
అల్లుడికి ఘనంగా భత్యం సమర్పించిన కడప ముస్లింలు
కడప: ఉగాది పర్వదినం సందర్భంగా శుక్రవారం దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుని దర్శనానికి ముస్లింలు పెద్ద సంఖ్యలో భక్తులతో కలిసి తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కొబ్బరి కాయలు కొట్టి కానుకలు సమర్పించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి లడ్డూలను కొనుగోలు చేశారు.
బీబీ నాంచారమ్మను తాము కుమార్తెగా భావిస్తామని, ఆ దృష్ట్యా శ్రీనివాసుడు తమకు అల్లుడవుతాడని… ప్రతి ఏటా ఉగాది రోజున ఆయనకు దిన భత్యం సమర్పించి పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని ఈ సందర్భంగా ముస్లిం మహిళలు తెలిపారు. ఏటా ఉగాది పర్వదినం సందర్భంగా పలువురు ముస్లిం సోదరులు శ్రీవారిని దర్శించుకుంటారు.
అధికసంఖ్యలో ముస్లింలు, హిందువులు స్వామి దర్శనానికి రావడంతో ఆలయం నూతన శోభను సంతరించుకుంది. వేదపండితులు మచ్ఛాశేషాచార్యులు, మయూరం కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో శ్రీవారికి ప్రత్యేక అభిషేకం, దివ్యాలంకరణ చేశారు. నూతనశోభితుడైన శ్రీవారిని శ్రీదుర్ముఖి నామసంవత్సరాదిన భక్తులు దర్శించి తరించారు.
ఆలయ ప్రధానార్చకులు మచ్ఛాశేషాచార్యులు ఇరుదేవేరులతో కొలువు దీరిన స్వామి సమక్షంలో పంచాంగ శ్రవణం చేసి భక్తుల తిథివారనక్షత్రాది యోగాలను వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి, అర్చక, భద్రతాసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.