సాహితీలోకానికి ఘన కీర్తి పద్మశ్రీ పుట్టపర్తి

‘ఏమానందము భూమీతలమున

 శివతాండవమట.. శివలాస్యంబట!

వచ్చిరొయేమో వియచ్ఛరకాంతలు

జలదాంగనలై విలోకించుటకు ఓహోహోహో..

 ఊహాతీతము ఈయానందము ఇలాతలంబున..!’

 సరస్వతీపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రొద్దుటూరు అగస్తేశ్వరస్వామి ఆలయంలో 18 రోజుల్లో రాసిన ‘శివతాండవంలోనివి ఈ పంక్తులు’. సంగీతం, సాహిత్యం మిళితమై నాట్యానికనుగుణంగా ఉన్న ఈ రచన ఆయనకు అనంత కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టింది.

దాదాపు 130కి పైగా రచనలు చేసిన ఆయన 14 భాషల్లో మహా పండితుడు. సాహితీలోకంలో మన జిల్లాకు అనితర సాధ్యమైన ఖ్యాతిని ఆర్జించి పెట్టిన సాహితీమేరువు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం చియ్యేరు అగ్రహారంలో శ్రీనివాసాచార్యులు, లక్షుమ్మ అనే పుణ్యదంపతులకు 1914వ సంవత్సరం మార్చి 28న జన్మించిన పుట్టపర్తి నారాయణాచార్యులు మన జిల్లాలో స్థిరపడ్డారు. కొన్నేళ్లపాటు ప్రొద్దుటూరు హైస్కూల్లో, ఆ తర్వాత కడపలోని రామకృష్ణ హైస్కూల్లో తెలుగు పండితునిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం ఇక్కడే ఉండిపోయారు. కడప గడప నుంచే తన ఖ్యాతిని నలుదిశలా విస్తరింప చేశారు.

చదవండి :  యంగముని వ్యవసాయం (కథ) - ఎన్. రామచంద్ర

1990 సెప్టెంబర్ 1వ తేదీ కడపలోనే పరమపదించారు. జ్యోతిష్యం, మంత్రశాస్త్రం, సంగీత, నాట్య శాస్త్రాల్లో అసాధారణ ప్రజ్ఞ గల ఆయన సాహిత్యానికే అధిక ప్రాధాన్యతనిచ్చారు. షాజీ, పండరీ భాగవతం, మేఘదూతం, జనప్రియ రామాయణం, శ్రీనివాస ప్రబంధం, మహాభారత విమర్శనం వంటి గ్రంథాలు రచించారు. వీటన్నింటిలోకి ఆయనకు అత్యంత పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది శివతాండవం. ప్రొద్దుటూరులోని శివాలయంలో రోజూ 108 ప్రదక్షిణలు చేస్తూ పరమశివుడిని అంతర్గతంగా దర్శిస్తూ శివతాండవం రచించిన ఆయన అభినవ పోతన, వాగ్గేయకారత్న, ప్రాకృత కవితా సరస్వతి, మహాకవి, పద్మశ్రీ, కవిసార్వభౌమ, ఆంధ్రరత్న వంటి ఎన్నో బిరుదులతోపాటు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ బిరుదు పొందినప్పటికీ సరస్వతీ పుత్రులుగానే ఖ్యాతి పొందారు.

సకల సంస్కృతులను ఆకళింపు చేసుకుని, సంగీత సాహిత్య నృత్య కళల్లో ప్రావీణ్యం సంపాదించి శతాధిక గ్రంథకర్త అయిన ఆయన పలు భాషల్లో అనువాదాలు చేశారు. తెలుగు, మలయాళం నిఘంటువును తయారు చేశారు. కవిగా, పండితునిగా, సాహిత్య విమర్శకునిగా, మహావక్తగా బహుభాషా కోవిదునిగా, చారిత్రక పరిశోధకునిగా, సాహిత్య సంగీత, నాట్యకళలలో నిష్ణాతునిగా విఖ్యాతులైన సరస్వతీ పుత్రుడు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వంటి మహాకవులు నూరేళ్లకుగానీ ఒకరు జన్మించరనేది అక్షర సత్యం. అలాంటి ఆయన కాంస్య విగ్రహాన్ని 2007లో ప్రొద్దుటూరులో(వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విరాళంతో) ఏర్పాటు చేశారు. కడప నగరంలో మాత్రం ఆయన విగ్రహం లేదు.

చదవండి :  కూలిన బురుజు (కథ) - కేతు విశ్వనాధరెడ్డి

తన రచనే పాఠ్యాంశంగా..

 పుట్టపర్తి 12 సంవత్సరాల వయసులోనే చారిత్రక ప్రదేశంగా ప్రఖ్యాతిగాంచిన పెనుగొండ క్షేత్రంపై ‘పెనుగొండ లక్ష్మి’ అనే కావ్యాన్ని రచించారు. అదే రచన ఆయన విద్వాన్ చదువుతున్న సమయంలో ఆయనకే పాఠ్యాంశంగా వచ్చింది.

హిమాలయాల్లో ‘సరస్వతీపుత్ర’

 పుట్టపర్తి యువకునిగా ఉన్న సమయంలో సంసార జీవితంపై విసిగి, దేహం చాలించాలని హిమాలయాలకు వెళ్లారు. అయితే అక్కడ స్వామి శివానంద సరస్వతి ఆయనను తన ఆశ్రమానికి తీసుకెళ్లారు. కొన్నాళ్లపాటు దేశవ్యాప్తంగా ఉన్న తన శిష్యులను రప్పించి పుట్టపర్తి సాహితీ గరిమను పరీక్షించి ‘సరస్వతీపుత్ర’ బిరుదును ప్రదానం చేశారు. మీ ప్రాంతానికి వెళ్లి సాహితీసేవ చేయాలని సూచించారు. దీంతో ఆయన తిరిగి ఇక్కడికి వచ్చేశారు.

చదవండి :  ఎంజె సుబ్బరామిరెడ్డి - మహా మొండిమనిషి

డీఎస్పీకి హితబోధ

 ఓసారి ఒక డీఎస్పీ పుట్టపర్తిని కలిసి తన రచనలను పరిశీలిస్తే పుస్తకంగా వేసుకుంటానని కోరారు. అప్పడు ఆయన జ్వరంతో ఉండటం గమనించిన డీఎస్పీ కుడిచేతిని గాల్లో ఊపి కుంకుమ సృష్టించి, ఇది ధరిస్తే త్వరలో జ్వరం తగ్గుతుందని చెప్పారు. పుట్టపర్తి కూడా తన చేతులను గాల్లో ఊపి రెండు చేతుల్లోనూ విభూది సృష్టించారు. ఇలాంటి ట్రిక్కులు రోడ్డుపై పొట్టకూటి కోసం చేసే గారడీవాళ్లు చేయాలిగానీ మనకెందుకురా, ఈ తెలివిని సాహిత్యంపై చూపించు అని డీఎస్పీకి హితబోధ చేశారు.

దక్కని జ్ఞానపీఠం

 పుట్టపర్తికి పద్మశ్రీ లభించినా ప్రాంతీయ, రాజకీయాల కారణంగా జ్ఞానపీఠ పురస్కారం మాత్రం దక్కలేదు. ఆ పురస్కారం పొందిన డాక్టర్ సి.నారాయణరెడ్డి ఈ పురస్కారం పుట్టపర్తికి లభించి ఉంటే బాగుండేదని స్వయంగా పేర్కొన్నారు.

(Sakhi – 03/28/2012)

ఇదీ చదవండి!

పుట్టపర్తి తొలిపలుకు

పుట్టపర్తి నారాయణాచార్యుల ఇంటర్వ్యూ

ఆనందనామ సంవత్సరం చైత్ర శుధ్ధ విదియ అంటే మార్చి 28,1914 న పుట్టిన కీ.శే పుట్టపర్తి నారాయణాచార్యుల వారికిది శతజయంతి …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: