ఆదివారం , 6 అక్టోబర్ 2024
మూఢనమ్మకాలు

పశుపక్షాదులను గురించిన మూఢనమ్మకాలు

ఇటీవలి కాలంలో హేతువాద సంస్థలు, మాధ్యమాల  ప్రచారం కారణంగా ప్రజలలో చాలా వరకు మూఢ నమ్మకాలను, ఆచారాలను సమర్ధించే పరిస్తితి తగ్గింది. కానీ ఒకప్పుడు ఈ విశ్వాసాలు అధిక సంఖ్యలో ఉండేవి. 19వ శతాబ్దం  (1800 – 1900)లో కడప జిల్లా ప్రజలలో పశుపక్షాదులకు సంబంధించి ఎలాంటి విశ్వాసాలు (మూఢనమ్మకాలు)ఉండేవో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇప్పటికీ వీటిలో కొన్ని అక్కడక్కడా కనిపించవచ్చు.

1875లో కడప జిల్లాకు సబ్ కలెక్టర్ గా వ్యవహరించిన జే.డి.గ్రిబుల్ అనే ఆయన వీటిని గ్రంధస్తం చేసినాడు. ఆసక్తికరంగా ఉన్న ఆ సమాచారం మీ కోసం…

తాబేలు చేలో బొక్క (బొరియ) పెడితే ఆ చేను ఆ సంవత్సరమంతా బీడుగా ఉంచాల్సిందే. ఎందుకంటే తాబేలు కనిపించిన చేలో ఆ సంవత్సరం పంటలు సాగు చేస్తే కీడు జరుగుతుందని నమ్మకం. సాగు చేసిన రైతు లేదా అతని పశువులు లేదా భార్య మరణిస్తారు అనే మూఢ విశ్వాసం కారణంగా చేనిని ఆ సంవత్సరం బీడుగా ఉంచేవారుట.

ఇలాటి ఒక సందర్భం… జుమ్మాబందీ (సంవత్సరంలో భూమి శిస్తు లెక్కలు సరిచూకుండే రోజు) నిర్వహించే సమయంలో ఒక రైతు పన్నును రద్దు చేయవలసినదిగా గ్రిబుల్ కి వినతి చేశాడు. అప్పుడు ఈ బ్రిటీషు దొర గారు రైతుతో ఇలా అన్నారు – “చెరువులో పుష్కలంగా నీరు ఉంది గదా!” అని.  అందుకు ఆ రైతు “ఆ..ఉంది. అయితే ఒక తాబేలు నా పొలంలో బొరియ చేసి బయటికి వచ్చింది.” అన్నాడు. “అంటే దానర్థం ఏమిటి?” అని గ్రిబుల్ రైతును ప్రశ్నిస్తే “ఒకవేళ తాబేలు కనిపించిన చేలో ఆ సంవత్సరం పంటలు సాగు చేస్తే కీడు జరుగుతుంది. సాగు చేసిన రైతు లేదా అతని పశువులు లేదా భార్య మరణిస్తారు” అని రైతు చెప్తాడు.

చదవండి :  సర్ థామస్‌ మన్రో - 1

“మరి తాబేలు కనిపించినా అటువంటి కీడు జరగలేదే?” అంటాడు గ్రిబుల్

“అవును జరగలేదు. తాబేలు కనిపించిన చేలో పంట పెడితే ముప్పై రోజులలో పైన చెప్పిన ఏదో ఒక కీడు జరుగుతుంది.” అంటాడు రైతు.

గ్రిబుల్  అంటాడు “తాబేలు విష్ణు రూపం (కూర్మావతారం) అని ప్రతీతి కదా. అటువంటి తాబేలు నీ పొలంలో కనిపించింది అంటే అది నీకు దక్కిన గౌరవం కదా!” అని

అందుకు ఆ రైతు “తాబేలు నీళ్ళలో కనిపిస్తే దానిని గౌరవంగా భావిస్తాను. నేల మీద కాదు” అంటాడు.

హైనా ముక్కుకు ఆ రోజుల్లో మాంచి డిమాండ్ ఉండేది. ఎందుకంటే జనాలు హైనా ముక్కును కలిగి ఉండడాన్ని గొప్ప ఆకర్షణగా భావించేవాళ్ళు. హైనా చనిపోయినప్పుడు దాని ముక్కును కత్తిరించి ఎండబెట్టే వారు. అజీర్తితో, కాలిన గాయాలతో బాధపడేవాళ్ళు, విపరీతమైన కాయకష్టం చేసి నొప్పులతో బాధపడేవాళ్ళు హైనా ముక్కును ముక్కు పుటాల మీద తగిలించుకుంటే ఆయా బాధల నుండి ఉపశమనం పొందుతారనే నమ్మకం బలంగా ఉండడమే హైనా ముక్కుకు అంత డిమాండ్ ఉండడానికి కారణం.

గద్ద కనిపించందంటే ఆ రోజు పాపాలన్నీ తొలగిపోతాయని విశ్వసించేవాళ్ళు. ప్రయాణంలో గద్ద మనిషి ఎడమ వైపు నుంచి కుడి వైపు ఎగురుకుంటూ వెళ్లిందంటే ఆ ప్రయాణం విజవంతమవుతుందనీ, అదే గద్ద  ముక్కుతో దేన్నైనా పట్టుకుని ఎడమ వైపు నుంచి కుడి వైపు ఎగురుకుంటూ వెళ్లిందంటే ఆ రోజంతా పనులన్నీ సక్రమంగా, సజావుగా జరుగుతాయని నమ్మేవాల్ల్లు.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 2002

కాకి మనిషి కుడి వైపు నుంచి ఎడమ వైపుకు ఎగురుకుంటూ వెళ్లిందంటే మంచి జరుగుతుందని నమ్మేవాళ్ళు. అదే కాకి ఎడమ వైపు నుంచి కుడి వైపు ఎగురుకుంటూ వెళ్లిందంటే చెడు జరగబోతోంది అనడానికి సంకేతంగా భావించేవాళ్ళు.

కాకి ఇంట్లోకి దూరిందంటే కనీసం మూడు నెలలకు తక్కువ కాకుండా ఖాళీ చేసి వెళ్ళేవాళ్ళు. మూడునెలల తర్వాత బాపనోల్లతో సంప్రోక్షణ చేయించి ఇంట్లోకి వచ్చేవారు. ఇలా సంప్రోక్షణ చేయించే స్తోమత లేనివాళ్ళు ఇళ్లను అలాగే వదిలేసేవాళ్ళు.

పిచుక కనిపిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మేవాళ్ళు. పిచుకలు రెండు జంటగా కనిపించినా లేదా పిచికల జంట ఇంటిలో గూడు కట్టుకుంటే అంతా దివ్యంగా మంచి జరుగుతుందని విశ్వసించేవాళ్ళు.

గుడ్లగూబను అపశకునానికి గుర్తుగా భావించేవాళ్ళు. గుడ్లగూబ  ఇంట్లోకి దూరిందంటే కనీసం ఆరు నెలలకు తక్కువ కాకుండా ఖాళీ చేసి వెళ్ళేవాళ్ళు. ఆరునెలల తర్వాత బాపనోల్లతో సంప్రోక్షణ చేయించి ఇంట్లోకి వచ్చేవారు.

గుడ్లగూబ కొన్ని సార్లు చిన్న పిల్లల ఏడ్పు లాగా కూత వేస్తుంది. ఇలాటి కూత వినబడిందంటే మంచి జరుగుతుందని నమ్మేవాళ్ళు.

ఉత్తీత (తీతువు పిట్ట) అరుపును జరుగబోయే చెడు శకునానికి సంకేతంగా భావిస్తారు. ఉత్తీత  ఇంట్లోకి దూరిందంటే కనీసం మూడు నెలలకు తక్కువ కాకుండా ఖాళీ చేసి వెళ్ళేవాళ్ళు.

చదవండి :  గండికోట పరిసరాల్లో తిరుగుతోంది పులి కాదు ... హైనానే!

నక్కను శుభ శాకునానికి సంకేతంగా భావిస్తారు. వెళ్ళే దారిలో నక్క ఎదురొచ్చిందంటే ఆ రోజు అమోఘంగా ఉంటుందని నమ్మేవాళ్ళు. నక్కను తాకితే ఆ రోజు తలపెట్టిన పనులకు విపరీతమైన అదృష్టం తోడవుతుందని నమ్మేవాళ్ళు. అందుకే ఏదైనా అదృష్టంతో కలిసొచ్చినప్పుడు ‘వీడు…నక్క తోక తొక్కి ఉంటాడు’ అనే వ్యవహారం వాడుకలో ఉంది.

కుందేలును అపశకునానికి సంకేతంగా భావించేవాళ్ళు. వెళ్ళే దారిలో కుందేలు ఎదురొస్తే ఆ రోజు తలపెట్టిన పనులు జరగవని నమ్మేవాళ్ళు. ఒకవేళ కుందేలు కూడా తాకినట్లయితే వెంటనే వెనుదిరిగి ఇంటికి వచ్చే వాళ్ళుట. కాదని అలానే ముందుకు వెళితే పెద్ద కీడు జరుగుతుందని నమ్మేవాళ్ళు. ఇందుకు సంబంధించి రామాయణంలో కూడా ఒక ప్రస్తావన ఉన్నట్లుగా ప్రచారంలో ఉంది – అది ‘రాముడు సీతను అడవిలో వదిలి రమ్మని చెబితే లక్ష్మణుడు సీతాదేవిని రథంలో తీసుకువెలుతుంటాడు. ఇలా వెళ్ళే దారిలో కుందేలు ఎదురవుతుంది. తనను అడవులకు తీసుకువెళుతున్న కారణం తెలియని  సీతాదేవి కుందేలు ఎదురొచ్చింది కాబట్టి ఏదో చెడు జరుగుతందని ఇంటికి తిరిగి  తీసుకెళ్ళమని లక్ష్మణుని అర్థిస్తుంది.’

నాగుపామును కూడా చెడు శకునానికి సంకేతంగా భావిస్తారు.

ఉడుమును కూడా చెడు శకునానికి సంకేతంగా భావిస్తారు. ఉడుము ఇంట్లోకి వచ్చిందంటే కనీసం మూడు నెలలకు తక్కువ కాకుండా ఖాళీ చేసి వెళ్ళేవాళ్ళు. ఉడుము మాంసం తింటే యవ్వన శక్తిని పొందుతారని విశ్వసించేవాళ్ళు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: