
‘రాక్షస పాలన కొనసాగుతోంది’ – సిఎం రమేష్
జమ్మలమడుగు సంఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు సరిగాలేదని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. స్థానిక పురపాలిక ఛైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా గురు, శుక్రవారం జరిగిన లాఠీఛార్జి, బాష్పవాయు ప్రయోగంలో గాయపడిన తెదేపా నాయకులు, కార్యకర్తలను పరామర్శించడానికి శనివారం జమ్మలమడుగుకు వచ్చిన రమేష్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
పురపాలిక ఎన్నిక న్యాయబద్ధంగా జరపాలంటూ నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిని పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చారన్నారు. పోలీసు అధికారులపై దాడిచేసిన వారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్న ఆయన జమ్మలమడుగులో ఇంకా రాక్షస పాలన కొనసాగుతోందన్నారు.
కొందరు అధికారులు ఇంకా స్థానిక ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి పరిస్థితులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు.
తెదేపాలో ముఖ్యుడిగా చలామణీ అవుతున్న రమేష్ తమ ప్రభుత్వ హయాంలో జమ్మలమడుగులో ఇంకా రాక్షస పాలన కొనసాగుతోందని చెప్పడం విశేషమే అవుతుంది! రమేష్ ఏమో చెప్పాలనుకుని తడబడ్డారా?
కడప జిల్లా పైన (పసుపు) పచ్చని విషం
Wednesday, July 24, 2019