతుకూర్చున్న భర్తకు కాస్త ధైర్యం పోసింది ప్రభావతి. అన్నమూ మెతుకూ సామెత తెలీక కాదు… ఎక్కడో చిరు ఆశ. తెల్లారి అంబలి పొద్దుకు ఆమె గొల్లుమంది. చేలో ఏ వరుస కట్టెలోనూ నిన్న చూసిన కాయల కంటే అదనంగా ఒక్కటీ లేదు. చెనక్కాయ కట్టె కల్లంలోపడింది గాని కాయల కోత సమస్య అందరనుకున్నంతగా రాలేదు. సంచికి ముప్పయ్ రూపాయలు. రోజంతా కోసినా సంచి నిండదు. పెద్దోళ్ళకు కూలి గిట్టుబాటు కాదు. వేరే పనులు లేవు గనుక రాక చస్తారా? మరుసటి వారంలో కాయల తూకాలు జరిగాయి. కల్లంలోంచి ఎనిమిది మూటలతో ట్రాక్టరు దౌడు తీసింది. పది రూపాయల నోట్ల కట్టలు ఐదు చేతిలో పడ్డాయి. ఇరుక్కుంతలో దూరి పోతున్న వ్యాపారి చూపు ఈటలా పొడుచుకుంది.

“యిదేం వ్యవసాయం బావా? ఎకరాకు ఒకటిన్నర మూట కాయలా? ఏటికేడు చూద్దాం చూద్దాం అనుకోవడం లోనే అన్నీ పూడ్చుకు పోతున్నాయి. ఇట్లయితే మనకు ఎండ్రిన్ డబ్బానే గతి” ముంచుకొస్తున్న దుఃఖంతో ప్రభావతి చరచరా ఇంటికొచ్చింది. అశోకుడికి వున్న ఫలంగా పక్షవాత వాయువు కొట్టినట్లయింది. కాళ్ళీడ్చుకుంటూ వచ్చి నులక మంచంలో పడ్డాడు. జేబులోని డబ్బు పుండులా సలుపుతోంది. ఇంటి అవసరాలు పొట్టు జొల్లకున్నాయి. తిండి గింజలు కావాలి. ఈ బట్టలేసుకుని కాలేజీకి వెళ్ళాలంటే మరీ నామోషీగావుందని ఇంటర్‌ చదివే కొడుకోపక్క సతాయిస్తున్నాడు. చినుకులు రాలితే శనిగ ధనాలు అదింత అదింతన్నా వేయాలి. చివర రోశిరెడ్డిది యమగండం. పంటరాబడి ఎంత చేతికొచ్చిందన్నది అతని కనవసరం. వడ్డీ మొదలు కట్టాలి. బతిమాలితే గుత్త తోసెయ్యచ్చు. ఏమైనా వేస్తే శనిగ, ధనాలే గడ్డనేయాలి.

“సంగటి చల్లారిపోతుంది లే నాన్నా” పెళ్ళీడుకొచ్చిన కూతురు ఒకటికి రెండు సార్లు భుజం తట్టింది. మోచేతులు పోటొడ్డుకుని లేచాడు అశోకుడు. ఎద్దుల్ని గాటిపాట కట్టేసి కాళ్ళూ మొగం కడుకుని తట్ట ముందుకొచ్చాడు.

ఈ డబ్బును ఏం చేస్తాం ప్రభావతీ?”పచ్చిమెరప కాయల వూరిమిండిని అద్దుకుని సంగటి వుంట గొంతులోకి దిగింది.

“వాడికి మూడు జతల బట్టలు, ఎద్దులకింత మేత, అత్తయ్యకు రెండు చీరలు తీసుకోండే. మిగిలింది శనిగ, ధనాలకుంటుంది. ఓ చిన్నమూట బియ్యం అంగట్లో అప్పు తెచ్చుకుందాం” మజ్జిగ పోసుకుని సౌమ్యంగా అంది ప్రభావతి. రైతు చేతిలో ఏదీ లేదని ఇరవై సంవత్సరాల జీవితానుభవం చెప్తోంది. ఇక నోరు పారేసుకుని సాధించేదేముందని.

అశోకుడిది సుమారు వందేళ్ళ వ్యవసాయ చరిత్రగల కుటుంబం. అబ్బ మిగిల్చిన పాతికెకరాల పొలంలో సగం అప్పచెప్పాడు తండ్రి. అతడు పగ్గాలు చేపట్టేనాటికి బావుల కాలం పోయి బోర్ల కాలం వచ్చింది. అప్పుచేసి ఒక బోరువేసి ఒకట్నిర ఇంచి నీళ్ళతో పోరాడినన్నాళ్ళు పోరాడాడు. రాను రాను నీటిమట్టం తగ్గిపోతోంది. రెండో ప్రయత్నం విరమించుకున్నాడు. ఏ సాహసాలూ, ప్రయోగాలూ చేయకపోయినా భూమి హారతి కర్పూరమయింది. పద్ధతి ప్రకారం పంటరాబడిలోపెట్టుబడిని తీసెయ్యాలి. అట్లగాక పెట్టుబడిలో పంటరాబడిని తరచూ తీసేస్తుంటే అప్పులు కమ్మంటే కావా? అశోకుడికి సేద్యం ఒక పిచ్చి. దానికి వారసత్వం చోదక శక్తి పైగా చేతనైనదీ, నచ్చినదీ. కానీ ఫలితం ఎప్పుడూ నష్టమే. మూగోడు అమ్మా అన్నట్లు ఎప్పుడో అంతో యింతో లాభం. క్రమేపి నేరమనస్తత్వం సన్నని పొరలా తయారవుతోంది. భార్య దాడి చేయనందుకు, అనుకున్న వారంలో వానపడినందుకు అశోకుడిలో ఆశ కదిలింది.

చదవండి :  అడవి (కథ) - సొదుం జయరాం

“మూడెకరాలు శనిగ, రెండు ధనాలేద్దాం బావా. మన అదృష్టం బాగుండి అవి రెండూ అంటుకున్నాయా రోశిరెడ్డి అప్పు తీరి నగదులోకొస్తాం” భార్య ప్రేరణ అశోకుడికి వెన్నెలలా చల్లగ తాకింది. శనిగల రేటు నూరు కేజీల మూట రెండు వేలుంది. ధనాల రేటు తొమ్మిదొందలు. హీనమంటే పన్నెండు మూటల శనిగలు, ఏడెనిమిది మూటల ధనాలు కావా? అప్పటికి రేటు కొంత తగ్గినా మిగులు బాటుంటుందనే ఉత్సాహంతో భుమి పని ముగించాడు.

“ఎక్కడా తెరపలు లేకుండా విత్తనం పడింది మిత్రమా. జమ్మిచెట్టు చేనుకు తన సత్తా చూపే సమయమొచ్చింది”‘ మూడో వారంలో హీరోహోండా నాపి వీరశేఖర మెచ్చుకున్నాడు. దినాలు పెరిగే కొద్దీ చూసిన వాళ్ళంతా శనిగలు ఇరవై మూటలవుతాయని అంచనా కడుతున్నారు. అశోకుడు ఉబ్బిపోలేదు . తన పాటికి తాను వారం వారం మందులు కొడుతున్నాడు. అమ్మకు, భార్యకు చెరోపూట కావిలి తప్పింది కాదు.

“నిన్నటికీ ఈ పూటకీ వాతావరణంలో ఇంత మార్పొచ్చిందేమిటి బావా? రేడియో వాన గురించేమైనా చెప్పిందా?” కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ ఆందోళన పడింది ప్రభావతి. నింగిని, భూమిని మార్చి మార్చి చూస్తోంది.

“వాయుగుండాలు, అల్పపీడనాలు మనల్ని పరీక్షించడానికి పుట్టినా పుట్టచ్చు చెప్పలేం” ధనాల మందు కలుపుతూ అన్నాడు అశోకుడు. పది రోజుల పాటు ఏ ఉపద్రవం రాకుంటే గట్టెక్కినట్లే అనుకుంటూ తల పైకెత్తి కలయ చూశాక అతని గుండె దిగజారింది. కనుచూపుమేర ఆకాశం నల్లకప్పు వేసుకుంటోంది. మందుకొట్టే పని పూర్తి కావడం ఆలస్యం సూర్యుని జాడే లేదు. వరసగా రెండున్నర రోజులు మబ్బులు ముసురుకున్నాయి. దానికి తోడు చినుకుల పొటుకు. పులుపు, పూత నేలపాలు. అశోకుడికి కాలూ చేయీ నరికినట్లయింది. ఏదోపూట చేనికాడికి పోయే ప్రభావతికి గర్భశోకమే నయమనిపించింది.పైరు పక్వానికొచ్చాక కూళ్ళుపెట్టడం దండగనుకున్నారు. ఐదుగురు మునాలు పట్టి పెరికారు శనిగ, ధనాలు. తయారయింది మొదలు రేట్లు పదీ ఇరవై వంతున తగ్గుముఖం పడుతున్నాయి. నిండా మునిగాక చలేముందనే ధైర్యం అశోకుని అంతరంగంలో కాసింత లేకపోలేదు. ఎండాకాలం దాటాక రేటు యధాస్థితికి రాగా అమ్మేశాడు. ధనాలు ఒకరకంగా పండబట్టి ఖర్చులు పోను వచ్చిన లాభం బండిసున్నా.

“రోశిరెడ్డి కాడికా అశోకన్నా?” వాగుడు కాయ గొంతే అని పంచాయితీ ఆఫీసు ముందాగాడు అశోకుడు. నడి దోవలో నలుగురైదుగురు జిల్లా పేపరు చూస్తున్నారు. అందరి ముఖాల్లో సంతోషం బుడగలు లేస్తోంది. ‘రైతుబాంధవుడు ముఖ్యమంత్రి” అను శీర్షిక తాటికాయంత అక్షరాలతో అతని కంటపడింది. పంటల బీమా మంజూరయినట్లుంది.
వూరబావి కాడ మాసిన అడ్డపంచలు, లుంగీలు పేపరు చుట్టూ రెపరెపలాడుతున్నాయి. తూర్పు, పడమటి వీధుల్లో సైతం జనం గుంపులు గుంపులుగా అగుపడుతున్నారు. ఇది కోదండ కొడుకు నిర్వాకం తప్ప వేరు కాదు. ఏదేని విశేషం దొరికిందా వూరంతా నెరుపుతాడు. దండోరా అక్కర్లేదు. ఇదికదూ వాడికి వర్తించని ఆనందం.

“ఈ ప్రజాస్వామ్యంలో. దున్నేవాడిది భూమి కాదన్నా. పంటల బీమా దృష్టిలో అసలు సిసలు రైతువు నువు కాదన్నా. నకిలీ పాసు బుక్కు తెచ్చుకుంటే నిన్నేం గల్లుకేస్తారా అశోకన్నా?” సేద్యం పట్ల తనకెటూ ఆసక్తి లేదని తేలిసిన సలహా యిచ్చాడు కోదండ కొడుకు.

“మీ నాయన, మా నాయన కాలం నుంచి పంటల రుణాలు, బీమాలు సక్రమంగా అమలు చేసుంటే భూమి లేని రైతు ఒక్కడుండడురా. నోటిని కాస్త అదుపులో పెట్టుకో” అంటూ కాళ్ళు కదల్చాడు అశోకుడు. రోశిరెడ్డి ఇంట్లోంచి బయట పడ్డాక కోదండ కొడుకు మీద కోప్పడ్డం న్యాయం కాదనిపించింది. ఉద్దేశ్యపూర్వకంగా ఎవరికీ హాని చేయని మనిషి. వాడి “అభిమానం అమాయకత్వం గాకపోతే భూమికి సంబంధించిన దొంగ పాసు బుక్కు తేరకు వస్తుందా? లంచమిచ్చి గుట్టుగా తెచ్చుకున్నా అదెన్నాళ్ళు నిలుస్తుంది? ఒంతుకు పాసు బుక్కుంటే సరి. క్రాఫ్‌లోనిస్తూ ఇన్సూరెన్సు డబ్బు పట్టుకుంటారు. అప్పుడు పంటల బీమా వర్తిస్తుంది. అది ఇచ్చేదీ లేనిదీ అమాత్యులకెరుక. అయినా వ్యక్తిగత కక్షలు, రాజకీయ కక్షలు లేని వూరుందా? సరిపోనివాళ్ళు ఎమ్మార్వోకు, కలెక్టరుకు పిటీషన్లు పెడతారు. ఆ పని రోశిరెడ్డి చేయడని నమ్మకమేమిటి?

చదవండి :  కడుపాత్రం (కథ) - తవ్వా ఓబుల్‌రెడ్డి

టెన్‌బి అడంగళ్‌కు చెదలు పట్టిందా? అది నోరు విప్పిందా బుక్కు భండారం అట్టే తెలిసిపోతుంది. అవమానానికి తోడు నానాక తిప్పలు. డబ్బు గుంజిన రెవెన్యూ వాళ్ళెవ్వరూ పట్టుబడరు. ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేశారంటారు. చిక్కేది మాత్రం బక్కరైతులే. ఇంతకీ పాసుబుక్కుల్లో వున్నంత భూమి టెన్‌బి అడంగళ్‌లో లేదన్నది జగమెరిగిన సత్యం.

“బాండుకు చెల్లు వేసి. వస్తున్నావా మిత్రమా? కూర్చో. ఎంతిచ్చావు ?” కుడిపంచ అరుగుమీద కూర్చున్న వీరశేఖర పలకరిం చాడు.

“కాదు. శనిగ ధనాల పెట్టుబడియిచ్చి వస్తున్నా. పోయినేడు ఆరువేలు, ఈ ఏడు ఎనిమిది వేలు వాతబడింది”

మర్యాద కోసం అశోకుడు ఎడమ పంచ అరుగుకానుకున్నాడు. తిష్ట వేయాలనిపించ లేదు.

“గుత్త ఇచ్చుకోలేనని అడగలేదా?” సానుభూతి ప్రకటించి కింగు సైజు సిగరెట్టు అంటించుకున్నాడు వీరశేఖర.

“అక్కడేం? భూమి మళ్లీ చేస్తివా గుత్తపూర్తితోసేస్తా. అట్ల కాదంటావా రూపాయదే ఖీలు గుత్తకట్టు. ఏటా ఇదీ ఆయన షరతు” మక్కీకి మక్కీ చెప్పాడు అశోకుడు.

“ఈ మధ్య కరువొస్తే చాలు రోశిరెడ్డే కాదు, చాలామంది ఆ తిరకాసు పెడుతున్నారు. నువు చేస్తున్న భూమికి ఎకరాకు ఆరు వేల వంతున లోను యిచ్చారు. ఇప్పుడు పంటల బీమా కింద తొంభయ్‌ ఐదు శాతం చెల్లు చేసుకుంటారు. సగానికి సగం మందికి తాము భూమి సాగు చేయకున్నా లాభం వస్తోంది. మునిగుత్త లేకపోవడానికి ఇదీ ఓ కారణమనుకుంటా” వీరశేఖర చెప్పింది రోశిరెడ్డిమీద అసూయతో కాదని అశోకుడు గుర్తిం చకపోలేదు. ఆమాటకొస్తే ఎన్నో విషయాల్లో ఇద్దరూ ఒకటే. వీరశేఖరకు చుట్టుపక్కల వూర్లతో పరిచయం వుంది. సమయానికి తిరిగి చెల్లించలేని రైతుల ,పంట రుణాలను వడ్డీ మొదలు బ్యాంకుకు కట్టేసి మూడో వారంలో తిరిగి క్రాఫ్‌ లోన్లు యిప్పించడం, పదివేలకు రెండొందలు చొప్పున తన రుసుం వసూలు చేసుకోవడం అతని పైపై వ్యాపారాల్లో అదొకటి. అందుకు పెట్లుబడి దారుడు రోశిరెడ్డి. పంటల బీమా కోసం తీవ్రప్రయత్నం చేస్తారు. స్వామి కార్యం స్వకార్యమన్నట్లు.

“పాలకులు, ఇన్సూరెన్సు అధికారులు కబోదులు వీరశేఖరా. కౌలులాంటి చట్టాలు మాత్రం కాగితాల్లో వుంటాయి. ఇక మా లాంటి వాళ్ళు బొగ్గులు గాక రత్నాలవుతామా?” అశోకుడి కాళ్ళు యింటిదారిపట్టాయి. మనసు వికలమైంది. పెద్దాయన కొడుకు, వాగుడు కాయ చిన్నాన్న, కట్టుబడి తమ్ముడు, వీరశేఖర అన్న వగైరా తనలాగా నిస్సహాయులై కళ్ళముందు మెదిలారు. ఈ గడ్డలో పుట్టడమే నేరమా? దిక్కు తెలియని పలు ఆలోచనలతో గూడు చేరాడు.

“రోశిరెడ్డి ఏమన్నాడు?” హీన స్వరంతో అడిగింది ప్రభావతి. బయట జరుగుతున్న సందడి సంబరాలకు ఈర్ష్యపడలేదు. ఏటేటా ఎద్దుల కష్టం, ఇంటిల్లిపాది రెక్కల కష్టం మట్టిపాలవుతోందని తీరని దిగులు ఆమె గుండెలకు కోత పెడుతోంది.

“పాత పాటే పాడుతున్నాడు” అశోకుడు చొక్కా గుంజకు తగిలించాడు.

“ఏ వనరూ లేనప్పుడు వ్యవసాయం ఎందుకు చేయాల బావా? బంగారు పండించుకుంటాడో, బలిసాకు పండించుకుంటాడో మనకనవసరం. ఎద్దులు, బండి అమ్మేసి ఆయన బాకీ తెంచెయ్‌” ఇందాకా కుమిలి కుమిలి అలసిపోయిన ప్రభావతి మొగం చాటేసుకుని లేచింది. అశోకుడి వెన్నెముక నిలువునా చీలింది. నోరు పడిపోయింది. మూర్చ వచ్చినంత పనయి మంచంలో ఒరిగాడు.తననూ, ఎద్దుల బండినీ వేరు చేస్తున్న దృశ్యం అతని కళ్ళల్లోంచి ఎగబాకుతోంది. ఈ పాపం నేల తల్లిదా? ప్రభావతిదా? కాదు కాదు అని గొణుక్కున్నాడు.

(నవ్య 5-7-2006)

ఇదీ చదవండి!

సీమ బొగ్గులు

సీమ బొగ్గులు (ముందు మాట) – వరలక్ష్మి

ఈ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ వచ్చి తన కథల పుస్తకం గురించి చెప్పి దీన్ని విరసమే ప్రచురించాలని, నేనే ముందుమాట …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: