
కడప జిల్లా ముఖచిత్రమే మారిపోతుందా!
జన్మభూమి గ్రామసభల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 12, 13వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. ఆదివారం స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామసభల్లో కడప జిల్లాపై వరాలజల్లును కురిపిస్తారని మంత్రి చెప్పారు.
ఉక్కు ఫ్యాక్టరీ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, టెక్స్‌టైల్ పార్కు, గాలేరు-నగిరి ప్రాజెక్టు, రైల్వేలైన్ల నిర్మాణం చేపడతామన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో కడప జిల్లా ముఖచిత్రమే మారిపోనుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లను అందిస్తామన్నారు. 27 వేల పెన్షన్లపై విచారణ సాగుతుందన్నారు. గత ప్రభుత్వం యువకులు, విదేశాల్లో ఉండే వారికి పింఛన్లు ఇచ్చిందన్నారు.
అనర్హులను తొలగిస్తే ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. పాదయాత్రలో రైతులు, డ్వాక్రా, వృద్దుల కష్టాలను స్వయంగా చూసిన చంద్రబాబు వారి సంక్షేమం కోసం రుణమాఫీ అమలు చేస్తున్నారన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఐదు రెట్లు పింఛన్ పెంచలేదన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ నేతలకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. పింఛన్లు తీసేస్తున్నట్లు ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిని అభినందించాల్సిపోయి విమర్శించడం హాస్యాస్పదమన్నారు. పింఛన్ల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామన్నారు.
జయలలితకు పట్టిన గతే అవినీతిపరులకు పడుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎర్రచందనం స్మగ్లర్లను ఉరితీయడంతో పాటు ల్యాండ్, శాండ్, వైన్ మాఫియా రాష్ట్రం విడిచి వెళ్లాలన్నారు.
ఇంతకీ ముఖ్యమంత్రి ప్రకటనతో కడప జిల్లా ముఖచిత్రం మారుతుందా? గతంలో ఇచ్చిన హామీలే ఇంతవరకూ ఒక్క అడుగూ ముందుకు కదలలేదు. అయినా మంత్రిగారు ఇలా చెబుతున్నారేమిటో?