
ఏమి నీకింత బలువు – పెదతిరుమలయ్య సంకీర్తన
తాళ్ళపాక అన్నమయ్య, అక్క(ల)మ్మల (అక్కమాంబ) సంతానమైన పెదతిరుమలయ్య వాళ్ళ నాయన మాదిరిగానే శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించినాడు. తిమ్మయ్య, తిమ్మార్య, తిరుమలాచార్య, తిమ్మడు, తిరుమలగురుడుగా పేర్కొనబడిన పెదతిరుమలయ్య కూడా దేవుని కడప లక్ష్మీ వల్లభుని దర్శించుకుని తరించినాడు. తన సంకీర్తనలతో కడపరాయని కీర్తించి గానం చేసినాడు. కడపరాయని కీర్తించిన పెదతిరుమలయ్య సంకీర్తనలలో ఇది కూడా ఒకటి.
వర్గం: శృంగార సంకీర్తన
రాగము: రామక్రియ
రేకు: 74-6
సంపుటము: 17-386
ఏమి నీ కింత బలువు యెవ్వ రిచ్చిరి
మామీఁదిచలములు మాను మన్నా మానవు ||ఏమి||
వాడుమోము వంటి నీతో వలపు చెప్పితినో
కూడు మని బత్తి నీకు గొట్టానఁ బెట్టితనో
యేడనుండో వచ్చి నీవు యిచ్చకము లెల్ల నాడి
వోడక వేఁడుకొనేవు వొపనన్నామానవు||ఏమి||
వట్టి చనవు సేసుక వద్దికి వచ్చితినో
రట్టుతోడ రమ్మని యాఱడిఁ బెట్టేనో
గుట్టుతో నుండక నన్ను కొంగువట్టి తీసినీవే
తట్టువడఁ బెనఁగేవు తగ దన్నా మానవు ||ఏమి||
కన్ను లార్చి నీమీఁద కాఁకలు చల్లితినో
తిన్ననిమాటల తరితీపులు సేసితినో
కన్నచో శ్రీవేంకటాద్రికడపరాయఁడవై
సన్నలఁ గూడితి వింకాఁ జాలు నన్నా మానవు ||ఏమి||