కడప నుండి కలెక్టరేట్‌ వరకూ …. తప్పెట ప్రభాకర్‌రావు ఐఏఎస్‌

కడప నుండి కలెక్టరేట్‌ వరకూ …. తప్పెట ప్రభాకర్‌రావు ఐఏఎస్‌

కలెక్టరేట్‌ ఎలా వుంటుంది?

కలెక్టర్‌ కనుసన్నలలో  నడుస్తూ, ప్రభుత్వ శాసనాల అమలును పర్యవేక్షిస్తూ నిరంతరం జన సందోహంతో రద్దీగా ఉంటుంది.

చాలా సంవత్సరాల క్రితం…

ఇలా రద్దీగా ఉండే కలెక్టరేట్‌లోకి అడుగుపెట్టిన రాయలసీమ పిల్లోడు దానిని పర్యవేక్షించే అధికారులను దగ్గరగా గమనించాడు. తను కూడా వారిలా ప్రజా సమస్యలను తీర్చే అధికారి కావాలని కలలు కన్నాడు.ఆ తరువాత ఆ కుర్రాడే ఐఏఎస్‌ అధికారిగా ఎంపికై వివిధ హోదాలలో పని చేశాడు.

*    *   *

కడప జిల్లాకు చెందిన ప్రభాకర్‌ రావు ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో కార్మిక ఉపాధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పదవీ భాద్యతలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వంలో ఇప్పటి వరకు వివిధ హోదాలలో పనిచేసిన ఈ వైద్య పట్టభద్రుడు ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనే నిజమైన సంతప్తి ఉందంటారు. దక్షిణ ఆర్కాట్‌ జిల్లా కలెక్టర్‌గా, హౌసింగ్‌ కార్పోరేషన్‌ సిఎండిగా, సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఇలా పలు కీలక బాధ్యతలను ఆయన సమర్ధవంతంగా నిర్వహించారు. కడప నుండి కలెక్టరేట్‌ వరకూ ఎదిగిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. కరువు జిల్లా నుండి కలెక్టరేట్‌ చేరే క్రమంలో ఆయన ఎంతో నేర్పును, ఓర్పును ప్రదర్శించారు.

విధి నిర్వహణలో భాగంగా చెన్నయ్‌లో ఉంటున్న ప్రభాకర్‌రావు తన జీవితపు మజిలీలను ఇలా చెప్పుకొచ్చారు…

*   *   *

దశాబ్దాలుగా వెనుకబాటు తనానికి, కరువు కాటకాలకు, అభివృద్ధికి దూరంగా ఉన్న రాయలసీమ ప్రాంతంలోని ఒక జిల్లా కేంద్రం మా ఊరు – కడప. 1955లో నేను ఇక్కడే పుట్టాను. మట్టిరోడ్లు- ఇరుకైన వీధులు – చిన్న చిన్న తారు రోడ్లు – ముక్కు సూటిగా మాట్లాడే మనుష్యులు (దీనినే కరకుతనం లేదా మొరటు తనం అని కొందరనేవారు) -ఘనమైన సాహితీ వారసత్వం… ఇదీ నాకు ఊహ తెలిసినప్పటి కడప ముఖచిత్రం.

సిఐఎస్‌ స్కూలు, పోలీసు గ్రౌండ్‌, రామకృష్ణ కళాశాల, మున్సిపల్‌ గ్రౌండ్‌, వైవి స్ట్రీట్‌, అల్మాస్‌ పేట, శంకరాపురం నా రోజువారీ జీవితంలో కార్యక్షేత్రాలుగా నిలిచిన ప్రదేశాలు.

అమ్మ రోజమ్మ, నాన్న సంజీవి – పదవీ విరమణ పొందిన డిప్యూటీ కలెక్టర్‌. అమ్మానాన్నలకు మేం ఆరుగురం. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలం. నేను రెండోవాణ్ణి. మాది ఉమ్మడి కుటుంబం. నాన్న, అమ్మ, చిన్నాన్న, పిన్నమ్మ, వాళ్ళ పిల్లలూ, మేము అంతా కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. పదిమంది పిల్లలూ, వాళ్ళ అల్లరి, పెద్దలూ, ఇంటికొచ్చే చుట్టాలు… ఇలా ఎప్పుడూ మా ఇల్లు సందడిగా ఉండేది.

చదవండి :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వేరేవారికి పడుతున్నాయి?
with Parents
with Parents

అప్పట్లో మా ఇల్లు రాజారెడ్డి వీధిలో ఉండేది. అక్కడికి దగ్గర్లో ఉన్న సిఎస్‌ఐ స్కూల్లో మమ్మల్ని చేర్పించారు నాన్న. ఒకటో తరగతి నుండి పదవ తరగతి దాకా అక్కడే చదివాను- ఇంగ్లీషు మీడియంలో. మా స్కూల్లో పెద్ద ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ ఉండేది. రోజూ సాయంత్రం అందులో ఫుట్‌బాల్‌ ఆడించేవాళ్ళు. రేచల్‌పీటర్స్‌ అని ఒకామె మా స్కూల్లో పనిచేసేవారు. ఆమె మాకు ఉపాధ్యాయురాలు. రేచల్‌ మేడం చాలా స్ట్రిక్టు. ఆమె అంటే మాకందరికీ భయం. పరీక్షల్లో మార్కులు తగ్గితే మేడం బాగా కోప్పడేవారు.

మా ఇంటికి దగ్గర్లోనే పోలీస్‌ గ్రౌండ్‌ ఉంది. ప్రతిరోజూ అక్కడికి వెళ్ళి హాకీ ఆడేవాళ్ళం. రిపబ్లిక్‌ డే, ఆగస్టు 15 వస్తే చాలా సంతోషంగా ఉండేది. ఆ రోజు పోలీసు గ్రౌండ్‌కు వెళ్ళి అక్కడ పరేడ్‌ను ఆసక్తిగా గమనించేవాళ్ళం. పరేడ్‌కు కలెక్టర్‌ వస్తే టపాకాయలు పేల్చేవారు. కార్యక్రమం అయిన తర్వాత స్వీట్స్‌ పంచేవారు. అప్పుడప్పుడు అమ్మానాన్నల అనుమతి తీసుకుని సినిమాలకెళ్ళేవాళ్ళం. ప్రతాప్‌ టాకీస్‌లో సినిమా చూసి నడుచుకుంటూ ఇంటికి వచ్చే వాళ్ళం. అప్పుడప్పుడు నాన్నతో కలిపి కలెక్టరాఫీస్‌కు పోయేవాణ్ణి. అక్కడ పనిచేసే కలెక్టర్లను దగ్గరగా గమనించేవాణ్ణి. అలా అనుకోకుండా కలెక్టర్‌ కావాలనే ఆసక్తి కలిగింది.

సిఎస్‌ఐ హైస్కూలులో పదవ తరగతి పూర్తవడంతో రామకృష్ణ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరాను. నేను ఇంటర్మీడియట్‌లో హిందీని రెండవ భాషగా ఎంచుకున్నారు. మా హిందీ లెక్చరర్‌ మాకన్నా ఎక్కువగా క్లాసులకు డుమ్మాకొట్టేవారు. అలాగే మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యుల వారు మా కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా ఉండేవారు. ఆయన క్లాసులో పాఠం చెబుతుంటే మేము ఆ క్లాసులో కూర్చునేవాళ్ళం- నేను తెలుగును ఒక భాషగా ఎంచుకోకపోయినప్పటికీ. ఎందుకంటే ఆయన తెలుగు అంత చక్కగా చెప్పేవారు. ఇంటర్మీడియట్‌లో అప్పుడప్పుడు (చాలా తక్కువ సార్లు) ఇంట్లో చెప్పకుండా ఫ్రెండ్సుతో కలిసి సినిమాలకు పోయేవాళ్ళం.

చదవండి :  గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయశర్మ

[box type=”shadow” align=”alignleft” ]

  • పూర్తి పేరు : తప్పెట ప్రభాకర్‌రావు
  • పుట్టిన తేదీ : 25/12/1955
  • తల్లిదండ్రులు : సంజీవి, రోజమ్మ
  • విద్యార్హత : ఎంబిబిఎస్  (కర్నూలు వైద్యకళాశాల)
  • స్వస్థలం : కడప
  • వృత్తి : ఐఏఎస్ అధికారి (1982 బ్యాచ్) కేడర్ : తమిళనాడు
  • ప్రస్తుత హోదా : కమీషనర్, రవాణాశాఖ, తమిళనాడు

నిర్వహించిన హోదాలు :

  • 24/09/2011 – 23/05/2012 వరకు ప్రిన్సిపల్ కార్యదర్శి – రవాణాశాఖ
  • 28/05/2011 – 24/09/2011 వరకు చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, తమిళనాడు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్
  • 13/08/2007 – 28/05/2011 వరకు కమీషనర్, భూసంస్కరణల చట్టం మరియు ప్రిన్సిపల్ కార్యదర్శి – కార్మిక ఉపాధి శాఖ
  • 09/06/2006 – 13/08/2007 వరకు వ్యవసాయ మరియు సహకార సంఘాల రిజిస్ట్రార్
  • 26/03/2003 – 20/05/2006 వరకు కమీషనర్, వాణిజ్య పన్నుల శాఖ
  • 01/06/2002 – 26/03/2003 వరకు చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, తమిళనాడు మౌలికసదుపాయాల కల్పనా సంస్థ
  • 01/12/1999 – 01/06/2002 వరకు  కమీషనర్, పట్టణాభివృద్ది శాఖ
  • 01/09/1996 – 01/12/1999 వరకు  డైరెక్టర్, పట్టణాభివృద్ది శాఖ
  • 01/04/1995 – 01/09/1995 వరకు  జాయింట్ కమీషనర్, Social Justice & EmpowermentP rohibition
  • 01/09/1993 – 01/04/1995 వరకు  జిల్లా కలెక్టర్, దక్షిణ ఆర్కాట్
  • 01/07/1992 – 01/09/1993 వరకు  మేనేజింగ్ డైరెక్టర్, హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్
  • 01/05/1991 – 01/07/1992 వరకు  కో-ఆర్డినేటర్, పరిశ్రమల శాఖ
  • 01/10/1987 – 01/05/1991 వరకు  ఎండి, పట్టణాభివృద్ది శాఖ
  • 01/09/1986 – 01/10/1987 వరకు  ప్రాజెక్టు అధికారి, గ్రామీణాభివృద్ది
  • 01/09/1984 – 01/09/1986 వరకు  సబ్-కలెక్టర్, నాగపట్నం

ఇంటర్మీడియట్‌ పూర్తయిన తరువాత కర్నూలు వైద్య కళాశాలలో ఎంబిబిఎస్‌లో చేరాను. దీంతో ఇంటిని వదిలిపెట్టి కళాశాల హాస్టల్‌లో ఉండవలసి వచ్చింది. మొదటి సారిగా కళాశాలలో అడుగుపెట్టినప్పుడు వాతావరణం కొత్తగా అనిపించింది. సీనియర్లు మమ్మల్ని ర్యాగింగ్‌ చేసేవారు. పాటలు పాడడం, డ్యాన్స్‌ చేయడం లాంటివి చేపించేవాళ్ళు (ఇప్పటిలాగా క్రూరంగా ఉండేది కాదు). వైద్య కళాశాలలో అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఉండేవారు.

చదవండి :  కీ.శే. ఏవీఎస్ రెడ్డి ఐఏఎస్

కోస్తా కుర్రాళ్లైతే ‘మీ భాష మొరటుగా వుంటుంది, మీకు సరిగ్గా మాట్లాడటం చేతకాదు’ అని మమ్మల్ని ఎగతాళి చేసేవారు. కళాశాలలో ప్రముఖ మానసిక వైద్యుడు డా ఇండ్ల రామసుబ్బారెడ్డి నాకు సీనియర్‌ – ఆయన కూడా కడపకు చెందినవాడు. ఎప్పుడైనా సీనియర్లు ర్యాగింగ్‌ చేస్తుంటే ఆయన వచ్చి తప్పించేవారు.

మెడికల్‌ కాలేజీలో హౌస్‌ సర్జన్‌ చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కంబైన్డ్ మెడికల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాశాను. అందులో సెలెక్ట్ కావడంతో మెడిసిన్‌ పూర్తయిన తరువాత వైద్యాధికారిగా అహ్మదాబాద్‌లో పోస్టింగ్‌ వచ్చింది. అక్కడ ఉదయం 7.00నుండి మధ్యాహ్నం 12 వరకు ఆ తరువాత సాయంత్రం 4.30 నుండి 8.30 వరకు పనిచేయాల్పి వచ్చేది. మధ్యాహ్నం ఖాళీ సమయంలో గుజరాత్‌ విద్యాపీఠ్‌కు వెళ్ళి అక్కడి గ్రంధాలయంలో చదువుకునేవాడిని. అక్కడే ఉండగా (అహ్మదాబాద్‌లో) సివిల్స్‌ రాయాలనే ఆలోచన వచ్చింది. దాంతో ఉద్యోగ విరామ సమయంలో సివిల్స్‌ కోసం ప్రిపేర్‌ అయ్యేవాణ్ణి.

మొదటిసారి 1981లో సివిల్స్‌ రాశాను. అయితే పరీక్షలో విజయం సాధించలేక పోయాను. ఇది కొంత నిరుత్సాహానికి గురిచేసినప్పటికీ మళ్ళీ ప్రిపరేషన్‌ ప్రారంభించాను.

1982లో రెండవసారి సివిల్స్ పరీక్షలకు హాజరయ్యాను.  ఇప్పటి మాదిరిగా అప్పట్లో సివిల్స్ లో మెడిసిన్‌ సబ్జెక్ట్స్ లేవు. అందువల్ల చరిత్ర, రాజనీతి శాస్త్రంలను అప్షనల్స్-గా తీసుకొన్నాను.

1982లో ఐఏఎస్‌కు ఎంపికవ్వడంతో గుజరాత్‌ నుండి ముస్సోరికి శిక్షణ కోసం వెళ్ళాను.  1984లో భారతితో వివాహమైంది. శిక్షణ పూర్తయిన తరువాత తమిళనాడులో వివిధ హోదాలలో పని చేశాను.

సాధారణంగా సివిల్‌ సర్వెంట్స్ పైన రాజకీయ నాయకుల ఒత్తిడి అధికంగా ఉంటుందనే అపోహ ఉంది. బాగా పనిచేసే అధికారులకు అది ఎంత మాత్రం సమస్య కాబోదు. ఇప్పటికీ అప్పుడప్పుడూ కడపకు వెళుతుంటాను. ఈ మధ్య కాలంలో కడప రూపురేఖలు మారిపోయాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం.

–      తవ్వా విజయభాస్కరరెడ్డి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *