డిసిసిబి పీఠం కోల్పోనున్న తిరుపాలరెడ్డి
దువ్వూరు: దువ్వూరులో సహకార సంఘంలో ఏడుగురు డైరెక్టర్లు రాజీనామా చేయడంతో అక్కడి నుంచి ఎన్నికైన డిసిసిబి చైర్మన్ తిరుపాలరెడ్డి అధ్యక్ష పదవిని కోల్పోయారు. ఫలితంగా డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ పదవి కూడా కోల్పోనున్నారు. ఇప్పటికే దీనిపై ప్రొద్దుటూరు డివిజనల్ సహకార అధికారి నుంచి, జిల్లా సహకార అధికారికి కాపీలు అందినట్లు ఈనాడు దినపత్రిక తన కథనంలో పేర్కొంది.
దువ్వూరు సహకార సంఘం బుధవారం పాలకవర్గ సమావేశం నిర్వహించగా, అక్కడ 11 మంది వైకాపా డైరెక్టర్లు ఆయనకు మద్దతుగా సంతకాలు పెట్టారు. 24 గంటలు గడవక ముందే వీరిలో ఆరుగురు డైరెక్టర్లు తెదేపా నేతల వ్యూహానికి అనుగుణంగా తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారితోపాటు అక్కడి ఏకైక తెదేపా డైరెక్టర్ కూడా రాజీనామా చేసి ఆ పత్రాలను ప్రొద్దుటూరు డివిజనల్ సహకార అధికారి రమేశ్ ఇవ్వగా ఆయన నిబంధనల ప్రకారం వాటిని ఆమోదించారు.
మరోవైపు పదవులకు రాజీనామాలు చేసిన దువ్వూరు సొసైటీ డైరెక్టర్లను తెదేపా నేతలు రహస్య ప్రదేశానికి తరలించారు. డిసిసిబి పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నించిన తెదేపా అది సాధ్యపడకపోవడంతో ఏకంగా దువ్వూరు సహకార సంఘాన్ని కూలదోసి చైర్మన్ ను పదవీచ్యుతుడిని చేశారన్న మాట. ఇక ఇంకొంత మంది వైకాపా డైరెక్టర్లను ఆకర్షిస్తేనే తెదేపాకు డిసిసిబి పీఠం దక్కుతుంది.
2013, ఫిబ్రవరిలో ప్రస్తుత డీసీసీబీ పాలకవర్గం ఏర్పడగా వీరిలో 8 మంది వైకాపా డైరెక్టర్లు, ఆరుగురు తెదేపా డైరెక్టర్లు ఎన్నికల ద్వారా గెలిచినవారు ఉన్నారు. డీసీసీ బ్యాంకు పాలకవర్గంలో 21 మంది డైరెక్టర్లు ఉంటారు. వీరిలో 14 స్థానాలకు డైరెక్టర్లుగా ఆయా సొసైటీల నుంచి గెలిచిన అధ్యక్షులను ఎన్నుకుంటారు. మిగిలిన ఏడు స్థానాలకు రిజర్వేషన్లు ఆధారంగా కోఆప్షన్ చేసుకుంటారు. మిగిలిన కోఆప్షన్‌కు చెందిన ఏడు డైరెక్టర్ స్థానాల్లో ఆరింటిని వైకాపా తమ వారిని నియమించుకుంది. ఒక ఎస్టీ స్థానాన్ని మొదటి నుంచి కోఆప్షన్ చేసుకోలేదు. గత ఏడాది చివర్లో కోఆప్షన్ ద్వారా నియమించిన బీసీ కోటాలోని ఓ డైరెక్టర్ ఆకస్మికంగా మృతి చెందారు.
అయినా డిసిసిబి చైర్మన్ గా ఉన్న తిరుపేలరెడ్డి సొంత మండలంలో పట్టు సడలుతుంటే గమనించలేకపోయారా?