
వదిమాను సేనుకాడ : జానపదగీతం
అత్త కూతురుతో మనువు కుదిరింది మల్లన్నకు. ఆ చనువుతో మల్లన్న మరదలిని తనతో కోతకు రమ్మని పిలిచినాడు. పెళ్లి కాకుండా ఇద్దరం కలిసి తిరిగితే నిన్నూ, నన్నూ ఛీ కొడతారంది మరదలు. అందుకతడు నేను ధర్మం తప్పేవాన్ని కాదు అన్నాడు. ఎన్నో ఆశలు చూపినాడు. ఏది ఏమైనా పెళ్ళైన పెళ్లి తర్వాతనే నీ చేనంతా కోస్తానంటుంది. సున్నితమైన బావా మరదళ్ల సరసాలు ఈ పాటలో చూడండి.
వర్గం: కోతల పాటలు
పాడటానికి అనువైన రాగం: మాయామాళవ గౌళ స్వరాలు (ఏక తాళం)
అతడు :
వదిమాను సేనుకాడ
సద్ద యిరగ పండినాది
కోతకు నీవు వచ్చావా
అత్తకూతురా నాగమ్మా
ఆమె :
కన్నెపిల్లను గానా
కన్నోల్లు పంపుదురా
కోత కెల్లా వచ్చాను
మామ కొడకా మల్లు బావా
అతడు :
దబ్బపండు సాయదాన
దర్మూడే మీ బావ
కన్నోల్లు ఒప్పిరిగా
బూతల్లి సాచ్చీగా
ఆమె :
కొత్తకోక కట్టుకోని
కొప్పున పూలు పెట్టుకోని
కోత కొచ్చే ఏమిచ్చావ్
సెన్నేపల్లి సిన్నబ్బీ
అతడు :
మనువుకు మానెడుతో
మానిక రాసులు కొలిసిచ్చ
పొద్దుగూకె జాముకాడ
ముద్దులన్ని నీకిచ్చ
ఆమె :
సందమామ నా మగము
పిడికెడుండు నా నడుము
అందమంత సూసి బమసి
బోలు మాట లాడకురా
అతడు :
బోలు మాటలు కావు
కాలు మోపిన సాలు
పైనంతా బంగారం
పంటంతా సింగారం
ఆమె :
నిడుపాటి కురులోడ
నాకు ఈడైన వోడ
తేనెలు నీ మాటల్లు
మనసు నీపై మల్లు
అతడు :
మల్లుకున్న మారుదాల
మా సూలు వడపాల
మాగం దాటిపోవాల
మనువు నీతో కుదురాల
ఆమె :
మడులు మాన్యాలొద్దు
మానికరాసులు వద్దు
మనువిచ్చే పంటంతా
మాటలోనె కోసెచ్చా
పాటను సేకరించినవారు: కలిమిశెట్టి మునెయ్య