మంగళవారం , 17 సెప్టెంబర్ 2024
ఇచ్ఛాగ్ని
ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

కేతు విశ్వనాథరెడ్డి ఇంటర్వ్యూ…

కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు పొందిన సందర్భంగా.. ప్రముఖ కథా రచయిత ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి తో కె.ఎస్.రమణ ప్రత్యేకంగా సంభాషించారు. ఆ సంభాషణ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో డిసెంబర్ 23 ,1996న  ప్రచురితమైంది. ఆ సంభాషణ కడప.ఇన్ఫో వీక్షకుల కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాం…

నిన్న కా.రా. మాష్టారు, నేడు మీరు కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు పొందటం ఆధునిక తెలుగు సాహిత్యానికి అనువైన వాతావరణం ఏర్పడుతోంది అనటానికి సూచనగా వుందని భావిస్తున్నారు. మీరేమంటారు?

మీరన్నది అక్షరాల నిజం. ఆధునిక తెలుగు కథ ఎక్కడో ఏ ఒక్కరితోనో ఆగిపోలేదని సాహిత్యమిత్రులు ఈ సందర్భంగా పునరాలోచించుకుంటే నేను చాలా సంతోషిస్తాను. ఈ పునరాలోచనలో జీవితం నుంచి బయలుదేరాలా? కథా సాహిత్యం నుంచి బయలుదేరాలా?మనలను అప్పుడప్పుడు కట్టివేసే తాతాచార్యుల ముద్రల చెర నుంచి విముక్తం కావాలా అనే విషయాలను సావధానంగా ఆలోచిస్తే -తెలుగు కథా రచయితలు తెలుగు ఆధునిక సాహిత్యాన్ని జీవితం నుంచే స్పష్టించుకుంటూ పోతారనే నా ఆశ ” .

తెలుగు కధా సాహిత్యాన్ని ఇతర భారతీయ భషల్లో వచ్చిన కధా సాహిత్యాన్ని పరిశీలించి పోల్చిచూసినప్పుడు మీకేమనిపిస్తుంది?

కొన్ని సామ్యాలు, ఆంతరాలూ వున్నాయనిపిస్తుంది.వివిధ భారతీయ భాషల్లోని కధాసాహిత్యంతో నాకున్న స్వల్ప పరిచాయాన్ని అదీ అనువాదాల ద్వారా దృష్టిలో వుంచుకొని అభిప్రాయం చెప్పమంటే – ఇటీవల మానసిక సంఘర్షణకు ఆధ్యాత్మిక సంవేదనకు ప్రాధాన్యం ఇవ్వడం కొందరి రచయితల విషయంలో జరుగుతోంది . తెలుగులో బలమైన సామాజిక ఉద్యమాల ప్రేరణ ఉండటం వల్ల భౌతిక జీవిత ఘర్షణకు ప్రాధాన్యం ఎక్కువ కనిపిస్తుంది. అట్లాగని భౌతిక జీవిత ఘర్షణలో మానసిక సంవేదనని తెలుగు కధా రచయితలు పట్టించుకోలేదని అర్ధంకాదు. మరో అంతరం కనిపిస్తుంది. అది రూప ప్రయోగానికి సంబంధించింది.తెలుగు కధా సాహిత్యంలో రూపప్రయోగాలున్నాయి. అయితే మిగతా భాషలతో పోల్చినప్పుడు అవి తక్కువగా వున్నాయి .అనేవారికి నాదొక్కటే మనవి. మనకు కలకత్తా లేదు,ముంబాయి లేదు, మద్రాసు, బెంగుళూరు కూడా లేవు. అమృత్సర్ లేదు అహమ్మదాబాదు కూడా లేదు. వాటి దారిలో హైదరాబాదో ,విశాఖో, విజయవాడో, అనంతపురమో, తిరుపతో, కడపో నగరీకరణ చెందితే రూప ప్రయోగాలు వాటంతటవే వస్తాయి. అయితే తెలుగు జీవితంలోని వాస్తవికతను గుర్తించిన వారసత్వం కేవలం తెలుగు కథకుడ్ని ప్రయోగవాదుడుగా నిలపదని నా విశ్వాసం “.

చదవండి :  'లౌకికవాద ధృక్పథంతో సాగితే అది అభ్యుదయం'

మానసిక చిత్రణ, వాతావరణ చిత్రణ కథా వస్తువుగా స్వీకరించి అద్భుతమైన కథలు రాసినవారున్నారు. అంతరంగిక జీఎవిత చిత్రణ ప్రధానంగా మీరు కథలు రాశారా?

మీరు మార్క్స్ కూ ప్రాయిడ్ కూ ఏదో తగాదా పెట్టినట్టుంది. అయితే అదేదో తగాదా అని నేను భావించడం లేదు. నవ్య ప్రాయిడ్ వాదులను కూడా అంతో ఇంతో దృష్టిలో పెట్టుకునే ఈ మాట అంటున్నాను. మానసిక జీవితానికీ భౌతిక జీవితానికీ ఉండే సంబంధం – ఎక్కడా ఎప్పుడు ఎందుకు ప్రారంభమవుతుందనే ఆలోచన నిజంగా రచయిత చేస్తే దేనికెంత ప్రాధాన్యతనివ్వాలో రచయిత నిర్ణయించుకుంటాడు. వాతావరణం విషయం కూడా ఇట్లాంటిదే . పెద్దిభొట్ల సుబ్బరామయ్య నో, ‘ చాసో ” నో అడపా దడపా సొదుం జయరామో ,రాచమల్లు రామచంద్రా రెడ్డి నో ఇంకా అల్లం రాజయ్య ,తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, పి.సత్యవతి, ఓల్గా వంటివాళ్ల కథల్ని కాస్త నిశితంగా పరిశీలించండి. కేవలం మానసిక జీవితం, కేవలం భౌతిక జీవితం విడివిడిగా వుంటాయనే వాదనకు ఏ రచయితైనా దిగితే వాదించడం అనవసరం. ఇవి రెండూ పరస్పర ఆశ్రితాలు, ఆధేయాలు, ప్రభావకాలు, పూరకాలు. ఈ విషయాన్ని మార్క్సిస్టులు నిరాకరించడం లేదు. మన సమాజంలో యజ్ఞానికి ఎంత ప్రాధాన్యత ఉందో “సంకల్పా” నికీ అంతే ప్రాధాన్యం ఉంది.”

అయితే బుచ్చిబాబు, పద్మరాజు, త్రిపుర, వడ్డెర చండీదాస్ వంటి కథకులకు సముచిత స్థానాన్ని మీరంగీకరిస్తున్నట్లే కదా ! ?

“ పూర్తిగా అంగీకరించడం లేదు .వాళ్ళ మానసిక విశ్లేషణ బొత్తిగా భౌతిక జీవితం తో సంబంధం లేనిదంటే నేను నమ్మలేను . వాళ్ళు సృష్టించిన పాత్రల సామాజిక వర్గం, ఆర్థికవర్గం నాకు గుర్తుకు వస్తాయి. అది ఆ వర్గాలకు సహజం అనుకుంటే ఎవరికీ ఏపేచీ ఉండదు. ఒక అన్వేషణ ఉన్న రచయితలుగా వారిని నేను అభిమానిస్తాను. గౌరవిస్తాను. కథల్లోనో, వ్యాసాల్లోనో భౌతికంతో ఏ ప్రమేయం లేదని ఎక్కడైనా అన్న సందర్భాలుంటే – గుర్తున్నంతవరకు వాళ్ళ కల్పనా సాహిత్యంలో బలమైన తాత్విక ప్రతిపాదనగా ఉన్నాయనుకోను. నేను అంగీకరించలేను. ఒక వేళ ఉన్నా వాళ్ళ సాహిత్యాన్ని భౌతికవాదులైన రచయితలందరూ తప్పక చదవాలి. – చంచల స్వభావాలు అర్థం చేసుకోవడానికి .”

చదవండి :  అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు - సొదుం గోవిందరెడ్డి

అయితే సృజనక్రమంలో మీ దృష్టిలో వాస్తవికవాదానికి ఉన్న స్థానం ఎలాంటిది ? జీవిత సత్యాల్ని ఆవిష్కరించే క్రమంలో మీరే వాదాన్ని సమర్థిస్తారు ?

వాస్తవికతా వాదమంటే కేవలం యాంత్రిక, భౌతిక వాదం కాదు. అది భౌతిక , మానసిక శక్తుల ఘర్షణల ఆవిష్కరణ – మనిషి మరింత సుఖంగా సంస్కారవంతంగా, నాగరికంగా బతకడానికి చేసే నిరంతర ప్రయత్నం. దీని నిర్వచనం చర్చించడం కంటే ఒక సారి మళ్ళీ కుటుంబ రావు సాహిత్యాన్ని తాపీగా చదవడం మన ఆరోగ్యానికి మంచిదనుకుంటాను. అట్లాగే రా.రా విమర్శను కూడా . నేను మౌలికంగా వాస్తవికతావాదినే. ఏమేరకు ఆవాదాన్ని నా రచనల్లో ప్రతిఫలింప చేశాననేది తెలుపవలసింది నేను కాదు. పాఠకులూ, విమర్శకులూ, సాహిత్యకారులూ – నా రాసిని బట్టి కాదు. నేను స్లో రైటర్ ని. దిద్దీ దిద్దీ తాపత్రయపడేవాణ్ణి . దాన్ని గమనించవచ్చు. “

ఇవాళ వస్తున్న అనేక సాహిత్య వాదాలు, రావాలన్న బాలవాదాలతో సహా – వస్తుపరంగా సిద్ధాంతపరంగా ఈ వాదాల మార్గదర్శకత్వం లోనే సాహిత్యం నడవాల్సిన అవసరం ఉందా?

లేదు. ఏవాదాలైనా ముందు పుట్టవు. వాదాలు జీవితాన్ని దాటిపోతే వాటి బతుకు గల్లంతవుతుంది. కానీ సమాజంలోని జీవితవాస్తవాల్ని గ్రహించకపోతే వాదాలకు ఒక తాత్వికత సమకూరదు. స్త్రీవాదం ,దళితవాదం, బాలవాదం, ఆఖరికి రాబోయే వృద్ధవాదం లాంటి వాదాలు కూడా సమాజంలో ఉత్తమమైన తక్షణ, దీర్ఘకాల సమస్యల నుంచి పుట్టినవి. అవి నాదృష్టిలో ఉపవాదాలే కానీ సమగ్ర పోరాటవాదాలు మాత్రం కావు. అయితే ప్రాంతీయ అసమానతల్ని నిర్లక్ష్యం చేసినట్లే వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇవి భస్మాసుర హస్తాలవుతాయి. భస్మాసురుడిని ఏమోహినో వశపరచుకునేదాకా మోహినులు శాశ్వతంగా ఉంటారనుకోవడం మాత్రం భ్రమ, మన అవతారాలేవో ఉన్నట్లు”.

ప్రాంతీయ జీవితాన్ని ప్రతిబింబించే కథలు విరివిగా రావాలని కొందరి ఆకాంక్ష. ప్రాంతీయ జీవితం, ప్రాంతీయ మాండలికం ప్రాంతీయ రచయితలు – ఇలా వీటికి ప్రాధాన్యతనిస్తూ పోతే ఇవి ఎక్కడికి దారితీస్తాయి?

ప్రాంతీయ వాస్తవికవాద స్ఫృహ ఉన్న సాహిత్యం వేరు, కేవలం ప్రాంతీయ స్వలాభాపేక్ష ఉన్న రాజకీయం వేరు. ఉప సంస్కృతులు ఉప సమస్యలు ఉన్నంతకాలం అవి తప్పనిసరిగా సాహిత్యంలో ప్రతిఫలిస్తాయి. వాటిని తేల్చుకోవల్సింది సాహిత్యకారులు కాదు. రాజకీయ మనుషులు . అది తెలంగాణా అయినా సరే రాయలసీమ అయినా సరే. “

చదవండి :  అల్లసాని పెద్దన చౌడూరు నివాసి

భౌగోళిక పరిస్తులు జీవితాన్ని ఎలా నియంత్రిస్తాయో తెలుసుకోవాలనే వారిని రాయలసీమ కథలని చదవమంటారు. ఆ కథలన్నీ కరువు కథలే అని ప్రతీతి ఉంది. మరి ఇతర జీవిత పార్శ్వాలను తడిమిన రచయితలు అక్కడ లేరంటారా ?

అవును . భౌగోళిక పరిస్థితులు జీవితాన్ని అనుశాసించ్వ్హటం ఒక ప్రమేయం. మార్కెటింగ్ రీత్యా తప్ప రొయ్యల పెంపకం తెలియని రాయలసీమ మెట్ట వాసుల్ని అనుశాసిస్తున్నది సముద్రమా, నదులా, కొండలా గుట్టలా, నీళ్ళా – ఆలోచిస్తే దాన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించవచ్చు. ఈ పరిస్తితులతో ముడిపడిన అభివృద్ధి తలాతోకల్ని కూడా పరిశీలిస్తే – కన్యాశుల్కంలో సారా దుకాణంలో బైరాగి చెప్పినట్లు తత్వం బోధపడుతుంది. “

ఇటీవల కథాసంపుటాలు విరివిగా ప్రచురిస్తున్నారు. నవలతోపాటు కథానికకు కూడా మార్కెట్ వాల్యూ ఎక్కువ లభించిందంటారా?

ఇది ఒక రకంగా అభినందనీయమే. పాఠకుల తీరిక, అభిరుచి, ప్రసార ప్రచార వ్యవస్థ , భిన్నకాలవ్యవధుల్లో అందించే కార్యక్రమాలు, ఏకాగ్ర అనుభూతిని తక్కువ సమయంలో అందించగలిగిన దృశ్యమాధ్యమంలోని కథలూ – వీటన్నింటినీ సమన్వయపరచుకొంటే కథకుండబోయే భవిష్యత్తు అద్భుతం , అనూహ్యం. పది సెకన్లకాలంలో ఒక దృశ్యాన్ని మనస్సుకు హత్తుకునేట్లు చేయగలిగిన సాంకేతిక మాధ్యమం ఉన్నప్పుడు ఆ ప్రమాణాలు ప్రేక్షకుల మీద, పాఠకుల మీద, శ్రోతల మీదపడి తీరతాయి. “

1934 నుంచి ఒక గొప్ప సాహిత్య ఉద్యమాన్ని నడుపుతున్న సంస్థకు అధ్యక్షునిగా మీ ముందు పెద్ద బాధ్యత ఉంది. కర్తవ్యముంది. దానినెలా నిర్వర్తించాలనుకుంటున్నారు ?

అరసం విషయమా? తాతాజి, శ్రీశ్రీ, కుటుంబరావు, కె.వి.రమణారెడ్డి, తుమ్మల, ఏటుకూరి మొదలైన హేమాహేమీలకు సాధ్యం కానిదేదో సాధిస్తాననే అపోహలు నాకు లేవు. నీ సహచరులైన కార్యవాదులు చేసే సమన్వయాన్ని బట్టి జ్ఞాతులైన వైరిపక్షాలుగా గిరిగీసుకున్న వారి వ్యూహాలను బట్టి, వాస్తవికతను బట్టి, నడవగలనే తప్ప ఆకాశంలోనో , పాతాళంలోనో నడవలేను కదా.

నేను నల్ల రేగడి మనిషిని. ఇప్పటికీ జొన్నన్నం జొన్న రొట్టెలు తినే మనిషిని . సన్నన్నం వ్యామోహం లేదు. గొధుమ రొట్టెల సంస్కారమూ లేదు. ఆలోచించండి. ప్రజాస్వామికంగా చర్చించండి. సరిదిద్దండి.దిద్దుకోండి.”

(డిసెంబర్ 23 ,1996, ఆంధ్రజ్యోతి సాహిత్యవేదిక)

ఇదీ చదవండి!

ఇచ్ఛాగ్ని

కడప జిల్లాలో కథాసాహిత్యం – డా|| కేతు విశ్వనాధరెడ్డి

కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: