కడప గడప ముందు కుప్పిగంతులు!

వైఎస్ హయాంలో కడప, పులివెందుల అభివృద్ధి కళ్లు చెదిరేలా ఉందంటూ… రాష్ట్రంలోని మిగతా జిల్లాల ప్రజల్లో అసంతృప్తి బీజాలు నాటేందుకు 2009 మే ఎన్నికల సందర్భంగా ‘ఈనాడు’ చేసిన అక్షర రాజకీయమిది. ఇప్పుడు అదే ‘ఈనాడు’ ఇడుపులపాయకు రోడ్డు లేదని, పంచాయతీ కార్యాలయం పెచ్చులూడిందని మరో రకం రాజకీయం మొదలుపెట్టింది. రామోజీకి ఎన్నికల సమయంలో ఎప్పుడూ ప్రకోపించే పైత్యంలో భాగంగానే వైఎస్‌కు కడపకు ఉన్న అనుబంధాన్ని అపహాస్యం చేస్తూ ఈ ఉప ఎన్నికల వేళ కథ(నా)లు రాస్తోంది.

అమావాస్య… పౌర్ణమి… నెలనెలా ఈ రెండు రోజుల్లో పిచ్చి ఉన్న వారికి అది ప్రకోపిస్తుందని నానుడి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రచ్ఛన్నంగా రాజ్యాధికారాన్ని చలాయించటానికి ఆబగా అలవాటుపడిన చెరుకూరి రామోజీరావు అనే ‘ఈనాడు’ పత్రికాధినేతకు ఎన్నికలు వచ్చేసరికి ఉన్మాదం గంగవెర్రులెత్తి కట్టలు తెంచుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం పాత్ర నామమాత్రమైపోయిందని… ఈ నేపథ్యంలో రోడ్లు వేసుకోవటం, చెరువులూ దొరువులూ తవ్వుకోవటం మొదలు దొంగల్ని పట్టుకోవటం వరకు ఏదీ ప్రభుత్వం చేయటానికి వల్ల కాదని, అవన్నీ ప్రజలే చేసుకోవాలని సంపాదకీయాలు రాసి ఉద్యమాలు నడిపి ఇంటింటా ఎవరి ఖర్చుతో వారే (ఇంకుడు) గుంత తవ్వుకోవాలని ఉపదేశాలూ సందేశాలూ ఇచ్చిన చరిత్ర సప్త సంవత్సరాల క్రితం వరకు రామోజీ బాబాది! అలాంటి రామోజీకి పాశర్లపూడి గ్యాసులా ఉప ఎన్నికలు మరో వారంలో ఉన్నాయనగా కడపజిల్లా ఇడుపులపాయ గ్రామంమీద అభిమానం బద్దలై బయటకు తన్నుకు వచ్చింది.

చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ప్రభుత్వం ఏ పనీ చేయకూడదని చెప్పిన రామోజీ సిద్ధాంతి… ఇడుపుల పాయలో పంచాయతీ కార్యాలయం పెపైచ్చు ఊడిపోవటానికి కూడా సాక్షాత్తు వైఎస్ రాజశేశర్‌రెడ్డే కారణమని తీర్మానించేశారిప్పుడు. హత్తెరిక్కీ… ప్రభుత్వమే రోడ్డు వేయాలంటే ఎలా? ప్రభుత్వమే పంచాయతీ ఆఫీసు బాగు చేయాలంటే ఎలా… అంటూ 1995-2004 మధ్య కథనాలల్లి రీముల కొద్దీ అచ్చుగుద్ది చంద్రబాబు చేతగాని తనానికి తన పేపరుముక్కను అడ్డంపెట్టిన రోజుల్ని రామోజీ మరచిపోయారు.

చదవండి :  ఇక సీమాంధ్ర కాంగ్రెస్ విన్యాసాలు

హయ్యో… ఇడుపులపాయ పక్కనుంచి పోతున్న నాలుగు లేన్ల రహదారి ఆ ఊరిగుండా పోలేదే… అంటూ తనకు తెలిసిన అక్షర రాజకీయాన్ని మళ్ళీ ప్రదర్శించారు. ఇడుపులపాయకు వెళ్ళే 1.7 కిలోమీటర్ల రహదారిని తారు రోడ్డుగా మార్చలేదన్నది, పంచాయతీ కార్యాలయానికి మరమ్మతులు చేయలేదన్నది… ఈ రెండూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన జిల్లా ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పటానికి ‘ఈనాడు’కు దొరికిన సాక్ష్యాలు! భేష్… రామోజీ యంత్రాంగం కొండను తవ్వి ఎలకను పట్టే పనిలో నిమగ్నం కావటం కడప జిల్లా ప్రజలకు ఓ కామెడీ షోలా కనిపించటం ఖాయం. ఇడుపులపాయ గ్రామానికి ఆనుకునే… కేవలం 1.7 కిలోమీటర్ల దూరంలోనే ప్రధాన రహదారి ఉండటమన్నది రామోజీ దృష్టిలో అభివృద్ధికి నిదర్శనం కాదు! ఇడుపుల పాయలో రూ.250 కోట్లతో ఐఐటీ, రూ.3కోట్లతో ఎకో పార్కు, రూ.50 లక్షలతో నెమళ్ళ కేంద్రం ఏర్పాటు చేయటం వంటి అనేకానేక అభివృద్ధి చిహ్నాలు కూడా వైఎస్ నాయకత్వ పటిమకు, ఇడుపులపాయ గ్రామాభివృద్ధికి నిదర్శనాలు కావని తన పాఠకుడిని నమ్మించటానికి చూడటమే రామోజీ మార్కు ఉన్మాదంతో కూడిన దుర్మార్గం!

కడప అనే మూడక్షరాలు పలకగానే తక్షణం గుర్తుకు వచ్చే మహానాయకుడు వైఎస్‌ఆర్. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యే వరకు మధ్య 21 సంవత్సరాల్లో కేవలం అయిదేళ్ళను మినహాయిస్తే మిగతా అంతా ఎల్లో పాలన. ఈ మొత్తం కాలంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నా రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధి లేదు. తొమ్మిదేళ్ళపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా, కనీసం ఆయన సొంతజిల్లా చిత్తూరు ముఖచిత్రంలో చోటుచేసుకున్న విప్లవాత్మకమైన మార్పులేవీ వెతికినా కనిపించవు. చిత్తూరు డెయిరీని మూయించి తన హెరిటేజ్‌పరం చేయటం, సూక్ష్మసేద్యం పేరిట కుప్పంలో కోట్ల రూపాయల కైంకర్యం… ఇవే చంద్రబాబు మార్కు అభివృద్ధి కార్యకలాపాలు! తనకు నచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆయన సొంత ఊళ్ళో పంచాయతీ కార్యాలయం సగం కూలిపోయినా రామోజీకి ఆ వాస్తవాలతో పంచాయతీ లేదు.

చదవండి :  ఏఆర్‌ రెహమాన్‌ కడపకొచ్చినాడు

ఈ రాష్ట్రంలో ప్రజల అభివృద్ధికి పాటుపడటం- పడకపోవటంతో ఆయనకు నిమిత్తమూ లేదు. అలాంటిదే ఉంటే ఈ రాష్ట్ర ప్రజలను తన తొమ్మిదేళ్ళ పాలనలో ఎండగట్టి, నిప్పులమీద నడిపించి, అన్నపూర్ణగా పేరొందిన ఈ రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చిన చంద్రబాబునాయుడిమీద రామోజీ పగబట్టి ఉద్యమాలు లేవదీయాలి. ఈనాడు అధినేతకు అలాంటి కాన్సెప్టే లేదు. ఆయన పత్రిక ఏనాడూ ప్రజల కోసం కాదు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా ప్రచ్ఛన్న అధికారం కోసం. ఏ పార్టీ ఎన్నికల్లో గెలిచినా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని వశం చేసుకోవటం కోసం. అధికారంలో ఉన్న వ్యక్తులు ఖాతరు చేయకపోతే వారిని దెబ్బతీయటం కోసం… నిజాలు తెలుగువారందరికీ తెలిసినవే.

కడప మీద ఈనాడు, తెలుగుదేశం పార్టీల అంతులేని అక్కసుకు పెద్ద చరిత్రే ఉంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన కడపకు ముఖ్యమంత్రా… లేక రాష్ట్రానికా అంటూ శాసన సభలోనే వ్యాఖ్యానించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ‘నిధులన్నీ కడప గడపకే’… ‘సొమ్ము అందరిది… సోకు పులివెందులది’… అంటూ కథ(నా)లు అల్లిన చరిత్ర ‘ఈనాడు’ది. వేమన విశ్వవిద్యాలయానికే నిధులన్నీ ఇస్తున్నారని, యువ శక్తి పథకం కడప జిల్లాలోనే ఎక్కువగా అమలు కావటం దారుణమని, చేనేత నిధుల్లోనూ కడపకే అగ్ర తాంబూలం దక్కిందని, హైదరాబాద్‌లోనూ లేని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రోడ్ల అభివృద్ధి పులివెందులలోనే ఉందని, కడప-బెంగళూరు ప్రత్యేక రైలు మార్గానికి సగం నిధులు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావటం అన్యాయమని… ఒకటా రెండా… డజన్ల కొద్దీ కథనాల్లో కడప అభివృద్ధిమీద 2009 ఎన్నికలకు పూర్వం విషం కక్కిన చరిత్ర ‘ఈనాడు’ది. కడప నగరం సమీపాన రక్షణశాఖ ఆధ్వర్యంలో సైనిక స్కూల్, పులివెందులలో శిల్పారామం ఏర్పాటు జరుగుతున్నాయన్నా కన్నీళ్ళు పెట్టుకున్న చరిత్ర ‘ఈనాడు’దే.

చదవండి :  జగన్ బయటకొస్తే వార్ వన్ సైడే...

సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఏడాదిలోనే ‘ఈనాడు’ అభిప్రాయాలు మారిపోయాయి. ఎందుకంటే…. అప్పట్లో, అంటే 2009 ఎన్నికల్లో ఈనాడు కుట్ర- కడప అభివృద్ధిని మిగతా 22 జిల్లాలకూ చూపి మిగతా రాష్ట్రంలో అగ్గి పెట్టాలన్నది. ఇప్పుడు ఇడుపులపాయ పంచాయతీ కార్యాలయం పెచ్చులూడిందని, 1.7 కిలోమీటర్లమేర తారు రోడ్డు లేదని రాయటానికి కారణం… కడప జిల్లా వైఎస్ హయాంలోనూ అభివృద్ధి చెందలేదని, కాబట్టి మహానేత తనయుడికి ఓటు వేయవద్దని పరోక్షంగా చెప్పే కుహకం. మనది ఓ అభివృద్ధి చెందుతున్న దేశం. అందునా శతాబ్దాలపాటు అభివృద్ధికి దూరంగా ఉన్న సీమలు అయిదారేళ్ళలోనే సింగపూర్, హాంకాంగ్‌లుగా మారిపోవు.

ఇడుపులపాయ గ్రామంలో వెనకబాటుకు ఆనవాళ్ళు లేవనీ ఎవరూ అనరు. అదే సమయంలో… చంద్రబాబు, రామోజీలు అసూయపడేలా… దేశంలోనే ఇలాంటి కట్టడాలూ రహదార్లు లేవనేలా కడపజిల్లా రూపుదిద్దుకోవటం మొదలై, చిరస్మరణీయమైన ముందడుగులు వేసినదీ వైఎస్ హయాంలోనే. వీటిని చంద్రబాబు, రామోజీ హర్షిస్తారా? వీరి వ్యవహారాలను కడప ప్రజలు హర్షిస్తారా? కడప, పులివెందుల ఎన్నికల ఫలితాలు సమాధానమిస్తాయి. 2004, 2009 ఎన్నికల్లో వాతలు పెట్టించుకున్న ఎల్లో ద్వయం హ్యాట్రిక్‌గా మరో వాత పెట్టించుకునేందుకు ఎన్నికల ఫలితాల వరకు వేచి ఉండక తప్పదు.

– సాక్షి దినపత్రిక, 01 మే 2011

ఇదీ చదవండి!

పోతిరెడ్డిపాడును

15 సంవత్సరాల కల సాకారమైంది !

పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల విడుదల శభాష్, 15 సంవత్సరాల కల నెరవేరిన రోజు,పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిసామర్ధ్యం 44,000 …

2 వ్యాఖ్యలు

  1. ఇది ఆలోచించాల్సిన విషయమే. వాస్తవం కూడానూ….

  2. Ee pachcha paper kadapa jillaa paina eppudoo visham chimmutoone untundi. Aa paper potlaalu kattukodaanikee panikiraadu.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: