
ప్రొద్దుటూరులో 6వేలమందితో జాతీయ గీతాలాపన
ప్రొద్దుటూరు: జయహో జనగణమన చతుర్థ వార్షికోత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరు అనిబిసెంట్ పురపాలక ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం వివిధ విద్యాసంస్థలకు చెందిన ఆరు వేలమంది విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. 1911 డిసెంబరు 27వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని రచించి ఆలపించిన సందర్భంగా అందరిలో ఐక్యతాభావం, జాతీయతా భావం, దేశభక్తిని పెంపొందించేందుకు, మహనీయులను స్మరించుకునేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించారు.
ఉదయం 10 గంటలకు సుమారు 6 వేల మంది విద్యార్థులు మైదానానికి చేరుకున్నారు. మాజీమున్సిపల్ చైర్మన్ నరాల బాలిరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్‌చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రుల ప్రసంగాన్ని ఆడియో టేపుల ద్వారా విద్యార్థులకు వినిపించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా ఆలపించిన జాతీయ గీతాన్ని వినిపిస్తూ అందరూ ఏక కంఠంతో జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.
విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, పరుగు, చిత్రలేఖనం, లాంగ్‌జంప్, హైజంప్ తదితర పోటీలలో గెలుపొందిన వారికి పతకాలను తహశీల్దార్ రాంభూపాల్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డి తదితరులు అందజేశారు.