
విమానం ఎగ’రాలేదే’?
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతి రాజుతో, ఏఏఐ అధికారులతో మే 19న డిల్లీలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వారంలో కడప విమానాశ్రయంలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని, అనంతరం ఒక వారంలో కడప నుంచి విమానాలు నడుస్తాయని పత్రికలకు చెప్పారు.
కడప విమానాశ్రయాన్ని ఏప్రిల్ 30న పరిశీలించిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దక్షిణ ప్రాంత రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నరసింహమూర్తి మే 10 నుంచి 15వ తేదీలోపు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతారని తెలిపారు.
అజయ్ జైన్ చెప్పిన వారమూ, నరసింహ మూర్తి చెప్పిన మే 15 రెండూ పూర్తయినాయి. అయినా కడప విమానాశ్రయంలో ఇంత వరకూ ట్రయల్ రన్ కోసం కూడా విమానం ఎగ’రాలేదు’. ఆలస్యానికి కారణాలేమిటి అనే దానిపై యధాలాపంగా ఎవరూ (అధికారులూ, ప్రభుత్వమూ, అధికారపక్ష నాయకులూ) నోరు మెదపటం లేదు.

ప్రతీసారి విమానాశ్రయానికి సంబంధించి అదిగో…ఇదిగో అంటూ వార్తలు రాసే పత్రికలూ ట్రయల్ రన్ ఇంకా ఎందుకు జరగలేదు అనే దానిపై కధనాలు ఇచ్చినట్లు కనిపించలేదు. చూస్తుంటే కడప నుండి విమానాశ్రయం గురించి వార్తలు రాసిన పాత్రికేయ మిత్రులు కూడా వీళ్ళు చెబుతున్న తేదీలను నమ్మలేక పోతున్నట్లుంది. ప్రతీసారి వీళ్ళు తేదీలతో సహా వార్త రాయడం.. తీరా ఆ తేదీ వచ్చే సరికి అంతా గప్ చుప్. పాపం విసుగు చెందినట్లున్నారు.

చిన్న పాటి ప్రారంభోత్సవాలకే హంగామా చేసే మన అధికారపక్ష నాయకులు కూడా ఈ దఫా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇదంతా గమనిస్తే మొత్తానికి కడప విమానాశ్రయం విషయంలో ఏదో జరుగుతోందని అనుమానం కలుగుతోంది. ఇంతకీ 2015లో కడప విమానాశ్రయం ప్రజలకు అందుబాటులోకి వస్తుందా? ఏమో.. వస్తుందేమో! ఎవరికి తెలుసు? అదంతా … ‘వారి దయా! మన ప్రాప్తమూనూ!!’ అన్నట్లు తయారైంది.