jammalamadugu

జమ్మలమడుగు అరాచ(జ)కీయం వెనుక కథ

జమ్మలమడుగు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక పేర అధికార పార్టీ రేపుతున్న దుమారం ఉద్రిక్తతలకు దారితీసింది. జానీ అనే తెదేపా కౌన్సిలర్ నిన్న అజ్ఞాతంలోకి  వెల్లిపోవడంతో మొదలైన రగడ ఇవాల్టికీ కొనసాగుతుండడం విచారకరం. ఘనత వహించిన మన ఏలికలు ఈ వివాదానికి ముగింపు పలుకపోగా వత్తాసు పలుకుతుండడమే విషాదకర పరిణామం.

22 మంది సభ్యులకు 21మంది హాజరైనప్పటికీ జానీ అపహరణకు గురైనందున గురువారం ఎన్నిక వాయిదా వేసినట్లు ఈ కార్యక్రమానికి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన జమ్మలమడుగు ఆర్డీవో రఘునాధరెడ్డి ప్రకటించారు. ఈ నేపధ్యంలో కనబడకుండా పోయిన జానీ ఈరోజు మీడియాకు ఫోన్లు చేసి తాను క్షేమంగా ఉన్నాననీ తననేవరూ కిడ్నాప్ చేయలేదని తెలపడంతో ఎన్నిక అనివార్యమైంది.  50శాతం కోరం ఉంటే  చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిబంధనలు రూఢీ చేస్తున్నాయి. 

ఇవాళ జరగాల్సిన ఎన్నికను ఎలాగైనా అడ్డుకోవాలని తెదేపా వాళ్ళు, ఎన్నిక జరపాలని వైకాపా వాళ్ళు పట్టుబట్టారు. అయితే అజ్ఞాతవాసంలో ఉన్న జానీ వచ్చే వరకు ఎన్నిక జరుగనివ్వమంటూ సుమారు రెండు వేల మంది తెదేపా వాళ్ళు భీష్మించుకుని కూర్చున్నారు – జమ్మలమడుగు పట్టణంలో. వీళ్ళందరికీ సౌమ్యుడుగా పేరున్న తెదేపా మాజీమంత్రి రామసుబ్బారెడ్డి నేతృత్వం వహించడం ఒక విశేషం. ఇలా రామసుబ్బారెడ్డిని పెద్దల పేరు చెప్పి సిఎం రమేష్ పురమాయిన్చాడనే ఒక ప్రచారం (పుకారు) జమ్మలమడుగు పట్టణంలో వినిపిస్తోంది.

చదవండి :  15 సంవత్సరాల కల సాకారమైంది !

ఇక వైకాపా వాళ్ళు కూడా నిన్న సాయంత్రం మునిసిపల్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపేరు. ఇవాళ కూడా ఎన్నిక జరపాలని పట్టుబట్టారు. కాకపొతే వీళ్ళు తెదేపా వాళ్ళలాగా జనాలను పట్టణంలోకి తేకపోవడం కొంతలో కొంత ఉపశమనం కలిగించే అంశం.

ఎట్టకేలకు ఈరోజు సాయంత్రం ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలోనే ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వైకాపాకు చెందిన కడప పార్లమెంటు సభ్యుడు  అవినాష్ మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చారు. అప్పటికే ఒకమారు పోలీసులపై రాళ్ళు విసిరి హుషారు మీదున్న తెదేపా కౌన్సిలర్లు కోరం సమావేశమైనప్పుడు అవినాష్ కంట్లో కారం పొడి చల్లి అతనిపై దాడి చేశారు.

ఈలోపే తనకు రక్తపోటు ఎక్కువైనందున ఎన్నిక నిర్వహించలేనని ప్రిసైడింగ్ అధికారి చేతులెత్తేశాడు. అయితే వైకాపా వాళ్ళు డాక్టరును రప్పించి అధికారికి వైద్యపరీక్షలు చేయించారు. పరీక్ష చేసిన డాక్టర్లు అధికారి రక్తపోటు సాధారణంగానే ఉందని తేల్చేశారు.  అదిగో అక్కడే మళ్ళీ కథ మొదటికొచ్చింది – విషయమేమిటంటే మన జానీ అజ్ఞాతవాసం వీడే వరకు అక్కడ ఎన్నిక నిర్వహించడం తెదేపా ప్రభుత్వ పెద్దలకు ఇష్టం లేదు. అందుకు ఎన్నికల సంఘమూ, నిబంధనలు అంగీకరించకపోవచ్చు – ఇక ఎన్నికను ఆపటానికి మిగిలింది రెండే మార్గాలు – ఒకటి అధికారుల సాయంతో – రెండు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా.

చదవండి :  93 మందితో వైకాపా జిల్లా కార్యవర్గం

జమ్మలమడుగులో మునిసిపల్ ఎన్నికల ఫలితాలలో ప్రజలు వైకాపాకు 9 తెదేపాకు 11 కౌన్సిలర్ పదవులను కట్టబెట్టారు. చైర్మెన్ ఎన్నికకోచ్చేసరికి ఎక్స్ అఫీషియో సభ్యులైన స్థానిక శాసనసభ్యుడూ, స్థానిక పార్లమెంటు సభ్యుడూ ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్దపడ్డారు. ఫలితంగా రెండు పార్టీల వారి సంఖ్యా సమానమైనది. అదిగో ఆ సమయంలోనే మన జానీ అజ్ఞాతవాసానికి వెల్లిపోయేడు – తెదేపా వాళ్ళ ఆశలపై నీళ్ళు చల్లి.

జిల్లాలో 7 పురపాలికలుండగా 20 మంది కౌన్సిలర్లున్న జమ్మలమడుగుపైనే ఎందుకీ పంతం? ఎందుకంటే అది తెదేపా ఉపాధ్యక్షుడూ… బాబు గారి కోటరీలో ముఖ్యుడూ అయిన సిఎం రమేష్ సొంత నియోజకవర్గం కాబట్టి. మరి వైకాపా వారెందుకు అక్కడ అంత పట్టుదలగా ఉన్నారు అంటే…  సిఎం రమేష్ సొంత నియోజకవర్గం కాబట్టే!

అబ్బ అది వైఎస్ జగన్ సొంత జిల్లా కాబట్టి కాదా? అంటే. సొంత జిల్లానే – కానీ ఇదే జిల్లాలో వైకాపా వాళ్ళు ఎన్నికలలో ఆధిక్యం పొందిన వాటిని కూడా తెదేపా వాళ్ళు లాగిన సభ్యుల మూలంగా డ్రా వరకూ వెళ్లి లక్కుతో గెలుచుకున్నారు. ఆ పురపాలికలలో ఎక్కడా వైకాపా వాళ్ళు ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరించలేదు. ఇలా వైకాపా వాళ్ళను లాగడంలో సిఎం రమేష్ పాత్ర కీలకం (ఇదే విషయాన్ని చాలా పత్రికలు రాశాయి. పైపెచ్చు రమేష్ వ్యూహాలు బాగా పన్నుతున్నారని చెప్పేయి కూడా)

చదవండి :  జానీ వచ్చాడోచ్...

అందుకే తెదేపా గెలిచిన సిఎం రమేష్ నియోజకవర్గంలోని జమ్మలమడుగు దక్కించుకోవాలనేది వైకాపా వారి వ్యూహం. దెబ్బతీసిన వాడికి అదే దెబ్బను రుచి చూపించాలనేది ఈ వ్యూహం వెనుకనున్న కధ. ఈ వ్యూహంలో జానీ పాత్ర ఉందా? లేదా? అనేది తేల్చగలిగింది ఒక్క జానీ మాత్రమే! మధ్యలో ఇబ్బంది పడుతున్నది ఉద్యోగరీత్యా ఇక్కడ పనిచేస్తున్న అధికారి మాత్రమే! ఆయనకు అధికార పార్టీ వాళ్ళ నుండి ఎంత ఒత్తిడి లేకపోతే అలా చేస్తారు?

ఈ కథ మొత్తంలో పావులు రెండు రోజులుగా తిండీ తిప్పలూ .. ఇల్లూ వదిలిపెట్టి జమ్మలమడుగు రోడ్ల మీద కాపు కాసిన సగటు అమాయక ప్రజలే! ఈ కథ ఇకమీద ఎంటువంటి  విషాదాలకు చోటివ్వకుండా ముగియాలని కోరుకుందాం!

(గమనిక: ఈ వ్యాసం రాసే సమయానికి జమ్మలమడుగు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తి కాలేదు)

ఇదీ చదవండి!

గండికోట కావ్యం

తొలి ఆధునిక క్షేత్రప్రశస్తి కావ్యం – ‘గండికోట’ – మొదటి భాగం

గండికోట కావ్యం సమీక్ష తెలుగులో ఆధునిక క్షేత్రప్రశస్తి కావ్యాలు స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, ఆ తర్వాత చాలా వచ్చాయి. వీటిని చారిత్రక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: