సోమవారం , 16 సెప్టెంబర్ 2024

పాలకంకుల శోకం (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

పాలకంకుల శోకం కథ

ఎదురుగా బడి కన్పించగానే గుర్తొచ్చింది కృష్ణకు – తను ఇంటివద్దనుంచి బయల్దేరేటపుడు ఈ దారిన రాకూడదనుకొంటూనే పరధ్యానంగా వచ్చాడని. సందులో దూరి పోదామనుకొన్నాడు గాని లోపల్నించి రమణసార్ చూడనే చూశాడు.

“ఏమయ్యా క్రిష్ణారెడ్డి?” అంటూ అబయటకొచ్చాడు.

“ఏముంది సార్..” నెత్తి గీరుకొంటూ దగ్గరగా వెళ్లాడు కృష్ణ.

“బంగారంటి పాప. ఆ పిల్ల జీవితమెందుకు నాశినం జేస్తావ్? బడికి పంపీయ్యా. పదిరోజులైంది సూడూ” నిలదీశాడు రమణ.

ఓసారి అటు ఇటు జూసి “సార్ సార్” అంటూ టీచర్ దగ్గరగా వెళ్లాడు కృష్ణ. ఆయన గడ్డం దాకా చేయి పోనిచ్చి “ఇంగెంత. రెండ్రోజులే సార్. యీ రోజు సోమారం గదా. బేస్తారం బడికి వొచ్చినట్లే సార్” బతిమిలాడాడు.

“ఇట్లా ఎన్ని సార్లు వాయిదా వెయ్యలేదు?”

“ఏం జెయ్యాల సార్. ఎదవబతుకైందిలే… లక్షన్నర రూపాయలు పోసి బోరు దించి మోటారు బిగిస్తే రెండెకరాలు గూడా తడ్సడంలే. నోటికాడికొచ్చిన పంట నిలువునా ఎండిపోతాంది. కూలి మనిసిని పిల్చుకొనేందుకుగ్గూడా గతి లేకనే ఆ చంటిపిల్లను పిల్చక్పోయ్యేది.”

sannapureddyసన్నపురెడ్డి పుట్టిందీ, పెరిగిందీ , ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నదీ – కడప జిల్లా, కలసపాడు మండలం బాలరాజుపల్లెలో – కుగ్రామం కావడంతో తన కథలకూ, కవితలకూ అవసరమైన మూలబీజాల్ని ఆ గ్రామీణం నుండే ఏరుకోగలుగుతున్నాడు. అక్కడి బడుగుజీవులైన రైతుల, రైతుకూలీల బతుకువెతల్ని తన కళ్ళలో నింపుకుంటూ, తన కళ్ళ దర్పణాల్లో వాళ్ళ జీవిత ప్రతిబింబాల్ని పాఠకలోకానికి స్పష్టంగా చూపించగలుగుతున్నారు. వీరి ‘పాలెగత్తె’ స్వాతివారపత్రిక నిర్వహించిన నవలలపోటీలో – ‘చినుకుల సవ్వడి’ చతుర నవలపోటీలో ప్రథమ బహుమతిని సాధించాయి. వీరి తొలి నవల కాడి 1998లో ఆటా వారు నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయబహుమతి పొందింది.2006 ఆటా పోటీలలో వీరి నవల తోలుబొమ్మలాట  ప్రథమ బహుమతి పొందింది.

“కొడుకును మాత్రం డబ్బుకట్టి మరీ రోజూ ప్రైవేటు స్కూలుకు పంపిస్తావు.”

మళ్ళీ గడ్డం పట్టుకొన్నాడు కృష్ణ “సార్ సార్… బేస్తారం వస్తాదిలే సార్…”

“ఆ రోజైనా ఖాయమేనా?” నిలదీశాడు.

బేస్తారం గాకుంటే శుక్రారమో, శనివారామో… అంతెందుకు సార్. మద్యన ఒక్క ఆదోరమెందుకులే… సోమారం ఖాయం జేసుకో. అప్పుడూ పంపలేదనుకో నన్ను పేరుతో పిల్చగాకు…” అంటూ దారిబట్టాడు.

వాళ్ళు మాటల్లో ఉండగానే నిండా మనుషుల్తో ఓ జీపు వెళ్లింది. తర్వాత మరోలారీ – అంచుల చుట్టూ నిల్చుని కాశినాయనకు గోవిందలు కొడుతోన్న జనంతో. నాయన ఆరాధనోత్సవాలు మొదలయ్యాయి. రేపటి నుంచి యాత్రికుల వాహనాలతో దారంతా రద్దీగా మారుతుంది. కొంత దూరం వెళ్లిన వాడల్లా ఏదో గుర్తొచ్చినట్లు మళ్లీ వెనుదిరిగి బడి వద్దకు వచ్చాడు కృష్ణ.

రమణసార్ తనకేసి చూడగానే “నాకొక సలహా యియ్యాల సార్ నువ్వు” అన్నాడు.

ప్రశ్నార్థకాంగా చూడాడు రమణ.

“నాకు బోరుకింద మూడెకరాల పొలముంది సార్. ఒకెకరా వరి, ఇంకో ఎకరా పసుపు పైరు పెట్టినా. మిగిల్నెకరా మిరప నాటినా. మొన్నమొన్నటి దాంకా మూడు పైర్లూ బాగుండె. ఇప్పుడు బోర్లో నీల్లు తగ్గిపాయె. కరంటు సక్రమంగా ఇడ్సక బోరూ ఆడకపాయె. ఏమారకుండా కనిపెట్టుకొని కరంటు రాంగానే మోటారాడించినా రెండెకరాలు తడవడమే గగనమైపోతాంది. ఎటుదిరిగి ఒకెకరా పైరు ఎండబెట్టుకోవాల్సి వస్చాంది. ఏ పైరు ఎండబెట్టుకోవాల్నో దీకుదెలడంలే… వారం రోజుల్నించీ నిద్దర్రాలేదనుకోసారు” అతని గొంతులో బాధ సుడులు తిరిగింది. ఆ వేదన తాలూఅకు తీవ్రత రమణ గుండెల్ని కూడా కమ్ముకొని నోట మాట రానీ లేదు.

“ఏం సార్ పలకవూ. నేనేం పొద్దుబోక మాట్లాడ్డంలే… ఒక పైరు ఎండ బెడ్తే రొండు పైర్లు బతుకుతాయి. మూటి మీందా ఆశబడ్తే మూడూ ఎండిపోతాయి. సెప్పు సారు. ఏ పైరు ఎండబెట్టుకోవాల్నో.”

తలతిరిగిపోయింది రమణకు. ‘ఏ పిల్లోన్ని చంపుకోమంటావో చెప్ప’మన్నట్లుగా ధ్వనిస్తోంది అతని ప్రశ్న. తన వద్దకు అక్షరాలకోసం వచ్చే బడిపిల్లల తల్లిదండ్రుల వెనక ఇంతటి బీభత్స దృశ్యాలుంటాయని అతనూహించలేదు.

వెళ్లి కుర్చీలో కూలబడ్డాడు.

ఇన్ని రోజులూ అప్పోసప్పో చేసి సాకిన పైరును ఇప్పుడు ఎండబెట్టుకోవటం అంటే – ఆ బాధ ఏమిటో ఆ రైతుకే తెలుసు. తనకేసి తదేకంగా చూడటం తప్ప సమాధానం ఇవ్వలేని రమణను చూసి ఏం మాట్లాడాలో తెలియలేదు క్రిష్ణారెడ్డికి. “సోమారం ఖాయంగా బడికి పంపిస్చాలే సార్ సుజాతను” అంటూ వెనుదిగి కదిలిపోయాడు.

భక్తజనంతో నిండిన వాహనాలు అప్పుడొకటి ఇప్పుడొకటి నల్లమల అడవిలోని జ్యోతి క్షేత్రం కేసి వెళుతున్నాయి. మాటల్లో బడి కాలాన్ని మర్చిపోయాడతను. పదకొండు గంటలైంది.

“మ్మేయ్ సుభద్రా. కరంటొచ్చిందే?” ఓ ఇంట్లోకి కేకేశాడు.

“ఆ వొచ్చింది… మినుక్కుమన్నది… పొయ్యింది. యీల్లకు గత్తర దగలా. కరంటు సక్రమంగా ఎప్పుడు యిడుస్తారో. నువ్వింగా యీధల్లోనే తిరుగుతండావా? మా ఆయన అప్పుడే పరిగెత్తిండే”

చదవండి :  జుట్టుమామ (కథ) - ఎం.వి.రమణారెడ్డి

నిమిషం కూడా ఆలస్యం చేయలేదు కృష్ణ. తిప్ప కింది చేలకేసి కాలికొద్దీ నడవసాగాడు.

ఈ మధ్య అనుక్షణం అతని మనస్సుని తొలుస్తూనే వుంది ఈ ఎండబెట్టే దిగులు. అన్నం తినేటప్పుడు కూడా వదలట్లేదు. నిద్రలో కూడా అవే కలలు. బోరులో నీళ్లు తగ్గిపోవటమనే సమస్య నెలకిందటే మొదలయ్యింది. మరి కొన్ని పైపులు దించుదామనుకున్నాడు గాని అప్పటికే పంపు స్టేజీలకు సరిపడేన్ని పైపులు దించి వున్నాడు. అదనపు పైపులు దించాలంటే ఎక్కువ స్టేజీలున్న పంపును మార్చాలి. పంపుకు తగినట్లు ఎక్కువ హార్స్‌పవరున్న మోటారును అమర్చుకోవాలి. అవసరమైతే మరో బోరు కూడా దించాలి.

ఈ సమస్య తనకే వచ్చిందనుకొన్నాడు మొదట. బోరు ఫెయిలవుతోందై చెప్పుకొనేందుకు నామోషీ పడ్డాడు. వారం రోజులకే అర్థమైంది చాలా బోర్లకు నీళ్లు రావట్లేదని. కొందరు డ్రిల్లింగ్ మిషన్ తెప్పించి కొత్తగా బోర్లు దించినా నీళ్లు పడలేదని.

బోరు బావి పూర్తిగా ఎండినా ఇంత మానసిక వేదన ఉండకపోను. చేతులారా సాకిన పైరును ఆ చేతుల్తోనే ఎండబెట్టుకొనే నిర్ణయం ఎదురై మనిషినంతా అతలాకుతలాం చేస్స్తోంది.

ఏ పైరును ఎండబెట్టాలి? వరినా, పసుపునా, మిరపనా? తన తోటి రైతులంతా సులభంగానే నిర్ణయం తీసుకున్నట్లుంది. కరెంటు రాగానే స్విచ్ నొక్కి ఏదో ఒక పైరును తడిపేందుకు ప్రయత్నిస్తున్నారు.

తనే ఏదీ నిర్ణయించుకోలేక పోతున్నాడు. తిప్పపైకి ఎక్కుతూ అటు ఇటు చేలకేసి చూశాడు. తనలాగే జనాలు మోటార్లకేసి పరుగు పరుగున నడుస్తున్నారు – కరంటు వచ్చింది కాబోలు. కరంటు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. ఎంత సేపుంటుందో కూడా తెలీదు. కంటికి రెప్పకు ఎడబాటు పెట్టి కరంటు వైర్లను కాపుగాయాలి. ఆలితో ఎడబాటు పెట్టుకొని మోటారు పకన గెనిమను కరుచుకు పడుకోవాలి. మంచువాలే జామున దుప్పట్లో దూరి కర్ళ్లుమూసుకొంటే, ఏ జామైందీ తెలీకుండానే ఉన్నట్టుండి మలకువ వస్తుంది. లేచి కరంటు తీగలకేసి చూస్తే బల్బు వెలుతురు కన్పించదు గాని చెట్టునిండా మిణుగురు పుగురులు మెరుపుల ముగ్గులేస్తూ వెక్కిరిస్తాయి. లేచి చుట్టుపట్ల చేలవద్ద మోటార్లకేసి చూసి ఎక్కడా బల్బు వెలగలేదని నిర్ధారణ చేసుకొని మళ్లీ ముసుగులో దూరటం. ‘థూ దీనెమ్మ బతుకు. సరిగ్గా పడుకొనేదానిగ్గూడా లేదు’ అనుకోవడం.

డ్రాయర్ జేబులో సన్నపాటి కరంటు షాక్ కొట్టినట్లుగా అనిపించి చేయి దూర్చి సెల్‌ఫోన్ బయటకు తీశాడు. ఫోన్ నొక్కి చెవి దగ్గర పెట్టుకొని ‘హలో’ అన్నాడు. స్కూల్ నించి ఫీజు డబ్బులకోసం.

“అనా… అనా… ఒక్క నెలన్నా. ఏమీ రాలేదన్నా. ఎవునికాడా లెక్క లేదన్నా. పైసా దొరకడం లేదన్నా. ఒక్క నెల ఓపికె పట్టండన్నా…” చాలా సేపు ప్రాధేయ పడ్డాడు.

‘గవర్నమెంటు స్కూల్లో చేర్పించినా బాగుండు. యీ పీడ తప్పేది’ అనుకున్నాడు. అంతలోనే కొడుకు రంగురంగుల భవిష్యత్తు కళ్లముందు మెదిలి ‘ఏదొక సావు జచ్చి ఫీజన్నా కట్టొద్దా’ మనుకున్నాడు. తిప్ప పైకెక్కి విశాలంగా పరుచుకొన్న పొలాలాకేసి చూశాడు. మర్రిమాను బాయి కాడ ఏదో లారీ ఆగివుంది. లారీలోంచి దిగిన జనమంతా తన మోటారు వద్దకే పోతున్నట్లుంది. పరుగులాంటి నడకతో పొలం వద్దకు చేరుకొనేసరికి మోటారు రన్నవుతూ కన్పించింది. లారీ జనమంతా మోటారు వద్ద పంపుకింద దోసిళ్లతో నీళ్లు తాగుతున్నారు. రైతుల్లాగే వుంది వాళ్లు. మరొకరైతే అంత సులభంగా పరాయి వాళ్ల మోటారు జోలికి పోరు.

“ఏ వూరన్నా మీది?” అడిగాడు. పడమట కె.సి.కెనాల్ కింది పల్లెలట. పంపులోంచి ధారగా నీళ్లు దూకటం లేదు. ఒక నిమిషం జమాయించి దూకి మరో నిమిషం గొంతు పట్టుకొన్నట్టు వస్తున్నాయి. నీళ్లు తాగిన వాళ్లలో తలకు రుమాలు చుట్టుకొన్న ఇద్దరు రైతులు వరిచేను గట్టు మీదకు వెళ్లి పైరును పరిశీలిస్తూ నిల్చున్నారు.

“బోరు నీదేనాబ్బీ?” అప్పుడే పంపు వద్దనించి పక్కకొచ్చిన బుర్ర మీసాల పెద్దాయన అడిగాడు.

“అవునయ్యా” చెప్పాడు.

“వరి పైరు ఒక్కటేనా?”

“అద్దో, ఆ పసుపూ, ఆ మిరపా…”

అతని కేసి ఎగాదిగా చూశాడు ఆయన. “ఇంత వాటంగా నీల్లొస్చాండాయి. ఎట్లా బతికించుకొంటావు పైరును?” అడిగాడు.

“నా దిగులు అదేనయ్యా. యీ కరువుల్తో, ఈ కరంటుతో పారకం దొల్లడం లేదు. ఏదోక పైరును సంపుకొంటేగాని మిగతా రెండు పైర్లూ బతికేట్టు లేవు. పెద్దోనివి సెప్పయ్యా ఏ పైరు ఎండబెట్టమంటావో సెప్పు” దీనంగా అడిగాడు.

అతనికేసి ఎగాదిగా చూశాడు పెద్దాయన. “ఇట్టడిగితే ఎవరు జెబుతార్రా నీ పాసుగుల్లా. మూడు పైర్లల్లో ఒక పైర్ను సంపుకోమని బుద్దున్నోడెవుడన్నా చెబ్దాడా? నోరెట్టాడ్తది?”

“ఒకదాన్ని సంపకుంటే మూడూ సస్చాయి పెద్దయ్యా.”

“నువ్వు వరి నాట్టమే బుద్ధి తక్కువబ్బీ. కాలవ కింద నీల్లతో జోము దిగే పొలాలోల్లం. మాకంటే గతిలేదు. నాటితే వరి నాటాల. లేకుంటే బీడు పెట్టాల. ఉద్దర నీల్లొచ్చే మడికయ్యలోల్లం – మాకే వరి గిట్టుబాటు గాలే. నీల్లు కొనుక్కొనేటోల్లు. మీరేం పెరక్క తిందామని నాటినార్రా నాయాల్లారా? నిరుడు పండిన వడ్లు రేటు లేక, అమ్ముకోలేక ఇండ్లల్లో మూలుగుతండాయి. పెట్టుబడులు అప్పులై మా గొంతులు బిగుస్తుండయి. అందుకే ఈ యేడాది పొలమంతా బీడు పెట్టినం. పేపరోల్లేదో పంట విరామమనీ ఇంగేదో క్రాప్… ఏందబ్బీ ఆఁ క్రాప్ హాలిడే అనీ… ఏదేదో రాస్చాండారు సూడూ. వరి నాటకుండా బీడు బెట్టినాంరా నాయినా. రైతుకు అంతకన్నా దరిద్రముందే? వరంటే మాకు ఉరిని సూసినంత బయంగా వుంది. నీ ఎర్రి దొంగల్దోలా. బోరు నీల్లన్నీ యీ ఒక్క వరిపైరు తాగి వూస్తావుంటే మెట్ట చేలోల్లు మీరెందుకబ్బీ దీని జోలికి పోయిన్రూ?” అన్నాడు ఆయన.

చదవండి :  ఏటుకాడు (కథ) - రామకృష్ణా రెడ్డి.పోసా

“తిండి గింజెలకూ గొడ్ల మేపుకూ యీ పైరే పెద్దాయనా గతి”

“వడ్లు కొనుక్కో… ఓ పాతిక నేల గడ్డి నాటుకో” చెబుతూ లారీ వద్దకు నడిచాడు.

అంతలో ఓ విచిత్రం జరిగింది.

వరిచేను గట్టుమీదున్న ఇద్దరు రైతులు తలమీది చుట్టలు తీసి దోసిట్లో పట్టుకొన్నారు. వరిపైరు కేసి వినయంగా వంగారు. నడుమెత్తకుండా ఒకసారి చేను చుట్టూ తిరిగి వచ్చారు. దోసిట్లోని నేలమీద పెట్టి, వరిపైరు కేసి చూస్తూ రెండు చేతుల్నీ ముకుళించారు.

“మమ్మల్ని దుంపనాశినం జేసి యీ గడ్డమీందిగ్గూడా వొచ్చినావా వడ్లగింజల తల్లీ” అంటూ బిగ్గరగా అరిచారు. “ఎందుకమ్మా యీ మెట్ట చేలోల్లగ్గూడా ఆశలు రేపి ఊరేస్తావు? నీ మాయల్లేకి యీడ్చి యీల్ల బతుకెందుకు తల్లీ మట్టిపాల్జేస్తావు? దండాలమ్మా నీకూ, నీ ఎన్నులకూ, నీ కులుకులకూ దండాలు దండాలు” అంటూ తలగుడ్డలు చేతికి తీసుకొని లారీకేసి నడిచారు.

అందరూ ఎక్కింతర్వాత లారీ కదిలి పోయింది.

అంతులేని ఆశ్చర్యం కలిగింది కృష్ణకు. గుండె ఆర్ద్రమయ్యింది. ఆలోచిస్తూ కాలువ వెంట వెళ్లాడు. వరిచేలోకి నీళ్ల మడవ వుంది. దాన్ని పూడ్చి నీళ్లను పసుపుతోటకు మళ్లిస్తూ ‘తను వరినాటి తప్పు చేశాడా? ఎండబెట్టాల్సిన పైరు ఇదేనా? వరిపైరంతా అర్ర్రొంచింది. సంక్రాంతి దాకా సగదీడుతే చాలు పంట చేతికొస్తది. తమకు ఏడాది బత్తెమూ… గొడ్లకు మేపూ. అమ్మో వరిని ఎండబెట్టేదానికి లేదు. కాలవ కింది మాగాణి రైతులకు వరిపంటపైన అంతకంటే మంచి అభిప్రాయం ఎందుకుంటుందిలే. తాము సాగుచేయ వలనుపడని పసుపు మిరప లాంటి గడ్డపైర్ల పైన వాల్లకు మోజుంటుంది. ఆ సంగతే చెప్పినట్టుంది పెద్దాయన’ అనుకున్నాడు.

కాలువ వెంట వెళ్లి వరిచేనుకే మడవ తిప్పాడు. మరి ఏ పైరును ఎండబెట్టుకోవాలి? వెళ్లి మర్రిచెట్టు మొదలుకు ఆనుకొని కూచున్నాడు. అతని మెదడు నిండా జోరీగల్లా చుట్టుముడుతున్నాయి ఆలోచనలు. అంతలో జనంతో నిండివున్న ట్రాక్టర్ ఒకటి వచ్చి మర్రిమాను నీడన ఆగింది. జనం దిగి మోటరు వద్దకు నడిచారు. దారి పక్కనే బోరు బావి ఉండడం వల్ల, నీళ్లను చూడగానే ఎవనికైనా దోసెడు తాగిపోదామనిపిస్తుంది.

‘తిరునాళ్లకు వచ్చేవాళ్లంతా ఇట్లా ఎగమల్లితే పంపులోంచి దూకే ఆ అరకొర నీళ్లన్నీ వాళ్లు తాగడానికే సరిపోతాయేమో!’ అనిపించింది కృష్ణకు. అంతలోనే తేరుకొని మనస్సులో జొరబడిన ఆ నికృష్టపు ఆలోచనకు బాధపడ్డాడు. ‘పాపిష్టి కరువు వల్లనే కదా తాగే నీళ్ల పట్ల కూడా ఇంత దుర్మార్గంగా ఆలోచించింది’ అనుకున్నాడు.

ఓ ముసలాయన వచ్చి మాటలు కలిపాడు. టేకూరుపేట ఏరియాట వాళ్లది. పసుపు సాగుకు రాష్ట్రస్థాయిలో పేరున్న ప్రాంతం. ఆయన ముందు కూడా తన గోడు వెళ్లబోసుకున్నాడు కృష్ణ. ‘ఏ పైరుని చంపుకోమంటావో సలహా యిమ్మం’టూ ప్రాధేయపడ్డాడు.

“నువ్వీ యేడు పసుపు సాగుజెయ్యడమే తప్పు” అంటూ “మేము తరాల్నించీ పసుపు పైరేస్చాండం. మాకది వాడిక. పదేండ్లకో యిరవైయేండ్లకో వొకతూరి మమ్మల్ని గట్టెక్కిస్చాది ఆ తల్లి. ఇన్నేండ్లూ నమ్ముకున్నెందుకు నిరుడు మునేడూ మా యిరవైయ్యేండ్ల కరవంతా తీర్చింది. పసుపు కొమ్మల రేటు జూసీ, మమ్ముల్ను జూసీ యిప్పుడు దేశమంతా అదే నాటబట్టిరి. విత్తిన కొమ్ములు కొనాలంటే ఎకరాకు యాభైవేల రూపాయలకు తక్కువగాదు. పైన పెట్టుబడి యాభైవేలకు దాడ్తాంది. కొమ్ముల వూరకమైనాంక తవ్వి, ఉడకబోసి, రుద్ది, సంచులకెత్తి, దుగ్గిరాల మార్కెట్టుకు తోలేసరికే ముప్పై నలభై యేలయిద్ది. ఇప్పుడు రేటు సూజ్జామా పదైదు వేలనుంచి ఐదువేలకు దిగింది. శివరాత్రికి కొమ్ములు తవ్వేతలికి మూడు వేలకి పడిపోయినా పోవచ్చు. అప్పుడయితే ఎకరాకు యాభైవేలు నష్టమొస్తాది. నా మాటిని యీ తడివేసినంక కొమ్ములు తవ్వి ఉడకబోయి నాయినా. పెట్టుబడన్నా వస్చాది. మిగతా రొండు పైర్లన్నా బతకుతాయి” చెప్పాడు.

వాళ్లు వెళ్లిన తర్వాత అనుకున్నాడు ‘వీళ్లకూ అంతే. బతికినన్నాళ్లూ సాగుజేసే పైరుమీద చులకన చూపు’ అని.

కొమ్ము ముదరకుండా తవ్వితే ఉడుక్కు నిలుస్తాదా? ఎండబెడితే పొక్కిళ్లు బారదా? మీద మీద రెండు తడులేస్తే కొమ్ము బిగుసుకొంటాది. అప్పుడు తవ్వి, ఉడకేసి, ఎండబెట్టి, రుద్దితే బంగారు తునకల్లా వుంటాయి కొమ్ములు.

చదవండి :  సీమ బొగ్గులు (కథ) - దేవిరెడ్డి వెంకటరెడ్డి

‘అమ్మో! ఇప్పుడీ పసుపు పైరును ఎండబెట్టుకొంటే ఎట్లా? చేతికింత లెక్కొచ్చే పైరు యిదే గదా? ఎంత అప్పు చేశాడనీ దీన్ని నమ్ముకొని!’ అతని గుండెలు లబలబలాడాయి.

మొన్న పాపిరెడ్డిపల్లె రైతులు యీ దారిన జ్యోతికి పోతూ మిరపకాయల రేటు కూడా పన్నెండు వేలనించి మూడు వేలకు దిగిందనీ, పండుని కోసి ఎండబెట్టి, పచ్చివి మార్కెట్టుకు పంపి మిరప పైరును ముగించమనీ సలహా యిచ్చారు. దానిక్కూడా ఎంత పెట్టుబడి పెట్టాడనీ? చేతులారా ఎట్లా ఎండబెట్టాలి?

ట్రాక్టర్ల నిండా కూరగాయలు, బియ్యం తరలిపోతున్నాయి. వరికోస్తే తనూ ఒక మూట వడ్లు ఆశ్రమానికి పంపించాలి. పసుపు కొమ్ములు, వొట్టి మిరపకాయలు కూడా పంపించాలి. అతను ఆలోచనల్లో ఉండగానే కరంటు పోయింది.

అంతలో ఓ స్కూటర్ వచ్చి చెట్టుకింద ఆగింది. దాని మీది మనిషిని చూడగానే ఉలికిపాటుగా లేచి నిల్చుని “ఏమన్నా యిట్లొచ్చినవూ?” అడిగాడు కృష్ణ.

“ఊర్లోకి వొచ్చిన్నే. నువ్వీడుండావని తెలిసి ఒక మాట మాట్లాడి పోదామనీ…” బండికి స్టాండేసి బోరు వద్దకు నడిచాడు అతను. పసుపు, మిరప పైర్ల చుట్టూ తిరిగొస్తూ వరిని కూడా పరిశీలించి “యీ సారన్నా బాకీ మొత్తం వొగదెంచు” అన్నాడు.

“వొగదెంచుదామనే వుందిన్నా” అంటూ నీటి సమస్య కరంటు సమస్య గురించి చెప్పాడు.

అందరు రైతులు చెప్పే మాటలే కాబట్టి అవి అతనికి కొత్తగా విన్పించలేదు. అప్పు గురించీ, రేయింబవళ్లు నిద్రబోకుండా పెరిగే దాని వడ్డీ గురించీ మాట్లాడాడు. తన బాకీ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వాళ్లని గొంతెత్తి తిట్టి, కృష్ణకు కూడా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు.

“ఎట్టజెయ్యాలన్నా?” అంటూ ఏ పైరును ఎండబెట్టుకోవాల్నో తెలీని తన సమస్య గురించి వాపోయాడు కృష్ణ.

“ఇదొక సమస్యా?” అన్నట్టు చూశాడు వ్యాపారి.

“లెక్క పైర్లు గదా. పసుపు, మిరపను బతికించుకో. వరి ఎండినా ఇబ్బంది లేదు. రూపాయికి కిలో స్టోరు బియ్యం దొరుకుతండాయి గదా” చెబుతూ స్కూటర్ స్టార్ట్ చేశాడు.

‘దొంగ నా కొడుకు. వాని బాకీ తీరితే సాలు’ గొణుక్కొన్నాడు కృష్ణ. అందరూ వరిని ఎండబెట్టమనే వారే. బతికించాల్సిన ప్రభుత్వమే రైతు గొంతుకోస్తావుంటే ఎవరికి మాత్రం రైతు శ్రమ మీద సానుభూతి వుంటుంది? పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదంటే దాన్ని పండించిన రైతు శ్రమను అగౌరవపర్చినట్లే గదా!

నాలుగొందలున్న ఫాస్ఫేటు ధర ఇప్పుడు వెయ్యి రూపాయలైంది. వెయ్యి రూపాయల వడ్ల బస్తా ధర ఏడు వందలకు దిగజారింది. కిలో బియ్యం ఒక్క రూపాయి. ఒక్క ఫాస్ఫేటు బస్తా వెయ్యి రూపాయలు. అంటే యాభై కిలోల ఫాస్ఫేటు బస్తా వెయ్యి కిలోల బియ్యానికి సమానం. వెయ్యి కిలోల బియ్యమంటే ఇరవై బస్తాల వడ్లు. అంటే ఒక్క ఫాస్ఫేటు బస్తా ఖరీదు ఇరవై బస్తాల వడ్లు.

ఎప్పుడైనా టౌనుకు పోయినప్పుడు టిఫిన్ తిందామని కూచుంటే ఇడ్లీ రేటు చూసి కడుపు మండిపోతుంది. రెండు ఇడ్లీలు పది రూపాయలు. కిలో బియ్యం ఒక్క రూపాయి. ఒక్క ఇడ్లీ ఐదు రూపాయలు. ‘మమ్మల్ని పాలించే ప్రభుత్వమా? రైతులంటే ఎంత చులకన నీకు? రైతు పండించే పంట ఎంత విలువ లేనిదిగా ఉంది నీ దృష్టిలో?’

ఆలోచిస్తూ చెట్టు మొదట్లో అలాగే కూలబడి ఉన్నాడు కృష్ణ. కరంటు కోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురు చూడసాగాడు.

* * *

బడి వదిలింతర్వాత బస్సుకోసం నిల్చుని వున్నాడు టీచర్ రమణ. అప్పుడే పొలాల వద్ద నుండి వూర్లోకొస్తూ కన్పించాడు కృష్ణ.

అతను తన మనసులో గుచ్చిన ప్రశ్న ఇంకా అలాగే నాటుకొని వుంది. ఏ పైరు ఎండబెట్టాలని తీర్మానించుకున్నాడో వినాలని ఉంది.

‘కూతురి చదువు విషయంలో అంత సులభంగా నిర్ణయం తీసుకొన్నవాడికి ఇదో లెక్కా?’ అనుకున్నాడు. కూతురి చదువును ఎండబెట్టి కొడుకు చదువును బతికించుకొంటున్నాడు గదా! దగ్గరగా వచ్చిన కృష్ణను అడిగాడు “ఏ పైరును చంపుకొంటాండావు?” అని.

తలెత్తాడు కృష్ణ. కళ్ల నిండా నీళ్లు.

“ఏదోక పైరుని ఎండబెట్టి మిగతా పైర్లను బతికించుకొందామనుకొంటే మూడు పైర్లనూ కరంటే సంపేట్టుండాది సార్! రోజంతా కలిసి రెండు గంటల సేపు గూడా కరంటిడ్సలే. అదీ రొండు మూడు సార్లు కట్టేసి” అన్నాడు జీర గొంతుతో.

అక్కడే తలగుడ్డ తీసి విదిల్చి మొహం తుడుచుకొంటూ అరుగుమీద కూచుని కరెంటునూ, ప్రభుత్వాన్నీ, రాజకీయాల్నీ కలేసి తిట్టసాగాడు. మరికొన్ని గొంతుకలు అతనికి తోడు కలిశాయి.

(ఆదివారం ఆంధ్రజ్యోతి 15 జూలై 2012 సంచికలో ప్రచురితం)

ఇదీ చదవండి!

కొండపొలం

సన్నపురెడ్డి నవల ‘కొండపొలం’కు తానా బహుమతి

కడప : జిల్లాకు చెందిన ప్రసిధ్ద రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ‘తానా నవలల పోటీ – …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: