
కడపకు తొలి విమానమొచ్చింది
కడప: బెంగుళూరు నుండి ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( OP 131) 11 గంటల 30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంది. సుమారు 60 మంది ప్రయాణికులు ఈ విమానం ద్వారా బెంగుళూరు నుండి కడపకు వచ్చారు.

అంతకు మునుపు విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని ఆం.ప్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. దీంతో కడప విమానాశ్రయం అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రులు, కేంద్ర విమానయాన సంస్థ అధికారులు, కడప జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలోకేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి పూసపాటి అశోకగజపతి రాజు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదన రాగానే కడప విమానాశ్రయానికి ‘తాల్లపాక అన్నమయ్య’ పేరు పెట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి ఎయిర్ పెగాసస్ సంస్థ కడప – బెంగుళూరుల మధ్య విమాన సర్వీసులు నడుపుతుందన్నారు. కొన్నాళ్ళ తర్వాత కడపకు నడిచే విమాన సర్వీసుల సంఖ్యను పెంచి ఇక్కడి నుండి హైదరాబాదు, చెన్నయ్, విశాఖపట్నంలకు విమానాలు నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిచేందుకు వీలుగా కడప విమానాశ్రయాన్ని విస్తరిస్తామన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… కడప విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. విమానాశ్రయానికి అన్నమయ్య పేరు పెట్టాలన్న డిమాండ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు.

కడప నుండి ప్రతి ఆది, బుధ, గురువారాలలో బెంగుళూరుకు ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు నడుస్తుంది. అధికారులు, విమానయాన సంస్థ అధికారులూ శని, సోమవారాలో విమానం నడిపే దానికి గల అవకాశాలను పరిశీలించాలని కోరుకుందాం. శని, సోమవారాల్లో కడప – విమాన సర్వీసు అందుబాటులో ఉంటే ఐటి కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు సౌలభ్యంగా ఉంటుంది. కడప – బెంగుళూరు నగరాల మధ్య వారాంతాలలో అధికంగా ప్రయాణించేది వాళ్ళే కదా!