నోరెత్తని మేధావులు

1980, 90 దశకాలలో రాయలసీమ జిల్లాలలో ఎక్కడ ఓ మోస్తరు దొంగతనం జరిగినా మరుసటి నాటి దినపత్రికలలో పోలీసుల ప్రకటన ఇలా ఉండేది. ‘దొంగతనం జరిగిన తీరును చూస్తోంటే ఇది స్టూవర్టుపురం ముఠాల పని అయి ఉంటుందని పోలీసులు ప్రాధమిక విచారణలో తేలింది’ అనేది ఆ ప్రకటనల సారాంశం. సదరు వార్తలు చదివిన వారికి స్టూవర్టుపురం దొంగల వెర్రితనం ఆశ్చర్యం కలిగించేది. ఎందుకంటే ఒకప్పుడు గుంటూరు జిల్లాలో భాగంగా ఉండిన చీరాలకు దగ్గరలో ఉన్న స్టూవర్టుపురం అనే ఊరు నుంచి ఈ దొంగలు నిత్యం కరువు కాటకాలతో సతమతయ్యే బీదాబిక్కీ జనం ఉండే రాయలసీమ జిల్లాలకు దొంగతనం కోసం రావడమేమిటి అని. ఆర్ధికంగా బలవంతులున్న తీరాంధ్ర ప్రాంతంలో లేని సంపద ఇక్కడ వారికేం కనబడిందీ అని. ఇలా పోలీసులు చెప్పడం వెనుక కారణం వాళ్ళ పరిశోధనలో వీలైనంత సమయం తీసుకోవటమూ, ఒకవేళ అసలు దొంగలు దొరకనట్లయితే ఏదో ఒక కేసులో దొరికిన స్టూవర్టుపురం తాలూకు దొంగలకు ఈ కేసులను అంటగట్టి విచారణను ముగించడం. ఒక రకంగా చెప్పాలంటే దర్యాప్తులోని అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు కొందరు అధికారులకు ఈ దొంగలు ఒక ఆదరువుగా ఉపయోగపడేవారు.

ఇదే అంశాన్ని నేపధ్యంగా తీసుకుని యండమూరి వీరేంద్రనాద్ గారు ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ అనే పేరుతో ఒక నవలను రాశారు. ఇదే నవలను తీసుకుని రామారావు అనే ఆయన యండమూరి దర్శకత్వంలో చిరంజీవిని హీరోగా పెట్టి సినిమా తీసి  1991 జనవరిలో విడుదల చేశాడు. అయితే ఈ నవలను పాఠకులు ఆదరించినట్లుగా సినిమాను ఆదరించలేకపోయారు తెలుగు ప్రేక్షకులు. ఇదంతా వేరే సంగతి.

సరిగ్గా 24 సంవత్సరాల తర్వాత ఈ స్టువర్టుపురానికి 90 కి.మీ దూరంలో ఆం.ప్ర రాజధానిగా తను ఎంపిక చేసుకున్న తుళ్ళూరు ప్రాంతానికి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే నెపంతో మొన్న గురువారం నాడు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అక్కడ ఒక బహిరంగ సభ పెట్టేరు. ముఖ్యమంత్రి తన సొంత జిల్లా అయిన  గుంటూరులో పచ్చని పంట పొలాలను కబళించి రాజధాని కట్టేందుకు సిద్దపడీ పైకి మాత్రం ఇలా చెప్తున్నారు – ఏమని అంటే ‘రాజధాని నిర్మాణంలో తనకెలాంటి స్వార్థమూ లేదని, అదే ఉంటే తిరుపతిలో రాజధాని కట్టుకునేవాడిని’ అని.

చదవండి :  కడపలో విశాలాంధ్ర పుస్తకాల అంగడి

చంద్రబాబునాయుడి గారి సొంత జిల్లా ‘చిత్తూరు’ అయితే ‘గుంటూరు’ అంటావేమిటోయ్ అని అడిగేరు. ఆయన సొంత జిల్లా గుంటూరే కావాలంటే తెదేపా వాళ్ళ వెబ్ సైట్ చూడండి (http://telugudesam.org/cbn/childhood.html). అందులో ఇలా ఉంది ‘Chandrababu Naidu was born in Naravaripalli, eight kilometers from Chandragiri in Chittoor district. Just a little away from the temple town of Tirupati. There were hardly 27 families which inhabited the village and all of them were either farmers or were from the middle class who migrated to this place years back. The story goes that these families migrated from Kondaveedu area in Guntur.’ అని. అంటే చంద్రబాబు గారి తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లాకు వచ్చి స్తిరపడ్డారు. అంచేత ఆయన అక్కడే పుట్టి పెరిగారు. ఆనక పెళ్లి అయిన తర్వాత బాబు గారికి వారి మూలాలు గుర్తు వచ్చినట్లున్నాయి. అంచేతనే ఆ ప్రాంతంపైన మక్కువ కనబరుస్తుంటారని వారి సన్నిహితులు చెబుతుంటారు.

ఇలా బాబు గారు సొంత ప్రాంతం మీద అభిమానం కొద్దీ తనకు దగ్గరైన (బాబు సొంతూరు కొండవీడుకు 50 కి.మీ, అత్తగారి ఊరైన నిమ్మకూరుకు 74 కిమీ దూరంలో ఉన్న) తుళ్ళూరును రాజధాని కోసం  ఎంపిక చేసుకున్నారు – కేంద్ర ప్రభుత్వం వారు నియమించిన శివరాక్రిష్ణన్ కమిటీ అది సరైన ఎంపిక కాదు అన్నా, స్థానికులు వద్దు బాబోయ్ అన్నా వినకుండా. అప్పుడు స్థానికులను నయానో భయానో ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయినా కొన్ని గ్రామాల వాళ్ళు ఒప్పుకోలేదు. బాబు గారికి అది నచ్చలేదు. వెంటనే భూములు ఎలా తీసుకోవాలో తనకు తెలుసు అనేశారు. ఇంతలో భూములివ్వమని చెప్పిన ఊళ్లలో పంటలు ఎవరో కాల్చేశారు. వెంటనే సాక్షి (వైకాపా అధినేత కుటుంబానికి చెందిన మీడియా గ్రూపు) ఈ అంశాన్ని పదేపదే ప్రసారం చేసింది. సహజంగానే బాబు గారి అనుకూల మీడియా ఈ అంశానికి తక్కువ ప్రచారం ఇచ్చింది. వెంటనే తెదేపా వాళ్ళు ఇది వైకాపా వాళ్ళ పనే కాబట్టే సాక్షి వాళ్ళకు ముందుగా విషయం తెలిసిపోయింది అని ప్రచారం మొదలెట్టారు. అంతేనా ఇది వారి (కడప వాళ్ళ) సంస్కృతే అన్నారు. రేపు కడపలో దోపిడీ జరిగి సదరు వార్త ముందుగా ఈటీవీలోనో, ఎన్టీవీలోనో వస్తే అక్కడ తెదేపా వాళ్ళ హస్తముంది, అది కృష్ణా జిల్లా వాళ్ళ సంస్కృతే లేదా చిత్తూరోల్ల సంస్కృతీ అని వైకాపా వాళ్ళు అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? ఇలా పసలేని వాదనలు చేసే బదులు సదరు ఘటనలో వైకాపా వాళ్ళ హస్తముంటే ప్రభుత్వం వాళ్ళను అరెస్టు చేసి జైలుకు పంపొచ్చు కదా! మధ్యలో కడప వాళ్ళ గురించి అవాకులూ, చవాకులూ పేలటం దేనికీ?

చదవండి :  " సీమ" భూమి పుత్రుడు "మాసీమ"కు జోహార్..!

ఈ నేపధ్యంలో జనవరి 1న తుళ్ళూరుకు వాయుమార్గంలో వచ్చిన బాబుగారు అక్కడి బహిరంగ సభలో మాట్లాడుతూ పంటలను తగులబెట్టిన వారి సంగతి ప్రభుత్వం తేలుస్తుంది అని చెబుతారేమో లేకపోతే ఆ విషయంలో ప్రభుత్వం సాధించిన పురోగతి గురించి వివరిస్తారేమో అని అనుకున్న స్థానికులకు నిరాశ ఎదురయ్యింది. పంటల తగులబెట్టిన వారి సంగతి గురించి చెప్పకుండా ఇలా చెప్పేరు ‘ఒకవేళ టీడీపీ ఓడిపోయి ఉంటే రాజధానిని ఇడుపులపాయకు తరలించుకు పోయేవారు. కొంతమందికి ఇక్కడ రాజధాని రావడం ఇష్టం లేదు. అందుకే రాజధానికి ఇంత భూమి ఎందుకంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాంటి వారి పార్టీ కార్యాలయాలకు మాత్రం వేల ఎకరాలు కావాలా? అడవిలో నిర్మిస్తే పోతుంది కదా… అంటూ ఉచిత సలహా ఇచ్చేవారి ఇల్లు మాత్రం విమానాశ్రయానికి దగ్గర్లో ఉండాలా? కొంతమంది బెదిరించి భూముల విలువ పోగొట్టేలా చేస్తున్నారు. కడప రాజకీయాలు ఇక్కడ సాగవు. ప్రశాంత నగరమని, గొడవలు లేని చోట గొడవలు పెడతారా? కడప,కర్నూలులో,ముఖ్యంగా కడపలో చీని తోటలు నరికేస్తుంటారని,ఇక్కడ మాత్రం వాళ్ల ఆటలు సాగవు. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి.’ అని.

చదవండి :  ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

నిందితులను అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టాల్సిన ప్రభుత్వానికి అధిపతిగా ఉన్న ముఖ్యమంత్రి చేతలకు బదులు ఆరోపణల మార్గాన్ని ఆశ్రయించినప్పుడే అక్కడ ఏదో మతలబు ఉన్నట్లు అర్థమవుతోంది. తెదేపా నాయకులను మించి కడప, కర్నూలు సంస్కృతిపైన ముఖ్యమంత్రి ఇంగితం మరిచి దాడి చేశారు. ఏం కడప, కర్నూలు జిల్లాలలో మొన్నటి ఎన్నికలలో తెదేపాను ఆదరించలేదనా?  మిగతా ప్రాంతాల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి చవకబారు మాట మాట్లాడగలరా? ఇది ఎవరిని మభ్య పెట్టటానికి?  ఘటన జరిగి ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నా పంటల తగులబెట్టింది ఎవరో తేల్చలేక పోతున్నామనే కదా దీనర్థం!

బెజవాడకు నుండి 25 కి.మీ, చుండూరు నుండి 55కి.మీ,  చిలకలూరిపేట నుండి 70 కిం.మీ , స్టూవర్టుపురం నుండి 90 కి.మీ, లక్కవరం నుండి 135కి.మీ దూరంలో ఉన్న వేదికపై నుంచుని ప్రసంగించిన గౌరవ ముఖ్యమంత్రిగారు ఎక్కడో 400 కి.మీ దూరాన ఉన్న ప్రాంతాన్ని బూచిగా చూపడమంటే గురవింద సామెత గుర్తుకు రావడం లేదూ! అందులో అక్కసు కనిపించడం లేదూ!

ఇంత బాహాటంగా, బహిరంగంగా మన పైన బురద జల్లుతున్నా ఆ కంపును భరిస్తూ, స్తోత్రాలు వల్లిస్తూ నోరెత్తని మేధావులు మన నాయకులు. స్థానికంగా మాత్రం వీళ్ళకు కావాలి చెలాయించడానికి అధికారమూ, చూపడానికి ఆధిపత్యమూనూ!

ఇదీ చదవండి!

అరటి పరిశోధనా కేంద్రం

పులివెందులలో ‘అరటి పరిశోధనా కేంద్రం’

కడప : పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధమయింది. ఏపీకార్ల్‌లో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు …

ఒక వ్యాఖ్య

  1. hariprasad ampabathina

    Anthey brother tdp Vallu
    Adhikaram lo unnarani pogaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: