తలకోనకు మూడురెట్లున్న గుంజన జలపాతం

తలకోనకు మూడురెట్లున్న ఆ జలపాతం ఇన్నాళ్ళు ఎలా గుంభనంగా మిన్నకుండిందో ఆశ్చర్యకరం. శివుడి జటాజూటమై ఎగసిపడుతున్న గలగలా ప్రవహించే ఆ మహాస్వరూపం అజ్ఞాతవాసం విస్మయకరం. ప్రకృతిలోని వైవిధ్యాన్ని, జనజీవాన్ని కలబోసుకుని ఉధృతమైన శక్తితో ఉరకలెత్తే వైనం గొప్ప ఉత్తేజకర దృశ్యం.

కడప జిల్లా రైల్వేకోడూరుకు పశ్చిమంగా శేషాచలం కొండల్లో, సుమారు 11 కి.మీ దూరాన – 244 అడుగుల ఎత్తైన ‘గుంజన జలపాతం’ కానవస్తుంది. చట్టపరంగా ఇది ‘శ్రీ వెంకటేశ్వరా నేషనల్ పార్క్’ ఆస్తి. కోడూరు నుంచి బయలుదేరి వెంకటపతిరాజు కండ్రిగ, పందేటివారిపల్లె లేదా దేశెట్టి వారి పల్లె దాటితే వెంకటేశ్వరా అభయారణ్యంలోకి అడుగిడతాం. మరో మూడు నాలుగు గంటలు ఏకధాటిగా అడవిలో నడిస్తే పుల్లగూరపెంట ఫారెస్ట్ రెస్ట్ హౌస్, ఇక్కడి నుంచి మొదలయ్యే నేషనల్ పార్క్ హద్దులో ఒకటిన్నర మైలు ముందుకు సాగి కొంచెం ఎడమ వైపు పల్లంలోకి దృష్టి సారిస్తే ఆకాశాన్ని, అగాధాన్ని కలుపుతున్న శ్వేత వారధిలా గుంజన సాక్షాత్కరిస్తుంది. విభ్రాంతి కలిగించే ఈ పెద్దమనిషి పెద్దగా సవ్వడి చేయకుండా లోయలగుండా అలా మెలికలు తిరిగి గండ శిలలను తోసి, కొండను కోసి అడవి వెలుపల మైదానంతో ‘వాగేటి కోన’గా పరిణతి పొందుతుంది (లోతైన లోయలో పడుతున్నందున శబ్ద తరంగాలు ప్రతిధ్వనించి హోరును అక్కడికక్కడే ఆగిపోయేట్లు చేసి దూరంగా విస్తరింప చేయవు). సుమారు 20 ఏండ్ల క్రితం ప్రారంభమై ఇటీవలే మెరుగులు దిద్దుకున్న నాగేటికోన ప్రాజెక్టు ‘గుంజన’ చలవే, ఇక్కడ నుంచి ఒక పాయ గుంజనేరుగా కోడూరును చుట్టుకుని ప్రవహిస్తుంది.

చదవండి :  "కడప దేవుని గడప" అని ఎందుకంటారో ...

శేషాచలం అడవులకే తలమానికమైన 75 మీటర్ల గుంజన జలపాతం కిందకు పోవడం చాలా ప్రమాదకరం. నూరు ఏనుగు తొండాలతో కుమ్మరించినట్టు జలధార పైనుంచి భూమిలోకి దిగగోట్టినట్లు పడుతుంటుంది. అక్కడున్న ఒళ్ళు గగుర్పొడిచే గుండం నిండి నాసిక రేఖలా ఎడమ పక్కకు ఒలికి తిరిగి నెమలి పించం తిరగేసినట్లు నిలువుగా జాలువారుతుంటుంది. ఈ అర్ధముఖాకృతి నుంచి చిప్పిల్లే నీటి తుంపరలు పారవశ్యం కలిగిస్తున్నట్లుంది. ఓ పావురాల గుంపు పదేపదే అక్కడ చక్కర్లు కొడుతోంది. పాకుడు పట్టిన రాళ్ళ మధ్య పొడుచుకు వచ్చిన ఫెర్న్ మొక్కలు పాము పడగలల్లే తలలూపుతున్నాయి. ఎర్రని కాంతులీనే క్వార్ట్ జయిట్ (స్ఫటిక శిల) భూమి పరిణామక్రమంలో కొన్ని లక్షల ఏండ్ల క్రితం విస్ఫోటనం చెంది విచ్చుకోవడంతో ఏర్పడిన ఖాళీ మధ్య ఈ సజీవ రూపం ప్రాణం పోసుకుంది.

గుంజన జలపాతం
రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంజన జలపాతం

ఏడాది పొడవునా ప్రవహించే గుంజనకు పై భాగాన గలకంగుమడుగును దాటితే వచ్చు ‘మూడేర్ల కురవ’ ప్రధాన జలాధారం. పెనుభాములకోన, ఎనుములేటికోనల నీళ్ళు ‘మూడేర్ల కురవ’ను ఎల్లవేళలా నిండుగా పారేట్లు చూస్తాయి. ‘గుంజన’ అసలు పేరు ‘కుంజర’(ఏనుగు) అయి ఉంటుందని చెబుతారు. కాలక్రమేణా గుంజనగా నానుడిలోకి వచ్చిందని అంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఏనుగులు విస్తారంగా తిరిగేవనడానికి ఆధారం దొరికింది. పుల్లగూరపెంట దగ్గరున్న ఓ నిలువుపాటి బండ మీద చిత్రితమైన అడవి ఏనుగు బొమ్మ అత్యంత ఆసక్తికరం. చరిత్ర పూర్వయుగం నాటిదా? కాదా? అన్నది కాలనిర్దారణ జరగాలి.

చదవండి :  బారులు తీరిన ఓటర్లు - భారీ పోలింగ్ నమోదు

అటు చిత్తూరు జిల్లా తలకోన, తిరుమల నుంచి కూడా ఇక్కడకు చేరుకోవచ్చు. అభయారణ్యంగా ప్రకటించనంతవరకు విశిష్టమైన ఎర్రచందనం, శ్రీగంధం, బిల్లు, జాలారి, మద్ది దుంగలను లాగలేక ఎద్దులు ముక్కులు ఎగబీల్చేవి. ‘కూపు’ పేరుతొ అడవిని తెగనరికి జీవచ్చవం చేశారు. కనిపించిన జింకనల్లా కాల్చేశారు. కోళ్ళను కోసుకున్నారు. కుర్ర పందులను నమిలారు. పూరేల్లను చప్పరించారు. పులులను పొట్టనబెట్టుకున్నారు. ఒకటనేదేముంది జీవాలనేవి మెసలకుండా చేసేశారు. బ్రిటీషు వాళ్లయితే ఏకంగా బంగలానే నిర్మించి అడవి సంపద దోచేశారు. గాయపడ్డ అడవి మూలుగులు మనలని అడుగడుగునా వెంటాడుతాయి.

కడప, చిత్తూరు జిల్లాల అటవీ సరిహద్దుల్లో ఉన్న మొగిలిపెంట బంగ్లా, పుల్లకూరపెంట బంగ్లా చెప్పుకోదగ్గవి. ఇంతేసి ఇటుకలతో, ఉక్కు కడ్డీల్లాంటి కలపతో, సున్నం కలిపి శాశ్వత కట్టడాలు నిర్మించారు. వాటి వైభవం చూస్తుంటే ఆ రోజుల్లో ఈ ప్రాంతాలు నిత్య జనసంచారంతో విలసిల్లేవని బోధపడుతుంది. ఏనుగుల మీద, గుర్రాల మీద బ్రిటీషు వాళ్ళు ఇక్కడకు వచ్చేవాళ్ళు. కార్చిచ్చు చెలరేగినప్పుడు ప్రమాదం జరుగకుండా బాతకి ఇరువైపులా పేర్చిన రాతిగోడలు ఇప్పటికీ చూడవచ్చు.

చదవండి :  అపర అయోధ్య.. ఒంటిమిట్ట

తలెత్తి చూసేసరికి ఈ కధంతా విని చలించిపోయిందో ఏమో రెండు జడలేసుకున్న చలాకీ అమ్మాయి లాంటి కొండ గొర్రె (శాస్త్రీయనామం : మంటికస్ మింటోజక్) మమ్మల్ని అదోలా చూస్తూ నిదానంగా నడిచి పొదల్లో మాయమయ్యింది. శ్వాస బరువుగా ఎగబీలుస్తూ గుట్టనెక్కాం. నేలంతా ఏడు పందులు ముట్టెలతో దున్నిపారేశాయి. ఆ గుంతల్లో పడి కాలు మెలిక పడకుండా జాగ్రత్తగా నడుస్తూ తిరిగి పుల్లకూరపెంట చేరుకున్నాం. దార్లో పరీక్ష కోసం చిరుతపులి మలాన్ని సేకరించాం. ఇంకో విషయం చెప్పకుండా మరచా. గుంజన మొగదాలలో ఓ బండ మీద మన పూర్వీకుడు గీసిన కణితిదో అడవి దున్నదో కొంత చెరిగిపోయిన చిత్రం (ట్రైబల్ ఆర్ట్) కనిపించింది. ఒకప్పుడు ఇవన్నీ మన ముత్తాతల ఇళ్లన్న మాట. గుంజన మర్మర ధ్వని కొత్త రహస్యాన్నేదో గుసగుసలాడుతున్నట్లుంది.

మరుసటి రోజు నేషనల్ పార్క్ డిప్యూటి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆనంద మోహన్ ను కలిస్తే నెలకోసారి గుంజనకు పోయి వచ్చే ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. 20 – 25 మందితో కూడిన జట్లు తిరుపతి కపిలతీర్ధం వద్ద గల తమ కార్యాలయంలో సంప్రదిస్తే వీలువెంబడి ఒక గైడ్ ను ఇచ్చి జలపాతాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తామన్నారు.

గుంజన దాపులనే 195 అడుగుల మరో జలపాతం ఉంది. ఉత్సాహవంతులెవరైనా దానిని కనుక్కోగలరేమో ప్రయత్నించండి!

– బి.వి.రమణ

ఇదీ చదవండి!

ఓటర్ల జాబితా

రైల్వేకోడూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

రైల్వేకోడూరు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోనే అత్యధికంగా …

ఒక వ్యాఖ్య

  1. ramana garu, mee information challa bagavundhi, dhanyavadamullu maa tho panchukunandhuku.

    meeru epudiyena akkadiki vellara. inka konni phots vuntey upload cheyandi.

    challa adbuthamiyena pradeshmu ni parichayamu cheysaru.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: