‘ఇప్పుడు స్పందించకపోతే తాగునీరూ దక్కదు’

    అఖిలపక్ష సమావేశం

    ‘ఇప్పుడు స్పందించకపోతే తాగునీరూ దక్కదు’

    ఒంటిమిట్ట స్ఫూర్తితో ఉద్యమించాల

    25, 26వ తేదీల్లో ప్రాజెక్టుల పరిశీలన

    కడప: జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోతే జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని అఖిలపక్షం నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్మికనేత సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో నవమి వేడుకలు నిర్వహించాలని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చారన్నారు. ఫలితంగా ఒంటిమిట్టలో అధికార లాంఛనాలతో నవమి వేడుకలు జరగనున్నాయని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో ప్రాజెక్టుల సాధనకు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పెండింగ్‌ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు.

    వామికొండ నుంచి కోడూరు వరకు గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) పనులను పూర్తిచేయాలని, అలగీ హంద్రీ -నీవా (హెచ్ఎన్ఎస్ఎస్) పనులను కూడా పూర్తి చేయాలన్నారు. వీటి కోసం ఎన్ని నిధులు అవసరం అనేది నివేదిక రూపొందించాలని తీర్మానించారు. ఇప్పుడు స్పందించకపోతే భవిష్యత్‌లో జిల్లాకు తాగునీరుకూడా దక్కదన్నారు. ఈ నెఖారును అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి మరో సమావేశం ఏర్పాటు చేసి చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం స్పందిచకపోతే న్యాయస్థానానికి అయినా పోవాలని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. శనివారం నీటిపారుదల శాఖ అధికారులను కలిసి జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి, అందుకు కావాల్సిన నిధులు ఎంత అనేది తెలుసుకోవాలని నిర్ణయించారు.

    ఈ నెల 25, 26వ తేదీల్లో పోతిరెడ్డిపాడు నుంచి వామికొండవరకు పనులను పర్యవేక్షించేందుకు అన్ని రాజకీయ పార్టీల నుంచి ఒక్కొక్కరు వెల్లి ప్రాజెక్టులను పరిశీలించాలని తీర్మానించారు.

    చదవండి :  సొంత భజనతో తరించిన ముఖ్యమంత్రి

    కార్యక్రమంలో మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు అంజద్‌బాష, జయరాములు, డీసీసీబీ ఛైర్మన్ తిరుపేలరెడ్డి, రైతునాయకుడు చంద్రమౌళీశ్వరరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

    ప్రభుత్వాలు మరిచిపోయినాయి

    జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులున్నాయనే విషయాన్ని ప్రభుత్వాలు మరిచాయి. ప్రజలకు అవగాహన లేదనే భ్రమలో నాయకులున్నారు. దొమ్మగూడెం, నాగార్జునసాగర్ వరద నీటిపైన ఆధారపడి నిర్మించినవే. అందరు ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలి.

    – సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, కార్మికనాయకుడు

    నిర్లక్ష్యం చేస్తున్నారు

    రెండువేల అడుగులు లోతు బోరుబావి తవ్వినా నీరు పడటంలేదు. జిల్లాను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అన్‌గోయింగ్ ప్రాజెక్టులు పూర్తికావాలంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. ప్రభుత్వం కాదంటే కోర్టుద్వారా అయినా కావాల్సిన నిధులు రాబట్టుకోవాలి. జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులన్ని పూర్తి చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చు.

    – వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ మంత్రి

    ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలి

    జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు జిల్లాకు ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. ఆ నిధులతో జిల్లాను అభివృద్ధి చేయ్యొచ్చు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇప్పటి వరకు ప్రాజెక్టులు చేపట్టారు. ఇంకా నిధులు చాలా అవసరం.

    – నజీర్ అహ్మద్, జిల్లా అధ్యక్షుడు – కాంగ్రెస్

    నివేదిక తయారు చేయాలి

    జిల్లాలో మిగిలిపోయిన ప్రాజెక్టులు పూర్తికావడానికి ఎన్ని నిధులు అవసరమో ముందు ఒక నివేదిక తయారు చేయాలి. పనులకు, భూ సేకరణకు, తదిర అవసరాలకు ఎంతనేది గుర్తించాలి. వచ్చే నెల 7న జరిగే బడ్జెట్ సమావేశాలలో ప్రస్థావిస్తాం. మరమ్మతుకు కూడా నిధులు లేవు. ఒక టీఎంసీ నీటిని ఇవ్వలేని పరిస్థితిలో కాలువలున్నాయి.

    చదవండి :  సమావేశానికి రాని వైకాపా నేతలు
    – ఎస్ రఘురామిరెడ్డి, మైదుకూరు శాసనసభ్యులు

    పార్టీ ముందుంటుంది

    జిల్లా ప్రజల పక్షాన నిలిచి ప్రజల బాగుకోసం చేసే ఏ పనికైనా మా పార్టీ ముందుంటుంది. గతంలోకూడా అనేక పోరాటాలు చేశాం. అఖిలపక్షం తీసుకునే నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉంటుంది.

    – రామసుబ్బారెడ్డి, సీపీఐ నాయకుడు

    అందరూ ముందుకురావాల

    జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలి. రాజకీయలకు ఇప్పుడు సమయం కాదు. ప్రజలు ఇబ్బంది పడకముందే నాయకులుగా మనం ముందుండి పోరాడాలి.

    – అమర్‌నాథ్‌రెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు

    ప్రభుత్వం తలుచుకుంటే..

    ప్రభుత్వం తలుచుకుంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం పెద్ద పనేంకాదు. అన్ని పార్టీలతో ఈ నెలాఖరున మరో సమావేశం నిర్వహించాలి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మనకు రావాల్సిన నీటిని తెచ్చుకుని అన్ని ప్రాజెక్టులకు, చెరువులకు నింపుకుంటే జిల్లా బాగుపడుతుంది. మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయి.

    – వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప పార్లమెంటు సభ్యుడు

    ప్రాజెక్టుల్లో చుక్కనీరు లేదు

    జిల్లా వాసులకు కృష్ణ జలాలు తప్ప మరో మార్గంలేదు. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినట్లే ఉంది. చుక్క నీరు ఎక్కడాలేదు. జిల్లాలో తీవ్రమైన కరవు ఛాయలు అలుముకుంటున్నాయి. వానలు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. టీజీపీలో కూడా కోటా ప్రకారం రావడంలేదు.

    చదవండి :  పాఠశాల ఆవరణలో 5 మృతదేహాలు
    – నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి

    సభలో చర్చిస్తాం

    పెండింగ్ ప్రాజెక్టులకు ఎంత నిధులు అవసరమనేది గుర్తించి నివేదిక తయారు చేస్తే అసెంబ్లీలో అడుగుతాం. గండికోటలో 20 టీఎంసీలు నీటిని నింపాలంటే ఆర్అండ్ఆర్‌కే రూ.250 కోట్లు అవసరం. హెచ్ఎన్ఎస్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎడారిగా మారిపోయే ప్రాంతం రాయచోటి ప్రాంతం. అక్కడ కనీసం హెచ్ఎన్ఎస్‌కు సంబంధించి డివిజన్ కార్యాలయం కూడాలేకపోవడం దారుణం.

    – శ్రీకాంత్‌రెడ్డి, రాయచోటి శాసనసభ్యులు

    సీమకు 200 టీఎంసీలు నీటిని ఇప్పించాల

    సీమ వాసులే ముఖ్యమంత్రిగా ఉండి మనకు అన్యాయం చేస్తున్నారు. పార్టీ సమావేశంలో జిల్లా గురించి ప్రస్తావించాం. ఇటీవల అమిత్‌షా నిర్వహించిన సమావేశంలోకూడా చెప్పాం – జిల్లాలో వైకాపాను గెలిపించిన కారణంగా జిల్లాను మరిచారని. రాయలసీమకు 200 టీఎంసీలు నీటిని ఇప్పించాలని అడిగినాం.

    – రామసుబ్బయ్య, భాజపా నాయకుడు

    జిల్లాను నిర్లక్ష్యం చేస్తోంది

    జిల్లాను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. జీఎన్ఎస్ఎస్ ద్వారా ఎక్కువగా లబ్ధిపొందేది కమలాపురం వాసులే. నియోజకవర్గంలో 80 వేల ఎకరాలు సాగుకు నీరందుతుంది.

    – రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం శాసనసభ్యులు

    ఇష్టం వచ్చినట్లు..

    ప్రజాప్రతినిధులు ప్రజలకోసం పాటుపడాలి. వర్షంలేక పంటలు పండలేదు. భూగర్భజలం అడుగంటిపోయింది. నీరులేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక క్వారీలకు ఇష్టం వచ్చినట్లు అనుమతులిస్తున్నారు.

    – గూడూరు రవి, జడ్పీ ఛైర్‌పర్సన్

    అన్ని పార్టీల వారు వచ్చినా తెదేపా వాళ్ళు ఈ సమావేశానికి రాలేదు ఎందుకనో? ఇంతకూ నిర్వాహకులు తెదేపా నేతలను ఆహ్వానించారా?

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *