కొత్త జిల్లా కేంద్రంగా కడప వద్దు !

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు వస్తే

కొన్ని నెలల క్రిందట పత్రికల్లో ఒక వార్త వచ్చింది – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి/ప్రణాళిక మండళ్లను ఏర్పాటు చేయనుందని. నాలుగు రాయలసీమ జిల్లాలకు కలిపి కడపలో, ఉత్తరాంధ్రకు విజయనగరంలో, మధ్యాంధ్రకు కాకినాడలో, దక్షిణాంధ్రకు గుంటూరులో అన్నారు. మూడు రాజధానుల విషయంలో లాగే నగరాల ఎంపికలోనే నాకు అభ్యంతరం ఉంది తప్ప వికేంద్రీకరణ విషయంలో ఈ మండళ్ల ఏర్పాటును నేను పూర్తిగా సమర్థిస్తాను. ఉత్తరాంధ్రకు విజయనగరం, దక్షిణాంధ్రలోని మూడు జిల్లాలకు ఒంగోలు, మధ్యాంధ్రకు ఏలూరు మేలు. (Ref: image in this page https://m.timesofindia.com/city/vijayawada/4-regional-planning-boards-to-be-created/amp_articleshow/70794017.cms) రాష్ట్ర ప్రభుత్వం ఈ మండళ్లను ఏర్పాటు చేసే విషయంలో నిజంగా చిత్తశుద్ధితో ఉన్నట్లయితే రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో భిన్న ప్రాంతాల మధ్యే కాక ఒకే ప్రాంతంలోని జిల్లాల మధ్య కూడా సమతూకం సాధించవచ్చు.

అయితే, ఈ మండళ్ల ఏర్పాటు గురించి మనకు తెలిసిందంతా అనధికారికంగా, లీకుల రూపంలో బయటికి వచ్చిందే తప్ప అధికారిక నిర్ణయం గానీ ప్రకటన గానీ వెలువడలేదు. బహుశా, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత దాని మీద దృష్టి పెడతారేమో అనిపిస్తోంది. ఎందుకంటే ముందుగా మండళ్లను ఏర్పాటు చేసి, తర్వాత జిల్లాల స్వరూపాలు మారిపోతే మండళ్ల పరిధులను మళ్ళా సవరించవలసి వస్తుంది.

దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చడానికి మాత్రం ప్రభుత్వం వైపు నుంచి కమిటీ ఏర్పాటు ద్వారా అధికారికంగా మొదటి అడుగు పడింది. పైగా ఇది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానమే. (మేనిఫెస్టోలో కూడానా?) కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం పట్టుదలకు సంబంధించి ఎటువంటి అనుమానాలూ లేవు :-). దీని మూలంగా పొరుగున ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాలు ఒక్కొక్కటీ రెండేసి జిల్లాలుగా విడిపోవడం తప్ప పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. వాటితో పోలిస్తే కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. ఎందుకంటే రాజంపేట, తిరుపతి నియోజకవర్గాలు రెండేసి జిల్లాల్లో వ్యాపించి ఉన్నాయి. ఇంతకాలం పేరుకు రాయలసీమలో ఉన్న తిరుపతి అధికారికంగా కోస్తాంధ్రలో కలవనుంది. (తత్ఫలితంగా నిజమైన రాయలసీమ, కోస్తాంధ్రల మధ్య అభివృద్ధిలో అసమానతలు మరింత తేటతెల్లం కానున్నాయి. అది వేరే టాపిక్.)

చదవండి :  నిరాదరణకు గురైంది తెలంగాణా కాదు, రాయలసీమే -శ్రీ కృష్ణ కమిటీ

Kadapa Parliamentకడప పార్లమెంటు నియోజకవర్గంలో కడప నగరం పూర్తిగా ఒక చివర, సరిహద్దు మీద ఉంటుంది. ఇలా అంచుల మీద ఉన్న నగరాలను అభివృద్ధి/పాలనాకేంద్రాలుగా చెయ్యడం విషయంలో నాకు తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు పెడతామన్నా, గత ప్రభుత్వం తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామన్నా వ్యతిరేకించడానికి నాకు గల కారణాల్లో అదొకటి.

ఇప్పుడు కడప పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారిస్తే ఆ జిల్లా కేంద్రంగా కడప నగరం కొనసాగాలనడం న్యాయం కాదు. ఎందుకు కాదో అర్థం కాకపోతే ఒకసారి కడప పార్లమెంటు నియోజకవర్గ మ్యాపు చూడండి. ఈ ప్రతిపాదిత జిల్లాకు దాదాపు నట్టనడుమ ఒక జిల్లా కేంద్రం కావడానికి అన్ని ఆర్హతలతో ప్రొద్దుటూరు పట్టణం ఉంది.

చదవండి :  పురపాలికల ఏలికలెవరో తేలేది నేడే!

మరి కడప నగరం వందల ఏళ్లుగా జిల్లా కేంద్రంగా కొనసాగింది కదా? మొదట్లో అంటే రాయలసీమలోని ఇతర జిల్లాలు ఏర్పడక ముందు మొత్తం రాయలసీమకే పాలనాకేద్రంగా విలసిల్లిన నగరం ఇప్పుడొక చిన్న జిల్లాకు కేంద్రంగా ఉండ తగదా అనిపించడం సహజం. అది అంతకంటే పెద్ద పాత్రనే పోషించతగిన స్థానంలో ఉంది. స్వార్థపర శక్తుల కుటిల పన్నాగాలు, దుష్ప్రచారాల మూలంగా రాష్ట్ర రాజధాని కాదగ్గ సువర్ణావకాశాన్ని కోల్పోయినా ఒక సూపర్ కలెక్టరేట్ తో రాయలసీమకు పాలనానగరంగా తను గతంలో కోల్పోయిన హోదాను తిరిగి పొందవలసి ఉంది.

Rajampeta Parliamentఅలాగే రాజంపేట నియోజకవర్గం. అసలు ఈ మ్యాపులు చూస్తే ఈ శాసనసభ నియోజకవర్గాల రూపురేఖలు ఇట్లా ఎందుకున్నాయా అని సందేహం వస్తుంది. కానీ శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగి ఎన్నో ఏళ్ళు కాలేదు. కాబట్టి ఏదో కారణం ఉండే ఉంటుందనుకుని దాన్ని అలా వదిలేద్దాం. ఈ నియోజకవర్గంలో రాజంపేట పట్టణం ఒక పక్కనుంటే నియోజకవర్గం ఇంకో పక్కన విస్తరిస్తూ పోయింది – జిల్లా సరిహద్దులు దాటుకుని మరీ. ఆ నియోజకవర్గం ఒక జిల్లాగా ఏర్పడితే రాజంపేట పట్టణం ఆ జిల్లాకు కేంద్రంగా ఉండతగదు. రాయచోటి సబబైన ఎంపిక అవుతుంది. మదనపల్లె కూడా ఒక పోటీదారే అయినప్పటికీ రాజంపేటలాగే అది కూడా ఇంకో మూలనుండిపోయింది. రాజంపేట, రైల్వే కోడూరు లకు మరీ దూరమైపోతుంది. కాదూ కూడదు, మదనపల్లె జిల్లా కేంద్రం కావలసిందే అన్నా రాజంపేట, కోడూరులను వదిలించుకుంటే తప్ప అది సాధ్యడదు. అప్పుడు వాటిని కడప జిల్లాలో ఉంచేసి (లేదంటే కోడూరును ఏ తిరుపతిలోనో నెల్లూరులోనో కలిపేసి), మరీ చిన్న జిల్లా కాకుండా ఉండడానికి అవతలి పక్కన కొన్ని ప్రాంతాలు కలపాలి. ఈ కూడికలు, తీసివేతలు ఇవన్నీ అనవసరమైన, నివారించదగిన తలనొప్పులు. పైగా రాయలసీమ వాస్తవ పరిధి కూడా చిత్తూరు, తిరుపతి మినహా ఇప్పుడున్న పార్లమెంట్ నియోజకవర్గాల పరిధులతో సరిపోలుతుంది. తీరి కూర్చుని దాన్నిప్పుడు చెడగొట్టనవసరం లేదు.

రచయిత గురించి

కడప జిల్లా సమగ్రాభివృద్ది కోసం పరితపించే సగటు మనిషీ త్రివిక్రమ్. సాహిత్యాభిలాషి అయిన త్రివిక్రమ్ తెలుగును అంతర్జాలంలో (వికీపీడియా సహా) వ్యాపితం చేసేందుకు ఇతోధికంగా కృషి చేశారు. ‘ఈ-మాట’ అంతర్జాల పత్రికకు సంపాదక వర్గ సభ్యులుగా వ్యవహరిస్తున్న వీరు కొంతకాలం పాటు అంతర్జాల సాహితీ పత్రిక ‘పొద్దు’ సంపాదకవర్గ సభ్యులుగా వ్యవహరించినారు. అరుదైన ‘చందమామ’ మాసపత్రిక ప్రతులను ఎన్నిటినో వీరు సేకరించినారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ‘పడిగెలపల్లి’ వీరి స్వస్థలం.

చదవండి :  ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం ఆందోళనలు

ఇదీ చదవండి!

వన్ టౌన్ సర్కిల్

కడప రుచుల కేంద్రం వన్ టౌన్ సర్కిల్

నేను పెద్దగా రుచులు తెలిసినవాణ్ణి కాను. రుచుల విషయంలో నాది మా నాన్న తరహా. ఏదైనా పదార్థం తినేటప్పుడు ఎంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: