తుమ్మలపల్లె యురేనియం గని కోసం సరికొత్త పరిజ్ఞానం
కడప: వైఎస్ఆర్ జిల్లాలోని తుమ్మలపల్లె గని నుంచి తక్కువ గ్రేడ్ యురేనియంను (0.2 శాతం కన్నా తక్కువ) వెలికితీసేందుకు బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్) సరికొత్త విధానాన్ని కనుగొంది. ఇది ఆర్థికంగా లాభసాటి ప్రక్రియని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇందులో చాలా దశలు తగ్గుతాయని బార్క్ డైరెక్టర్ (మెటీరియల్స్ గ్రూప్) ఎ.కె.సూరి చెప్పారు. ఈ ప్రక్రియలో తక్కువ స్థాయిలో మంచి నీరు అవసరమవుతుందని వివరించారు. ద్రవరూప వ్యర్థాలూ తగ్గుతాయని పేర్కొన్నారు.
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఈ పరిజ్ఞానాన్ని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) తీర్చిదిద్దుతోందని ఆయన వివరించారు. తుమ్మలపల్లెలో గని, మిల్ తుదిదశలో ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం జార్ఖండ్‌లోని జాదుగూడ, తురామ్ది గనుల్లో యెల్లో కేక్ (మెగ్నీషియం డైయురేనేట్) ఉత్పత్తికి సంప్రదాయసిద్ధమైన సల్ఫ్యూరిక్ ఆమ్ల లీచింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. తుమ్మలపల్లిలో తొలిసారిగా ఆల్కలైన్ లీచింగ్ పరిజ్ఞానాన్ని తెరపైకి తెస్తున్నామని వివరించారు.