
‘డొక్కల కరువు’ సమయంలో బళ్లారిలో బ్రిటీషు వారు ఏర్పాటు చేసిన గంజికేంద్రం
డొక్కల కరువును తెలిపే జానపదగీతం
1876-78 సంవత్సరాలలో వచ్చిన కరువును ‘దాతు కరువు’ లేదా ‘డొక్కల కరువు’ లేదా ‘పెద్ద కరువు’ లేదా ‘ముష్టి కరువు’ గా వ్యవహరిస్తారు. తెలుగు సంవత్సరమైన ‘దాత’ లో వచ్చినందున ఈ కరువును ‘దాతు కరువు’ అని వ్యవరించేవారు. కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా కడుపు మాడ్చుకునేవాళ్ళు. దాంతో సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి ఎముకలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు(ఎముకల గూళ్ళు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పేరొచ్చింది. అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు.
తెలుగు అకాడమీ వాళ్ళు ‘త్రివేణి’ పేర ప్రచురించిన ‘అం.ప్ర జానపద గేయాల’ సంపుటిలో డొక్కల కరువును గూర్చి మేధావులు ఇలా సెలవిచ్చారు ‘ఆకలికి తట్టుకోలేని పసిపిల్లలను చూసి జాలిపడి కలవారు పిడికెడు అన్నం పెట్టి తమ ఎదుటనే తినిపించమని తల్లులను కోరేవారుట. అన్నం పెట్టిన వాళ్ళు వెళ్ళిపోగానే తల్లులు పిల్లల డొక్కలు చించి అందలి అన్నమును తినేవారుట. అందుకే కాబోలు ఆ కరువునకు ‘డొక్కల కరువు’ అని వాడుక’ అని. ఇది పైత్యం ప్రకోపించి మాండలిక పదాలకు అర్థం తెలియక సొంత ఊహలు జోడించడమే అనిపిస్తోంది. రాయలసీమలో ‘డొక్క’ అంటే పొట్ట అని సాధారణ అర్థం. ఇప్పటికీ సీమ పల్లెల్లో అన్నం తినకుండా ఉండే పిల్లలను ఉద్దేశించి ‘డొక్క మాడ్చుకోవద్దురా’ అనే మాట వినబడుతూ ఉంటుంది. అంటే ‘కడుపు మాడ్చుకోవద్దు’ అని అర్థం.
యెంత మంచి దాతకరువన్నా
భూమిలో జనులకు యేమి కష్టము కలిగేరోరన్నా ||యెంత||
మూడు రూపాయలిచ్చామంటే ముప్పావు కొర్రాలివ్వరూ
పది రూపాయలిచ్చామంటే పావు జొన్నాలివ్వరన్నా ||యెంత||
సేరు బంగారిచ్చామంటే సేరు రాగూలిచ్చారన్నా
సేరు యెండీ ఇస్తమంటే సేరు జొన్నాలిచ్చారన్నా ||యెంత||
సేరు గింజాలిసురూకోని వంబలైనా గాసుకుంటే
మంచిమంచికి వంతులేస్తే గంటేడైనా రాదురన్నా ||యెంత||
సేసుకున్నే పెళ్ళాలను సెట్టుకిందా పండబెట్టీ
సెప్పకుండా పారిపోయే సెడ్డకాలామోచ్చేనన్నా ||యెంత||
కలిగినమ్మా కనికరీంచి పిడికేడన్నం పిలకు బెడితే
కన్నబిడ్డల డొక్కజించే కాని కాలామొచ్చేనన్నా ||యెంత||
యెంత మంచి దాతకరువన్నా
భూమిలో జనులకు యేమి కష్టము కలిగేరోరన్నా
పాడినవారు: సెక్కిరాల్ల గొల్ల సుంకప్ప, సెక్కిరాళ్ళ, పత్తికొండ, కర్నూలు జిల్లా
పండబెట్టీ = ఇడిసిపెట్టి
వంబలి = అంబలి
మంచిమంచికి = ఒక్కొక్కరికి