
కడప జిల్లాలో నేరాలు – ఒక పరిశీలన
రోజూ కాకపోయినా వీలుకుదిరినప్పుడల్లా ఈనాడు.నెట్లో కడప జిల్లా వార్తలు చూసే నేను క్రైమ్ వార్తల జోలికి పోయేవాడ్ని కాదు. తునిలో రైలు దహనం జరిగిన రోజు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిన తర్వాత (ఆ వ్యాఖ్యల గురించి కూడా కొన్ని రోజుల తర్వాతే నాకు తెలిసింది) అడపా దడపా నేరవార్తలు కూడా చూడడం మొదలుపెట్టాను.
ఎక్కువ జనాభా ఉన్న జిల్లాలో సహజంగానే ఎక్కువ నేరాలు నమోదౌతాయి. ఐతే కడప జిల్లాలో సహజసిద్ధమైన అడవులు, అటవీశాఖకు అప్పగించిన భూములు (విజయవాడ ప్రాంతంలో రాజధాని పేరుతో ఆక్రమించుకున్న అడవులకు బదులుగా ఇక్కడి బీడుభూములను అప్పగించింది రాష్ట్రప్రభుత్వం), ఇతరత్రా బీడు భూములు, సాగుభూములు పోగా నివాసయోగ్యమైన భూమి తక్కువ. అందువల్ల సహజంగానే జనసాంద్రత, జనాభా కూడా తక్కువే. కాబట్టి ఇక్కడ నమోదైన నేరాల సంఖ్య తక్కువైనంత మాత్రాన నేరాల రేటు తక్కువనుకోలేం. ఉదాహరణకు 2011 లెక్కల ప్రకారం పొరుగునే ఉన్న చిత్తూరు జిల్లా జనాభా 4,170,468 ఐతే కడప జిల్లా జనాభా 2,884,524 మాత్రమే. మాటవరసకు ఈ రెండు జిల్లాల్లో సమాన సంఖ్యలో నేరాలు నమోదౌతున్నాయనుకోండి, అప్పుడు ఉన్న జనాభాతో పోలిస్తే నేరాల విషయంలో కడప జిల్లానే ముందున్నట్లు లెక్క. అది తేటతెల్లమయ్యేందుకే సగటున లక్ష మంది జనాభాకు నమోదయ్యే నేరాల రేటును పోల్చి చూస్తారు.
ఉదాహరణకు తుని ఉన్న తూ.గో.జిల్లాలో 2014 సంవత్సరంలో లక్ష మందికి 162.5 నేరాలు నమోదైతే అదే సంవత్సరంలో విజయవాడ నగరంలో367, కృష్ణా జిల్లాలో 256, నెల్లూరు జిల్లాలో 250, గుంటూరు జిల్లా (అర్బన్)లో 460, చిత్తూరు జిల్లాలో 145.6, కడప జిల్లాలో 188.2 నేరాలు నమోదయ్యాయి.
ఐతే వార్తాపత్రికలో అడపా దడపా నేరవార్తలు చూడడం మొదలుపెట్టిన తర్వాత నేను గమనించిందేమంటే కడప జిల్లాలో నమోదయ్యే నేరాల్లో బాధితులు కడప జిల్లావాసులే అయినప్పటికీ “నేరస్థులు” తరచూ బయటి జిల్లాలవాళ్ళే కావడం. ఆత్మహత్యలు, ప్రమాదాలు లేదా ప్రమాదవశాత్తూ జరిగే వివిధ ఘటనల్లో నమోదయ్యే కేసులను వదిలేస్తే బుద్ధిపూర్వకంగా చేసే నేరాల్లో నేరస్థులు బయటి ప్రాంతాలవాళ్ళే కావడం చాలా తరచుగా జరుగుతోంది. మొదట్నుంచీ ఇంతేనో లేక ఇది ఇటీవలి సంవత్సరాల్లో కొత్తగా మొదలైన ట్రెండో తెలియదు. రెండోది నిజమైతే మటుకు ఆ పుణ్యం కట్టుకున్నది కూడా తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాకుండా అధికారంలో ఉన్నరోజుల్లో కూడా “కడప జిల్లాలో హింస, దౌర్జన్యాలు, మోసాలు చేసేవాళ్ళ ఇష్టారాజ్యంగా నడుస్తుంద”ని అదేపనిగా ప్రచారం చేసిపెట్టి, ఆ ఒక్క జిల్లాలో మాత్రం శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చుంటుందే తప్ప అదుపు చెయ్యడానికి ఏ ప్రయత్నమూ చెయ్యదనే బలమైన అభిప్రాయాన్ని కలగజేసి ఎక్కడెక్కడి నేరగాళ్ళనైనా కడప జిల్లా వైపు ఆకర్షితులయ్యేలా చేసిన బాబుగారు & ఆయన పరివారమే అనుకోవాలి.
ఎక్కడైనా శాంతిభద్రతల వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నా అంతా బాగుందని ప్రభుత్వాలు, అధ్వాన్నంగా అఘోరించాయని ప్రతిపక్షాలు చెప్పుకొస్తాయి. ఎందుకంటే శాంతిభద్రతల పరిరక్షణ ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కాబట్టి,దాంట్లో విఫలమైనట్లు తానే ఒప్పుకోవలసిరావడం సిగ్గుచేటైన విషయం కాబట్టి. కానీ కడప జిల్లా విషయంలో మాత్రం 2009-2014 మధ్య కాలంలో రాష్ట్రప్రభుత్వం ఆ బాధ్యత విషయంలో చాలా తేలిగ్గా చేతులు దులిపేసుకుని, అక్కడొక్కచోటే రౌడీ రాజ్యం నడుస్తోందని సిగ్గూ ఎగ్గూ లేకుండా తనే దుష్ప్రచారానికి తెగబడడం విషాదం.
ఐతే పై లెక్కల ప్రకారమే ఐనా కూడా కేవలం నమోదైన కేసుల నిష్పత్తి మీద ఆధారపడి జిల్లాల మధ్య నేరవ్యాప్తిని పోల్చడం కూడా నమ్మదగ్గ ఫలితాలనివ్వకపోవచ్చు. పైగా కొన్ని రకాల చట్టాలను దుర్వినియోగం చేసి, ఎవరి మీదైనా కేసు పెట్టడం చాలా సులభం. అలాగే కొందరు తమ అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టడం కూడా చూస్తున్నాం. అలాంటి కేసుల్లో నిందితులందరూ నేరస్థులనలేం.
ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కథనాలు వస్తున్నట్లు ఇతర జిల్లాల్లో రౌడీయిజం చేస్తున్నది కడప వాసులు అనుకున్నా, (క్రింద ఇచ్చిన ఉదాహరణలను బట్టి) కడపలో నేరాలు చేస్తున్నది బయటి జిల్లాలవాళ్ళు అయినప్పుడు ఎవరిలో ఎక్కువ నేరస్థులున్నారో తెలియాలంటే కేసు ఎక్కడ నమోదైందన్నదానితో సంబంధం లేకుండా ప్రతి కేసులోనూ నేరస్థులు ఎక్కడివాళ్ళో తెలియాలి. దీనికి సులువైన, నమ్మకమైన పద్ధతి – నేరం రుజువై, శిక్షపడినవాళ్ళలో ఎవరు ఎక్కడివాళ్ళో జైళ్ళశాఖ లెక్కల నుంచి తెలుసుకోవడమే తప్ప పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల లెక్కలు పోల్చడం కాదు.
– త్రివిక్రమ్
(trivikram@kadapa.info)
[author title=”రచయిత గురించి” image=”https://kadapa.info/wp-content/uploads/2014/11/writer_clip.png” ]
కడప జిల్లా సమగ్రాభివృద్ది కోసం పరితపించే సగటు మనిషీ త్రివిక్రమ్. సాహిత్యాభిలాషి అయిన త్రివిక్రమ్ తెలుగును అంతర్జాలంలో (వికీపీడియా సహా) వ్యాపితం చేసేందుకు ఇతోధికంగా కృషి చేశారు. ‘ఈ-మాట’ అంతర్జాల పత్రికకు సంపాదక వర్గ సభ్యులుగా వ్యవహరిస్తున్న వీరు కొంతకాలం పాటు అంతర్జాల సాహితీ పత్రిక ‘పొద్దు’ సంపాదకవర్గ సభ్యులుగా వ్యవహరించినారు. అరుదైన ‘చందమామ’ మాసపత్రిక ప్రతులను ఎన్నిటినో వీరు సేకరించినారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ‘పడిగెలపల్లి’ వీరి స్వస్థలం.
[/author]