ఆ రోజుల్లో రారా..

ఒక రోజు చండ ప్రచండంగా వెలిగిన రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి) ఈ రోజు మన మధ్యలేరు. ఆయన సహచరుడైన నాకు ఆయన జ్ఞాపకాలు (రారా జ్ఞాపకాలు) మిగిలాయి. కడపోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకాన్ని మననం చేసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో, నా జ్ఞాపకాల్ని పాఠకుల ముందుంచుతున్నాను.

కడప జిల్లాకు సంబంధించి ఆధునిక కథానిక ప్రక్రియలు గాని, విమర్శనా ప్రక్రియను గాని, ఉటంకించదలచుకుంటే రారా పేరు అనివార్యం. నిజానికి ఆయన పేరు కడప జిల్లాకు మాత్రమే పరిమితం కాదు మొత్తం ఆంధ్రదేశ సాహిత్య చరిత్రలో ఎన్నదగిన వారిలో రారా అగ్రగణ్యులు.

రాచమల్లు రామచంద్రారెడ్డితో నాకు పరిచయం నేను చాలా చిన్నతనంలో వుండగా జరిగింది. నేను ప్రభుత్వ కళాశాలలో బి.ఎ. చదువుతున్న రోజుల్లోది ఆ పరిచయం. నేనప్పటికే ఏవో కవితలు రాస్తుండేవాడిని. రారాగారు మా అన్న గోవిందరెడ్డి గారికి చాలా సన్నిహిత మిత్రుడు. మా అన్నగారే నన్ను ఆయనకు పరిచయం చేశారు. రారాగారు ఆ రోజుల్లో కొన్ని అమెరికన్ పుస్తకాలను విద్యోదయ పబ్లికేషన్ వారికి, అనువాదం చేసిచ్చినట్లు జ్ఞాపకం. ఆయన అప్పటికే ఒకటి రెండు కథానికలు కూడా రాసి వున్నారు. అవి అభ్యుదయ ఉపాధ్యాయ పత్రికలో అచ్చయ్యాయి. నా కవితలు నేను ఆయనకు చూపించినప్పుడు చాలా అసంతృప్తి వ్యక్తం చేశాడు. నీలాంటి వారు కవితలు రాయదలచుకుంటే మాత్రాబద్ధంగా రాయడం మంచిదని సలహా ఇచ్చాడు. చిత్రమైన విషయం, ఏమిటంటే కవితకు మాత్రా బద్ధమైన ఛందస్సున్నదని తెలియదు. రారాగారు చెప్పిన తరువాత కష్టపడి మాత్రా ఛందస్సు ఏమిటో తెలుసుకున్నాను. తరువాత మాత్రా ఛందస్సులా వున్న నా కవితలు ఆయన అచ్చువేశారు. కాని వాటి పట్ల కూడా ఆయనకు సంతృప్తి కలగలేదు. ఉన్నట్టుండి ఒకరోజు జయరాం నీవు కథానికలు రాయడం మంచిదయ్యా అని సలహా ఇచ్చారు.

రారాతోనే మొదలైంది

రాచమల్లు రామచంద్రారెడ్డి
రాచమల్లు రామచంద్రారెడ్డి

నిజానికి కథానిక ప్రక్రియలో కడప జిల్లా చాలా వెనుకబడి వుంది. నాదమునిరాజుగారు అప్పటికి, కొన్ని కథలు రాశారు. అందుకే నాదమునిరాజు గారిని కడప జిల్లా కథకు ఆద్యుడు అని అంటున్నారు. కాని ఆయన కథానికకు సౌష్ఠవం తక్కువ. కథానికా లక్షణాలు పూర్తిగా తెలుసుకుని రాయడం రారాతోనే మొదలైంది. నేను రాసిన మొదటి కథ ‘ఆశ’. అది ఉపాధ్యాయ పత్రికలో రారా అచ్చువేశారు. ఉపాధ్యాయ పత్రికకు జయరామరాజు గారు సంపాదకుడైనా కవితలు, కథలు, రారా గారు చూసేవారు. నా కథ ‘ఆశ’ చదివి పర్వాలేదు జయరాం నీవు కథలు రాయగలవు, నీ కథ నీట్‌గా వుంది అన్నాడు. నిజానికి ఆ రోజుల్లో నీట్‌గా వుంది అన్న ఆయన కామెంట్‌కు నాకర్థం కాలేదు. కథానిక నీట్‌నెస్‌గా వుంది అని చెప్పడం గొప్ప ప్రశంస అని చాలా రోజులకు తెలుసుకున్నాను.

చదవండి :  ఆరవేటి శ్రీనివాసులు - కళాకారుడు

కథలో ఎక్కడా వ్యర్థ పదాలు లేకుండా ఉండటం అనవసరమైన పాత్రలు గాని, అనవసరమైన సంభాషణలు గాని, లేకపోవడాన్ని నీట్‌నెస్ అంటారు. అప్పుడే కథ సౌష్ఠవంగా వుంటుంది. అందుకే Technic is a sense of proportion – ఈ విషయాన్ని నేను రారా గారి దగ్గర నేర్చుకున్నాను.

మహామనిషి

క్షమించాలి! రారా విషయం వదిలి నా గొడవలో పడ్డాను. రారాగారు గొప్ప విమర్శకుడన్న విషయం ఆంధ్రదేశానికి తెలుసు. కాని ఆయన మహామనిషి అన్న విషయం చాలా మందికి తెలియదు. తన సాహితీ మిత్రులలోని బలహీనతల్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రేమించారు. మాస్కోలో అనువాదకుడుగా ఆయన గడించిన డబ్బులో అధిక భాగం కడపలోని హోచిమిన్ భవన్ నిర్మాణానికి విరాళంగా అందజేశాడు. నిజానికి మాస్కో నుంచి వచ్చాక ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.

కవుల్ని, కథకుల్ని తయారుచేసినాడు

విమర్శలో ఆయన క్రూరుడుగా కనిపించేవాడు గాని ఆయన సహచరుల దగ్గర చాలా సున్నితంగా ప్రవర్తించేవాడు. లోపాలను చాలా సున్నితంగా ఎత్తి చూపేవాడు. కడప జిల్లాలో కేతు విశ్వనాథరెడ్డి, సొదుం జయరాం, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, వై.సి.వి.రెడ్డి వంటి కథకుల్ని తయారుచేశాడు. గజ్జెల మల్లారెడ్డిలాంటి కవుల్ని తయారు చేశాడు. ఆర్.వి.ఆర్ లాంటి విమర్శకుల్ని తయారుచేశాడు. నిజానికి కవుల్ని, కథకుల్ని, ఎవరూ తయారు చేయలేరు. కథకైనా, కవిత్వానికైనా భావుకత్వం ప్రధానం. భావుకత్వమన్నది పుట్టుకతోనే రావాలి. కాని పరిసరాలు కూడా ప్రధానం. అందుకే రారా కవుల్ని, కథకుల్ని తయారు చేశాడంటున్నాను.

చదవండి :  ఎంచక్కని దొరసాని శాంతకుమారి

ఆయనకు నచ్చిన కథకులు రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు. కుటుంబరావుగారి పట్ల ఆయనకు అమితమైన గౌరవం వుండేది. అందుకే ఆయన ‘అలసిన గుండెలు‘కు కుటుంబరావుగారితో పీఠిక రాయించారు. ఆ పీఠికను చూచి ఆయన చాలా సంతోషించిన విషయం నాకిప్పటికీ తెలుసు. ఆంధ్రదేశంలోని ఇతర కథకుల పట్ల గురుత్వం ఉండేదికాదు.

నిర్మొహమాటి

సంవేదన‘ నడిపే రోజుల్లో నా కథలు, రెండు అందులో అచ్చువేశారు. ‘సంవేదన’లో అచ్చు కావడమనేది ఆ రోజుల్లో నాకు అమితానందం కలిగించింది. రారాగారు సంవేదన నడిపే రోజుల్లో కడప సాహితీరంగానికి స్వర్ణయుగం లాంటిదనిపిస్తుంది. ఆ రోజుల్లోనే గజ్జెల మల్లారెడ్డి ఆంధ్రదేశానికి కవిగా పరిచయమయ్యాడు. ఆర్.వి.ఆర్. విమర్శకుడిగా పరిచయమయ్యాడు. సొదుం జయరాం, కేతు విశ్వనాథరెడ్డి కథకులుగా పరిచయమయ్యారు. రామ్మోహన్‌లాంటి జర్నలిస్ట్‌లు పరిచయమయ్యారు. ఆయన తన అభిప్రాయాల విషయంలో చాలా నిర్మొహమాటంగా వ్యవహరించేవారు. తనవారు, పరవారు, అన్న బేధం ఆయనకు ఏ కోశాన వుండేదికాదు. నేను కథలు రాసినా విశ్వం కథలు రాసినా చాలా నిర్మోహమాటంగా లోపాలను ఎత్తిచూపేవారు. గజ్జెల మల్లారెడ్డి వంటివారు బాధపడిన సంఘటనలూ వున్నాయి. సంవేదనలో మల్లారెడ్డి గారి శంఖారావం మీద సమీక్ష చేస్తూ మాత్రాబద్ధ శంఖారావం అని ఆర్.వి.ఆర్.గారు సమీక్షిస్తే, రారాగారు దానిని సంవేదనలో వేసినందుకు మల్లారెడ్డిగారు బాధపడినట్లు నాకు జ్ఞాపకం.

నా ‘వాడిన మల్లెలు’ కథానిక సంపుటికి కుటుంబరావుగారితో ప్రస్తావన రాయించాను. కుటుంబరావుగారు రాసిన ప్రస్తావన రారా గారికి నచ్చలేదు. అందుకనే మళ్లీ ఆయన నా కథల మీద సంవేదనలో మధ్యతరగతికి షాక్ ట్రీట్‌మెంట్‌గా సమీక్షించుకున్నారు.

చదవండి :  హృదయమున్న విమర్శకుడు - రారా!

దురదృష్టకరమైన విషయం

ఆంధ్రదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, రారాగారిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉండేది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆయన సేవలను విశ్వవిద్యాలయాలు ఉపయోగించుకోలేకపోయాయి. రారాగారు కథకుడు, విమర్శకుడే కాదు మంచి జర్నలిస్ట్ కూడా. సంవేదన అలా వదిలితే, ఈనాడు వంటి పత్రికలో సంపాదకవర్గంలో వుండి పని చేశారని ఆ పత్రికలు కూడా ఆయన సేవలను సద్వినియోగం చేసుకోలేకపోయాయి.

సాహిత్య మీమాంస తప్ప…

రారా చాలా సంవత్సరాలు కడపలో కాపురమున్నాడు. ఆయన ఇంట్లోకాని, లేదు రామప్పనాయుడు ఇంట్లోగాని, సాహిత్య సమావేశాలు తరచూ జరుగుతూ వుండేవి. ఆ సమావేశాల్లోనే ఆయన మంచి పుస్తకాలను గురించి తన సహచరులకు చెప్పేవాడు. వాటిని చదివించేవాడు. ఆంగ్ల సాహిత్య పుస్తకాలను ఢిల్లీ నుంచి యం.పి. ఈశ్వరరెడ్డి గారి ద్వారా తెప్పించుకునేవారు. సాహిత్య సమావేశాల్లో సాహిత్య మీమాంస తప్ప వ్యక్తిగత దూషణలు దొర్లేవి కావు. ఆయనకు కాఫీ సిగరెట్ అలవాట్లు వుండేవి.

చిరకాలం నిలుస్తుంది

ఆంధ్రదేశ సాహితీ లోకాన్నే అతలాకుతలం చేసిన ఉత్తుగ తరంగం రారా. ఆయన ఇవాళ మన మధ్య లేకపోవచ్చు గాని సాహితీ విమర్శలో అది చిరకాలం నిలుస్తుందనేది నా విశ్వాసం. ఇలా చెప్పుకుంటూ పోతే రారా గురించి పేజీలకు పేజీలవుతుంది ఇంతటితో ఆపేద్దాం!

రచయిత గురించి

స్వర్గీయ సొదుం జయరాం గారు కడప జిల్లాలోని ఉరుటూరు గ్రామంలో జన్మించారు.కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందిన కథకుడాయన. కేతు విశ్వనాధరెడ్డి మాటల్లో చెప్పాలంటే “మధ్యతరగతి ఆలోచనల్ని భూమార్గం పట్టించిన కథకుడాయన”. ‘పాడె’, ‘వాడిన మల్లెలు’, ‘పుణ్యకాలం మించిపోయింది మొదలైనవి’ వీరి ప్రసిద్ధ కథలు.  వీరి కథల్లో అనవసరమైన సన్నివేశం గానీ, అనవసరమైన వాక్యం గానీ, అనవసరమైన మాటగానీ ఉండవని రచయితలు, విమర్శకులు, సాహితీపత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు. వీరు రాసిన కథలు చాలా మటుకు రెండు పేజీల్లోపలే ముగుస్తాయి.  2004లో వీరి కథలకు రాచకొండ రచనాపురస్కారం వచ్చింది. (సొదుం జయరాం కథలు: ప్రచురణ బండ్ల పబ్లికేషన్స్).

ఇదీ చదవండి!

జిల్లా కేంద్రంగా కడప

కొత్త జిల్లా కేంద్రంగా కడప వద్దు !

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు వస్తే కొన్ని నెలల క్రిందట పత్రికల్లో ఒక వార్త వచ్చింది – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: