
రాయలసీమకు తరతరాలుగా అన్యాయం: బి.వి.రాఘవులు
-
వారిద్దరూ సీమ ద్రోహులే
-
బంగరు భూములకు సాగునీరూ లేదు
-
కడప జిల్లా అభివృద్దిపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది
-
పర్యాటక రంగంలోనూ జిల్లాపైనవివక్ష
-
ప్రభుత్వ తీరుపై ఉద్యమించాలి
కడప: రాయలసీమకు తరతరాలుగా అన్యాయం జరుగుతోందని, ఈ ప్రాంతం నాయకులు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ ముఖ్యమంత్రి పదవులను వెలగపెడుతున్నారే కానీ ఇక్కడి అభివృద్ధిని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ హాలులో సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ రాష్ట్రవిభజన-కడపజిల్లా సమగ్రాభివృద్ధి’ అంశంపై సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బి.వి.రాఘవులు మాట్లాడుతూ… నేను మారిన మనిషినని ప్రజలను మభ్యపెట్టి నవ్వాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు పాతనడకే నడుస్తూ కొత్త శంఖంలో పాత తీర్థాన్నే పోస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా వంతపాడుతూ ఇరువురూ కలిసి కుర్చీలాట ఆడుతూ రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డా రు.
సీమలోని కొందరు నాయకులు, వారికి అనుకూలమైన పెట్టుబడిదారులు ఇక్కడి ఖనిజ సంపదను తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటూ అన్ని రంగాలను శాసిస్తున్నారన్నారని, ఈ కారణంగా పంతాలకు ఆజ్యం పోస్తున్నారన్నారు. వీరి ఆటలను కట్టిపెట్టేలా ఖనిజ సంపదను జాతీయపరం చేయాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి వ్యవసాయ అనుబంధ రంగాలను అభి వృద్ధి చేయాలన్నారు. మైనార్టీ, పేద, బడుగు, బలహీన వర్గాలలో తలసరి ఆదాయం పెరగాలని, ఇందుకు వీరు విద్య, ఆరోగ్యం, వ్యవసాయ దిగుబడులతో పాటు ఇతర రంగాలలో వందశాతం అభివృద్ధి సాధించినప్పుడే సాధ్యపడుతుందన్నారు.
కడప జిల్లాలో 47 శాత నల్లరేగడి భూములు, 24 శాతం ఎర్రరేగడి భూములు ఉన్నాయని వీటిలో బంగారం లాంటి పంటలను పండించవచ్చని కానీ సాగునీటి సౌకర్యం లేకపోవడం వలన ప్రయోజనాన్ని అందించలేకపోతున్నాయన్నారు. రాజధానిపై చూపే శ్రద్ధ రాయలసీమ అభివృద్ధిపై చూపితే మంచిదని ఆయన హితవు పలికారు.
రాజధాని నిర్మాణానికి కమిటీ వేసినట్లే రాయలసీమ వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు మంత్రివర్గంతో కూడిన కమిటీని వేయాలని, ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ నవ్వాధ్రప్రదేశ్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఓట్లు, సీట్లు ప్రాతిపదికన కడప జిల్లా అభివృద్ధి విషయంలో తీరని అన్యాయం చేస్తూ రాజకీయ వివక్షను కొనసాగిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రజాప్రయోజనాలను పక్కన బెట్టి రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. ఇటీవల అసెంబ్లీలో కడప జిల్లాకు ప్రస్తావించిన అంశాల రూపకల్పనకు అవసరమైన నిధులను కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని ఆయన సూచించారు.
ఇరిగేషన్ రిటైర్డ్ ఎస్‌ఈ రామసుబ్బరాజు మాట్లాడుతూ ఆధ్యాత్మిక, పర్యాటక రంగ అభివృద్ధిలో జిల్లాకు స్థానం కల్పించకపోవడం ఇంతకన్నా వివక్ష మరొకటి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కడప జిల్లా నిలయమన్నారు. పుష్పగిరి దక్షణ కాశీగా ప్రసిద్ది గాంచిందన్న విషయం పాలకులు గుర్తించకపోవడం దారుణమన్నారు. నలంద విశ్వవిద్యాలయం లాగానే ఇక్కడ కూడా పుష్పగిరి విశ్వవిద్యాలయం ఉండేదని ఇక్కడ ఆష్టదిగ్గజ కవులలో ముగు ్గరు శిష్యరికం చేసినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయన్నారు. ఇలాంటి పుష్పగిరిని ఆధ్యా త్మిక, పర్యాటకరంగంగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.జిల్లాలోని నదులను అనుసంధానం చేసి, గాలేరు-నగర, సుజల-స్రవంతి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని ఆయన సూచించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి బి.నారాయణ మాట్లాడుతూ విభజన బిల్లులో జిల్లాకు పొందుపరిచిన అం శాల అమలుతో పాటు, ఇటీవల అసెంబ్లీలో జిల్లాకు ప్రభుత్వం ప్రకటించిన స్టీల్‌ప్లాంట్, సీమెంట్, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, స్మార్ట్‌సిటీ, కడప ఎయిర్‌పోర్ట్ ప్రారంభం, ఫుడ్ పార్క్, ఉర్దూ యూనివర్శిటీ, సోలార్-విండ్‌పవర్, గార్మెంట్స్ క్లష్టర్ ఏర్పాటు తదితర వాటి అమలుకు, నిధుల కేటాయింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామమోహన్ సదస్సుకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ మూసివేసిన పరిశ్రమలను పునఃప్రారంభించడంతో పాటు, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సు (సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు), ఐటీ కారిడార్ సాధన కోసం ప్రజలు ఉద్య మించాలని ఆయన పిలుపునిచ్చారు. యోగివేమన యూనివర్శిటీని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్చాలని, వ్యవసాయ పరిశోధనా సంస్థలను ఏర్పాటుచేయాలని, పుల్లరిన్ పరిశోధన కేంద్రం ఏర్పాటుతో పాటు కడప-బెంగళూరు, ఎర్రగుంట్ల-నంద్యాల, ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైలుమార్గాల సత్వర పూర్తికి ప్రభుత్వాలపై ఉద్యమించాలన్నారు.
వామపక్ష పార్టీలు రాయలసీమకు జరిగిన అన్యాయం గురించి సభలు, సమావేశాలలో ప్రస్తావిస్తారు కాని శ్రీభాగ్ ఒప్పందం అమలు కోసం పోరాడుతున్న ఇతర సంఘాలతో కలిసి ఉద్యమించరు కదా!