కడప దోసపండ్లు – ప్రత్యేకతలు – ఔషధ గుణాలు

నాపరాళ్లకు ‘కడప రాళ్లు’ అన్న పేరున్నట్లే కర్బూజా పండ్లకు ‘కడప దోసపండ్లు’ అన్న పేరు కూడా ఉంది. కడప జిల్లాలోని పెన్నానది ఒడ్డున – ఇసుక దిబ్బల్లో కర్బూజా పాదుల పెంపకం విస్తారంగా జరుగుతూంటుంది. వేసవి కాలం ప్రారంభం నుంచి వేసవి బాగా ముదిరే వరకూ ఈ పండ్లు లభ్యమవుతాయి. కడప జిల్లాలోనే కాకుండా కర్బూజా దోసపాదుల్ని కర్నూలు జిల్లాలోనూ, అనంతపురం జిల్లాలోనూ, అలాగే చిత్తూరు ప్రాంతాలలోనూ పెంచుతున్నారు.

తీగపాదుల ద్వారా మనకు లభించే ఫలాల్లో కర్బూజ ముఖ్యమైనది. దీనిలో ఎన్నో ఔషధ విలువలున్నాయి. ప్రాచీన వైద్య గ్రంథాల్లో కర్బూజాకి ‘మృదుఫల’ ‘మధుపాక’ అనే సంస్కృత పేర్లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన నవీన ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో దీనికి ‘కర్బూజ’ అనే పేరును కూడా వాడారు. అలాగే దీనికి సంస్కృతంలో ‘్ఫలరాజం’ ‘అమృతాహ్వం’ అనే పేర్లు ఉన్నట్లు ధన్వంతరీ నిఘంటువు పేర్కొంది. హిందీలో దీనికి ‘ఖర్బూజ్’ అని పేరు ఉంది. తెలుగులో కూడా మనం దీనిని కర్బూజా పండు అనే పేరుతోనే పిలుస్తున్నాం. కడప జిల్లాల్లో ఈ కర్బూజా పండ్ల సాగు ఎక్కువగా జరుగుతుంది కాబట్టి, ఇది దోస జాతికి చెందింది కాబట్టి, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో దీన్ని ‘కడప దోస’ అని కూడా అంటారు. ఆంగ్లేయులు కూడా ఈ పండ్లను ‘cuddapah melon’ అని గెజిట్ లో ప్రస్తావించారు.

చదవండి :  'పట్టిసీమ' పేరుతో రాయలసీమకు గన్నేరుపప్పు పెడుతున్నారు: ఉండవల్లి

ప్రత్యేకతలు

కర్బూజా ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని ఉష్ణ ప్రాంతాలలో సాగు చేయబడింది. కానీ ప్రస్తుతం ఇది ప్రపంచంలో అన్ని ఉష్ణ ప్రాంతాల్లోనూ పెంచబడుతోంది.

కర్బూజ ఏకవార్షిక తీగ పాదు. అంటే ఒక సంవత్సరంలో పంటకు వచ్చే మొక్క. నీటి సౌకర్యం ఉండే నేలలు, పొడి నేలలు, మంచి ఎండకాచే అన్ని నేలల్లో కూడా కర్బూజా మొక్కలు పెరుగుతాయి. అలాగే ఇతర పంటలు ఏవీ పెరగని నదీ తీరపు ఇసుక దిబ్బల్లో కూడా ఈ కర్బూజా పాదుల్ని పెడుతూంటారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కడప ప్రాంతం కర్బూజా పండ్ల వ్యవసాయానికి ప్రసిద్ధమైంది.

కర్బూజాలో చాలా రకాలున్నాయి. లోపల ఉండే గుజ్జు రంగును బట్టి, కాయ ఆకారాన్ని బట్టి దీనిలో రకాలు ఏర్పడుతాయి. కొన్ని పండ్లలో గుజ్జు ఎక్కువగా ఉంటుంది. కొన్ని పండ్లలో గుజ్జు కాస్తంత తక్కువగా ఉంటుంది. కొన్ని పండ్ల రంగు తెల్లగా ఉంటే మరి కొన్ని పండ్ల రంగు పసుపుగా ఉంటుంది. అలాగే కొన్ని పండ్లు గుండ్రంగా ఉంటే, మరికొన్ని పండ్లు కోలగా ఉంటాయి. కొన్ని పండ్లపైన చర్మం బొరుసు బొరుసులుగా ఉంటే మరి కొన్ని పండ్ల మీద తోలు నునుపుగా ఉంటుంది. కర్బూజ రకాల్లో కొన్నింటి కాయలు పచ్చి స్థితిలో చాలా చేదుగా ఉంటాయి. కాని పండితే ఆ చేదు పోతుంది. కొన్ని రకాల కర్బూజా పండ్లు దోరగా ఉన్నప్పుడు రుచికి దోస ముక్కల్లాగా ఉంటాయి.

చదవండి :  యోవేవికి ఒకేసారి ఆరు రామన్ ఫెలోషిప్‌లు

గుణధర్మాలు

కర్బూజా గింజల్లో ఔషధ గుణాలు

* దోస పండు లోపల ఉండే గింజలు దోస పండులోని గింజలను పోలి ఉంటాయి. దోస గింజల కంటే కర్బూజా గింజలు కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఆయుర్వేదంలో ధాతుపుష్టి లేహ్యాల తయారీకి ఈ గింజల్లోని పప్పును వాడుతారు. గింజల్లోని పప్పు వీర్య పుష్టిని కలిగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో తయారయ్యే వక్కపొడిలో ఈ గింజల పప్పుని చేర్చుతుంటారు. సీమ బాదం, పిస్తా పప్పులకు అభావ ప్రతినిధిగా కర్బూజా పప్పుని వాడటం చూస్తుంటాం. కర్బూజా గింజల్లో హైపోగ్జాంథిన్ అనే పదార్థం ఉంటుంది. కర్బూజా గింజల్లో నూటికి ముప్పయ్యో వంతు నూనె పదార్థం ఉంటుంది. ఈ నూనె లేత పసుపు రంగులో ఉంటుంది. కొంతవరకూ దానంతట అదే ఆరిపోయే స్వభావం కలిగి ఉంటుంది. ఈ నూనెను వంటకాల్లో వాడుకోవచ్చు. కర్బూజా నూనె సబ్బుల పరిశ్రమలో కూడా ఉపయోగపడుతుంది.

చదవండి :  ఒంటిమిట్టలో కృష్ణంరాజు

* దోస గింజల్ని చూర్ణ రూపంలో లోపలికి తీసుకుంటే బంధించబడిన మూత్రం జారీ అవుతుంది. సమస్త విధాలైన మేహ రోగాలను కర్బూజా గింజలు తగ్గిస్తాయి.

* దోస గింజలను చూర్ణ రూపంలో వాడితే వీర్యపుష్టి కలుగుతుంది.

* అలాగే వీటిని ఔషధంగా వాడుకుంటే మూత్ర మార్గంలో తయారయ్యే రాళ్లు కరిగి పడిపోతాయి.

* దోస గింజల్ని నీళ్లతో ముద్దగా నూరి చిన్నపిల్లలకు కడుపు ఉబ్బినప్పుడు పొత్తి కడుపు మీద వేసి కట్టినట్లయితే గుణకారిగా ఉంటుంది.

* జ్వరాల్లో కూడా ఈ గింజలు ఉపయోగపడతాయి. కర్బూజా గింజలు శారీరక ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. కర్బూజా గింజల్ని యవకుటంగా అంటే బరకగా దంచి నీళ్లల్లో వేసి కషాయం కాచి వడకట్టి తాగితే టైఫాయిడ్ జ్వరంలో హితకరంగా ఉంటుంది.

* కర్బూజా నీరసం, నిస్త్రాణ, జ్వర తాపం వంటి వాటిని తగ్గిస్తుంది.

* దోష జ్వరాలవల్ల కడుపులో ఏర్పడే వ్రణాల్లోనూ కర్బూజ గింజల చూర్ణంగానీ, కషాయం గానీ గుణకారిగా ఉంటుంది.

* అలాగే కర్బూజా గింజల కషాయాన్ని గాని లేదా చూర్ణాన్ని గాని పురాణ జ్వరాలు, అంతర్గత వ్రణాలు తదితర సమస్యలను తగ్గించుకోటానికి వాడుకోవచ్చు.

– డా. చిరుమామిళ్ల మురళీమనోహర్

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: